RSS
Facebook
Twitter

Thursday, 29 September 2011




శ్రీకాకుళం , కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో గల శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం
ఆంధ్రమహావిష్ణువు వెలసిన ఆలయంగా చెబుతారు.శ్రికాకుళం అనే ఈ పేరుని విదేశీ
వర్తకులు తమ వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని సిరికొలని, సిరికి
కొలనుగా పిలిచే వారట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్న మరో జిల్లా ముఖ్యపట్టణం
పేరు కూడా శ్రీకాకుళంగా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు ఈ ఊరిని చికాకోల్ అనే
వారు మన భూమండలానికి కృష్ణాజిల్లాలో గల ఈ శ్రీకాకుళం మధ్య భాగమని
శ్రీకాకుళం భూకేంద్రమనీ ఇక్కడ ఆది ద్వుడు "ఆంధ్రవిష్ణువుగా వెలిసాడని
చెబుతారు . ఈఆలయం విశాలమైన ప్రాంగణంలొ మధ్యగా నిర్మాణం జరిగింది.
ఈ ఆలయ గోపురం చోళరాజైన అనంతదండపాలుడు నిర్మించినట్లుగా చరిత్ర
తెలియజేస్తున్నది.ఆలయ గోపురము పై సర్వధారి నమ సంవత్సరము 1081
లో నిర్మాణము జరిగినట్లుగా శాసనం వ్రాసి వున్నది.
బ్రహ్మగారు శ్రీమహావిష్ణువు కొరకు తపస్సు చేయగా వారి ఫూజలకు వీలుగా విష్ణువు
ఆర్చారూపుడుగా శ్రీవైఖానన మహర్షులచే ప్రతిష్టించబడ్డాడని ,శ్రీమన్నారాయణుడు
వైకుంఠమునుండి ఆంధ్రవిష్ణువుగా వెలిసినట్టు క్షేత్రమహత్యంలో వివరించారు.
విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కీ"శ" 1519లో శ్రీకాకుళాంధ్రదేవుని
అర్చించాడని చెబుతారు స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యములకై ఐదు గ్రామాలను
సమర్పించాడని శాసనములద్వారా తెలుస్తుంది.
ఆలయప్రాంగణములొ విశ్రమించిన రాయలుకు కలలో శ్రీఆంద్రమహావిష్ణువు అగుపించి
ఆంధ్రకావ్యమును రచించమని చెప్పినట్లు, అటుపిమ్మట ఆముక్తమాల్యద రచించినట్లు
ఆ గ్రంధములో వ్రాశారు. ఈ ఆలయానికి ఆగ్నేయ మూలగా ఎత్తైన 16 స్థంబాల
మంటపంలోనే కూర్చుని ఆ గ్రంధ రచన చేశారట. అందువల్ల ఈ మంటపానికి "ఆముక్త
మాల్యద మంటపము" అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశఖ శుద్ధ
దశమితో బ్రహ్మోత్సవాలు మొదలై పంచాహ్నిక దీక్షతో ముగుస్తాయి.

Saturday, 24 September 2011

తెనాలి ఐతానగరంలో 1908 ఆగష్ట్ 5వ తేదీన వెంకట సుబ్బారావనే
చక్రపాణి జన్మించారు. ఆయన ఇంటి దగ్గరే వున్న ప్రాధమిక పాఠశాలలో
ఐదో తరగతి పూర్తి చేసి, తెనాలి తాలూకా హైస్కూళ్ళో ఆరవ తరగతిలో
చేరి ఎస్.ఎస్.ఎల్.సి.వరకూ చదివారు. జాతీయోద్యమంలో చేరి ఉత్సాహంగా
పాల్గొన్నారు.

1934లో చక్రపాణిగారికి టిబీ సోకింది. మదనపల్లి శానిటోరియంలో 1935
లో చికిత్సకై చేరిన ఆయనకు ఓ బెంగాలీ వ్యక్తితో పరిచయమవటమే
కాకుండా ఆయన దగ్గర బెంగాలీ నేర్చుకున్నారు. కలకత్తా నుంచి వాచకాలు,
పిల్లల కధలు తెప్పించి చక్రపాణికి కానుకగా ఇచ్చారు. తన అపార గ్రహణశక్తితొ
బెంగాలీ భాషను నేర్చుకొనడమే కాక ప్రఖ్యాత శరత్ నవలలను అవి తెలుగులో
శరత్ బాబే వ్రాశాడా అన్నంతగా ఆయన అనువాదం సాగింది. చక్రపాణి శత
జయంతి సంధర్భంలో ఆయన వ్రాసిన శరత్ సాహిత్యం దేవదాసుతో బాటు
మరో ఐదు నవలను ఒకే పుస్తకంగా డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సేకరణగా
వెలువడింది.
నాగిరెడ్డిగారితో పరిచయం అటుతరువాత వారిద్దరి స్నేహం దినదిన
ప్రవర్ధమానమయింది. నాగిరెడ్డిగారు మద్రాసులో బియన్ కే ప్రెస్ ప్రారంబించాక
అందులో చక్రపాణిగారి పుస్తకాలు అచ్చువేసేవారు ఇద్దరూ కలసి సినిమాలు,
తీశారు. "చందమామ" లాంటి పిల్లల బొమ్మల పత్రికను పలు భాషలలో
ప్రారంభించారు. విజయా సంస్థను స్థాపించి "షావుకారు", "పెళ్ళిచేసి చూడు",
"పాతాళభైరవి", "మిస్సమ్మ"," గుండమ్మకధ", "మాయాబజార్" లాంటి ఆణిముత్యాలను
తెలుగుతెరకు అందించారు ఆయన ముక్కుసూటిగా మాట్లాడేవారు. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణగారు ఆంధ్రపత్రికలో పని చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళి
"నేను ఆంధ్రపత్రిక నుంచి వచ్చానండి" అన్నారు
"ఎందుకూ"
"మీతో ఇన్టర్వ్యూ చేసి"
"ఎందుకూ"
"మీ గురించి వ్రాద్దామని"
"నా గురించి చెప్పడానికి ఏముంది..నువ్వు రాయడానికేముంది.నేను నేనే"
"అంతేనా"
"అంతేగదా". కుండ బద్దలు కొట్టినట్లు సమాధానాలు చెప్పడం చక్రపాణిగారికే
సాధ్యం. ముళ్ళపూడి చక్రపాణి గురించి ఇలా అన్నారు. "వేప రసం,హ్యూమరసం
కలిసి కళాత్మక వ్యాపారి వెరసి చక్రపాణి"
ఆంధ్రజ్యోతి మాస పత్రికను స్థాపించి అందులో "పనిలేని మంగళి" శీర్షికలో వివిద
విషయాలపై ఎన్నో వ్యాసాలను వ్రాశారు. హైద్రాబాదులో "యువ" మాసపత్రికను
నడిపారు. "కినిమా" మాసపత్రికను నాగిరెడ్డిగారితో స్థాపించి కొంతకాలం నడిపారు.
సినిమా, పుస్తక పత్రికా రంగాలలో ఎనలేని సేవలందించిన చక్రపాణిగారు ఇదే
రోజు ( 24-09-1975) చెన్నై విజయా హాస్పటల్లో మరణించారు .సినీ సాహిత్య
లోకంలో చందమామలా వెలిగిన శ్రీ చక్రపాణిగారికి జోహార్లు. .

