నండూరి రామమోహనరావు గారు ఈ రోజు అస్తమించారనే వార్త
మార్కట్వేన్, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ తెలుగు అనువాదాలు మా
చిన్ననాటే ఆంధ్రవార పత్రికలో చదివిన నాలాటి అశేష అభిమానులకు
తీరని ఆవేదన కలిగించింది.
బాపు రమణలు నండూరి వారి అనువాద ప్రతిభను గురించి ఇలా
అంటారు. "ఎంత చక్కని తెలుగు-ఎంత చల్లని తెలుగు! ఎంత తీయని
తెలుగు-తెలుగు వెలుగు ! చూడండి:
ఒక శీతాకాలం రాత్రి మంచు కురుస్తోంది,చలి కరుస్తొంది-
ప్రతి క్రియకూ అందుకు దీటైన ప్రతిక్రియ వుంటుంది ( ఎవిరి యాక్షన్
హాజ్ యాన్ ఈక్వల్ రియాక్షన్)
"మేరీ హాడ్ ఎ లిటిల్ లాంబ్" కి నండూరి పలుకుబడి-
"మేరీకి కలదొక్క మేకపిల్ల..."
శ్రీ నండూరి రామమోహనరావు గారు ఏప్రియల్ 24,1927లో జన్మించారు.
స్వంత వూరు కృష్ణాజిల్లా ఆరుగొలను. బందరు, నూజివీడులలో హైస్కూల్
విద్య, రాజమండ్రి కళాశాలో కాలేజీ విద్య అభ్యసించారు. 1948 -1960
వరకు ఆంధ్రపత్రిక అటు తరువాత ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా
1976-1994 వరకు పనిచేశారు. టామ్ సాయర్ నవల అనువాదం
చదువుతుంటే అది ఓ ఇంగ్లీషు నవలకు అనువాదం అని అనిపించదు
హకల్ బెరీ ఫిన్ నవలలో కూడా మనకు టామ్ సాయర్ పాత్ర వస్తుంది.
ఈ నవలలో అమెరికన్ నీగ్రోల బానిసత్వపు సమస్యను మార్కట్వేన్
తెలియజేశాడు. ఇందులో టామ్ సాయర్ శిష్యరికం చేసిన హకల్
బేరీఫిన్ ముఖ్యపాత్రధారి.నండూరివారు అనువదించిన ఈ నవల
పిల్లల్ని పెద్దలనీ అలరిస్తుంది.
మరొ అనువాద నవల రాజూ-పేద. ఈ కధను ఇదే పేరుతో యన్టీఆర్,
సుధాకర్ అనే బాలనటుడితో బిఏయస్ వారు నిర్మించారు. ఒకే పోలిక
కలిగిన ఇద్దరు ఒకరు రాజకుమారుడు, మరొకరు ఓ నిరుపేద కుమారుడు.
వీళ్ళిద్దరు తమతమ స్థానాలను మార్చుకుంటే ? ! ఈ కధ 64 ఏళ్ళ క్రితం
ఆంధ్రవారపత్రికలో ప్రచురించినప్పుడు పాఠకుల విశేష ఆదరణ పొందింది.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ వ్రాసిన ట్రెజర్ ఐలెండ్ ,కాంచనద్వీపంగా
శ్రీ నండూరి అనువదించారు.
ఈ అనువాదాలతో బాటు విశ్వదర్శనం, విశ్వరూపం, నరవతారం లాంటి
విజ్ఞాణ గ్రంధాలను కూడా శ్రీ నండూరి తెలుగు పాఠకులకు అందించారు
ఆంధ్రవారపత్రికలో పంచతంత్రం బొమ్మలకధగా శ్రీ విశ్వాత్ముల నరసింహ
మూర్తి ఆ తరువాత శ్రీ బాపు వేసినప్పుడు శ్రీ నండూరి ఆ బొమ్మలకు
చక్కని గేయరూపంలో సంభాషణలను అందించారు
శ్రీ నండూరి రామమోహనరావుగారు తెలుగు పాఠకుల హృదయాల్లో
కలకాలం నిలచి వుంటారు.
Thank you for reminding such a beautiful episodes from Nanduri garu.
ReplyDeleteఈ రోజు శ్రీ నండూరి రామ్మోహనరావుగారు కాలధర్మంచెందినా
ReplyDeleteతన అద్బుత సాహిత్య సృష్టివలన ఆయన చిరంజీవి....
నండూరి వారు తెలుగు వారికి విశ్వదర్శనం చేయించారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.
