RSS
Facebook
Twitter

Sunday, 29 November 2009

గోదావరి చిత్ర గాన లహరి


అందాల గోదావరికి తెలుగు చిత్ర పరిశ్రమకు మూగమనసులు సినిమాతో అనుబంధం ఏర్పడింది.
బాపు రమణలు ఒకరు ప.గో,మరొకరు తూ.గో జిల్లాలకు చెందిన వారు కాబట్టి తమ సినిమాలను
ఎక్కువగా గోదావరి తీరంలోనే నిర్మించారు.ఐనా తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమా పాటలలో
గోదావరికి సముచిత స్ఠానం ఇచ్చారు.

మొదటి సారి 1952 లో వచ్చిన మరదలు పెళ్ళి లో ఇలా వినిపిస్తుంది. "పిలిచె గోదారొడ్డు,నోరూరించే బందరు లడ్డు" అని శ్రీశ్రీ రచించారు.

తరువాత యన్టీఆర్,జమున నటించిన చిరంజీవులు లో
"నీ ఆశ అడియాస,నీ బ్రతుకు అమవాస...
కన్నులలో గోదారి కలువలే కట్టింది." అంటూ ఆరుద్ర వ్రాసారు.

అలానే పెద్దమనుషులు చిత్రంలో,
"కుక్క తోక పట్టుకొని గోదావరీదితే కోటిపల్లి కాడ తేలేనయా" అని కొసరాజు రచించారు.

ఇక పల్లెటూరు చిత్రంలో,
"కల్లోల గౌతమి,వెల్లువల క్రిష్ణమ్మ,..."అని వేములపల్లి శ్రీకృష్ణ కలం నుంచి వచ్చింది.



విచిత్ర కుటుంబం చిత్రం కోసం సినారే,
"ఆదికవి నన్నయ అవతరించిన నేల
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయనిక్షీరధారలై
జీవకళ లొలుకు గోదావరీ తరంగాల..."అంటూ సాగిపోతుంది రచన!

1963లో కోటిపల్లి,నర్సాపురం రేవుల్లో మూగమనసులు పాటలు,
"గోదారీ గట్టుంది,గట్టు మీద చెట్టుంది",తల్లీ గోదారికీ ఎల్లువస్తే అందం,
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం"

అనుపమ వారి ఉయ్యాల-జంపాల చిత్రం లో ఆరుద్ర గీతం "కొండగాలి తిరిగింది,గుండె వూసులాడింది,
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది" ఎంత మంచి పాట!!

బాపురమణల ముత్యాలముగ్గు లో శేషేంద్రశర్మ రఛన
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బులారా నదిని దోచుకుపోతున్న నావను ఆపండి గుర్తుండేవుంటుంది.


దేవత సిన్మాలో "ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడుతూ వుంటే" పాట రచయిత శ్రీ వేటూరి.

సితార లో"వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం",

ప్రేమించి పెళ్ళాడు లో "ఒయ్యరి గోదారమ్మఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం",

ఆంధ్రకేసరి కోసం ఆరుద్ర రాసిన
"వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా భాసించే రాజమహేంద్రి" గీతం గోదావరి ప్రాసత్యాన్ని,రాజమండ్రి వైభవాన్నివివరిస్తూ
"కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు,వీరేశ లింగ మొకడు మిగిలెను చాలు" కలకాలం నిలిచిపోయే
పాట.


ఇలా తల్లి గోదారి పై ఎన్నెన్నో పాటలు!!

Tuesday, 24 November 2009

నేను -- నాడు... నేడు...




















ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఈరోజు నేనేంటి అని కాక నిన్న ఎలా ఉన్నాను. ఇపుడు ఎలా ఉన్నాను.రేపు ఎలా ఉండాలి అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నాడైనా, నేడైనా ప్రతీ అనుభవం ఒక జీవితపాఠంలా మలుచుకుని సాగిపోతూ ఉండాలి. ముప్పై నాలుగేళ్ల క్రిందటి చిత్రాన్ని చూసుకుంటే అప్పటి ఆలోచనలు, పోరాటాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి.