Friday, 23 September 2011

దేముళ్లనూ వదలం !

ఈ కలికాలంలో మానవుడు దేముడికి భయపటం లేదు. వాడు ప్రతి రోజూ
చేస్తున్న పాపాలకు భయపడుతున్నాడు. తన మోసాలు, అత్యంత నీచంగా
పీడించి మేస్తున్న లంచాల గడ్డి ఎక్కడ పోతుందోనని ప్రతి రోజు భయపడుతూ
బ్రతుకు వెళ్ళబోస్తున్నాడు. చివరకు తన పాపాల గోతిలోంచి బయటకు
లాగడానికి ఆ దేముడికీ లంచాలు సమర్పిస్తున్నాడు. మనం చేసే పాపాలకు
ఓ కొబ్బరికాయ కొట్టేసి, అప్పనంగా కొట్టేసిన డబ్బుతో వెలిగిపోవాలని
అనుకుంటున్నాడు..

పదవిరావాలని, అటుతరువాత డబ్బు గడ్డి బాగా దొరికే మరో పదవి రావాలని
అగుపించిన ప్రతి దేముడి గుడి చుట్టూ గానుగెద్దులా తిరుగుతూ చివరకు ఆ
దేముడికే శఠగోపం పెడుతున్నాడు. చివరకు దొరికిపోయి జనాలు, కోర్టులు
అక్షింతలు వేసినా, శ్రీకృష్ణజన్మస్థానానికి ( పెద్ద వాళ్ళను జైలుకెళ్ళాడు అని
అనకూడదు కదా!) వెళ్ళి చిప్పకూడు తింటున్నా గుళ్ళో వాడూ, బయట
(అ)కార్యకర్తలు యజ్ఞాలు,యాగాలు చేస్తుంటారు. ఇక బందులూ చేయిస్తూ
రాబందుల్లా జనాలను పీక్కు తింటారు. ఇక పవిత్రత ఎక్కడ వుంది. ఈ
మధ్య కొన్ని గుళ్ళల్లో పూజారులు గుళ్ళు మూసేసి ఆ గుడి బయట క్రికెట్
ఆడుతున్నారంటే ఇంతకంటే పాపం ఎక్కడవుంది చెప్పండి. రెండు రోజుల క్రితం
హిండూ పత్రికలో పడిన పై ఫొటోయే అందుకు నిదర్శనం.
భగవాన్ ! ఈ ప్రపంచాన్ని ఇలాటి నరాధములనుంచి ఇక నువ్వే కాపాడాలి.
వాళ్ళకి నువ్వంటే చచ్చేంత భయం. నువ్వెక్కడ బయటకు వచ్చి వీళ్ళ భరతం
పడతావేమోనని నీ గుడికీ తాళాలేసి ఆటలాడుతున్నారు.

Wednesday, 21 September 2011

మన గురజాడ అప్పారావుగారు.

