
               సాహిత్యం అర్ణవమైతే...
               ఆరుద్ర మధించలేని లోతుల్లేవు...
               సాహిత్యం అంబరమైతే.....
               ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు..
                      జ్యోతి బుక్స్ వారు ప్రచురించిన ఆరుద్రగారి "కూనలమ్మ
               పదాలు" పుస్తకం(1964)  అట్టవెనుక ఆయన గురించివ్రాసిన ఈ
               ఆణిముత్యాలు అక్షర సత్యాలు.
                      అంతు చూసేవరకు
                      అకట! ఆంధ్రుల చురుకు
                      నిలువ వుండని సరుకు
                      ఓ కూనలమ్మ అంటూ మన తెలుగు వాళ్ళగురించి ఎంత
              చక్కగా చెప్పారు

ఆయన కొండగాలి వీచిందన్నా, పచ్చాబొట్టూ చెరిగిపోదన్నా, ముద్దంటే
             చేదా అన్నా దేనికదీ ప్రత్యేకమే. ఆయన వ్రాసిన  ఇంటింటి పజ్యాలు
             గురించి ఏమి వ్రాయగలం ! చదివి ఆనందించడమే! ఎన్నిసార్లు చదివినా
             తనివితీరుతుందా?! మచ్చుకి
                     నాకు తెలిసిన ఒకానొక నాస్తికుడు
                     లేదంటాడు ఆబ్దీకాలవల్ల జాస్తీ చెడు
                     ఏవంటే ఆయనకు అసయ్యమే తద్దినాలు
                     అయినా ఎంతో ఇష్టం ఆ బోయినాలు
           ఆరుద్రగారు మాటల చమత్కారి. జనవరి ఇరవైఆరు 1964 లో ముళ్లపూడి
            వెంకటరమణగారి పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళివారింట్లో గుమ్మాలు పొట్టిగా
          వుండటం వల్ల వంగి వేళ్ళాల్సి వస్తే " చూశారా! పెళ్ళి వారు మనకు తలవంపులు
          తెస్తున్నారు" అన్నారట. రమణగారి పెళ్ళికానుకగా ఆరుద్ర తన కూనలమ్మ
          పదాలు కానుకగా ఇచ్చారు.

              ఆరుద్ర రచన కవితలు పేరిట 1942 నుండి 1985 వరకు ఆయన కవితలు
          పుస్తకంగా వచ్చింది. అందులో ఆగష్టు 15  పేరిట ఆయన వ్రాసిన (ఆనందవాణి
          1948) ఓ మచ్చుతునక మీకోసం...
                     మూలపడి విరిగిన చరఖా
                     గాంధీజీ పేరు అనే బురఖా
                     ధరించి వచ్చిన ఈ తారీఖు
                     మా చెడ్డ నిషా చేసే అరఖు
                     నట్టనడి సముద్రం హంగరు
                     ఎత్తరేం జీవితం లంగరు
                     ఎలా వుందో  పీపిల్స్ పల్సు
                     ఏ నాయకుడి కయ్యా తెల్సు? ............
         ఇట్లా సాగిపోతుంది ఆరుద్ర కలం
        ఆరుద్ర జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జోహార్లు.

















































 
 
 
 
 
 
 
 
 








