RSS
Facebook
Twitter

Thursday 31 March 2011



ఈ రోజు ఆంధ్రజ్యొతి దినపత్రిక తెరవగానే లోపలి పేజీలో "బాపూ పుస్తకంపై
నిషేధం?" అన్న వార్త అగుపించింది. అదేమిటి బాపుగారి పుస్తకాల్లోని
బొమ్మలు నవ్విస్తాయి మరెందుకీ నిషేధం అని ఆశ్చర్యపడి లేచి విషయం
చదివాక అమ్మయ్యా ! ఇదా సంగతి అని కుదుటపడ్డాను.
ఎవరో విదేశీపెద్దమనిషి గాంధీ గారి మీద అవాకులు చెవాకులు
రాశాడట. బ్రతికిపోయాం! ఆ గాంధి మీద వ్రాశాడు, ఈ గాంధీలమీద
వ్రాసుంటే ఇప్పటికి ఎన్ని బస్సులు కాలిపోయేవో ! ఎన్ని బందులు
రాస్తా రోకోలు జరిగేవో !!
పేపరు తీస్తే, అదే నండి మన వార్తాపత్రికలు చదివితే అన్నీ హత్యలూ,
ఆత్మహత్యలు, దోపిడీలూ ,త్రీపిడీలూ, నిన్నలూ ,రేపులూ కోకొల్లలు !! కానీ
ఆ వార్తలూ ఒక్కోసారి చదివితే నవ్వు వస్తుంది. ఎలాగో చిత్తగించండి.
ఈ మధ్యే ఒక హెడ్డింగ్:
" రైతు ఆత్మ హత్యలకు రెండు కోట్లు "
ఈ మాట చదవగానే ఏమిటి, ఆత్మ హత్య చేసుకోడానికి ప్రభుత్వం రెండు
కోట్లు ఇస్తున్నదా అనిపిస్తుంది. ఇక మరో వాక్యం:
"ఆత్మహత్య చేసుకొన్న యువకుడి మృతి"
ఆత్మ హత్య అంటేనే చనిపోయాడని అర్ధం. ఇక చేసుకొన్నవ్యక్తిని వీళ్ళు
మరోసారి చంపేశారన్నమాట!
చాలా ఏళ్ళ క్రితం ఇంగ్లీషు పేపర్లలో తరచు ఈ మాటలు అగుపించేవి
MGR BACKS INDIRA
OPPOSITION'S MOTION IN PARLAMENT.

ఇవి చదువుకొని నవ్వుకొనే వాళ్ళం! కొన్ని వినటానికి అదోలా వుంటాయి.
అన్ని శీర్షికలూ అలానే వుంటాయి అనలేం!ఒక పత్రిక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి
వ్రాస్తూ " స్టేట్ బ్లాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్న పతాక శీర్షిక వుంచింది.
అలానే గనుల దోపిడీని "గనుల ఘనులు" అని వ్రాసారు. బొగ్గు గనుల్లోని
దగాకు కోల్ మాల్ ( గొల్ మాల్ ) అని వ్రాయటం సీరియస్ విశేషాలకు
వ్యంగ్యాన్ని జోడించడం పాఠకులను ఆకర్షించడానికి జర్నలిజమ్ లో
కొత్త ప్రయోగాలు. వివాహ ప్రకటనలు కూడా ఈ మధ్య " 50వ వివాహ
వోత్సవమ్" అని వేస్తున్నారు. ఆ తప్పు అటుతరువాత మార్చారు.
మా చిన్నతనంలో వచ్చిన కొన్ని పత్రికల పేర్లు కూడా తమాషాగా
వుండేవి. గుండుసూది,ఢంకా, కాగడా, చిత్రగుప్త మొదలైనవి. ఆ రోజుల్లో
డిటెక్టివ్, అపరాధపరిశోధన పేర్లతో పత్రికలు వచ్చేవి. కొమ్మూరి సాంబశివరావు
సంపాదకత్వంలో తెలుగు సినిమా అనే సినిమా మాస పత్రిక వచ్చేది.

Wednesday 30 March 2011





కొండలలో కోనలలో వయ్యారంగా ఉరకలెత్తే గోదారమ్మ రాజమహేంద్రవరం
చేరుకోగానే గంభీరంగా సాగిపోతుంది. గోదారమ్మ నడుముకు వాడ్డానంగా
అమరిన రెండు వంతెనల మధ్య గోదావరి నది అందాలు పకృతి ప్రేమికులకు
మధురానుభూతిని కలిగిస్తుంది. ఆ పాత కొత్త వారధుల మధ్య ప్రతి ఏడాది
మార్చి చివరి రోజుల్లో సూర్యభగవానుడు నారింజరంగులో అగుపిస్తూ కన్నుల
పండుగగా వుంటాడు. రాజమండ్రి పుష్కరాలరేవు దగ్గర నిన్న సాయంత్రం
ఈ దృశ్యాల్ని నా కెమారాలో బంధించి మీ ముందుంచా.
రాజమండ్రి 16.98 డిగ్రీల ఉత్తర రేఖాంశం, 81.78 డిగ్రీల తూర్పు రేఖాంశంల
నడుమ ఉండటంతో సూర్యుని చుట్టూ భూభ్రమనంలో భాగంగా సూర్యుడు ఈ
రెండు వంతెనల మధ్య అస్తమిస్తూ అగుపిస్తాడు.
,