ఈ రోజు శ్రీ గురజాడ అప్పారావుగారి 150వ జయంతి. ఆదుర్తి, అక్కినేని నిర్మించిన
"సుడిగుండాలు" సినిమాలో ఒక డైలాగు మీకు గుర్తుండే వుంటుంది. ఈ కాలం
పిల్లలకు గురజాడ అంటే తెలియదని అదెక్కడో మారుమూల ఓ గ్రామమనీ అను
కుంటారనీ ఆనాడే మాటల రచయిత శ్రీ యన్నార్ నంది వ్రాశారు. గురజాడ కలం
నుంచి వెలువడిన దేశభక్తి గీతాలు మన జాతీయగీతాల స్థాయికి మించినదిగా
వున్నా తెలుగునే మరచిపోతున్న మన యువతరానికే పూర్తిగా తెలియనప్పుడు
యావత్ భారతదేశానికి తెలిసే అవకాశం ఎక్కడ? "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే
మనుషులోయ్","ఈసురోమని మనుషులుంటే దేశమేగతిని బాగుపడునోయ్" ఇలా
ఎన్నెన్నో గీతాలను రచించారు.
సంఘదురాచారాలను ఎత్తి చూపిస్తూ ఆయన రచించిన "కన్యాశుల్కం" నాటకం
రంగస్థలం మీదే కాకుండా సినిమాగా ప్రశంసలను అందుకుంది. గురజాడ అంటారు
"మనం చెడ్డవారని అనుకునేవారి యెడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నిస్తే
దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ లోకము మరింత యింపుగా
కనబడుతుంది. మీకూ, మీ పరిచయం కలిగిన వారికి మరింత సౌఖ్యం కలుగుతుంది.
కాక, మంచి చెడ్డలు ఏర్పరచగలిగినవాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది; చెడ్డ
లోనూ మంచి ఉంటుంది." ఇలాటి మహనీయుడు మన తెలుగు రాష్ట్రంలో కాకుండా
ఏ తమిళనాడులోనో, బెంగాలు లోనో పుట్టి వుంటే ?! మన తెలుగు వాళ్ళు ,నాయకులు
ఇప్పటికైనా మేలుకుంటారనీ ఆశిద్దాం! అట్లాంటి మంచి రోజులు రావాలనీ కోరుకుందాం
ఈ రోజు సాయంత్రం 4-30 గంటలకు రాజమండ్రి కందుకూరి వీరేశలింగం టౌన్ హాల్లో
కళాగౌతమి ఆధ్వర్యంలో శ్రీ గురజాడ జయంతి సభ జరగడం హర్షనీయం .

Tuesday, 20 September 2011



ఏ నాగేశర్రావ్? అదేనండి మన నాగేశ్వర్రావే ! అదే ఏ.నాగేశ్వరరావుకు 88 వ
పుట్టిన రోజు. నాగేశ్వరరావనే చిన్న బీజం "ధర్మపత్ని" అన్న సినీమాలో
ఓ చిన్న పాత్ర ద్వారా చిన్న పిల్లాడిగా (కన)పడినా నటుడిగా జన్మించినది
మాత్రం "సీతారామజననం" చిత్రంలోనే !అటు తరువాత అంచెలంచెలుగా తెలుగు
తెరపై వెలుగుతుంటే ఎన్నేన్నో పాత్రలు అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతనితో
జత కలిపాయి..నాగేశ్వరరావు ఫలానా పాత్రకు సరిపోడని కొన్ని పత్రికలూ, సినిమా
వాళ్ళు ధైర్యంగా చెప్పినా వాళ్ళ అభిప్రాయాలన్నీ తప్పులనీ తన అభినయం
ద్వారా నిరూపించాడు. నటసామ్రాట్ అయ్యాడు.పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ
వీభూషణ్, దాదాఫాల్కే, మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాళిదాస్ సన్మాన్ పురస్కారాలు
అందుకున్నాడు. అమెరికా ప్రభుత్వంచే ఆ దేశానికి అతిధిగా ఆహ్వానం అందు
కొని ఆ దేశంతో సహా ఎన్నెన్నో దేశాలు చుట్టివచ్చాడు.
హైద్రాబాదుకు తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకు వెళ్ళడానికి శ్రీ అక్కినేని ఆనాడు
కృషి చేస్తే 1963 లో బాపు రమణలు "ఈనాడు తెలుగు సినిమా నావ నతడు
చేర్చదలచిన రేవు నీటికీ నేటికీ నూరామడనిపించే హైదరాబావు !" అంటూ
"జ్యోతి"లో కార్ట్యూన్ ద్వారా వెక్కిరించి వాళ్ళే మళ్ళీ 2003లో ఆయన పుట్టినరోజున
ఇలా అన్నారు.
తెలుగు సినిమా నావను
ఓడగా పెంచిన ధీరో !
హైదరాబాదులో హార్బరు
నిర్మించిన హీరో !!
అనుకున్నది సాధించిన అసాధ్యుడా !
అఖండుడా !
ఓ మా అందరి హీరో!
నీకు మా జోహారో !
ఈనాడు హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృర్ది చెందింది అంటే ఆనాడు
అక్కినేని తీసుకున్న చొరవే!
వేసేది బుద్ధిమంతుడి పాత్రైనా (విప్రనారాయణ) బుడ్డిమంతుడి పాత్రైనా (దేవదాసు)
మెప్పించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. చక్రపాణి, మిస్సమ్మ లాంటి చిత్రాలలో
హాస్యాన్ని పండించాడు.
శ్రీ బాపు రమణలంటే శ్రీ అక్కినేనికి ఎనలేని గౌరవం. శ్రీరామరాజ్యం చిత్రంలో
బాపురమణలు ఆయన్ని వాల్మీకి మహర్షిగా చూపించబొతున్నారు.
అక్కినేని తన అనుభవాలను ,భావాలను ’అ ఆ " ( అక్కినేని ఆలోచనలు)లుగా
వ్రాసుకున్నారు. ఒక చోట అయన ఇలా అంటారు.
"జీవితములో నటన వృత్తిగా తీసుకొనేవాడొకప్పుడు మానవుడు!
నటనే జీవితంగా జీవిస్తున్నాడు యిప్పుడు"
తెలుగు చిత్ర పరిశ్రమ 80 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఈ సమయంలో
88 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మన అక్కినేని ఇలా మరెన్నో పుట్టిన
రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.....