Sunday, 22 November 2009




ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో ఇట్టే తెరపై ఏ మిక్కీమౌసో ప్రత్యక్షమై అట్టే మాయమైపోయేది. ఒక్కోసారి అసలు చూపించేవాళ్ళేకాదు! ఇక మాకు నిరాశే మిగిలేది.ఆ మార్నింగ్ షోలకు క్లాస్ కన్షెషన్ వుండేది. అంటే బాల్కనీ టిక్కెట్టు దాని క్రిందిక్ల్లాస్ ధరకే ఇచ్చేవారు.




ఆదివారం మాకు మరో ఆటవిడుపు ఇంగ్లీష్ పేపరే! ఇండియన్ ఎక్సప్రెస్ ఆదివారం సండేస్టాండర్డ్ పేరుతో వచ్చేది.అందులో మెజీషియన్ మాండ్రేక్, బ్రింగింగ్ అప్ ఫాదర్,లిటిల్ కింగ్,ప్రిన్స్ వాలియంట్ మొదలయిన బొమ్మల కధలు రంగుల్లో వచ్చేవి.మావి కాన్వెంట్ చదువులు కాదు కాబట్టి నాన్నగారు చదివి చెప్పేవారు. కొంతకాలం తరువాత మమ్మల్నే చదవమని అర్ధం చెప్పమనేవారు. మాకు అదో ఇంగ్లీష్ పాఠంలా వుండేది. ది మెడ్రాస్ మెయిల్,ఇండియన్ ఎక్స్ప్రెస్ చివరి పేజీల్లో కర్లీవీ,టార్ఝన్ బొమ్మల కధలు ప్రతి రోజూ వేసేవారు.ఆంధ్రపత్రిక వీక్లీలో బాపు బంగారం-సింగారం,లంకె బిందెలు.రాజు-రైతు, విశ్వాత్ముల నరసింహమూర్తి పంచతంత్రం, చందమామలో బాపు గలివర్ ట్రావల్స్ మొ" బొమ్మల కధలు చదవేవాళ్ళం.కార్టూన్ చిత్రాల సృష్టికర్త వాల్ట్ డిస్నీమిక్కీమౌస్ లాంటి కార్టూన్లే కాకుండా డిస్నీ లాండ్ నిర్మించి అనేక అస్కార్ ఎవార్డ్స్ పొందాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంద్రజాల్ కామిక్స్ పేరిట ఫాంటమ్, చందమామ సంస్ధ క్లాసిక్స్ ‍‍అండ్ కామిక్స్ పేర డిస్నీ కామిక్స్,ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్ర కధ పేరిట ట్వింకిల్, భారత రామాయణాలు బొమ్మల కధలుగా ప్రఛురించారు.కొంతకాలంవరకు ట్వింకిల్ తెలుగులో కూడా వెలువడింది.

Saturday, 21 November 2009



నేను ఆడవాళ్ళ సాంప్రదాయాల గురించి వ్రాయటం ఏమిటని అనుకోకండి!
మన అభ్యున్నతికి తొడ్పడేది ముందుగా ఆడవాళ్ళే అన్నమాట కాదనలేం.
కొందరు ఉద్యోగాలకు బైటకు వెల్తున్నా మన సాంప్రదాయాలను చక్కగా
పాటిస్తున్నారు.ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.






మన సాంప్రదాయంలో కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వటం
మంచి అలవాటు.పసుపు మంచి యాంటీ సెప్టిక్ గుణాలు కలిగివున్న విషయం
అందరికి తెలిసిన విషయమే.ఇంతకు ముందు గుమ్మాలకు పసుపు వ్రాసి పసుపు
తోనే చేసిన కుంకుమ,వరి పిండి తో బొట్లు పెట్టే వారు.ఇప్పుడు ముందు గుమ్మం
తప్ప ఇతర గదులకు గుమ్మాలే వుండటం లేదు.ఉన్న ఒక్క గుమ్మానికి పసుపు
పెయింట్ వేయించి ఏవేవో డిజైన్లు వేయిస్తున్నాం.పసుపు వ్రాయటం వల్ల కీటకాలు,
అనారోగ్యం కలిగించే క్రిములు రావని మన పూర్వికులు ఇలాటి సంప్రదాయాలని
ఏర్పాటు చేసారు.