ReplyDeleteఆ రోజుల్లో మార్కట్వైన్ నవలలు ఆంధ్రవార పత్రికలో చదవడానికి ఆతృతతో ఎదురుచూసేవాళ్ళం. విశ్వాత్ముల నరసింహమూర్తి
ReplyDeleteగారి పంచతంత్రం బొమ్మల కధకు నండూరివారు చక్కని గేయరూపంలో మాటలు కూర్చేవారు. లేడి వలలో చిక్కినప్పుడు "మేత
కోసమై వలలో పడినే పాపం పసివాడు...." అంటూ వ్రాశారు. పంచతంత్రం బొమ్మలకధ పుస్తకరూపంలో వచ్చింది. నే అరువిచ్చి పోగొట్టు
కున్న మంచి పుస్తకాల్లో అదొకటి. ఎవరైనా తిరిగి పునర్ముద్రిస్తే బాగుండును. దీనికి రచన శాయిగారే పూనుకోవాలి. అభిప్రాయలు చెప్పిన
మీ అందరికి ధన్యవాదాలు.
పాశ్చాత్య బాల సాహిత్యాన్ని శ్రీ నండూరి వారు తెనిగించిన తీరు అనితర సాధ్యం. ఆ నవలలు చదివేటప్పుడు మధ్యలో దొర్లే పాత్రల పేర్ల వల్ల మాత్రమే ’చదువుతున్నది పాశ్చాత్యం’ అని గుర్తుకొస్తుంది. వారి మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. వారి రచనలు విశ్వదర్శనం, భారతీయ పాశ్చాత్య చింతనలూ, విశ్వ రూపం, నరావతారం, రాజూ-పేద, కాంచన ద్వీపం, టామ్ సాయర్, హక్ల్ బరీ ఫిన్, మొదలైనవన్నీ నాదగ్గర వున్నాయి.
ReplyDeleteబాల్యంలో ఆంధ్రవారపత్రికను 1970ల మొదటి నుంచి చదవటం, ాగతి పండరి గారి కార్డూన్లను విడవకుండా చదవటం, నండూరివారి సీరియల్స్‌తో పాటు అన్ని సీరియల్స్‌ని అనుసరించడం.. సాహిత్యాన్ని కొని చదవగలిగిన లేదా గ్రంథాలయాలకు పోయి చదివే అవకాశం ఉన్న తెలుగు కుటుంబాలకు అదొక స్వర్ణయుగం.
ReplyDeleteపల్లెల్లో ప్రతి వారం, నెలనెలా పత్రికలను అందుకునే భాగ్యం ఉండకపోవడం అనేది పెద్ద అడ్డంకి కాబట్టి చిన్నప్పుడు ఏ సీరియల్‌ని కూడా పూర్తిగా చదవలేక పోయేవారం. తర్వాత అవి నవలలుగా వచ్చినప్పుడే పూర్తిగా చదవటం సాధ్యమయేది.
అలా నండూరి వారి పూర్తి పుస్తకాన్ని చదివన అనుభవం రాజుపేద తో మొదలైంది. 1980లో రాయచోటి ప్రబుత్వ గ్రంథాలయంలోంచి సభ్యత్వం తీసుకుని తెచ్చుకుని దీన్ని చదివినప్పుడు నా కళ్లముందు ఓ గొప్పకాంతి ప్రసారమైన అనుభూతి. అది తెలుగు పుస్తకం కాదంటే నమ్మలేనంత తీయటి తెలుగు... తర్వాత కాలం గడిచేకొద్దీ ఆయన నవలలూ, తాత్విక పుస్తకాలు దాదాపుగా చదవగలిగే అవకాశం దక్కింది.
ఒక్క మాటలో చెప్పాలంటే బాలసాహిత్యం, సైన్స్ రచనలు, తాత్విక రచనలకు నండూరి వారు అనితర సాధ్యమైన సిలబస్ తయారు చేశారు. పిల్లల నవలలు రాయడమంటే సరే.. కాని సైన్స్‌ని, తత్వశాస్త్రాన్ని ఇంత సులభంగా, సుందరంగా, ఆకర్షణీయంగా, పరమప్రామాణికంగా రాయగలగడం ఎవరికి సాధ్యం.. ఒక్క కొడవటిగంటి కుటుంబరావు గారికి తప్ప..
నండూరి వారి రచనలు నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, వంటివి ప్రామాణికత అనే భావనకే పరమ ప్రామాణికతను కల్పించేంత గొప్ప రచనలు. సమాజంలోని అన్ని వర్గాల పాఠకులతోపాటు, రెండు మూడు తరాల కమ్యూనిస్టులు కూడా పై మూడు పుస్తకాలను చదువుతూ వచ్చారంటే వీటి గొప్పతనం అర్థమవుతుంది.
ఇవ్వాళ ఆయన లేరు. కరదీపికల్లాంటి ఆయన పుస్తకాలు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. ఏ జాతికయినా ఇంతకు మించిన సంపద మిగులుతుందా..!
మంచి పరిచయం చేశారు, అభినందనలు.