Thursday, 15 September 2011

యమలీల చిత్రంలోని వీడియో క్లిప్పింగ్ చూశారుగా ! ఇందులో మెంటల్ డాక్టరుగా
నటించిన శ్రీ యుప్పలూరి సుబ్బరాయశర్మ జన్మ స్థలం విజయవాడ. అక్కడే ఎస్.
ఆర్.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ రోడ్డూ రవాణాసంస్థలో 1971లో
ఉద్యోగంలో చేరారు. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో "ఆడది" ,"అంతా ఇంతే" ,
"కీర్తిశేషులు" "వాంటెడ్ ఫాదర్స్" మొదలైన నాటికల్లో నటించారు. ప్రఖ్యత హాస్య
రచయిత, దర్శకులు శ్రీ జంధ్యాల సహవాసంతో ఆయన రచించిన "జీవనజ్యోతి",
" ఏక్ దిన్ కా సుల్తాన్ ", "లేత గులాబి", " గుండెలు మార్చబడును" మొదలైన
నాటికల్లో పాల్గొన్నారు. ఉద్యోగ రిత్యా హైదరాబాదుకు బదలీ అయ్యాక దూరదర్శన్
ప్రచారకార్యక్రమాల్లో నటుడిగా అడుగు పెట్టారు. " కుక్క" చిత్రంతో నటుడిగా సినీ
రంగ ప్రవేశం చేసి దాదాపు 250 చిత్రాలకు పైగా నటించారు. "శుభలగ్నం" చిత్రం
లో మహా నటుడు శ్రీ గుమ్మడి వేంకటేశ్వరరావు ప్రక్కన నటించే అవకాశం రావటం
తన అదృష్టం అంటారు శ్రీ సుబ్బరాయశర్మ.
ఎన్నో సంవత్సరాల నాటకానుభవంగల శ్రీ శర్మ అనేక పురస్కారాలను పొందారు.
చెన్నై కళాసాగర్ నుండి మూడు సార్లు ఉత్తమ నటుడు అవార్డు పొందారు. నాగపూర్
తెలుగు సమితి నుండి ఉత్తమ నటుడు, హైదరాబాదు ఆరాధన సాంస్కృతిక సంస్థచే
"కళాకౌశల" బిరుదు, తెలుగు నాటకదినోత్సవ సంధర్భంగా 2010 సం" లో రంగస్థల
పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి నాటకశాఖలో 30 ఏళ్ళు శ్రీమతి శారదా
శ్రీనివాసన్, శ్రీమతి శ్యామలాదేవి, శ్రీ రత్నప్రసాద్, శ్రీ నండూరి మురళీకృష్ణలతో పని
చేశారు. ఎన్నో టీవీ ధారావహికలలో ఆయన నటనకు అనేక సంస్థల నుండి
బహుమతులు అందుకున్నారు. " జానకీ గోపాలం " టెలీఫిల్మ్, "భక్తవిజయం " 13
ఎపిసోడ్స్ ( SVBC) నిర్మాణ దర్శకత్వాలలో పాలు పంచుకున్నారు. "స్వయంవరం"
"మరో వసంతం" ధారావహికలకు ఉత్తమ సహాయక నటుడిగా నంది బహుమతులను
అందుకున్నారు. ఈటీవీ నిర్మించిన "శ్రీ భాగవతం" లో దూర్వాసునిగా శ్రీ బాపుగారి
దర్శకత్వంలో నటించారు. శ్రీ బాపు దర్శకత్వంలో అతిత్వరలో రాబోతున్న శ్రీరామ
రాజ్యం లో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హాస్య పాత్రయినా, గంభీరమైన పాత్రయినా
అవలీలగా నటించగల ప్రతిభావంతులు శ్రీ సుబ్బరాయశర్మ.కె.రాఘవేంద్రరావు, జంధ్యాల,
సింగీతమ్ శ్రీనివాసరావు, ఎస్వీ.కృష్ణారెడ్డి,కోడి రామకృష్ణ,బాపు, సురేష్ కృష్ణ,బోయిన
సుబ్బారావు, రాజమౌలి మొదలయిన ప్రముఖ దర్శకులందరి దగ్గరా ఆయన నటించారు.

గత ఏప్రియల్లో మా కోడలు ఇంట్లో జరిగిన ఉపనయానికి మేము హైద్రాబాదు వెళ్ళి
నప్పుడు శ్రీ శర్మ ( మా కోడలికి ఆయన ఆత్మీయ బంధువు) నన్ను, నా శ్రీమతిని
వారింటికి పిలిచారు. శ్రీ శర్మ, వారి శ్రీమతి మాపై చూపించిన అభిమానం, ఆప్యాయత
మరువలేనివి.

Tuesday, 13 September 2011



పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు , నవ్వినా
ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం ఇలా
ఎన్నెన్నో మనసుకు హత్తుకొనే పాటల పాఠాలు నేర్పిన మనసు కవి ఆత్రేయ
వర్ధంతి నేడు.



ఆయన పాటలు తెల్గు సినిమా పాఠాలు ! ఆయన పాటకు ఓ మంచి నటుడి
నటన, ఓ మంచి సంగీత దర్శకుడి సంగీతం తోడైతే వేరే చెప్పాలా ! తన గీతాలతో
ఎందరో నటుల నటనా ప్రతిభకు జీవం పోసిన కవి ఆత్రేయ.

ఆయన పాటలు దేనికవే ఆణిముత్యాలు! ఆ పాటలలోని కొన్ని చరణాలను కలిపి
మరో పాటను సరదాగా కూర్చాను . నా ప్రయోగంలో తప్పులుంటే క్షమించమని
వేడుకుంటూ...