ఇప్పుడు ప్రతి ఇంట్లో వంటింట్లోనే పంపు వుంటున్నది.పూర్వం ఎంతటివారైనా
చెరువుకో,నదికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొనేవారు.పాదాలు నీటిలో ప్రతి రోజూ
నానటంవల్ల వేళ్ళ మధ్య పుండ్లు పడేవి.రోజూ స్నానం చేసి పాదాలకు పసుపు
రాసుకోవటం వల్ల మందులా పని చేసి పుండ్లు తగ్గేవి.అలానే గుమ్మాలకు కట్టే
మామిడి ఆకుల తోరణాలు.ఆ ఆకుల ద్వారా మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇంటి ముందు వరి పిండితో ముగ్గులు పెడీతే చీమలు లాంటి చిన్నజీవులకు
ఆహారం అందించే అలవాటును కూడా మన పెద్దలు తెలిపారు.
ఇప్పుడు ఇంట్లో కాలికి పసుపురాస్తే మార్బుల్ నేల పాడై పోతుందని భయపడు
తున్నారు.అలాటప్పుడు కాళ్ళ క్రింద ఓ ప్లాస్టిక్ షీట్ వేసి పసుపు ధైర్యంగా రాయొచ్చు.

Thursday, 19 November 2009


ఈ ఫొటో నేను రాజమండ్రి యస్.ఆర్.సిటీ.హైస్కూల్లో SSLC చదువుకునేటప్పుడు మార్చి 1956 లో తీసినది. ఇందులో నేను పైనుంచి రెండవ వరుసలో కుడివైపు నుంచి నాల్గవ వాడిని! ఆ వరుసలో మొదట వున్నది నక్కిన శ్రీరామమూర్తి. ఇక్కడే క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు.అదే వరుసలో ఎడమవైపున మొదట వున్నది భాగవతుల మంగశర్మ.భిలై స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ గా రిటైరై ఇక్కడే వుంటున్నారు.తరచు కలుస్తుంటాము.ఆయన సతీమణి భాగవతుల లలిత మంచి కధా రచయిత్రి. "తీరనిఋణం" పేరిట ఆమె కధా సంకలనం వెలువడింది.పై వరుసలో కుడి నుంచి రెండో అతను వీర్రాజు.పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసాడు.తక్కిన మితృలు ఎవరైనా ఈ ఫొటో ఛూసి జవాబిస్తారని ఆశిస్తున్నాను.ఇక టీచర్లలో కూర్చున్న వాళ్ళలో ఎడమనుంచి నాలుగో సోషల్ మేస్టారు పి.సూర్యనారాయనమూర్తి గారు.ఆయన దివంగత సినీ హాస్య నటుడు రాజబాబు మేనమామ! అదే వరుసలో చివరవున్నది మాధ్స్ మేస్టారు చలపతి రావు గారు.మా అబ్బాయి సాయి చదివిన స్కూల్లో (టౌన్ హై స్కూల్)ప్రధాన ఉపాద్యాయుడుగా పనిచేసి రెటైర్ అయ్యారు. అంటే నేను,మా అబ్బాయి (ఇప్పుడు వాడు బొంబాయిలో ఓ సంస్దలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు) ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నామన్న మాట!

Monday, 16 November 2009

నేనప్పుడప్పుడు కవితలు?! స్దానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం వ్రాస్తుంటాను.మీరు నా ఎదురుగా లేరు కాబట్టి
ధైర్యంగా కొన్ని కవితలు చూపిస్తాను.