Tuesday 29 March 2011


డి.కె.పట్టమ్మాల్ సంగీతం విన్న జర్మనీ దేశపు వనిత " మీ భాష నాకు
తెలియకపోయినా మీ సంగీతం నన్ను ఎదేదో కొత్త అనుభూతులను కలుగ
జేసింది." అని అన్నదంటే చాలు ఆమె సంగీతంలో ఎంతటి ప్రతిభావంతురాలో
అని తెలుసుకోడానికి! 1919 సంవత్సరం మార్చి 28న తమిళనాడు
కాంచీపురంలో జన్మించిన పట్టమ్మాల్ పూర్తి పేరు దామల్ కృష్ణస్వామి
పట్టమ్మాల్. ఐదేళ్ల వయసుకే ఆమె తన తండ్రి కృష్ణ స్వామి దీక్షితార్
వద్ద ఎన్నో వందల శ్లోకాలను నేర్చుకొని అప్పజెప్పగలిగేది. ఆ కాలంలో
స్త్రీలు, అందునా ఉన్నత వర్గాలలోని వారు బయటి మగవారితో మాట్లాడ
కూడదనీ, పాటలు పాడటం లాంటివి చేయకూడదనే ఆంక్షలుండేవి.
హిందూ పత్రికలో వచ్చిన వార్త ద్వారా ఆమెఖ్యాతిని విన్న కొలంబియా సంస్థ
ఆమెపాటలను రికార్డులుగా విడుదల చేయటానికి అనుమతిని కోరారు. బయట
ప్రపంచకానికి అలా పాటలు వినిపిస్తే అమ్మాయికి పెళ్ళి కాదేమో నని ఆమె
తండ్రి ఒప్పుకోకపోతే శ్రీనివాసన్ అనే కాంగ్రెస్ నాయకుడు, మీ అమ్మాయికి
పెళ్ళీడు వచ్చినప్పుడు నామేనల్లుడికిచ్చి వివాహం చేస్తానని హామీ ఇచ్చాడు.
తరువాత అన్నట్లుగానే 1939లో ఆయన మేనల్లుడు శ్రీనివాసన్ తో ఆమెకు
వివాహం జరిగింది. సంగీత కళారంగాలకు నిలయమైన మద్రాసు నగరానికి
పట్టమ్మాల్ కుటుంబం మకాం మార్చారు. మద్రాసుకు వెళ్ళాక ఆమెకు
ఎందరో సంగీత నిష్టాతులతొ పరిచయం ఏర్పడి సంగీత కచేరిలు చేసి సాధన
చేశారు. ప్రజల్లో పట్టమ్మాల్ గాన మాధుర్యం పై పెరిగిన విశేష ఆదరణను
గమనించిన రికార్డు కంపెనీలు, రేడియో కేంద్రాలు లాభాలు పొందాయి. .
సినిమారంగంలో తొలి నేపధ్య కర్ణాటక గానం చేసిన గాయనిలలో ఆమె
ఒకరు. ఫూర్వం మద్రాసు సంగీత ఎకాడమీలో పురుషులకే ప్రాధాన్యత
వుండేది ఎమ్మెస్.సుబ్బులక్ష్మి, డికే.పట్టమ్మాల్, యంయల్.వసంతకుమారిల
గాన త్రయం పేరుగాంచాక అకాడమీ వారు వీరిని కచేరీలకు ఆహ్వానించడం
మొదలుపెట్టారు.1970 పట్టమ్మాల్ ను "సంగీత కళానిధి"బిరుదుతో సత్కరించింది.
ఎందరో వాగ్గేయకారుల కీర్తనలను ఆమె తన బాణీకి అనువుగా మార్చుకున్నారు.
భారతదేశం తరఫున ఆమె, బెర్లిన్, బాన్ నగరాలు,ప్రాన్స్ ,స్విజర్లాండు, కెనడా,
యుఎసేఏ పర్యటించారు. ఆమెకు పద్మభూషణ్, గాన సరస్వతి, పద్మవిభూషణ్
మొదలైన సత్కారాలు అందాయి మన దేశానికి , ముఖ్యంగా మన దక్షిణ భారత
దేశానికి కర్ణాటక సంగీతానికి గుర్తింపు తెచ్చిన గాయనీ మణుల్లో పట్టమ్మాల్ ఒకరు.

Monday 28 March 2011

రమణగారికి హాస నీరాజనం





నిన్న ఆదివారం సాయంత్రం మా హాసం క్లబ్, రాజమండ్రి గౌతమీ గ్రంధాలయంలో
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి హాస నీరాజనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాము.
రమణ గారికి అన్ని వయసులవారిలోఎంతమంది అభిమానులున్నారో నిన్నటి
సమావేశం తెలియజేసింది. హాలు పూర్తిగా నిండిపోయి చాలామంది హాలు బయట
ద్వారం దగ్గర నిలబడి కార్యక్రమాన్ని చూడవలసి వచ్చింది. ఈ కార్యక్రమానికి శ్రీబాపు
రమణల అభిమాని శ్రీ ఎమ్మాస్సార్ మూర్తిగారు కాకినాడ నుంచి వచ్చి పాల్గొనటం
విశేషం. దాదాపు రెండున్నర గంటల పైగా సాగిన ఈ కార్యక్రమాన్ని హాస్యాభిమానులు
అద్యంతం ఆనందించారు. మితృడు హనుమంతరావు కార్యక్రమాని నిర్వహిస్తుండగా,
నేను మధ్య మధ్యలో రమణగారితో నా అనుబంధం , ఆయన మాటలలోని చమక్కులను
చెప్పాను. శ్రిమతి విజయలక్శ్మి, శ్రీమతి శారదలు రమణగారి "భామాకలాపం" స్కిట్
ప్రదర్శించి శ్రోతలను నవ్వుల్లో ముంచెత్తారు. శ్రి యస్.కృష్ణారావు (శ్రీనివాసా మెడికల్
ఏజెన్సీస్) ముత్యాలముగ్గులోని గోగులుపూచే, ఏదో ఏదో ఐనది పాటను, శ్రీ యువీ.
సత్యనారాయణ (పోలీస్ డిపార్ట్మెంట్) బుద్ధిమంతుడు చిత్రంలో బుడ్డిమంతుడి పాట
టాటా వీడుకోలు పాటను మధురంగా గానంచేశారు. రమణగారి జోకులను ఎంతో
మంది చెప్పి నవ్వితేనవ్వండి మాకభ్యంతరంలేదని చెప్పారు. ఈ రమణీయ హాసం
కార్యక్రమానికి లైఫ్ ఎమెర్జెన్సీ హాస్పటల్ డాక్టర్ చక్కా మార్కండేయగుప్త, ఫిజియో
ధెరపిస్ట్ జియెస్సెన్ మూర్తి, కధారచయిత, ప్రముఖ ఒరియా కధల అనువాదకులు
శ్రీ మహీధర రామశాస్త్రి, నటుడు గాయకుడు జిత్మోహనమిత్ర, కార్టూనిస్ట్ శేఖర్,
శ్రీ దివాన్ చెరువు శర్మ, శ్రీమతి కొండూరి రమాదేవి, శ్రీ తోలేటి రవికుమార్ ,శ్రీ అయ్యగారి
వెంకట్రామయ్య తదితర నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలోఉత్సాహంగా పాల్గొన్నారు
ప్రతినెలా జరిగే హాసం కార్యక్రమాల్లో ముళ్లపూడి వారి మాటల చమత్కారాలకు
కొంత సమయాన్ని కేటాయించాలని శ్రీ ఎర్రాప్రగడ ప్రసాద్ సూచనను హాసంక్లబ్
పాటించాలని నిర్ణయించింది.
<><><><><><><>
"నేను మీ యింటికి భోజనానికి వస్తున్నట్లు మీ ఆవిడకు తెలుసా?"
" భలే వాడివే!. నిన్ను భోజనానికి పిలిచినందుకు మా ఆవిడకు
నాకూ పొద్దున్న పెద్ద దెబ్బలాటైతేనూ !!"
><><><><><><><

ముళ్లపూడివారి "నవ్వితే నవ్వండి" మా కభ్యంతరంలేదు నుంచి
రాలిన ఓ చిరు(నవ్వు)ముత్యం.