చిటా పటా చినుకులతో (అక్కచెల్లెలు)
చిటపట చినుకులు పడుతూ వుంటే ( ఆత్మబలం)
ఎక్కడికి పోతావు చిన్నవాడా (ఆత్మబలం)
ఈ పగలూ ఈ రేయిగా (సిరి సంపదలు)
కోడి కూసే జాముదాకా (అదృష్టవంతులు)
తెల్లవారనీయకు ఈ రేయినీ ( ఆత్మబలం)
<><><><><><><>

కోడెకారు చిన్నవాడా (ముందడుగు)
బలె బలె మగాడివోయ్ (మరో చరిత్ర)
నువ్వంటే నాకెందుకో ఇంత ఇది (అంతస్థులు)
ఈనాటి ఈ బంధమేనాటిదో ( మూగమనసులు)
నువ్వూ నేనూ ఏకమైనాము ( కొడుకు కోడలు)
<><><><><><>
ఎక్కడ ఎక్కడ పోతావురా (ప్రేమ)
మంచుకురిసే వేళలో (ఆభినందన)
నా మాటే నీ మాటై (మట్టిలో మాణిక్యం )
నా జీవితము నీ కంకితము ( శ్రీ కృష్ణ విజయం)
<><><><><>
ఒసే ఒయ్యారి రంగీ (పల్లెటూరి బావ)
చెంగావి రంగు చీర ( బంగారుబాబు)
( చీర) కట్టింది సింగారం ( దేవత )
చల్లగాలేస్తుంది మెల్లగా రమ్మంది ( ఛాలెంజ్ రాముడు)
శ్రీ ఆత్రేయ "చిలిపి కృష్ణుడు" సినిమాలో వ్రాసిన పాటతో ఆయనకు
నివాళులు అర్పిస్తూ ముగిగిస్తాను.
ఎళ్ళొస్తానోయ్ మావ మళ్ళొస్తానోయ్...
మళ్ళొస్తాను మరి ఎళ్ళొస్తాను
ఎళ్ళిపోయానని ఏడుస్తా కూకోకు
అయ్యో పాపం...
మళ్ళొచ్చేసరికి నన్ను మరసిపోకు........

Sunday, 11 September 2011

1952 లో అనుకుంటాను ( ఏమంటే నా దగ్గర 1953 నుండే చందమామలు
వున్నాయి ) విచిత్రకవలలు సీరియల్ చందమామలో వచ్చేది. అప్పుడు నా
వయసు 11 ఏళ్ళు. ఐనా ప్రతినెలా చందమామలోని ఆ కధ చదవడానికి
ఆతృతగా అక్కా, నేనూ ఎదురు చూసేవాళ్లం. ఆ కధలోని రాక్షసులు, బారెడు
గెడ్డంతో వుండే పొట్టివాడు, ఇలా ప్రతిదీ మమ్మల్ని , మాలాగే వేలాది మందిని
చందమామ ప్రియులుగా చేశారు. ఆ "విచిత్రకవలలు" కధకు కీ"శే" చిత్రా
అద్భుతమైన చిత్రాలు గీశారు.
1974 జూలైలో విచిత్రకవలలు చిత్రాగారి రంగుల బొమ్మలతో తిరిగి
మొదలయింది. పతాక శీర్షికకు బొమ్మను మార్చటమే కాకుండా ప్రతి
బొమ్మను చిత్ర మరింత అందంగాతిరిగి వేశారు. ప్రతి నెలా పతాక శీర్షిక
బొమ్మను ఆ నెల కధానుగుణంగా మార్చి వేశేవారు. పై బొమ్మను ఈ
బొమ్మను చూస్తే మీకు తేడా తెలుస్తుంది.
కవలలను రాక్షసుడు గ్రద్ద రూఫంలో వచ్చితన్నుకు పోయే దృశ్యాల్ని
గతంలో ప్రచురించిన బొమ్మల్ని మీరు ఇక్కడ చూడొచ్చు
అదే దృశ్యాన్ని దాదాపు ఇరవైఏళ్ళ తరువాత రంగుల్లో చిత్రా వేసిన
బొమ్మను చూడండి !! ఏదీ ఈనాటి చందమామకు ఆ వెన్నెల వెలుగు?!
1955 జూలైలో "విచిత్రకవలలు" కధను చందమామ పబ్లికేషన్స్ వారు
పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ కధ ఎంత విచిత్రంగా వుంటుందో
అలానే అప్పుడు ఈ పుస్తకం ఖరీదు ఓ రూపాయి అంటే ఇప్పుడు విచిత్రంగా
వుంటుంది. ముఖచిత్రాన్ని మాత్రం చిత్రా కాకుండా గోపి అనె చిత్రకారుడు
వేయడం మరో విచిత్రం! ఈ అపురూప పుస్తకం నా దగ్గర వుంది. ఎందు
కంటే " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి మీకిప్పుడు పుస్తకాల
షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి !! నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ
ఇవ్వను ! అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి !! "

