RSS
Facebook
Twitter

Sunday, 22 November 2009




ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో ఇట్టే తెరపై ఏ మిక్కీమౌసో ప్రత్యక్షమై అట్టే మాయమైపోయేది. ఒక్కోసారి అసలు చూపించేవాళ్ళేకాదు! ఇక మాకు నిరాశే మిగిలేది.ఆ మార్నింగ్ షోలకు క్లాస్ కన్షెషన్ వుండేది. అంటే బాల్కనీ టిక్కెట్టు దాని క్రిందిక్ల్లాస్ ధరకే ఇచ్చేవారు.




ఆదివారం మాకు మరో ఆటవిడుపు ఇంగ్లీష్ పేపరే! ఇండియన్ ఎక్సప్రెస్ ఆదివారం సండేస్టాండర్డ్ పేరుతో వచ్చేది.అందులో మెజీషియన్ మాండ్రేక్, బ్రింగింగ్ అప్ ఫాదర్,లిటిల్ కింగ్,ప్రిన్స్ వాలియంట్ మొదలయిన బొమ్మల కధలు రంగుల్లో వచ్చేవి.మావి కాన్వెంట్ చదువులు కాదు కాబట్టి నాన్నగారు చదివి చెప్పేవారు. కొంతకాలం తరువాత మమ్మల్నే చదవమని అర్ధం చెప్పమనేవారు. మాకు అదో ఇంగ్లీష్ పాఠంలా వుండేది. ది మెడ్రాస్ మెయిల్,ఇండియన్ ఎక్స్ప్రెస్ చివరి పేజీల్లో కర్లీవీ,టార్ఝన్ బొమ్మల కధలు ప్రతి రోజూ వేసేవారు.ఆంధ్రపత్రిక వీక్లీలో బాపు బంగారం-సింగారం,లంకె బిందెలు.రాజు-రైతు, విశ్వాత్ముల నరసింహమూర్తి పంచతంత్రం, చందమామలో బాపు గలివర్ ట్రావల్స్ మొ" బొమ్మల కధలు చదవేవాళ్ళం.కార్టూన్ చిత్రాల సృష్టికర్త వాల్ట్ డిస్నీమిక్కీమౌస్ లాంటి కార్టూన్లే కాకుండా డిస్నీ లాండ్ నిర్మించి అనేక అస్కార్ ఎవార్డ్స్ పొందాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంద్రజాల్ కామిక్స్ పేరిట ఫాంటమ్, చందమామ సంస్ధ క్లాసిక్స్ ‍‍అండ్ కామిక్స్ పేర డిస్నీ కామిక్స్,ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్ర కధ పేరిట ట్వింకిల్, భారత రామాయణాలు బొమ్మల కధలుగా ప్రఛురించారు.కొంతకాలంవరకు ట్వింకిల్ తెలుగులో కూడా వెలువడింది.

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About