Sunday 27 March 2011

మంచివాడి మీద ఒక పద్యం



వెక్కిరిస్తూనే జీవితాన్ని
చక్కదిద్దే వాడా !
తెలుగు తనానికి వెలుగు తనం
జోడించిన ప్రోడా !
రెండు గీతల్లో పన్నెండు కావ్యాలు
ధ్వనించిన ఋషీ !*
నువ్వంటే మాకు కుషీ !
నువ్వు పెట్టిన ఒరవళ్ళు
నీతరం ద్దిద్దుతున్నందుకు
తెలుగుదేశపు గోడలే సాక్ష్యం
నువ్వు తిట్టిన దీవనలు
మూడు పువ్వులు - ముప్ఫయ్యారు పళ్ళయినందుకు
తెలుగు వీక్లీల పేజీలు తార్కాణం
గుండెలకు కితకితలు పెడుతూ
మనస్సులు ఉతికే మనిషీ !
మేమంటే మాకు నామోషీ
( మానవుడు తప్పుచేయని దోషి )
----- ఆరుద్ర

1974 ఫిబ్రవరిలో రాజమండ్రి విక్రమహాలులో బాపుగారి చిత్రకళా
ప్రదర్శన జరిగింది. ఆ సంధర్బంలో విడుదలయిన సావనీర్లో బాపు
గారిపై ఆరుద్ర వ్రాసిన పై రచన ప్రచురించారు
ఇంకా ఆ పుస్తకంలో శ్రి ఎమ్వీయల్ బాపుగారి గురించి ఇలా చెప్పారు.
ఎవరి గీత ఎలా వుంటుందో దైవం తప్ప ఎవరూ చెప్పలేరు. కానీ బాపు
గీత బావుంటుందని మనందరిచేతా చెప్పించి బాపు మనందరికీ
దైవత్వాన్ని ప్రసాదించాడు.
సుఖ దు:ఖాదిక ద్వంద్వాతీతమైన
మనస్తత్వం
ఒకరిఒరవడి కాదగిన
వ్యక్తిత్వం
కలిగినవాడు బాపు
నిరంతరం శ్రమించడం
పనిలోనే విశ్రమించడం
మనసారా నవ్వగలగడం
నవ్వించ గలగల గలగడం
అతను పొందిన వరం
బాపు గొప్పవాడనడానికి మనం ఎవరం ?
తెలుగువారం -
ఏనాటికైనా ఒక వెలుగు వెలుగువారం !
బాపు అభిమానులందరికీ నచ్చుతుందని ఆశిస్తూ........
* శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు బాపుగారి గురించి చెబుతూ" ఆయన
దేముని చిత్రాలు గీసేటప్పూడు ఋషిగా మారిపోతారు"అన్నారు. అందుకేనేమో
ఆరుద్ర "ఋషీ"అన్నపదాన్ని అప్పుడె ఉపయోగించారు.!!

Saturday 26 March 2011

తిరుపతి వేంకట కవులు

దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినార మీ
మీసలు రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు,గెల్చిరేని యీ
మీసలు తీసి మీ పద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే !!

నేడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి ( మార్చి 26)
ఆ మహాకవిని స్మరిస్తూ.......
...కళాగౌతమి , తెలుగు భాషభివృద్ధి పత్రిక,
రాజమహేంద్రవరం , సౌజన్యంతో............

Friday 25 March 2011

1924లో అలా...మొదలైంది !!


మీరు పై ఫొటోలో చూస్తున్న ధియేటర్ రాజమండ్రిలో అతి పురాతనమైన
ధియేటర్. రాష్ట్రంలో నిర్మించబడ్డ రెండో సినిమా టాకీస్. దీన్ని 1924లో
నిర్మించారు. మొదట ఇందులో మూకీ చిత్రాలు ప్రదర్శించేవారట. భారత
చలన చిత్ర రంగంలో టాకీ చిత్రాలకు నాంది పలికిన మొట్టమొదటి చిత్రం
"అలంఅరా" (హిందీ) 1931 లో ఇక్కడ ప్రదర్శించారు. మూకీలకు అటు
తరువాత టాకీలకు వేదికగా నిలచిన ఈ టాకీస్ శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్
గా పిలచేవారు. 1983 నుండి సాయిక్రిష్ణగా పేరుమార్చారు. తెలుగువారు
తీసిన మొదటి టాకీ చిత్రం భక్తప్రహ్లాద కూడా ఇక్కడే 1931 లో ఆడింది.
విజయవాడలో మొదటి సినిమా హాలు మారుతీ ధియేటర్, రాజమండ్రిలో
కృష్ణాటాకీస్ రెండవది. విజయవాడలోని మారుతి, షాపింగ్ క్లాంప్లెక్స్ గా
మారినా ఆనాటి ఈ ధియేటర్ ఇంకా చిత్ర ప్రదర్శనను కొనసాగించడం
చెప్పుకో దగ్గ విషయం.. ఈ ధియేటర్ నిర్మాతలు నిడమర్తివారు. వారికి
రాజమండ్రిలో దుర్గాసినీటోన్ పేరిట సినిమా స్టూడియో కూడా వుండేది.
సంపూర్ణరామాయణం చిత్రం ఆ స్టూడియోలోనే నిర్మించారు. ఆ సినిమాలో
రాముడి వనవాస దృశ్యాలలో గోదావరి బ్రిడ్జ్ అగుపించిందని చెప్పుకొనేవారు.
ఇప్పుడు ఈ ధియేటర్ ఏసి/డిటీయస్ సౌకర్యాలతో మేనేజింగ్ డైరెక్టర్ నిడమర్తి
మురళి నిర్వహిస్తున్నారు. ఈ ధియేటర్లో హిందీ సినిమా "కొహ్రా" నూరు
రోజులాడింది. అంజలీ పిక్చర్స్ "సువర్ణసుందరి" రజతోత్సవం జరుపుకొంది.
ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఈ ధియేటర్లో ప్రదర్శించారు. అలా మొదలైన
ఈ హాల్లో ఇప్పుడు "అలా...మొదలైంది" విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది.