Saturday, 10 September 2011

నానమ్మలు-అమ్మమ్మలు-తాతయ్యలు

ఇప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు , తమ పిల్లలకు దూరంగా వుంటున్నారు.
వాళ్ళ అమ్మాయిలు దూరంగా అత్తవారింట్లో , అబ్బాయి(లు) ఉద్యోగ రిత్యా
మరో ఊర్లో వుంటున్నారు. కానీ ఇది తప్పదు. సెలవుల్లో వాళ్లు అందరూ
ఇంటికి వచ్చినప్పుడు ఆ సందడి ఆ సంబరం చెప్పలేనిది. అలానే తాతలు
వాళ్ళదగ్గరకు వెళ్ళినప్పుడు మనవలతో గడిపే మధురక్షణాలు మరువలేము.
ఈ ఫొటో 1948 లో మా మావయ్య (అమ్మ అన్నయ్య) గుంటూరు నుంచి
రాజమండ్రి వచ్చినప్పుడు తీయించుకున్నది.ఇందులో నిలబడిన వారు
ఎడమ వైపు నుండి, మా మామయ్య , అత్తయ్య ,మాబావ (అక్కయ్యనే
ఇచ్చాము), అమ్మ, నాన్న, కూర్చున్న వారు మా తాతయ్య, అమ్మమ్మ,
మా పెద్దత్త, మా మామ్మగారు,.క్రింద కూర్చున్న పిల్లలు ఎడమనుండి,
మా మరదలు, చిన్న బావ దాసు (ఇప్పుడు U.S.లో voluntary Consultant
Surgeon), నేను,చెల్లి, అక్కయ్య. ఇప్పుడు తాతలమైన మేము ఈ ఫొటోలో
మా తాతయ్య, అమ్మమ్మ, మామ్మలను చూస్తుంటే వాళ్లతో మేము గడిపిన
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.
ఈ ఫొటో మా పెద్దమ్మాయి మాధురితో మా నాన్నగారు బాపట్లలో (1966).
మాధురి పిల్లలు చి"నృపేష్, చి" హ్రితీష్ లతో నేను. గోడమీద వున్న మిక్కీ
మౌస్ బొమ్మ నేను గీసిందే !!


ఈ ఫొటో మా చిన్నమ్మాయి మాధవి పాప చి" జోషితతో
మా అబ్బాయి కృష్ణశాయి అబ్బాయి చి" కౌస్తుభ్ తో మేము. పదిహేను
రోజులక్రితమే చి"కౌస్తుభ్ కు చెల్లి పుట్టి మేము మరోసారి తాత,మామ్మల
మయ్యాము. "గ్రాండ్ పేరెంట్స్ డే " జరుపుకుంటున్న ఈ సమయంలో
అందరి తాతయ్యలకు,అమ్మమ్మలకు,నానమ్మలకు నమస్సుమాంజలులు
పాదాభివందనాలు.
<><><><><><><><><>

ఓ బామ్మగారు ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళి "నన్ను మళ్ళీ
పాతికేళ్ళ అమ్మాయిగా మార్చడానికేం తీసుకుంటారు"
అని అడిగింది.
" రెండు లక్షలు"
"పదిహేనేళ్ళ పిల్లగా మార్చాలంటే ?"
"పది లక్షలు"
సరేనంది బామ్మగారు. రెండు నెలల్లో వైద్యం పూర్తి అయింది.
పదిహేనేళ్ళ బాలాకుమారిగా మారింది. కాని డాక్టరుకు
డబ్బివ్వనంది.
"కోర్టులో దావా వేస్తా"నన్నాడు డాక్టరు.
"వేసుకోండి. నాకు పదిహేనేళ్ళు .మైనరును. దావాలు గీవాలు
పనిచెయ్యవు" అంది బాలబామ్మగారు.
( ముళ్లపూడి వెంకటరమణ గారి నవ్వితే నవ్వండి జోకును కొంత మార్చి)

Wednesday, 7 September 2011

విచిత్ర కవలలు

ఈ ఫొటోలో వున్న మా ఇద్దరు పాపలు చి" మాధురి, చి"మాధవి ఒకే తేదీన, (సెప్టెంబరు 8) పుట్టారు !
కానీ కవలలు కాదు. ఏమంటే పుట్టిన తేదీ ఒకటే కానీ సంవత్సరం మాత్రం వేరు ! అందుకే విచిత్ర
కవలలు అన్నాను. ఇద్దరి పుట్టిన రోజూ ఒకే రోజవటం వల్ల పుట్టిన రోజు వేడుక చేయడం చాలా సులువుగా
వుండేది.

ఈ ఫొటో మాధురికి ఏడేళ్ళు, మాధవికి ఐదేళ్లు వయసప్పుడు తీసినది. ఇద్దరు ఒకే స్కూల్లో,
రాజమండ్రి షాడే గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ క్లాసువరకు చదువుకున్నారు
ఈ ఫొటో వాళ్ళు 8th, 9th చదువుతున్నప్పటిది


విశాఖపట్టణం లో కాలేజీ లో చదువుతున్నప్పటి రోజుల్లో ! వాళ్ళిద్దరికీ రికార్డు ప్లేయర్లో
పాటలు వినడమంటే చాలా ఇష్టం! పెద్దమ్మాయి B.Sc., M.A.(Eng Lit), చిన్నమ్మాయి
B.A.B.L చదివింది..


ఇప్పుడు పెద్దమ్మాయి మాధురి చెన్నైలోను , మాధవి ముంబాయిలోనూ వుంటున్నారు. మాధురీ
చంద్రశేఖర్ కు ఇద్దరు అబ్బాయిలు, మాధవీ వెంకట్ కు ఒక అమ్మాయి. ఇదీ ఈ విచిత్రకవలల
కధ. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ఇద్దరికీ మా ఆశీస్సులతో బాటు ఆత్మీయులైన
మీ ఆశీస్సులు కోరుకుంటూ...

