ఈ రోజు ఉదయమే ఈనాడు పేపరు చూడగానే నేడు ప్రపంచ జలదినోత్సవం
అని కనబడంది. ఏమిటో మనకు రోజుకో ఉత్సవాలు రోగాలదగ్గరనుంచి అన్ని
విషయాలమీద ఉత్సవాలే. నిన్ననే అటవీ దినోత్సవం జరుపుకున్నాం.గుర్తుగా
తిరుమలలోని అడవంతా కాలిపోయింది. మరి ఈరోజు జలప్రలయం ఏమైనా వస్తుందేమో
అని భయంవేసింది. ఇంతలోనే శ్రీమతి మంచి నీళ్ళు రావటంలేదంటూ ఓ కేక !
వాచ్ మన్ను అడిగితే ఐదుగంటలకే కరెంటు పోవడంవల్ల మోటార్ వేయలేదండీ.
రాగానే వేస్తానని చల్లని కబురు చెప్పాడు. అయినా మన ముఖ్యమంత్రిగారు కోత
లేదని కోసారుగాదా , అవును పాపం లోడ్ షెడ్డింగే లే అని తృప్తి పడాలికదా!
మనకు పకృతి ప్రసాదించిన వరాల్లో ఉచితంగా దొరికేవి నీళ్ళు, గాలి అని గతంలో
అనుకొనే వాళ్లం. ఇప్పుడు ఆ నీళ్ళు కొనుక్కోవాలి, అలానే గాలీ ఫాన్లు, ఏసీల
రూపంలో కొనుక్కుంటున్నాము. నిత్య జీవితంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత
వుంది. ఆరోగ్యంగా వుండాలన్నా, రోగాల బారి పడాలన్నా ఆనీరే! ప్రళయ కాలంలో
విష్ణుమూర్తి వటపత్రం పై పవళించాడట. మన పరిణామ క్రమం చెప్పిన డార్విన్
కంటే ముందే మన పురాణాలు పరిణామ క్రమాన్ని చెప్పాయి. దశవతారాలు
అదేకదా! ముందుగా నీరు అందులోంచి పుట్టినది మత్యం. అటుతరువాత ఉభయచరం
తాబేలు. అదే కూర్మావతారం. మన భారతదేశ పురాణగ్రంధాలు పుక్కిటి పురాణాలు
కాదని వీటివల్ల తెలుస్తున్నది.
దేశం లో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. కొండల్లో కోనల్లో ప్రవహించి ఎన్నో ఔషధ
గుణాలను పొంది ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. అందు చేతే మన వాళ్ళు
ఈ నదుల్లో స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. కాని ఇప్పుడు నదులన్నిటినీ
మనమే కాలుష్యపరుస్తున్నాము. కార్పొరేషను కొలాయిల్లో వచ్చిన నీళ్లయినా ఫిల్టర్
చేసుకు తాగితేకాని పనికిరాని రోజులొచ్చాయి. పూర్వం ఇలా ఫిల్టర్లు లేని రోజుల్లో
చెరువుల్లో, నదుల్లోని నీరు బురదగావుంటే ఇండుపకాయి ( ఓ విత్తనం) ని అరగదీసి
బిందెల్లో, కుండల్లొ వుంచేవారు. నీరు తేరుకొని శుభ్రపడటానికి ఆ రోజుల్లో ఇదో ఉపాయం.
ఎన్నికలురాగానే నాయకులు ప్రతి గ్రామంలోను నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని,
ఇక అందరికీ రక్షిత నీటిని అందజేస్తామని వాగ్దానాలు జలధారలు కురిపిస్తారు. చివరకు
అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు నీటి వ్యాపారం జోరుగా సాగు
తున్నది. మినెరల్ వాటర్ అని ప్రతి చోటా ఈ నీళ్ళవ్యాపారం సాగుతున్నది. నిజానికి
మామూలు నీళ్ళే!. ప్లాస్టిక్ సంచుల్లో నింపి అమ్ముతుంటే పాపం అమాయకజనాలు
వాటికోసం డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.
నీళ్ళమీద కూడా ఎన్నో నానుడులు వాడుకలో ఉన్నాయి. ఎవరైనా ఇద్దరు కలసి
మెలసి వుంటే పాలూ నీళ్లలా కలసిపోయారంటారు. పరిసరాలను బట్టి ప్రాచుర్యం
పొందుతారనటానికి తామరాకు పై నీటి బొట్టని అంటారు. తెలియకుండా మనకు
ఏ ఉపద్రవం వచ్చినా చాపకింద నీరులా అంటారు. ఏ విషయాన్ని మొండిగా
పట్టించుకోని వాళ్ళను నిమ్మకు నీరెత్తినట్లు అంటారు. ఇక వేసవి రాగానే నీటి కొరత
మొదలవుతుంది. నేల మీద పడిన కొద్ది నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోతున్నది.
అందుకే గత ప్రభుత్వం ప్రతి ఇంటికి తప్పక ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని
చెప్పింది. తారు రోడ్లు, ఇరువైపులా సిమెంట్ నడకదారులూ, అపార్ట్ మెంటు కల్చరుతో
ఆవరణ అంతా కాంక్రీటుతో నీరు భూమిలొకి ఇంకే అవకాశమే లేకుండాపోతున్నది.
నీరు ! కన్నీరు ! అను "ఐస్" వాటర్ !!
మునిసిపాలిటీ అందించే కలరు నీరు జనం పాలిటి కలరా !
ఆ నీళ్ళు తాగి రోగాలు రాని జనాలు ఒక్కరైనా కలారా ?!
అందుకే సందు సందు ముందు పెట్టారు ఓ "మందు" దుకాణం !
ఆ ":మందు"తో తీర్చుకుంటున్నారు ఓటేసిన జనం ఋణం !!
><><><><><><><><><><.
' అందుకే సందు సందు ముందు పెట్టారు ఓ "మందు" దుకాణం !
ReplyDeleteఆ ":మందు"తో తీర్చుకుంటున్నారు ఓటేసిన జనం ఋణం !! '
- బాగా చెప్పారు అప్పారావు గారూ !