Wednesday 23 March 2011




కన్యాశుల్కం చదవడం, భమిడిపాటిని చూడడం వాడడం, బారిస్టరు పార్వతీశంతో
నడవడం, వుడ్ హౌస్ వరడ్-ప్లే-గ్రౌండ్సులో చెడుగుడు ఆడడం, లా రలెండ్ హార్డీ,
చాప్లిన్ లూ, మార్క్స్ బ్రదర్సూ చూడడం మాయిద్దరికీ యిష్టం.
సోగ్గా నడిచే బొమ్మాయిల వెనకాలే నడుస్తూ వాళ్ళ నడుముల మీద నాట్యమాడే
జడగంటా రావాలకు తాళం వెయ్యడం ఇంకా ఇష్టం.వాళ్ళ వెనకాలే నడిచేవాళ్ళం కాబట్టి
మొహాలు కనబడావు గదా! అందుకని వాళ్ళకు ఎదురుగా వస్తున్న మొహాలు చూస్తూ
-అమ్మాయిల అందాలను అంచనా కట్టడం అదో సరదా; ఆ కుర్రాళ్ళు వీళ్ళనే చూస్తూ
పేడకళ్లల్లో కాళ్ళేసి బోర్లా గీర్లా పడటం చూసి నవ్వడం మరింత సరదా. వీటన్నిటినీ మించి
ఇంకో సరదా ఉంది.
చక్కహా పెసరట్టుప్మా లాగించి, కాఫీ తాగేసి నోట్లో వక్కపొడి వేసుకొని-కాలు మీద
కాలు వేసుకొని వెల్లకిలాపడుకొని సిగరెట్టు కాలుస్తూ....ఇవన్నీమామూలే ... పొగపీలుస్తూ
చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం-అల్టిమేట్ జాయ్! దీనికి తోడు వెనకనించి-విన-
బడే-గులాం పాట, చిన్నప్పటి రాజేశ్వరరావు బాలసరస్వతి పాటలు అల్టిమేటున్నర.అలా
వందలు వేలూ చూశాం.
భారతిలో "త.రా " ( తలిశెట్టి రామారావుగారి ప్రబంధకన్య) తరవాత తరతరానికీ
ఎదిగే పెరిగే కార్టూన్ లు లక్షోపలక్షలు... ఎందరో మహానుభావుకులు ఎన్నోవేసేశారు; మరి
ఈతరంవారికేం మిగిల్చారు అని జాలిపడుతూ వీపు నిమరబోయాం - వీపు బదులు పిక్కలు
అందాయి. అంటే-జాలిపడే స్థితికాదు; అసూయ పడేస్థాయికి ఎదిగారు; ఎదుగుతున్నారు.
కొత్త కొత్త గీతలూ రాతలూ జోకులూ బావిలో నీరులా వూరుతూనే ఉన్నాయి. కొత్త వాళ్ళు
వేస్తునే వున్నారు. అది తరగని గని-అలాగే సూ-రేఖార్టూన్స్ కూడా. అంత హాయిగానూ
వున్నాయి. ఆయన రాతా గీతా మిళాయించారు. రాత మీద గీత - రాతలేకుండా గీతా....
ఎన్నో నవ్వులు గుబాళించాయి. బాంకాఫీసరుగా డబ్బుని అప్పులిచ్చి పుచ్చుకున్న
అప్పారావుగారు - ఇవి మాత్రం ఎక్కడా అప్పు చేయకుండానే లా- గీయించేశారు.
టైరై-పోయారు-కార్టూన్లు పడ్డాయి, మందురాయడం-టిఫిను చెయ్యడం లాటి మామూలు
మాటల్లోంచి ఎడా-పెడా-ర్ధాలు తీసి- కుంచెడేసి నవ్వులు పిండుతారు.
వెయిటర్ ఎవడూ? వడ్డించేవాడా? తినేవాడా? టిఫినుచేసేవాడెవడు తినేవాడా?
వండేవాడా?
కాల్చుకు తింటున్నావని చిలగడదుంప మొర్రో అంటే- వేపుకుతింటున్నావని
బంగాళాదుంప కుయ్యో అందిట....
50 ఏళ్ళ నవ్వుల పంటతో గోల్డెన్ జూబ్లీవిందు అందిస్తున్న శ్రీ అప్పారావుగారికి
శతమానం భవతి.
-------ముళ్లపూడి వెంకట రమణ.
నాపై ఎంతో అభిమానంతో ( అప్పారావంటే అయనకు నిజంగా ఎంతో ప్రేమ) నే అడగగానే
ముందుమాటను వ్రాసి పంపించారు. తరువాత మరోటి వ్రాసి " ఇంతకుముందు పంపినది
అందినా దాని బదులు ఇదే వాడండి " అంటూ పైన నేను మీ ముందుంచినది వ్రాశారు.
వెంకటరమణగారు స్వదస్తూరితో వ్రాసిన మొదటి పేజీకూడా ఇక్కడ వుంచుతున్నాను.
ఈ నెల 27వ తేదీ ఆదివారం స్ఠానిక గౌతమీ గ్రంధాలయంలో మా "హాసం క్లబ్"
ముళ్లపూడి రమణీయం పేరిట ఆయన జోకులు, చిత్రాలలోని పాటలతో రెండు గంటల
కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నాము.

Tuesday 22 March 2011

నీటిమీద రాతలు



ఈ రోజు ఉదయమే ఈనాడు పేపరు చూడగానే నేడు ప్రపంచ జలదినోత్సవం
అని కనబడంది. ఏమిటో మనకు రోజుకో ఉత్సవాలు రోగాలదగ్గరనుంచి అన్ని
విషయాలమీద ఉత్సవాలే. నిన్ననే అటవీ దినోత్సవం జరుపుకున్నాం.గుర్తుగా
తిరుమలలోని అడవంతా కాలిపోయింది. మరి ఈరోజు జలప్రలయం ఏమైనా వస్తుందేమో
అని భయంవేసింది. ఇంతలోనే శ్రీమతి మంచి నీళ్ళు రావటంలేదంటూ ఓ కేక !
వాచ్ మన్ను అడిగితే ఐదుగంటలకే కరెంటు పోవడంవల్ల మోటార్ వేయలేదండీ.
రాగానే వేస్తానని చల్లని కబురు చెప్పాడు. అయినా మన ముఖ్యమంత్రిగారు కోత
లేదని కోసారుగాదా , అవును పాపం లోడ్ షెడ్డింగే లే అని తృప్తి పడాలికదా!
మనకు పకృతి ప్రసాదించిన వరాల్లో ఉచితంగా దొరికేవి నీళ్ళు, గాలి అని గతంలో
అనుకొనే వాళ్లం. ఇప్పుడు ఆ నీళ్ళు కొనుక్కోవాలి, అలానే గాలీ ఫాన్లు, ఏసీల
రూపంలో కొనుక్కుంటున్నాము. నిత్య జీవితంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత
వుంది. ఆరోగ్యంగా వుండాలన్నా, రోగాల బారి పడాలన్నా ఆనీరే! ప్రళయ కాలంలో
విష్ణుమూర్తి వటపత్రం పై పవళించాడట. మన పరిణామ క్రమం చెప్పిన డార్విన్
కంటే ముందే మన పురాణాలు పరిణామ క్రమాన్ని చెప్పాయి. దశవతారాలు
అదేకదా! ముందుగా నీరు అందులోంచి పుట్టినది మత్యం. అటుతరువాత ఉభయచరం
తాబేలు. అదే కూర్మావతారం. మన భారతదేశ పురాణగ్రంధాలు పుక్కిటి పురాణాలు
కాదని వీటివల్ల తెలుస్తున్నది.
దేశం లో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. కొండల్లో కోనల్లో ప్రవహించి ఎన్నో ఔషధ
గుణాలను పొంది ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. అందు చేతే మన వాళ్ళు
ఈ నదుల్లో స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. కాని ఇప్పుడు నదులన్నిటినీ
మనమే కాలుష్యపరుస్తున్నాము. కార్పొరేషను కొలాయిల్లో వచ్చిన నీళ్లయినా ఫిల్టర్
చేసుకు తాగితేకాని పనికిరాని రోజులొచ్చాయి. పూర్వం ఇలా ఫిల్టర్లు లేని రోజుల్లో
చెరువుల్లో, నదుల్లోని నీరు బురదగావుంటే ఇండుపకాయి ( ఓ విత్తనం) ని అరగదీసి
బిందెల్లో, కుండల్లొ వుంచేవారు. నీరు తేరుకొని శుభ్రపడటానికి ఆ రోజుల్లో ఇదో ఉపాయం.
ఎన్నికలురాగానే నాయకులు ప్రతి గ్రామంలోను నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని,
ఇక అందరికీ రక్షిత నీటిని అందజేస్తామని వాగ్దానాలు జలధారలు కురిపిస్తారు. చివరకు
అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు నీటి వ్యాపారం జోరుగా సాగు
తున్నది. మినెరల్ వాటర్ అని ప్రతి చోటా ఈ నీళ్ళవ్యాపారం సాగుతున్నది. నిజానికి
మామూలు నీళ్ళే!. ప్లాస్టిక్ సంచుల్లో నింపి అమ్ముతుంటే పాపం అమాయకజనాలు
వాటికోసం డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.
నీళ్ళమీద కూడా ఎన్నో నానుడులు వాడుకలో ఉన్నాయి. ఎవరైనా ఇద్దరు కలసి
మెలసి వుంటే పాలూ నీళ్లలా కలసిపోయారంటారు. పరిసరాలను బట్టి ప్రాచుర్యం
పొందుతారనటానికి తామరాకు పై నీటి బొట్టని అంటారు. తెలియకుండా మనకు
ఏ ఉపద్రవం వచ్చినా చాపకింద నీరులా అంటారు. ఏ విషయాన్ని మొండిగా
పట్టించుకోని వాళ్ళను నిమ్మకు నీరెత్తినట్లు అంటారు. ఇక వేసవి రాగానే నీటి కొరత
మొదలవుతుంది. నేల మీద పడిన కొద్ది నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోతున్నది.
అందుకే గత ప్రభుత్వం ప్రతి ఇంటికి తప్పక ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని
చెప్పింది. తారు రోడ్లు, ఇరువైపులా సిమెంట్ నడకదారులూ, అపార్ట్ మెంటు కల్చరుతో
ఆవరణ అంతా కాంక్రీటుతో నీరు భూమిలొకి ఇంకే అవకాశమే లేకుండాపోతున్నది.
నీరు ! కన్నీరు ! అను "ఐస్" వాటర్ !!
మునిసిపాలిటీ అందించే కలరు నీరు జనం పాలిటి కలరా !
ఆ నీళ్ళు తాగి రోగాలు రాని జనాలు ఒక్కరైనా కలారా ?!
అందుకే సందు సందు ముందు పెట్టారు ఓ "మందు" దుకాణం !
ఆ ":మందు"తో తీర్చుకుంటున్నారు ఓటేసిన జనం ఋణం !!
><><><><><><><><><><.