Monday, 5 September 2011

గురు బ్రహ్మ




తొలి ఉప రాష్ట్రపతి , రెండవ రాష్ట్రపతి ఐన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన
ఎన్నో పుస్తకాలు,ముఖ్యంగా భారతీయ తత్వ శాస్త్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించి
విదేశ పాఠకుల మన్నలను పొందాయి. ఆయన రచించిన The Reign of Religion
in contemporary Philosophy, An Idealist View of Life, The philosophy
of Upanishads, Eastern Religions and Western Thought మొదలైన
పుస్తకాలు ప్రపంచమంతా ఖ్యతి గాంచాయి. ఆయన మన ఆంధ్రా యూనివర్సిటీలో
కూడా విద్యార్ధులను తీర్చిదిద్దారు. అటువంటి నాయకులు గాని గురువులు గాని
ఈనాడు అతి తక్కువ, విద్యార్ధులపై గురువుల అకృత్యాలు ప్రతి రోజూ ఎక్కడో అక్కడ
వింటూనే ఉన్నాము.
మా కాలంలో ఇప్పటిలా ఇంగ్లీషు కాన్వెంట్ చదువులు లేక పోయినా స్కూల్లో
మాష్టార్లు ప్రత్యెక శ్రర్ధతో పాఠాలు చెప్పేవారు. మేము చదివిన రాజమండ్రి SR
City High School ల్లో ప్రతి ఆదివారం ఉదయం ప్రత్యేక క్లాసులు పెట్టి ఇంగ్లీషు
నేర్పేవారు. కొంత కాలం ఇంటికి సాయంత్రం వచ్చి నాకు, అక్కకు, చెల్లికి ప్రవేటు
చెప్పడానికి ఓ మేష్టారు వచ్చేవారు. ముళ్లపూడి వారి బుడుగు ప్రవేటు మేష్టర్ల
మీద బోల్డు కధలు చెప్పాడు. మేస్టరు కోప్పడితే అదే ప్రవేటన్న మాట. బుడుగు
అంటాడు." ఒక మాట చెప్తా విను. నేనున్నానుక్కో.నాకు ప్రెవేటు చెప్పిన ఒక్కొక్క
మేష్టరు ఒక్కొక్క లాంటివాడు. ఒక మేష్టారేమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో యిలా
ఎడమవేపుకి తిప్పుతాడుగదా,పోన్లే అని ఊరుకుంటామా, ఇంకో కొన్నాళ్ళకి కొత్త
వాడొస్తాడు కదా? వాడేమో ఆ చెవిని కుడివేపుకి మెలిపెడతాడు. మళ్ళా ఇంకో
మేష్టరు ఎడంవేపుకి తిప్పుతాడు.ఇలా అవుతే చెవి పాడైపోదూ."
ఫుర్వకాలంలో రాజులు గురుకులాల్లో జేరి గురువుల వద్ద సకలవిద్యలు నేర్చుకునే
వారు. గురువులు కూడా విద్యతో బాటు సత్ప్రవర్తన, యుద్ధంలో మెలుకవలు నేర్పే
వారు. పంచతంత్రం కధలో రాజు మూర్ఘులైన తన ముగ్గురు కుమారులను విష్ణుశర్మ
అనే గురువు దగ్గరకు పంపితే ,విష్ణుశర్మ వాళ్ళకు "పంచతంత్రం "కధల రూపంలో చెప్పి
నీతి వంతులుగా తీర్చిదిద్దాడు. శ్రీ కృష్ణుడు కూడా బాల్యంలో సాందీపని ఆశ్రమంలో
విద్యా బుద్ధులు నేర్చాడు. శ్రీ బాపు కృష్ణుడు, ఆయన గురువు గారి మీద ఓ చక్కని
కార్టూన్ గీశారు.అసలు మన తొలి గురువులు అమ్మా నాన్నలే! వాళ్ళు మనకు మాటలు
నేర్పారు, నడవడి నేర్పారు. ముందు మనం వాళ్ళని గౌరవిస్తే గురువులను గౌరవించినట్లే!


ఇక్కడి ఫొటో నేను S.S.L.C. రాజమండ్రీ సిటీ హైస్కుల్లో (1955-56) లోతీయించుకున్న
గ్రూప్ ఫొటో. బాణం గుర్తులో వున్నది నేను. ఇందులోని మా గురువులందరికీ నమోవాకాలు.