"సమ్"గీతమ్

పాత పాటలు ఎంతో మధురం!
మంచి పాట ఈ నాటి తెలుగు తెరకు దూరం!!
ఎప్పుడో ఎక్కడో మంచి పాటల సంగీతం!!
ఇప్పుడు వినిపించేది మాత్రం "సమ్"గీతం!!॰

******************************
దిష్టి బొమ్మ

దిస్టి బొమ్మ నిండుగా బట్టలేస్కుని,
ఒంటి నిండుగా గడ్డి నింపుకొని ఠీవిగా నిలబడింది!!
కేరింతల మధ్య తగులబడింది!!
అభాగ్య జీవులకు గుడ్డ కరువు!!
మూగజీవులకు గడ్డి కరువు!!!

*******************************
ఓట్లు-నోట్లు

ఓట్ల కోసం ఈవీయం!
నోట్ల కోసం తెల్లవార్లూ బాంకు ఏటీయం!!
ఓట్లేశాక వాగ్దానాలు మళ్ళీ ఏటియ్యం!!
మెజార్టీ ఎంతైనా గెలుపే మా ధ్యేయం!!
ఏమైతేనేం గెల్చాక ప్రజల నుండి మేం మటుమాయం!!



*********** ఉంటాటాటా..మీ సురేఖ

Sunday, 15 November 2009



కీ"శే"వడ్డాది పాపయ్య వర్ణ ఛిత్రాలు చూడనివారు,అభిమానించని వారు ఎవ్వరు ఉండరు.కాని దురదృస్ట వశాత్తు ఆయన గురించి సరైన ప్రచారం జరగలేదని పిస్తుంది.చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చందమామ,యువ మాస పత్రికల ముఖచిత్రాలు, లోపలి కధలకు బొమ్మలు ఆయన వేలాదిగా వేసారు. చందమామకు ముందు బాలన్నయ్య,బాలక్కయ్యల "బాల" పత్రిక(1947)లో ఆయన లటుకు-చిటుకు శీర్షికకు,పోలికలు అనే బొమ్మలు,కార్టూన్లు వేసారు.ఆ బొమ్మలు (బాల) కూడా మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను.శ్రీ వడ్డాది శ్రీకాకుళం లో 1921 సెప్టెంబర్ 10న జన్మించారు.వీరి నాన్నగారు శ్రీరామమూర్తివృత్తి రిత్యా డ్రాయింగ్ టీచర్.శ్రి పాపయ్యగారు రేఖాచిత్రాలు,ఏక వర్ణ,బహు వర్ణ చిత్రాలు గీసారు.ఆయన చిత్రాలు స్త్రీ ల పైనే ఎక్కువగా వున్న మాట నిజమ ఐనా వివిధ విషయాలపై కూడా చిత్రాలు గీసారు.ఈనాడు యువతులపై ఆసిడ్ దాడులు చేస్తున్న కొందరు యువకుల్ని
మానవ మృగాలుగా మనం వర్ణిస్తున్నాము.ఆయన ఏనాడో "యువ"లో ఈనాటిఆధునిక యువకున్ని "మృగము"అనే బొమ్మ ద్వారా చిత్రించాడు.ఆయన చిత్రకళారంగం లో చూపిన ప్రతిభ మరువలేనిది.అందుకే ఆయన బొమ్మలు ఈ నాటికీ అభిమానుల గుండెల నుంచి చెరిగి పోలేదు.నేను సేకరించి ఆల్బం లో పదిలపర్చుకొన్న కొన్ని బొమ్మలు మీ కోసం.

Thursday, 12 November 2009

కోతి కొమ్మచ్చిలో నేను


నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే బాపు రమణల కోతి కొమ్మచ్సిలో చిన్న మాట చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను.


