ఒకటో ప్రశ్న : పేనుపాలెం నుంచిశ్రీమతి మాతాశ్రీగారు తమ కుమారీశ్రీకి తలలో పేలు
విపరీతంగా చేరాయని,ఎన్నోరకాల షాంపూలు, మందుల హేరాయిల్లు
వాడినా పోవటంలేదనీ, మంచి సలహా చెప్పమని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : మాతశ్రీ గారు వాడల్సిన అసలైన మందు నే చెబ్తా! మీరు వెంటనే
బ్రాందీగానీ,విస్కీగానీ తీసుకొని, తీసుకొని అంటే లోపలికి కాదు, దోసిట్లో
తీసుకునన్న మాట, కుమారీశ్రీ తలకు బాగా పట్టించండి. తరువాత
గండ్ర ఇసుక ఆ జుట్టులో బాగా చల్లండి. ఇప్పుడు మీరు తలకు రాసిన
బ్రాందీ ఆ పేలు బాగా త్రాగేసి మత్తు తలకెక్కి, కిక్కెక్కి అక్కడి ఇసుక
రేణువులు తీసి ఒకదానితో ఒకటి తగువులాడుకుంటూ కొట్టుకుంటూ
చచ్చినట్లు చస్తాయి. ఇంకేం ఇప్పుడే మందుల షాపుకు ( మీ వీధి చివరే
మీ కుటుంబ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు) పరిగెట్టండి.
రెండోప్రశ్న : పొదుపులూరి నుంచి పి.సి.నారయ్యగారు, వారు అమెరికా వెళ్ళిరావాలని
అనుకుంటున్నారట. బోల్డు డబ్బు ఖర్చవుతుందని బెంగగా వుందట.
ఖర్చు ఎంతవుతుందో చెబితే ఆలోచిస్తారట.!
సలహాల్రావ్: పి.సి.నారయ్యగారూ బెంగ పడకండి. ఒక్క పైసాఖర్చుకాదు. నిజమండీ,
వేళ్ళి రావాలని అనుకోడానికేం ఖర్చు కాదండి. బెంగపడకుండా అను
కుంటూనే వుండండి.
మూడోప్రశ్న: కోదాడనుంచి కొత్త కోడలు కోమలిగారు తను అత్తవారింట్లో పాలు ఎంత
జాగ్రత్తగా కాచినా పాలు విరిగి పోతున్నాయట. పాలు విరిగినప్పుడల్లా
అత్తగారు నోరు మూత పడకుండా తిడుతున్నారని, అత్తగారి నోరు
విప్పకుండా, పాలు విరగ కుండా వుండే మార్గం చెప్పండని అడుగుతున్నారు.
సలహాల్రావ్ : కోమలిగారూ, ఇలా చూడండి ! ఈ సారి పాలు కాచేటప్పుడు అందులో రెండు
టీ స్పూన్ల ఫ్లెవికాల్ కలపుతుండండి. పాలు విరగవు. ఓ వేళ సరదాపడి
విరిగినా అందులో మీరు కలిపిన ఫ్లెవికాల్ వల్ల వెంటనే అతుక్కుపోతాయి.
తరవాత ఓ గ్లాసు పాలను మీ అత్తగారికి ప్రేమతో ఇచ్చారంటే ఆ పాలు
త్రాగిన అత్తగారు ఇక నోరు తెరిస్తే ఒట్టు!
నాల్గోప్రశ్న: పెన్నులూరినుంచి నవలల దస్తూరీబాయిగారు, తను ఎన్ని కధలు,నవలలు
వ్రాసి పత్రికలకు పంపినా ఒక్కటీ అచ్చవటం లేదట. ఇంత కాలం మామూలుగా
కుడిచేత్తో వ్రాస్తున్నానని, ఇకనుండి ఎడమ చేత్తో వ్రాస్తే పడే అవకాశం వుందా
అని, పంపిన కధలు తిరిగి రాకుండా వుండే ఉపాయం కూడా చెప్పమంటున్నారు.
సలహల్రావ్ : అమ్మా, దస్తూరీబాయి గారూ, మీరు కుడిచేత్తో వ్రాసినా, ఎడమచెత్తో వ్రాసినా
ఫలితం వుండదండి. మీరో మాంచి బాల్పాయింట్ పెన్నో, సిరా పెన్నో కొనుక్కొని
దానితో వ్రాయండి! మీ రచనలు తిరిగి రాకుండా వుండాలంటే స్టాంపులతో
కవరును జత చేయకండి. మీ కధ చస్తే తిరిగిరాదు.గ్యారంటీ !!
