RSS
Facebook
Twitter

Monday, 12 August 2013

టీవీ వె(క)తలు

     
                   నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలు
ఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలు
మరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ?
గంట గంటకు సీరియస్గా  సీరియల్గా  ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని 
పేరంటానికి ఇంటింటికి!
ఇక దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో! ఓ రోజు కేబుల్ బందే ?!
అయ్యో!! ఈ జనాలకు తీరని ఇబ్బందే!!



Sunday, 4 August 2013

స్నేహానికి ఓ రోజా ?

                   స్నేహానికి ఓ రోజా ?
తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !!
ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ?!!
బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !


కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం !!
కాదా బాపూరమణల మైత్రీ బంధం ఎంతో రమణీయం !!
అలాటి అపురూప స్నేహానికి ఏడాదికి ఒక రోజా?!!
అందిద్దాం ప్రతినాడూ స్నేహానికి  ఓ పరిమళాల రోజా !!!

Thursday, 11 July 2013

 1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డే
అని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ,
రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి"
ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. అవిష్కరించింది
నటసామ్రాట్ అక్కినేని నాగేశవరరావు గారు. ఆనాటి జ్యోతి నవ్వుల
వెలుగులను నెల నెలా తెలుగు పాఠకులకు మాటల, జోకులు,
కార్టూన్లతో "పంచి"Oది !!

 జ్యోతిలొని జోకులు, బాపు, గోపుల నవ్వుల బొమ్మలు అన్నీ కలిపి
1964  ఆగష్టు   లో జ్యోతి బుక్స్ పేరిట "రసికజన మనోభిరామము"
అను N2O పుస్తకాన్ని అచ్చేసి జనాలపైకి వదిలారు. 84 పేజీల
పైనే వున్న ఈ పుస్తకం వెల తెలుసు కుంటేనే పకపకా నవ్వుతారు.
ఒకే ఒక్క రూపాయి !! ఇప్పుడేమో మన రూపాయి విలువ మరీ మరీ
పడి పోతుంటే అప్పటి రూపాయి ఎంత జ్యోతిలా వెలిగిపోయిందో
చూశారా !!ఇక అసలు చెప్పోచ్చేదేమిటంటే ఈ ప్రత్యేక పుస్తకం
ముందు మాటలు కూడా నవ్విస్తాయి. ఆ పేజీకే రూపాయివ్వొచ్చు!
ఆ మాటలు చదవని వారి కోసం ఇక్కడ ఇస్తున్నాను.

 " ఇది జ్యోతి బుక్స్ వారి రెండవ ప్రచురణ.కొన్ని అనివార్య కారణాల
వల్ల దీన్ని ఆలస్యంగా వెలువరిస్తున్నందుకు మన్నించ మనవి.
"జ్యోతి"మాసపత్రికను మొదటి సంచికనుంచి చూస్తున్నవారు 
"ఇవన్నీ జ్యోతిలోవే" అనేస్తే అది అక్షరాలా రైటే ( ఆ మాటకొస్తే ఈ
పుస్తకం పేరుకూడా మాకంటేముందే కూచిమంచి తిమ్మకవి 
ఉపయోగించాడు. ముఖచిత్రం మీద తారలిద్దరూకూడా సరికొత్త
వారుకాదు,పాతవారే ) జ్యోతిలో వెలువడిన కార్టూన్లు,జోకులే ఇప్పుడు
పుస్తక వేషం ధరించి మిమ్మల్ని మరోసారి నవ్వించలేమా అనే 
ధీమాతో మీఎదట నిలబడుతున్నాయి
   అయినా జోకులకులంలో మంచి చెడ్డల భేదం తప్ప కొత్తపాతల
భేదం అంతగా లేదేమో. ఇదివరకు మీరు వినకపోతే జోక్ కొత్తదే :
ఇదివరకు విన్నా మళ్ళీ నవ్వొస్తే కొత్తదే; మీకు బాగా నచ్చితే కొత్తదే.
ఇక ఏది మంచి జోకు,ఏదికాదు అనేది మానవుడు నవ్వడం నేర్చిన
నాటినుంచి వస్తున్న ప్రశ్న.అసలు ఏది జోకో, కాదో చెప్పడం బ్రహ్మ
పదార్ధాన్ని నిర్వచించడమంత కష్టం- (గులాబీ పువ్వును గెర్ట్రూడ్
స్టీన్ నిర్వచించినట్టు,  A joke is a joke is a joke అని మాత్రం చెప్ప
వచ్చు). అందుచేత దానిజోలికి మేము పోవడంలేదు. అలాగే, నవ్వు
ఎట్లు పుట్టును, తెలుగువారికి హ్యూమరు కలదా లేదా, " పాండురంగ
మాహాత్మ్యము"లో జోకులున్నవా లేవా మొదలైన చిక్కుప్రశ్నలను
కూడా పండిత ప్రకాండులకే వదిలేస్తున్నాము. ఈ పుస్తకానికి మరో
పేరు N2O అనగా నైట్రస్ ఆక్సయిడ్ అనబడు "లాఫింగ్ గ్యాస్".
మీకు ఏమీ తోచనప్పుడు,కాసేపు నవ్వుకోవాలనిపించినప్పుడు,
మనసు అదోలా వున్నప్పుడు దీన్ని వాడిచూడండి. (అన్నినొప్పు
లకు హాస్యాంజనం అన్నారు పెద్దలు). మీ మిత్రులకు కానుకగా
ఇవ్వడానికి,(లేక కానుకగా స్వీకరించడానికి), ఏదైనా ఉత్తరం
వ్రాస్తున్నప్పుడు ఒత్తు పెట్టుకోడానికి ( తలగడగా పనికిరాదు )
కూడా ఇది పనికిరాగలదు."


