RSS
Facebook
Twitter

Wednesday, 13 March 2013

 కామేశ్వరరావు , జోగమ్మ దంపతులకు ఆగస్టు  3, 1913
జన్మించారు. సంగీత నేపధ్యంగల వంశమవటం చేత ఆయనకు
సంగీతంపై గల ఆసక్తిని గమనించి రాజమండ్రిలో ఆయన 11
ఏళ్ళ వయసులో సంగీత గురువు బియస్ లక్ష్మణరావుగారి
వద్ద చేర్పించారు. యుక్తవయసు వచ్చేనాటికి ప్రఖ్యాత వాయులీన
విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడిగారి వద్ద కొంత
కాలం శిష్యరికంచేసి ,కచేరిలలో పాల్గొంటూ సంగీత సాధనతో బాటు
రాజమండ్రిలో హైస్కూలు , కాలేజీ విద్యలు పూర్తి చేసి అటు
తరువాత MBBS పూర్తిచేశారు.

 1945లో యండీ పూర్తిచేసి
అసిస్టెంట్ సివిల్ సర్జనుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో
చేరారు. అటు తరువాత వివిధ ప్రభుత్వఆసుపత్రులలొ పని
చేసి 1957 లొ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలుగా
పనిచేశారు. దాదాపు ముప్పయి ఏళ్ళపైగా వైద్యుడిగా
సేవలు చేసి 1968 లో రెటైరయ్యారు. మనోధర్మ సంగీతం,
పల్లవిగానసుధ, మేళరాగమాలిక గ్రంధాలను రచించారు.
టిటిడి వారు ఆయన రచనలను "సంగీతసౌరభవం"  పేరిట
నాలుగు సంపుటాలుగా ప్రచురించింది.


ఆయనకు 1966లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ
పురస్కారం, 1970 లో సంగీత కళాశిఖామణి, 1974లో
టిటిడీ వారిచే సప్తగిరి సంగీత విద్వామణి, పొందారు.
ఆయనకు ఆగస్టు 2012 న టిటిడి, తెలుగు యూనివర్సిటీ
వందవ పుట్టిన రోజు సంధర్భంగా స్వర్ణకంణధారణ జరిగింది.

Friday, 8 March 2013

ఆడవాళ్ళూ ,మీకు జోహార్లు !!


       మా అమ్మగారు ఎప్పుడూ అంటూ వుండేవారు. ఆడపిల్ల ఎప్పటికీ ఆడ(అక్కడి)
పిల్లేనని. ఎందుకో ఆడపిల్లంటే లోకువ. ఎవరైనా ఆడపిల్ల పుట్టిందండి అని అంటే
వీళ్ళ సొమ్మేదో పోయినట్లు "అయ్యో ఆడపిల్లా!" అంటూ సానుభూతి చూపిస్తారు.
అసలు ఆడపిల్ల సరదాయే వేరు. చిన్నారి పాపలుగా బుజ్జి బుజ్జి పాదాలకు వెండి
గజ్జెల పట్టీలు పెట్టుకొని ఘల్లు ఘల్లు మంటూ అడుగులేస్తుంటే ఆ అందమే వేరు,
ఆ ఆనందమే వేరు.ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రాలు "ఈనాడు" కార్టున్ ఎడిటర్
శ్రీ శ్రీధర్ స్త్రీలగురించి వేసిన అద్భుత చిత్రాలు  జపాన్ ఫౌండేషన్ ఫోరమ్ వారు
1995లో జపాన్ లో నిర్వహించిన చిత్ర ప్రదర్శన్లలోనివి. వారి ఆహ్వానంపై శ్రీశ్రీధర్
జపాను వెళ్ళివచ్చారు. ఇంతకీ "ఆడ" (అక్కడ) పిల్లంటే ఈడ నుంచి ఆడకి అత్త
వారింటికి ఏదో ఒకనాటికి వేళ్ళే పిల్లని.అందుకే ఆడ పిల్లకు విద్యతో బాటు ఇంటి
పనులూ అమ్మ నేర్పుతుంది.

       ఈనాడు ఆడపిల్లలుకూడా మగపిల్లలతో సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు
సాగిపోతున్నారు. మరి ఇంకా ఆడ మగా అనే బేధ భావాలెందుకో అర్ధంకాదు. అత్తా
కోడళ్ళుకూడా తల్లీ కూతుళ్లులాగ వుండే కుటుంబాలు ఎన్నిలేవు. మన సినిమాల్లో,
టీవీ సీరియల్లలో ఆడవాళ్ళని కౄరులుగా , విలన్లుగా చూపిస్తారు. వింతేమిటంటే
తమని అలా చెడ్దగా చూపిస్తున్న సీరియల్ కధలనే వేలం వెర్రిగా ఆడవాళ్ళే
చూస్తుంటారు. బాపుగారు ఈ సబ్జెక్ట్ పై గీసిన కార్టూన్  చూడండి
       కొందరు ఆడవాళ్ళు తమ కూతుర్లు ఏం చేసినా బాగుంటుందికానీ అదే కోడలుపిల్ల
చిన్నతప్పుచేసినా పెద్దగా కనిపిస్తుంది. అదే Human weakness ఏమో !! ఈ
విషయం పై నేను సరదాగా గీసిన కార్టూన్.