Wednesday, 11 November 2009



తెలుగువారికి ఒక ప్రత్యేకత వుంది.కొన్ని కొన్ని లక్షణాలనుబట్టి ఎంత మందిలో వున్నా తెలుగువాడిని ఇట్టే పసిగట్టవచ్చు.ఉదాహరణకు :- మీ దోవన మీరు పోతుండగా,ఎవడైనావచ్చి,మీ చెయ్యి మెలిపెట్టి మీ వాచీలో టైము చూసుకొని వెళ్ళిపోతే, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయివుంటాడు. రోడ్డు కడ్డంగా నుంచుని,కార్లు,సైకిళ్ళు,రిక్షాలు,ఆవులు మొదలైన వేటినీ లెక్క చేయకుండా గంటల తరబడి రాజకీయాలు,సినిమాలు చర్చించే వాడు తెలుగువాడనటానికి సందేహం లేదు. మీరు దినపత్రికగాని,మరో పత్రికగాని కొనడంతోటే, "ఒక్క సారి చూసిస్తాను,పేపరిస్తారా?" అని అడిగి పుచ్చుకుని,తిరగేసి,నిర్లక్ష్యంగా మీమీద పడేసి చక్కా పోయేవాడు తెలుగు వాడే. బస్సులో గాని రైల్లో గాని ఆరుగురు కూర్చోవలసిన సీట్లో నలుగురికి కూడా ఇరుకయ్యేట్టు కూర్చో గల నేర్పు ఒక్క తెలుగు వాడికే వుంది.అన్నట్టు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం : తెలుగు వాళ్ళని తిట్టిపోసి,అరవ్వాళ్ళని,బెంగాలీవాళ్ళని మెచ్చుకునేవాడు కూడా తెలుగు వాడే! ఈ సోదంతా ఇప్పుడెందుకని నన్ను కోప్పడకండి.తెలుగువాడు,కనీసం భారతీయుడు కాకపోయినా సీ.పీ.బ్రౌన్ అనే బ్రిటిష్ దేశీయుడు తెలుగు నేర్చుకుని తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. ఆయన జన్మదినం నిన్ననే( నవంబర్ 10 ).ఆయన తెలుగు నిఘంటువును,వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు.అప్పయ్యదీక్షుతులు లాంటి పండితులవద్ద తెలియని విషయాలు నేర్చు కున్నాడు.రాజమండ్రి లో శ్రీ సన్నిధానమ్ నరశింహశర్మ,వారి సోదరులు శాస్త్రి వారి ఇంటికి"బ్రౌన్ మందిరం" అన్న పేరు పెట్టుకొన్నారంటీ వారిని అభినందించాలి.బ్రౌన్ జన్మ దినం రోజున స్తానిక యంయల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారి అధ్వర్యంలో సభ నిర్వహించి తెలుగు భాషాభి వృర్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేసారు.వక్తలందరూ ఎన్నోవిషయాలను చెప్పారు కాని మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు వాళ్ళకి యన్టీఆర్ తెచ్చిన గుర్తింపును ఒక్కరు జ్ఞాపకం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏమైనా మనం తెలుగు వాళ్ళం కదా!!





చివరగా ఒక మాట: తెలుగోపనిషత్ జ్యోతి బుక్స్ వారు 1964 లో ప్రఛురించిన "రసికజన మనోభిరామము" పుస్తకం లోనిది. ఆ పుస్తకంలో బాపు,రమణ ,రావి కొండలరావు మొ ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి" మాస పత్రికలోని జోకులు,కార్టూన్లతో ఆ పుస్తకం ప్రచురించారు.ఆ పుస్తకం ధర ఎంతో ఊహించండి.దాదాపు 80 పేజీల బుక్ వెల ఒక రూపాయి మాత్రమే! మీరు నమ్మాలి.ఆ పుస్తకం నా దగర వుంది!!

