RSS
Facebook
Twitter

Tuesday, 15 March 2011

మంచం కబుర్లు


ఈరోజు బాపుగారి ఆనాటి జ్యోతి పత్రికలోని ఓ కార్టూన్ చూడగానే ఆ రోజుల్లోని
నవారు మంచాలు జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడెక్కడా నవారు మంచాలు
కనిపించడంలేదు. అన్నీ మోడ్రన్ మంచాలు. ఇనపవీ ,లోపల బోల్డు
సామాన్లు దాచుకొనేవీ ఎన్నెన్నో! పూర్వం నవారు మంచాలతో బాటు
నులక మంచాలు వుండేవి. మడికోసం వాటిని తడిపినప్పుడు తమాషాగా
ఒంకర పోయేవి. ఆ వంకర మంచం మీద నేను అక్కయ్య, చెల్లి ఎక్కి అది
పైకి క్రిందకుకదలుతుంటే సీసా బల్ల మీద ఎక్కినట్లు భలే సరదాగా వుండేది!
మా ఇంట్లో వుండేవి కాదుగాని చాలా మంది ఇళ్లల్లో మడత మంచాలు
వుంటుండేవి.. మడిచి గోడమీద ఆనించి వుంచితే చాలా స్థలం కలసి వస్తుందని
ఆ మంచాలు ఉపయోగించేవారు. ఇక నవారు మంచాలు అప్పుడప్పుడు
వదలవుతే ఆ మంచానికి అటువైపు ఇటు వైపు క్రింద ఇద్దరు కూర్చొని నవారు
టేపుని లాగి బిగించేవారు. మాసిన నవారును విప్పి వుతకడానికి వేస్తే
ఉతికి గుడ్రంగా చుట్టి తెచ్చేవారు. మళ్ళీ దాన్ని మంచానికి అల్లడం ఒక
కళ. ఆ రోజుల్లో డబల్ బెడ్స్ లను పందిరి మంచాలనేవారు. ఎత్తుగా అందమైన
డిజైన్లతో నాలుగు వైపులా పందిరిలా స్థంభాలుండి పైన మంచి గుడ్డతో
కవరుండెది. పూర్వపు రొజుల్లో దాదాపు అన్నీ పెంకుటిళ్ళేకాబట్టి చూరు
మీద నుంచి పురుగు పుట్రా పడకుండా అదో ఏర్పాటు అనుకుంటాను.
మంచానికి ఎన్నెన్నో అర్ధాలు వున్నాయి. ఎవరికైనా వొంట్లొ బాలేదనుకోండి,
వాడు మంచ మెక్కాడు అంటారు. కొత్త పెళ్ళి కొడుకులు అలక పాన్పు(మంచం)
ఎక్కేవాళ్ళట. ఇక గవర్నమెంట్ హాస్పటల్లళ్ళో లంచమిస్తే గాని మంచమియ్యరట!
పొలాల్లో పిట్టలని తోలడానికి, రాత్రి పూట కాపలా కాయటానికి ఎత్తుగా నాలుగు
కర్రల మీద ఏర్పాటు చేసుకొనే మంచె ఈ మన మంచానికి దగ్గర చుట్టమనకుంటా.
ఇక మంచాలమీద కూడా మన తెలుగు సామెతలూ ఎక్కాయి!
"పంచ పాండవులంటే నాకు తెలియదా ? మంచపుకోళ్లలాగ ముగ్గురు
అని రెండు వేళ్లు చూపించాడట ! "
" మంచ మున్నంతవరకే కాళ్లు చాపుకో "
" మంచమెక్కి వరుసలడిగినట్లు "
మర్చిపోయా. మా చిన్నతనంలో నరసారావుపేట కాట్స్ అని ఫోల్డు చేసేందుకు వీలుండే
మంచాలు వచ్చేవి. మొత్తం మంచం మడత పెడితే సన్నని పొడవైన ఓ సంచిలో పట్టేది!.
నేను మొదటి సారిగా శ్రీకాకుళం బ్యాంకులో ఉద్యోగానికి 1963లో జేరినప్పుడు నాకు
నాన్నగారు అలాటి మంచాన్నే కొనిచ్చారు.అందండీ మంచాల కధ.
( శ్రీ బాపు కార్టూన్: జ్యోతి బుక్స్ వారి " రసికజన మనోభిరామం " సౌజన్యంతో )

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About