Sunday 20 March 2011

ఆ రోజుల్లో ప్రకటనలు !


ఇప్పటి ప్రకటనలకు అప్పటి ప్రకటనలకు ఎంత తేడా వున్నదో పై ప్రకటనలు
చూస్తే తెలుస్తుంది. ఆనాడు ఉపయోగించిన పదాలకు ఇప్పటి ప్రకటనలలోని
పదాలకు కాలంతో వచ్చిన మార్పులతో తేడా అగుపిస్తుంది. ఇప్పుడు ప్రచార
సాధనాలు పెరిగాయి. ఒక వస్తువు గురించిన విశేషాలు వినిమయదారులకు
చేరే దారికి ఆనాడు పత్రికలే మార్గదర్శకాలు.. కాని చదువొచ్చిన వారికే ఆవస్తువు
గురించి తెలుసుకొనే అవకాశం వుండేది. అటుతరువాత సినిమా ధియేటర్లలో
ప్రకటనలు చూపించడం ప్రారంభించాక సామాన్య వినియోగదారుడికీ కూడా
తమ వస్తువుల గురించి తెలియజేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు చిన్నతెర
ప్రతి ఇంట్లో ప్రవేశించాక తాయెత్తుల దగ్గరనుంచి ఎన్నెన్నో ప్రకటనలు. ఒక్కో
సారి ఆ ప్రకటనలలో ఉపయోగించే భాష ఇబ్బందికరంగా వుంటుంటుంది. దీనికి
ముఖ్య కారణం ఆప్రకటనలలోని మాటలను స్థానిక భాషలోకి అనువాదం
చేసే వారి అతి తెలివి. ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అనువాదకులకు
తెలియక పోవడమే. ఇటీవల ( ఇప్పుడు మార్పు చేశారులెండి ) ఒక మాల్ట్ డ్రింకు
ప్రకటనలో పిల్ల వాడు తన తల్లితో " అమ్మా! నాకూ వయసు వచ్చింది!"
అంటాడు. ఇక్కడ వయసు అన్న మాటకు భావం వేరుగా వుటుంది కదా?!
ఈ మధ్య తాయెత్తులు , అంటూ జనాల బలహీనతలమీద కుప్పలు తెప్పలుగా
టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయి. మోసాలు దగాలూ అంటూ క్షణక్షణానికి
ఎలుగెత్తే మన న్యూస్ చానల్లు , వీటికి మాత్రం తెగ ప్రచారం ఇస్తున్నాయి. కొన్ని
ప్రకటనలు ఇప్పటి సినిమాల లాగానే పిల్లల్ని పక్కన పెట్టుకొని చూడలేం. ప్రతిదీ
తెల్సుకోవాలనే ఈ కాలం పిల్లలకు ఏదోలా మరో విషయం మరోలా చెప్పి
సమాధాన పరచడం ఈ నాటి పెద్దలు నేర్చుకోవాల్సిన అవసరం కలుగుతున్నది..
ఈ పై ప్రకటనలు 1954 ఆంధ్ర సచిత్రవార పత్రిక ( ఆంధ్ర పత్రిక) దసరా సంచిక
లోనివి.

Saturday 19 March 2011


ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారు. హొలీ అంటే కామదహనం. తారకాసురిడి
సంహారం కోసం శివపార్వతుల నడుమ ప్రేమ చిగురించడానికి ఇంద్రుడు
మన్మధుని సహాయం కోరగా మన్మధుడు తన పూలబాణాలను
తపస్సు చేసుకొంటున్న శివునిపై వేయగా శివుడు కోపించి తన
తన మూడో కంటిని తెరచి మన్మధున్నిభస్మం చేస్తాడు. ఆ రోజే కాముని
పున్నమిగా పిలుస్తారు
మన్మధుని మరో పేరు కాముడు. రతీదేవి కోరికపై ఈశ్వరుడు మన్మధుని
బ్రతికిస్తాడు. ఈ పున్నమినే హొలీ అని అంటారు. మధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!
.
.