Tuesday, 10 November 2009




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

Monday, 9 November 2009



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

Wednesday, 4 November 2009

గ్రీటింగ్ కార్డుల కధ





ఈనాడు ఆ మైల్ పోయి ఈ మైల్ వచ్చాక ఒకరికి ఒకరు ఉత్తరాల ద్వారా పలుకరించుకోవడం తగ్గిపోయింది.ఇక బజారుకు వెళ్ళి మనకు నచ్చిన గ్రీటింగు కార్డులు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపిక,తీరిక ఉండటంలేదు.నెట్ నుంచి 123 అన్నంత తేలికగా 123 గ్రీటింగ్స్ రకరకాలు మితృలకి ,ఆప్తులకి క్క్షణాల్లో పమ్పిస్తున్నాము.ఐనా మొట్టమొదటి గ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకోడం,జ్ఞాపకం చేసుకుందాం! 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!విలియం తయారుచేసిన కార్డు పై భాగాన టు ... అని,అడుగున ఫ్రం...అని అచ్చువేసి పంపే వాళ్ళు పేర్లు వ్రాసుకో వడానికి వీలుగా వుండేదట.మొదటి అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడు.1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సం" వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు తరువాత పుట్టిన రోజులు మొ'' వాటికి కూడా జేర్చటం మొదలయింది.1920 అతి చిన్న కార్డు వడ్ల గింజ పై 22 మాటలతో వ్ర్రాసిన క్రిస్మస్ కార్డు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి బహుకరించారట!


ఇకనుండైనా కొందరు ఆప్త మితృలకయినా గ్రీటింగ్ కార్డులు కొనైనా లేకపోతే తయారు చేసైనా పంపిస్తారు కదూ!

Monday, 2 November 2009



ఫిల్మ్ ఫేర్,ఫెమినా లాంటి పత్రికలను ఎన్నో ఏళ్ళుగా ప్రచురిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రఛురణల సంస్ద బెనెట్ కోల్మన్ కంపెనీ ఇది వరలో ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వార పత్రికను ప్రచురించేది. ఎందుకోగాని ఆ పత్రిక ప్రఛురణ చాలా ఏళ్ళ క్రితం నుంచి మాని వేసింది.ఆ పత్రికలో గొప్ప భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్,శిల్పాలు,ఫొటోలు ప్రఛురించేవారు.మా నాన్న గారు ఆ పత్రికలోని అపురూప చిత్రాలను జాగ్రత్త చేసి ఆల్బమ్ గా తయారు చేసారు.అందులోని కొన్ని బొమ్మలు మీ ముందు వుంచుతున్నాను.ఇందులో ఒక బొమ్మలో చిత్రకారుడు కవి స్త్రీ ని వర్ణించే తీరులో వుంటే ఆమె రూపం ఎలా ఉంటుందో చమత్కారం గా చూపించటం మీరు గమనించ గలరు

Sunday, 1 November 2009

అపురూపకథ - తిట్టు మాటలు



అలనాటి చందమామ లోని అపురూప కధ తిట్టు మాటలు




గాడిద,ఎద్దు,దున్నపోతు కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి "దేవా! మానవులు మా చేత ఎంతో చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ తోటి మనుషులను,"అడ్డగాడిదా అని,ఎద్దులాగున్నావు, బుద్ది లేదా అని, ఒరే దున్నపోతా!! అని మా పేర్ల తో తిడుతుంటే మాకు చాలా బాధ కలుగుతున్నది.మీరు ఆ మానవులకు చెప్పి తిట్లలో మా ప్రస్తావన లేకుండా చూడండి" అని మొరపెట్టుకున్నాయి.


అప్పుడు బ్రహ్మ దేవుడు" మీ నడవిడిని బట్టి మానవులు అలా అంటున్నారు. ముందు మీ నడవడి మార్చుకొని నా దగ్గరకు రండి. అప్పుడు చూద్దాము" అన్నాడు.అప్పుడు గాడిద "ఈ దున్నపోతు దగ్గరకు రావటం నే చేసిన తప్పు"అంది. తరువాత ఎద్దు "ఈ అడ్డగాడిద దగ్గరకు వచ్చి పొరపాటు చేసా" అంది. చివరకు దున్నపోతు"ఈ ఎద్దుగాడు మానవ పక్షపాతి వీడి దగ్గరకు వచ్చి చాలా తప్పు చేశాం"అంది.


అలనాటి చందమామ లోని ఈ ఛిన్న కధ ఎలావుంది?
  • Blogger news

  • Blogroll

  • About