ఐదోప్రశ్న: ఆరోగ్యవరం నుంచి కత్తుల కోతలరావుగారు ఇలా వ్రాస్తున్నారు.
ఆయన ఇప్పటివరకూ 116 పైగా ఆపరేషన్లు చేయించుకొన్నారట! ఆయనకు ఇలా ఎక్కువ ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ టేబుల్ మీదే కాకుండా గిన్నేస్ బుక్కులో కూడా ఎక్కాలని వుందట. కానీ ఆపరేషన్లు చేసే ఆయన డాక్టర్లు ప్రతిసారి కోసి కుట్టడానికి విసుగు పుడుతుంది బాబోయ్ అంటున్నారట. సలహా చెప్పమని వ్రాస్తున్నారు.
సలహాల్రావ్ : ఈ సారి ఆపరేషను చేసినప్పుడు సర్జన్ గారిని ఓ మాంచి ఇంపోర్టెడ్ జిప్ కుట్టేయమనండి! మీ పొట్టను ఓపెన్ చేయడం, మూసేయడం చాలా సులువవుతుంది. డాక్టరు ఒప్పుకోక పోతే మీ పాంట్లు కుట్టే టైలర్ చేత జిప్పు కుట్టించుకోండి!!
ఆరో ప్రశ్న: వార్తలు తెలుసుకోవడానికి న్యూస్ పేపరు బెస్టా, టీవీ బెస్టా చెప్పమని డిష్ బాదు నుండి టీవీ.రావుగారు అడుగుతున్నారండీ.
సలహాల్రావ్ : టీవీ.రావుగారూ, టీవీ కన్నా పేపరే నయమండి. కరెంట్ పోతే టివీ వార్తలు చూడలేము.అదే ఏ ఈనాడు పేపరో ఐతే కరెంట్ పోగానే హాయిగా దాన్తో విసురుకోవచ్చు.!!
ఏడో ప్రశ్న : తోటల పుష్పగారు తనకు పూలమొక్కలంటే అమిత ప్రేమనీ, కానీ కుండీలలోని
మొక్కల ఆకులకు పురుగులు చేరి మొగ్గలు రాలి పోతున్నాయని, ఎన్ని రకాల
పురుగుల మందులు వాడినా అవి మరింత ఎక్కువవుతున్నాయని ఏడుస్తూ
వ్రాస్తున్నారండీ.
సలహల్రావ్ : చూశారా గమ్మత్తు! ఇది నే జవాబివ్వబోయే ఏడో ప్రశ్న, మొక్కలపై ప్రేమున్న
మీకు ఏడుపు రావడం సహజమే! పురుగుమందులు వాడితే పురుగులెలాచస్తాయండి? బాతురూములు కడిగే ఆసిడ్ రెండు మగ్గుల్లో తీసుకొని ఓ బకెట్ నీళ్లల్లో కలపండి. మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు పూలకుండీలలో పోయండి..దెబ్బకు ఆకులు మలమలా మాడి రాలిపోతాయి. పురుగులకు తినడానికి ఆకుల తిండి లేక ఆకలితో దెబ్బకి చస్తాయి.
ఎనిమిదోప్రశ్న :కేశవరం నుండి శ్రీమతి కేశవర్ధిని గారు ఎంత మంచి నూనెలు వాడినా తలదువ్వు
కొన్నప్పుడల్లా జుట్టు విపరీతంగా రాలి పోతున్నదని, రాలిపోకుండా సలహా చెప్ప
మంటున్నారు.
సలహల్రావ్ : ఇదో రాలిపోయే కేసన్నమాట! కేశవర్ధినిగారూ, మీరు తల దువ్వుకొనేటప్పుడు ఓ
అట్టపెట్టె తీసుకొని అందులో రాలిన మీ జుట్టును వేసుకుంటే మీ రాలిన జుట్టు ఎక్కడికీ
పోదు.
(మా "హాసం క్లబ్" కార్యక్రమంలో నేనూ, మితృడు దినవహి హనుమంతరావు ప్రదర్శించిన స్కిట్)