Tuesday 15 March 2011

మంచం కబుర్లు


ఈరోజు బాపుగారి ఆనాటి జ్యోతి పత్రికలోని ఓ కార్టూన్ చూడగానే ఆ రోజుల్లోని
నవారు మంచాలు జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడెక్కడా నవారు మంచాలు
కనిపించడంలేదు. అన్నీ మోడ్రన్ మంచాలు. ఇనపవీ ,లోపల బోల్డు
సామాన్లు దాచుకొనేవీ ఎన్నెన్నో! పూర్వం నవారు మంచాలతో బాటు
నులక మంచాలు వుండేవి. మడికోసం వాటిని తడిపినప్పుడు తమాషాగా
ఒంకర పోయేవి. ఆ వంకర మంచం మీద నేను అక్కయ్య, చెల్లి ఎక్కి అది
పైకి క్రిందకుకదలుతుంటే సీసా బల్ల మీద ఎక్కినట్లు భలే సరదాగా వుండేది!
మా ఇంట్లో వుండేవి కాదుగాని చాలా మంది ఇళ్లల్లో మడత మంచాలు
వుంటుండేవి.. మడిచి గోడమీద ఆనించి వుంచితే చాలా స్థలం కలసి వస్తుందని
ఆ మంచాలు ఉపయోగించేవారు. ఇక నవారు మంచాలు అప్పుడప్పుడు
వదలవుతే ఆ మంచానికి అటువైపు ఇటు వైపు క్రింద ఇద్దరు కూర్చొని నవారు
టేపుని లాగి బిగించేవారు. మాసిన నవారును విప్పి వుతకడానికి వేస్తే
ఉతికి గుడ్రంగా చుట్టి తెచ్చేవారు. మళ్ళీ దాన్ని మంచానికి అల్లడం ఒక
కళ. ఆ రోజుల్లో డబల్ బెడ్స్ లను పందిరి మంచాలనేవారు. ఎత్తుగా అందమైన
డిజైన్లతో నాలుగు వైపులా పందిరిలా స్థంభాలుండి పైన మంచి గుడ్డతో
కవరుండెది. పూర్వపు రొజుల్లో దాదాపు అన్నీ పెంకుటిళ్ళేకాబట్టి చూరు
మీద నుంచి పురుగు పుట్రా పడకుండా అదో ఏర్పాటు అనుకుంటాను.
మంచానికి ఎన్నెన్నో అర్ధాలు వున్నాయి. ఎవరికైనా వొంట్లొ బాలేదనుకోండి,
వాడు మంచ మెక్కాడు అంటారు. కొత్త పెళ్ళి కొడుకులు అలక పాన్పు(మంచం)
ఎక్కేవాళ్ళట. ఇక గవర్నమెంట్ హాస్పటల్లళ్ళో లంచమిస్తే గాని మంచమియ్యరట!
పొలాల్లో పిట్టలని తోలడానికి, రాత్రి పూట కాపలా కాయటానికి ఎత్తుగా నాలుగు
కర్రల మీద ఏర్పాటు చేసుకొనే మంచె ఈ మన మంచానికి దగ్గర చుట్టమనకుంటా.
ఇక మంచాలమీద కూడా మన తెలుగు సామెతలూ ఎక్కాయి!
"పంచ పాండవులంటే నాకు తెలియదా ? మంచపుకోళ్లలాగ ముగ్గురు
అని రెండు వేళ్లు చూపించాడట ! "
" మంచ మున్నంతవరకే కాళ్లు చాపుకో "
" మంచమెక్కి వరుసలడిగినట్లు "
మర్చిపోయా. మా చిన్నతనంలో నరసారావుపేట కాట్స్ అని ఫోల్డు చేసేందుకు వీలుండే
మంచాలు వచ్చేవి. మొత్తం మంచం మడత పెడితే సన్నని పొడవైన ఓ సంచిలో పట్టేది!.
నేను మొదటి సారిగా శ్రీకాకుళం బ్యాంకులో ఉద్యోగానికి 1963లో జేరినప్పుడు నాకు
నాన్నగారు అలాటి మంచాన్నే కొనిచ్చారు.అందండీ మంచాల కధ.
( శ్రీ బాపు కార్టూన్: జ్యోతి బుక్స్ వారి " రసికజన మనోభిరామం " సౌజన్యంతో )

Monday 14 March 2011




ఇప్పటి మ్యూజిక్ సిస్టమ్లు, ఐపాడ్లు లేని రోజుల్లో ఆనాటి ప్రముఖుల గానం
విని ఆనందించాలంటే గ్రామఫోన్ రికార్డులే శరణ్యం. ఓ గాయకుడు రికార్డు
కంపెనీల మెప్పు పొందినప్పుడే అతని పాటలు రికార్డులుగా విడుదలయేవి.
మధుర గాయకులు ఘంటసాల మాస్టారును కూడా మొదట ఆయన గాత్రం
బాగోలేదని తిరస్కరించారట! ఆ రోజుల్లో ఓ ప్రముఖ గ్రామఫోను కంపెనీలో
ఉద్యోగం చేస్తున్న ప్రఖ్యాత నటులు శ్రీ పేకేటి శివరాం శ్రీ ఘంటసాల వారి
ప్రతిభను గుర్తించి ఆయనను కలకత్తాకు తీసుకొని వెళ్ళి పాటను రికార్డు
చేయించారట!.
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ శ్రీ యం.సూరిబాబు " తొలినాటి గ్రామఫోన్
గాయకులు " పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో ఆనాటి
గాయకుల ఫొటోలతో బాటు , వివరాలను పొందుబరచారు. అంతేకాదు
ఆనాడు వారు ఆలపించిన మధుర గీతాల సీడీని కూడా ఆపుస్తకంతో
జత పరచడం విశేషం. ధరకూడా అందుబాటులో 80 రూపాయలుగా
ఉంచడం అభినందనీయం. ఈ సిడీలో శ్రీ కపిలవాయి రామనాధశాస్త్రి,
ఉప్పులూరి సంజీవరావు, సి.ఎస్.ఆర్, అద్దంకి శ్రీరామమూర్తి, రామతిలకం,
వేమూరి గగ్గయ్య, దైతా గోపాలం, టి.రామకృష్ణశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరి
రావు, కన్నాంబ, పారుపల్లి సత్యనారాయణ, నాగయ్య, ఆరణి సత్యనారాయణ,
స్థానం నరసింహారావు, కొచ్చెర్లకోట సత్యనారాయణ, పి.సూరిబాబు, కె.రఘు
రామయ్య, బందా కనకలింగేశ్వరరావు, ఎస్.రాజేశ్వరరావు, టంగుటూరి
సూర్యకుమారి, మోహన్ పాటలున్నాయి ఈ గాయకుల సంక్షిప్త వివారాలను
శ్రీ మొదలి నాగభూషణశర్మగారు అందించారు. సంగీత అభిమానులు ప్రతి
ఒక్కరు స్వంతం చేసుకోవాల్సిన మంచి పుస్తకం ఇది.

Sunday 13 March 2011




చందమామలో 1953 నుంచి అద్భుతమైన చిత్రాలు వేస్తున్న
శ్రీ శంకర్ ( కె.సి.శివశంకర్), చందమామలో కార్టూన్లు అప్పు
డప్పుడు వేసేవారు ఫిబ్రవరి 1959 సంచికలో ఆయన వేసిన
కార్టూన్ మీరు ఇక్కడ్ చూడండి. ఆయన చిత్రాలు సన్నని
పెన్ స్ట్రోక్స్ తో, ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు కమణీయ దృశ్య
కావ్యాలుగా వుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న లంకలోని
రావణుని దుర్గం, చుట్టూ అగడ్త, రాముడు అంగదుణ్ణి పిలిచి,
"అంగదుడా, నీవు నిర్భయంగా లంకా ప్రాకారం దాటి, రావణుడుండే
చోటికి వెళ్ళి,నా మాటలుగా ఇలా చెప్పు :....."అంటున్న సంధర్భాన్ని
శ్రీ శంకర్ కన్నులకు కట్టినట్లు చూపించారు. చందమామ నాగిరెడ్డి
1952 డిసెంబరు నెలనుంచి నెలకు 300 రూపాయలకు ఆర్టిస్టుగా
శ్రీ శంకర్ ను నియమించారు.
చందమామ సౌజన్యంతో