            ఆడవాళ్ళు లేని ఇంటిని ఊహించుకోగలమా !! మగవాడికి స్నానానికి టవల్
దగ్గరనుంచి భార్య అందించకపోతే రోజే గడవదు. నా సంగతే చూడండి. ఇంట్లో
వంటపని అన్నీ చూసుకొని నా శ్రీమతి నా పుస్తకాల ర్యాకులను రోజూ నిద్ర
లేవగానే తుడుస్తుంది. నేచేస్తానన్నా "అయ్యో మీకు డస్ట్ ఎలర్జీ , వద్దు"అంటుంది.
అసలు ఆడవాళ్లకున్న ఓపిక, నేర్పు మగవాళ్ళకుండదు. ఆడ పిల్లలు చిన్న
నాటి నుంచే లక్కపిడతలతో వంట చేయడం, పాపాయి బొమ్మల్తో అమ్మ ఆట
లాడు కోవటం, బుజ్జి చేతులతో తనకన్నా పెద్ద చీపురుతో ఇల్లు చిమ్మటం
చేయటం మొదలేడతారు. ఈ చిన్నారులిద్దరూ మా అమ్మాయిలు మాదురి,
మాధవి. చీపురు తో చిమ్ముతున్న చిన్నారి మా మాధవి కూతురు
చి" జోషిత. చక్కగా తీర్చిదిద్దిన ఇల్లు ఇల్లాలి గురించి చెబుతుంది.. అందుకే
ఇంటిని చూడు ఇంటిల్లాలును చూడు అంటారు కానీ ఇంటాయన్ని చూడు
అనరు. అందుకే ఈ మహిళా దినోత్సవం రోజున మగవాళ్ళను తీర్చి దిద్దుతున్న
అమ్మలకు, అమ్మాయిలకు ప్రతి స్త్రీమూర్తికి నా జేజేలు.
(శ్రీ శ్రీధర్ గారికి, శ్రీ బాపుగారికి కృతజ్ఞతలతో)

Wednesday, 6 March 2013

         తెల్లవారగానే వార్తాపత్రిక రాగానే ప్రతి ఒక్కరూ మొదట
ఆతృతగా చూసేది మొదటి పేజీలోనే కార్టూనే. ఓ వేళ
ఆ పేజీని ఏ ప్రకటనో మింగేస్తే కంగారుగా చికాకుగా
రెండో పేజీ తిప్పేసి కార్టూన్ కనబడగానే ఆ చికాకు
మాయమై చిరునవ్వు తాండవిస్తుంది. కార్టూన్ మహిమ
అంతటిది.
  ముళ్లపూడి వెంకటరమణగారు నా "సురేఖార్టూన్స్" కి
ముందుమాట వ్రాస్తూ " ఎందరో మహానుభావుకులు
ఎన్నోవేసేశారు: మరి ఈతరం వారికేం మిగిల్చారు అని
జాలిపడుతూ వీపు నిమరబోయాం - వీపు బదులు
పిక్కలు అందాయి. అంటే - జాలిపడే స్థితికాదు :అసూయ
పడే స్థాయికి ఎదిగారు : ఎదుగుతున్నారు. కొత్త కొత్త
గీతలూ రాతలూ జోకులూ బావిలో నీరులా వూరుతూనే
ఉన్నాయి. కొత్త వాళ్ళు వేస్తూనే వున్నారు.అది తరగని గని -
......."అంటూ ఈనాడు తెలుగు కార్టూనిస్టులు ఎంతగా
ఎదిగిపోయారో చెప్పారు.
  నాకు చిన్ననాటి నుంచి కార్టూన్లు అంటె ఎంతో ఇష్టం.
మా నాన్నగారు కొనే TIT BITS,లాంటి బ్రిటిష్ వార
పత్రికలో వారం వారం ఎన్నో మంచి మంచి కార్టూన్లు
చూసేవాడిని. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక
కార్టూనిస్టులెందరికో మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. శ్రీ బాపు,
శ్రీ బాబు, శ్రీ జయదేవ్, శ్రీ సత్యమూర్తి (చదువుల్రావ్)
లాటి ఈనాటి ప్రముఖులను పరిచయంచేసింది. 1958
లో నే వేసిన నామొదటి కార్టూన్ ఆంధ్రవారపత్రికలోనే
అచ్చయింది.


 యమర్జన్సీ పుణ్యమా అని శంకర్స్ వీక్లీ లాంటి మంచి
రాజకీయ వార పత్రిక మూతపడింది. అందులో మధ్య
పేజిలలో  గాడిద తలలతో ఓ ఆడ, మగ బొమ్మలు
వేసి సంభాషణలు వ్రాసే వారు. ఆ పత్రిక రాగానే మధ్య
పేజీలు ఆ బొమ్మల కోసం ఆతృతగా చూసేవాడిని.
అన్నీ దాచిన నేను ఆ పత్రికలను ఎందుకు దాచుకో
లేకపోయానా  అని ఇప్పుడు బాధేస్తుంటుంది.


చాలా మంది ప్రముఖ కార్టూనిస్టులతో పరిచయ భాగ్యం
కలిగింది. కొందరిని స్వయంగా మరికొందరిని ఉత్తరాల
ద్వారా పరిచయం చేసుకొనే అదృష్టం కలిగింది. మన
కార్టూనిస్టులకు, కార్టూన్ ఇష్టులకు అందరికీ జేజేలు !!
1. Cartoon Courtesy Eenadu & Sri Sridhar
 My pictures with Bapugaaru, Sri Satyamurty &
Sri Jayadev,Sri Subhani cartoon editor Deccon
Chronicle, Sri Sridhar cartoon editor Eenadu,
Sri Pukkaklla Ramakrishna, Sri B.S.Raju and
chanibabu Ambati
  • Blogger news

  • Blogroll

  • About