"నాకూ మనసున్నాది " అంటూ కవితల పుస్తకం వ్రాసి ప్రశంసలందుకున్న ఈయన పేరు మహమ్మద్
ఖాదర్ ఖాన్. నిజంగా ఈయన మనసున్న మనిషి! రాజమండ్రి, దానవాయిపేట పోస్టాఫీసులో పోస్ట్
మాస్టారుగా పనిచేసి ఆ శాఖలో నాలుగుసార్లు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెరెన్స్ అవార్డును అందుకున్న
పనిమంతుడు. తెలుగు సాహిత్య ప్రేమికుడైన ఖాన్ తెలుగును మన తెలుగు వాళ్లకంటే అద్భుతంగా
మాట్లాడతాడు. స్నేహానికి ప్రాణమిచ్చే ఖాన్ మెచ్చిన వాఖ్య:" జిస్ పల్ డే మే తులె మొహబ్బత్, ఉస్మే
చాందీ నహీ తోల్ నా"(ప్రేమాభిమానాలు తూచిన త్రాసులో వెండి బంగారాలను తూచవద్దు) ఆయన
తన పుస్తకంలో ఇలా అంటారు." ఈ గ్రంధ విక్రయంలో సింహభాగాన్ని నిజమైన ఆర్ధికావసరం కలిగిన
విద్యావైద్య సహాయార్ధులకు వినియొగించ నిశ్చయించాము.కావున దయతో మీరు కుడా ఈ పుస్తకాన్ని
కొని మీ వంతు సాయంగా సమాజానికి ఉపయోగించండి !!"
ఖాదర్ ఖాన్ ప్రతి ఆదివారం స్థానిక దినపత్రిక "సమాచారం"లో కవితలు వ్రాసేవారు. వాటిలో ముఖ్యంగా
నన్ను శాంతి కపోతాలు, రాక్షసజన్మ ప్రసాదించవూ అన్న కవితలు నన్ను ఆలోచింపజేశాయి. ఈనాటి
మానవులకన్నా ఆనాటి దానవుడు రావణుడే మిన్న అని రాక్షసజన్మ... అన్న కవితలో ఖాన్ చెప్పారు.
ఆయన్ని స్వయంగా కలసి అభినందనలు చెప్పాలి అని అనుకుంటుండగానే ఆయన దగ్గర నుంచి ఓ
ఉత్తరం వచ్చింది." ఈ వయసులో ఎవరికీ ప్రియుణ్ణి కాలేను కాబట్టి మీ "హాసం క్లబ్ " కు ప్రియుణ్ణి
కావాలని వుంది" అన్నది ఆ లేఖాంశం. వెంటనే ఆయన్ని పోస్టాఫీసుకు వెళ్ళి కలవటం, "స్నేహమేరా
జీవితం,స్నేహమేరా శాశ్వతం, అల్లా సాక్షిగా" అన్నట్లు ఆయన మాకు ఆనాటినుంచి మా "అహ"లకు
(అప్పారావు, హనుమంతరావు ,హాసం క్లబ్ ) తోడై మాతో పాలు పంచుకుంటున్నారు.
మా మితృడు హనుమంతరావుతో బాటు నేను, ఖాను కొన్ని స్కిట్స్ తయారుచేసి "హాసం క్లబ్"లో
ప్రదర్శించాము. అందులో "డాక్టర్-పేషెంట్" స్కిట్ హాస్యప్రియుల ప్రశంసలు అందుకొంది. ఆయన
పోస్టాఫీసులొ జరిగిన ఓ సంఘటన చెప్పారు. తిరుపతి వెళ్ళివచ్చిన ఒకాయన లడ్డూ ప్రసాదం స్టాఫ్
అందరికీ పంచుతూ ఈయన దగ్గరకు ఓ పెద్ద లడ్డూ తెచ్చి" మీరు ముస్లింలు, మీకభ్యంతరం లేక పొతే
మీకు ఇవ్వాలనుకుంటున్నాను" అన్నాడట. వెంటనే ఖాన్ " ఆ వెంకన్నబాబు మా ఆడబడుచు
బీబీనాంచారమ్మ కూ భర్తే కదా! అందుకే చూశారా ఆయన నాకు పూర్తి లడ్డు మీ చెత పంపించాడు.
మిగతా మా స్టాఫుకు చిన్న ముక్కలే ఇచ్చాడు"అంటూ కళ్లకద్దుకొని తీసుకున్నారట. చూశారా ఖాన్
మనసు౧ వినాయకుడి పై కార్టూన్లు అలా మరీ విపరీతంగా మీ కార్టూనిస్టులు వేయడం బాగాలేదు అని
ఆయన నొచ్చుకుంటూ నాతో అన్నారు. ఆయన కవితలో కొన్ని మచ్చుతునకలు మీ కోసం ’
1 తెలుగు
మా తెలుగు తీయనిది
మానుండి ఎవరూ విడతీయనిది
తెలుగును వాడుదాం
తెలుగులో ఆడిపాడుదాం
తెలుగును కాపాడుదాం
2 శాంతి కపోతాలు
నీకు శాంతి కపోతాలు బోలెడు
ప్రేమతో ఆనందంగా అందించాలని
చాలా ఆశగా వుంది భాయీ
మసాలా రుచులు మరిగినవాడివి
వండుకొని తినవని
నమ్మకంఏమిటి ? (ఎవరిని ఉద్దేసించి ఈ కవిత వ్రాశారో మీరు గ్రహించే వుంటారు)
గత ఆదివారం 27-11-11న మక్కాయాత్ర పలుమార్లు చేసివచ్చిన మా ఖాన్ బాయికి మితృలు సత్కారం
ఏర్పాటు చేశారు. ఆ రోజు ముంబాయి ప్రయాణంలో వున్న నేను మితృడు ఖాన్ కు ఇలా మీ అందరి ద్వారా
అభినందనలు అంద జేస్తున్నాను.