Saturday 12 March 2011






అన్నపూర్ణావారి " వెలుగు నీడలు " చిత్రానికి శ్రీశ్రీ ఏనాడో వ్రాసిన
పాట "పాడవోయి భారతీయుడా" అన్న పాట నేటి పరిస్థితులకు సరిపోవడం
ఆశ్చర్యమే!
పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !
ఇద్దరు తెలుగు వాళ్ళకు పడదు. ఓ తెలుగు వాడు వ్రాసిన @పద్యాన్ని ఆ పద్యం
అతనిడి కాదని సభలూ సమావేశాలు ఏర్పాటు చేస్తారు!. ఇప్పుడేమో కొందరు
తెలుగు వాళ్ళు విడి పోదామంటున్నారు. కొందరు తెలుగువాళ్ళు కాదు
కలసే వుండాలంటున్నారు. ఇద్దరిదీ మూర్ఘత్వమే. ఇలా తగవులతో దిన దిన
గండంగా బ్రతికే కంటే విడి పోతే అప్పుడు విడిపోయి సుఖపడాలనుకొనే వాళ్ళకి
ఆ సుఖమేమిటొ తెలిసి వస్తుంది. మొన్న టాంకు బండు పై జరిగిన విగ్రహాల
విధ్వంశం చాలా బాధాకరమైన సంఘటన. విగ్రహాలుపోతే మళ్ళీ ఏర్పాటు చేసు
కోవచ్చ అన్న మాట సరైనది కాదు. హైద్రాబాద్ నగరంలోని ఆ టాంక్ బండును
ప్రముఖుల శిల్పాలతో అలంకరించాలన్న ఆనాటి ముఖ్యమంత్రి కోరికను మన
తెలుగువాళ్ళతో సహా ఇతరులు అభినందించారు. ఇప్పుడేమో వాటిని సర్వనాశనం
చేశారు. ఒకనాడు మన రాజధాని సుందర నగరంగా, క్లీన్ సిటీగా పేరు పొందింది.
2004 తరువాత క్రమక్రమంగా మన రాజధాని అన్నివిధాల దిగజారింది.
National Geographic నవంబరు 2002 సంచికలో హైద్రాబాదు గురించి
ఆ పత్రిక GLOBAL CITIES పేరున వ్రాసిన సచిత్ర వ్యాసం చూడండి. తెలుగు
వాళ్ళంగా ఇప్పటి పరిస్థితికి తలలు దించుకొందాం.
<><><><><><><><><><><>
@ భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏడ్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసిన ఈ పద్యం ఆయన వ్రాయలేదంటూ
కొందరు తెలుగు వాళ్ళే సభలు చేసి అలజడి సృష్టించారు, కొంతకాలం క్రితం!
ఇదీ మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్య స్ఠితి!

Wednesday 9 March 2011

జపాన్ లో మన శ్రీధర్





మన తెలుగు కార్టూనిస్టులు చాలా మంది విదేశాల్లో కూడా ఎన్నో కార్టూన్
ప్రదర్శనలలో పాల్గొని బహుమతులు ప్రశంసలు పొందారు. ఈనాడు కార్టూనిస్ట్
శ్రీధర్, జపాన్ కార్టూనిస్ట్స్ అసొసియేషన్ సహకారంతో "జపాన్ ఫౌండేషన్
ఫోరమ్" 1955లో జపాన్లో Asian Cartoon Exhibition ఏర్పాటు చేసిన.
ప్రదర్శనలో మన దేశం తరఫున పాల్గొన్నారు. మన దేశంతో బాటు పదకొండు
దేశాల కార్టూనిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జపాన్ ఫౌండేషన్ ఆహ్వానం
అందుకొని అప్పుడు శ్రీధర్ జపాన్ వెళ్ళి వచ్చారు. మన ఆశియా మహిళలు
అనే శీర్షిక మీద స్త్రీల సమస్యలపై శ్రీధర్ సంధించిన వ్యంగాస్త్రాలుగా ఈ కార్టూన్లు
కలకాలం నిలచి పొతాయి. ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమోహన్ .నిర్వహించే
స్మైల్ పత్రికను నిన్న మరోసారి చూస్తుండగా అందులో అగుపడ్డ శ్రీధర్ కార్టూన్లు,
(నిన్ననే మనం మహిళాదినోత్సవం జరుపుకొన్నాము) చూసి మీతో పంచుకోవాలని
మీ ముందు వుంచుతున్నాను.
Courtesy: Sri Syammohan's "SMILE"

Tuesday 8 March 2011

బొమ్మల కధలు





విదేశాల్లో బొమ్మల కధల పుస్తకాల్లు కోకొల్లలు. డిసీ కామిక్స్ లాంటి
ఎన్నెన్నో బొమ్మల కధల పుస్తకాలు అక్కడి పిల్లలను, పెద్దలను విశేషంగా
ఆకర్షించాయి. అవే పుస్తకాలు మన దేశంలోనూ దిగుమతిఅయ్యాయి.
ఆకధలన్నీ సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి కధలు! ఆ తరువాత
ఆ కధలే సినిమలుగానూ వచ్చాయి. మన దేశంలోని పిల్లలు ఆ బొమ్మల
కధలను చదవడానికే ఎక్కువ ఇష్టపడటం మొదలెట్టారు. విదేశాల్లో
కూడా పిల్లలు వాటితో బాటు క్లాసిక్స్ ను కూడా చదివే అలవాటు
చేయడానికి క్లాసిక్స్ ఇల్లస్ట్రేటెడ్ పేరిట ప్రసిద్ధ రచయితల కౌంట్ ఆఫ మాంటో
క్రిస్టో, టేల్ ఆఫ్ టు సిటీస్ మొదలయిన కధలను బొమ్మలు కధల రూపంలో
ప్రచురించడం మొదలయింది. మన భారతదేశ సంస్కృతిని, గాధలను మన
పిల్లలకు తెలియ చెప్పడానికి అనంత్ పాయ్ అమరచిత్ర కధల పేరిట
పౌరాణిక, చారిత్రక గాధలను బొమ్మలు కధలుగా ప్రచురించి , పిల్లలను
మన దేశకధల వైపు ఆకర్షింప జేశారు. ఆయనే టింకిల్ పేరిట మాస పత్రికను
వివిధ విషయాలపై బొమ్మల కధలతో ప్రారంభించారు. కొంతకాలం టింకిల్
తెలుగులోనూ వచ్చేది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన పిల్లలు తెలుగు
పుస్తకాలు చదివితే మనకు నామోషీ కాబట్టి కొనడం మానేశాం. అందుచేత
టింకిల్ తెలుగు ప్రచురణ ఆగిపోయింది. పిల్లల కోసం ఇంతటి మంచి పుస్తకాలను
తీసుకొనివచ్చిన అనంత్ పాయ్ మన బుడుగు రమణ గారు దిగవంతులైన రోజునే
అస్తమించడం విచారకరమైన వార్త.
ఆంధ్ర వార పత్రిక 1950 లలో పంచతంత్రం కధలను విశ్వాత్ముల నర
సింహమూర్తి గారిచే బొమ్మల కధలుగా ప్రచురించింది. ఆ బొమ్మల కధలకు
శ్రీ నండూరి రామమోహనరావుగారు గేయాలరూపంలో రచన చేశారు. ఆ పుస్తక
రూపంలో వెలువడిన ఆ పంచతంత్రం బొమ్మలకధ నేను నమ్మి అరువిచ్చి పొగొట్టుకున్న
చాలా పుస్తకాల్లో అదొకటి. అందులొ నాకింకా గుర్తు. మిత్రలాభం కధలో
లేడి వేటగాడి వలలో పడినప్పుడు, రామమోహనరావుగారు ఆ బొమ్మ పైన ఇలా
వ్రాశారు. "మేత కోసమై వలలో పడినే పాపం పసివాడు" అని ! విశ్వాత్ముల నరసింహ
మూర్తిగారు దివగంతులైతే శ్రీ బాపు మిగతా పంచతంత్రమ్ కధలను వేశారు. ఆంధ్ర
వారపత్రికలో బాపుగారు "బంగారం-సింగారం", "లంకెబిందెలు" మొదలయిన బొమ్మల
కధలను వేశారు. "గలివర్ ట్రావెల్స్" ను రంగుల్లో బాపుగారు బొమ్మల కధగా గీయగా
చందమామ లో ప్రచురించబడింది. బాపు గారి బొమ్మల కధలన్నిటినీ ఒకే చోట
చదివే అవకాశం వాహిని బుక్ ట్రస్ట్ వారు "ముళ్లపూడి వెంకటరమణ -బాపు బొమ్మల
కధలు పేరిట ప్రచురించారు.

