ఎన్నాళ్ళకు పద్మశ్రీ అవార్డుకు విలువ వచ్చింది ! అవునండీ పద్మశ్రీ అవార్డు
బాపుగారికి వచ్చి ఇన్నాళ్ళకు ఆ బిరుదుకే విలువ పెరిగింది. ఆయన
ఇంతకాలం అవార్డు కా(రా)వాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. కానీ
ఆయన అభిమానులు మాత్రం ప్రతి ఏడాదీ పద్మ అవార్డుల ప్రకటనలో బాపు
గారి పేరుంటుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తూనే వున్నారు.
శ్రీ బాపు 1945 నుంచి తెలుగు, తమిళం, ఇంగ్లీషు పత్రికల ,కధలకీ
, నవలల ముఖచిత్రాలకీ బొమ్మలు, కార్టూన్లు వేస్తునే వున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి ముఖ్యమంత్రిగా సారధ్యం వహిస్తున్నప్పుడు
బాపు రమణలు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధమిక విద్యాభోధనకు ఆడియో
విజువల్ పాఠాలు ( 1986-88) నిర్మించారు. ఈటీవీ కోసం 40 గంటల టీవీ
సీరియలుకు దర్శకత్వం వహించారు (1996-2004). తిరుమల తిరుపతి
దేవస్ఠానం ఆస్థాన చిత్రకారుడిగా 1979 నియమించ బడ్డారు. రఘుపతి
వెంకయ్య అవార్డు, ఆంధ్రాయూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (కళాప్రపూర్ణ),
తిరుపతి వెంకటేశ్వరయూనివర్సిటీ ఆనరరీ డాక్టరేట్ ఇలా ఎన్నో సత్కారాలు
అందుకున్నారు.
ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ 2001, ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమీ-2002, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-క్రోక్విల్ అకాడమీ-2002,
ప్రపంచ తెలుగు సమాఖ్య 2004, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 5 వ
తెలుగు సాహితీ సదస్సు 2006 లలో లైఫ్ టైం అచీవుమెంట్ అవార్డులు
పొందారు..భద్రాచలం రామాలయంలో, కోటప్పకొండ దేవాలయంలోనూ
ఆయన వేసిన వర్ణచిత్రాలు అలంకారాలుగా నిలచాయి.
1967 నుండి తెలుగు సినిమాలకు గర్వకారణమైన చిత్రాలను మితృలు
శ్రీ ముళ్లపూడితో సహకారంతో దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో
వచ్చిన "సీతాకళ్యాణం" విదేశాలలో విమర్శకుల ప్రశంసలను పొందటమే
కాకుండా, లండన్, చికాగో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.శ్రీ బాపు 9 హిందీ
చిత్రాలకు, ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. "వంశవృక్షం" చిత్రంతో
అనిల్ కపూర్ ను హీరోగా పరిచయం చేశారు.
మేమింత అందంగా వుంటామా అని దేముళ్ళే అనుకునేటంత అందంగా
వుంటాయి శ్రీ బాపూ గీసిన దేముళ్ళ బొమ్మలు. శ్రీ బాపూ దేముళ్ళ బొమ్మలు
చిత్రించేటప్పుడు ఋషిగా మారిపోతారని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
అన్నారు. ఇంతటి ప్రతిభావంతులైన శ్రీ బాపుకి పద్మశ్రీ నిజంగా చాలా చిన్న
పురస్కారం. అభిమానుల ప్రేమాదారాలే ఆయనకు నిజంగా తృప్తినిచ్చే
బహుమతి. ఆయన అభిమానిగా , ఆశేష అభిమానులందరి తరఫున
వారికి నా శుభాభినందనలు.