Friday, 2 September 2011

శ్రీ నండూరి రామమోహనరావు

నండూరి రామమోహనరావు గారు ఈ రోజు అస్తమించారనే వార్త
మార్కట్వేన్, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ తెలుగు అనువాదాలు మా
చిన్ననాటే ఆంధ్రవార పత్రికలో చదివిన నాలాటి అశేష అభిమానులకు
తీరని ఆవేదన కలిగించింది.
బాపు రమణలు నండూరి వారి అనువాద ప్రతిభను గురించి ఇలా
అంటారు. "ఎంత చక్కని తెలుగు-ఎంత చల్లని తెలుగు! ఎంత తీయని
తెలుగు-తెలుగు వెలుగు ! చూడండి:
ఒక శీతాకాలం రాత్రి మంచు కురుస్తోంది,చలి కరుస్తొంది-
ప్రతి క్రియకూ అందుకు దీటైన ప్రతిక్రియ వుంటుంది ( ఎవిరి యాక్షన్
హాజ్ యాన్ ఈక్వల్ రియాక్షన్)
"మేరీ హాడ్ ఎ లిటిల్ లాంబ్" కి నండూరి పలుకుబడి-
"మేరీకి కలదొక్క మేకపిల్ల..."
శ్రీ నండూరి రామమోహనరావు గారు ఏప్రియల్ 24,1927లో జన్మించారు.
స్వంత వూరు కృష్ణాజిల్లా ఆరుగొలను. బందరు, నూజివీడులలో హైస్కూల్
విద్య, రాజమండ్రి కళాశాలో కాలేజీ విద్య అభ్యసించారు. 1948 -1960
వరకు ఆంధ్రపత్రిక అటు తరువాత ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా
1976-1994 వరకు పనిచేశారు. టామ్ సాయర్ నవల అనువాదం
చదువుతుంటే అది ఓ ఇంగ్లీషు నవలకు అనువాదం అని అనిపించదు
హకల్ బెరీ ఫిన్ నవలలో కూడా మనకు టామ్ సాయర్ పాత్ర వస్తుంది.
ఈ నవలలో అమెరికన్ నీగ్రోల బానిసత్వపు సమస్యను మార్కట్వేన్
తెలియజేశాడు. ఇందులో టామ్ సాయర్ శిష్యరికం చేసిన హకల్
బేరీఫిన్ ముఖ్యపాత్రధారి.నండూరివారు అనువదించిన ఈ నవల
పిల్లల్ని పెద్దలనీ అలరిస్తుంది.
మరొ అనువాద నవల రాజూ-పేద. ఈ కధను ఇదే పేరుతో యన్టీఆర్,
సుధాకర్ అనే బాలనటుడితో బిఏయస్ వారు నిర్మించారు. ఒకే పోలిక
కలిగిన ఇద్దరు ఒకరు రాజకుమారుడు, మరొకరు ఓ నిరుపేద కుమారుడు.
వీళ్ళిద్దరు తమతమ స్థానాలను మార్చుకుంటే ? ! ఈ కధ 64 ఏళ్ళ క్రితం
ఆంధ్రవారపత్రికలో ప్రచురించినప్పుడు పాఠకుల విశేష ఆదరణ పొందింది.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ వ్రాసిన ట్రెజర్ ఐలెండ్ ,కాంచనద్వీపంగా
శ్రీ నండూరి అనువదించారు.






ఈ అనువాదాలతో బాటు విశ్వదర్శనం, విశ్వరూపం, నరవతారం లాంటి
విజ్ఞాణ గ్రంధాలను కూడా శ్రీ నండూరి తెలుగు పాఠకులకు అందించారు
ఆంధ్రవారపత్రికలో పంచతంత్రం బొమ్మలకధగా శ్రీ విశ్వాత్ముల నరసింహ
మూర్తి ఆ తరువాత శ్రీ బాపు వేసినప్పుడు శ్రీ నండూరి ఆ బొమ్మలకు
చక్కని గేయరూపంలో సంభాషణలను అందించారు
శ్రీ నండూరి రామమోహనరావుగారు తెలుగు పాఠకుల హృదయాల్లో
కలకాలం నిలచి వుంటారు.

Thursday, 1 September 2011

ఈ రోజు వినాయక చవితి ! ఏ కార్యం ప్రారంభించాలన్నా విఘ్నాలను తొలగించే
గణనాయకునికి పూజలు చేస్తాం! పార్వతీ మాత పసుపుతో బాలగణపతిని
సృష్టించింది. మనం ఈ సారి గణపతిని మట్టితోనే తయారు చేస్తున్నాం.




ఒక విదేశీయుడు విఘ్నేశ్వరుని గుడికి గంటను కట్టి తన మొక్కును తీర్చుకున్నా
డంటే వినటానికి వింతగానే వుంటుంది. గోదావరి ఆనకట్ట నిర్మాణం ఎటువంటి
ఆటంకం లేకుండా పూర్తయితే శ్రీ సిద్ధి లక్ష్మీగణపతి స్వామి ఆలయానికి ఓ కంచు
గంట సమర్పిస్తానని బ్రిటిష్ దొర, గోదవరి డెల్టా రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ మొక్కు
కున్న మొక్కు ఇది !ఆయన కోరికను గణనాధుడు తీర్చాడు. భారత దేశంలో గోదావరి
నదిని దక్షిణ గంగగా భావిస్తారు. ఆ గోదావరీ తీరంలో ఉన్న అతి ప్రాచీన నగరమైన
రాజమహేంద్రవరాన్ని దక్షిణకాశీగా పిలిస్తారు నాళం భీమరాజు వీధిలో ఉన్న ఈ లక్ష్మీ
గణపతి ఆలయానికి దగ్గరలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఆంధ్రకేశరి టంగుటూరి
ప్రకాశం పంతులు, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మొదలైన నగర ప్రముఖులు
నివశించారు.ఈ దేవాళయంలో ఆరు కొబ్బరి కాయలు కొట్టి ఏ కోర్కె కోరుకున్నా తీరుతుందని
భక్తులు విశ్వశిస్తారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ కంచు గంట కాటన్ భక్తితో సమర్పించు కున్నదే! అంతరాలయంలో
నిత్యం మ్రోగుతున్నగంటపై "1858 సాముద బ్రదర్స్ బిల్డర్స్ ,లండన్" అని చెక్కిన అక్షరాలు
మనం ఇప్పటికీ చూడొచ్చు.
అది సరే ! మీరు మట్టి వినాయకుడికే పూజలు చేశారు కదూ !
బాలగణపతి బొమ్మ శ్రీ బాపు గారికి కృతజ్ఞతలతో
లక్ష్మీగణపతి దేవాళయం, గంట ఫొటోలు "గుడిగంట" ఆధ్యాత్మిక వార పత్రిక (రాజమండ్రి)
సంపాదకులు శ్రీ సన్నిధానం శాస్త్రి గారి సౌజన్యంతో.
మీ ఇంటిల్లిపాదికీ మా ఇంటిల్లిపాది వినాయకచవితి శుభాకాంక్షలు!
  • Blogger news

  • Blogroll

  • About