Friday 4 March 2011






మీరు చూస్తున్న ఈ ఫొటోలు SMALL TALK అన్న పుస్తకం
లోనివి. చిట్టిపాపాయిల ఫొటోలను SYMS అనే అనే వ్యక్తి
వేరు భంగిమలలో ఫొటోలు తీసి ఆ ఫొటోలకు చక్కని
వాఖ్యలను వ్రాసారు. దీన్ని పుస్తక రూపంలో Jaico Publishing
House వారు 1958 లో ప్రచురించారు. ఈ పుస్తకం మా నాన్నగారి
అనేక మంచి పుస్తకాల కలెక్షన్స్ లో ఒకటి. ఆ రోజుల్లో ఈ పుస్తకం
ఖరీదు రెండు రూపాయలు. ఆ పుస్తకం చివరి పేజీలలో పాఠకులను
ఇలాటి ఫొటోలను తీసి మంచి కాప్షన్ తో పంపమని ప్రచురుణకర్తలు
కోరారు. మొదటి పేజీలో ఇలా వ్రాశారు..
YOUR SWEET LITTLE ONES !
........They cannot talk. Then what ? -- Are not their
expressions angelic, unforgettable, more eloquent
than words ?
And it is this eloquence that lits up the pages
of this small book. Their "SMALL TALK " gets a
better audience than any of the "TALL TALK" on
record.
"A babe in the house is a well-spring of
pleasure, a messenger of peace and love, "-said
Tupper, the great English writer. It is the same
fashion it lends charm to each of the pages of this
book.
Ah ! their bewitching smile, their bubbling
laughter and their tears that fall like summer rains !
They bring pleasure, peace and love to a weary
world.
------- JAICO BOOKS

ఈ పుస్తకం మీకెక్కడైనా బుక్ స్టొర్సులలో
(కొత్త ఎడిషన్) అగుపిస్తె నాకు తెలియజేస్తారని తలుస్తాను.

Thursday 3 March 2011


చాలా చాలా ఏళ్ళక్రితం తపాలాబిళ్లల కాగితాలలో ఈకాలంలో లాగ ఒక
బిళ్లకీ మరో బిళ్లకీ మధ్య బెజ్జాలుండేవి కావు. వాటిని వేరు చేయాలంటే
కత్తెరతో కత్తిరించడమో, చాకుతో కోయడమో చేయవలసి వచ్చేది. ఒక
పత్రికా విలేఖరి తన హోటల్ గదిలో కూర్చొని తన పత్రికకు పంపవలసిన
వార్తలు వ్రాయటం పూర్తయిన తరువాత ఆ కాగితాలను కవరులొ పెట్టి
అతికించాడు. కవరుపై అతికించడానికి తపాలాబిళ్లల కాగితం తీసి వాటిని
వేరుచేయడానికి చూస్తే అతని దగ్గర కత్తెర గానీ చాకుకానీ లేదు. అప్పుడు
అక్కడ దొరికిన ఓ గుండుసూది తీసుకొని ,దానితో ఆ తపాలా బిళ్లల చుట్టూ
రంధ్రాలు పొడవటం మొదలుపెట్టాడు. అదే హోటల్లో వుంటున్న అతని
స్నేహితుడు, హెన్రీ ఆర్చర్ అతని రూములోకి వచ్చి తన స్నేహితుడు
చేస్తున్న పని చూసేసరికి అతనికి మెరపులా ఓ ఆలోచన తట్టింది. స్వతహాగా
అతను ఇంజనీరు. అతను తపాలా బిళ్లలను వేరు చేయడనికి ఓ మిషను
తయారుచేయాలని అనుకొన్నాడు. కొంతకాలానికి అతనొక యంత్రాన్ని
తయారు చేసి తపాలాశాఖకు పంపిస్తే వాళ్ళు దాన్ని ఆమోదించలేదు.
అయినా అతను నిరాశ చెందక మరో ప్రయత్నం చేశాడు. చివరకు 1848
లో అతను కనుగొన్న యంత్రానికి తపాలాశాఖ ఆమోదం లభించింది.
ఆ యంత్రం 1854లో ఇంగ్లాండులోవాడుకలోకి వచ్చి ఇప్పుడు మనం
చూస్తున్న విధంగా స్టాంపులు రంధ్రాలతో వచ్చాయి!. ప్రతి కొత్త విషయం
వెలుగు చూడటానికి ఇలా అనుకోని సంఘటనలు విచిత్రంగా కలసి
వస్తుంటాయి.

Tuesday 1 March 2011






1945 సంవంత్సరంలో ముళ్లపూడి వెంకటరావు, సత్తిరాజు లక్ష్మీనారాయణ
అనే ఇద్దరు అబ్బాయిలు మద్రాసు కేసరీ హైస్కూళ్ళో సహాధ్యాయులు.
"బాల" పత్రికలో అమ్మమాట వినకపొతే అనే కధ , బాల శతకాన్నిఒకబ్బాయి రచిస్తే ,
మరో అబ్బాయి "కవ్వపు పాట" అనే రచనకు బొమ్మ గీశాడు. వాళ్ళే పేద్దవాళ్ళయి
ఒకరేమో అక్షరాలతో ఆడుకొనే అసమాన రచయిత ముళ్లపూడి వెంకటరమణగా
మారితే మరొకరు కుంచెతో గీతాలాపన చేసే బాపుగా అవతారమెత్తారు. ఆనాటి
" బాల " లోని ఆ ఇద్దరు మిత్రుల రాత, గీతలు మీకొసం , మరోసారి.
<><><><><><><><><><><><><>
" బాల " విహంగ వీక్షణ సంచిక మొదటి భాగం (శ్రీరచన శాయి) సౌజన్యంతో.
1945 నుండి 1959 వరకు వాహినీ బుక్ ట్రస్ట్ వారు నాలుగు వాల్యూములుగా
ప్రచురించారు. 1.9.286/3, విద్యానగర్, హైద్రాబాదు-500044 వద్ద ఈ పుస్తకాలు
లభ్యమవుతాయి.
  • Blogger news

  • Blogroll

  • About