ముందుమాటే ఇంత ముద్దుగా నవ్విస్తుంటే ఇక లోపలి పేజీలో!
ఈ పుస్తకం అరువిచ్చి చినిగిన అట్టతో నాకు తిరిగొచ్చిన ఈ పుస్తకాన్ని
చూడాలన్నా చదవాలన్నా మా ఇంటికి రండి ! ఎవ్వరికీ అరువు
ఇవ్వబడదు." నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను. అవిమీకిప్పుడు
పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కాబట్టి ! అలానే నా పాతపుస్తకాల్ని
ఎవ్వరికీ ఇవ్వను. అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి." అదండీ
సంగతి.
( ఇందులోని బొమ్మలు జ్యోతి, జ్యోతి బుక్స్ ,రచన సాయిగారికి 
కితజ్ఞతలతో)

Tuesday, 2 July 2013

 ముఖాలగురించి రాయాలంటే  నా ముఖం ఏం రాస్తాం
అని అనుకుంటాం కానీ ఎంతైనా రాయొచ్చు. అందులో
రోజుల్లో అదేదో "సాంఘిక వల పనికి" సంబంధించిన ముఖ
పుస్తకంలో మునిగిపోయిన వాళ్ళెందరో! ఈ రోజుల్లో చూద్దా
మంటే బయట, వాళ్ళ ముఖం చాటేస్తున్నారు. ఇక వాళ్ళ
ముఖారవిందాలు అందరివీ అక్కడా చూడలేం. అక్కడ
వాళ్ళ ముఖం బదులు ఏ పువ్వు బొమ్మో, సినిమా స్టారు
ముఖమో కనిపిస్తుంది. ఎవరి భయం వాళ్ళది. ఈ ముఖ
పుస్తక వ్యామోహంలో పడి నేనూ నా బ్లాగులో వ్రాయటం
తగ్గించేశాను. ఈ వల(నెట్)లోంచి బయట పడలేక చేపలా
గిలగిలకోట్టుకొంటున్నాను. ఐనా ఇంతకు ముందు నాకు
ముఖపరిచయంలేని వాళ్ళు కూడా ఈ ముఖపుస్తకం
ద్వారా ఆప్తులయ్యారు. ఆ మధ్య కార్టూన్ ఫెస్టివల్ కు
హైద్రాబాదు వెళితే అందరూ పలకరించారు.ఎక్కడో
జొహెన్బర్గ్ లో వున్న శ్రీమతి జ్యొతిర్మయి వైజాగ్ వచ్చి
నన్ను చూడటానికి మా రాజమండ్రి ఇంటికివచ్చారంటే 
అది ఈ"ముఖపుస్తకం"మహిమే!

 నాకు నిజ పుస్తకాలంటే యమ పిచ్చి. ఇంటి నిండా ఆ
పుస్తకాలే. ముఖపుస్తకం వచ్చాక ఈ పుస్తకాల ముఖం
అసలు చూడనప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు వారానికి
రెండు మూడు ఎందుకు కొంటారని నా శ్రీమతి అంటే
"నీ ముఖం ! ఆ ముఖపుస్తకం కన్నా ఈ పుస్తకాలముఖమే
ఎప్పటికైనా బెస్ట్ !" అంటుంటాను. శ్రీ బాపు నాకు ఓసారి
ఉత్తరం వ్రాస్తూ ఇలా "ముఖపుస్తకం" బొమ్మ గీసి పంపారు.

 కాసేపు ఈ ఫేసుబుక్కు వైపునుంచి ముఖాన్ని ఇటువైపు
తిప్పుదాం. అసలు ఈ ముఖానికి ఎంతవిలువో. అప్పుల
వాళ్ళు అగుపిస్తే అప్పారావులు ముఖం చాటేస్తారు. చాటంటే
జ్ఞాపకం వచ్చింది. తమకు ఇష్టమైన విషయాలు విన్నా,
చూసినా జనాలకు ముఖం చాటంతయిందంటారు. కోపం
వస్తే అదే ముఖం కందగడ్డయిందంటారు.  మోసం బయట
పడితే  మేకప్ వేసుకోకుండానే ముఖం రంగులు మారిం
దంటారు. 

 మన పురాణాల్లో బ్రహ్మగారికి నాలుగు ముఖాలు. పూర్వం
సినిమాల్లో, అట్ట ముఖాలు పెట్టేవారుకాని ఇప్పుటి గ్రాఫిక్
యుగంలో ఆ నాలుగు ముఖాలు కదులుతాయి, మాట్లాడ
తాయి. లంకాధిపతి రావణాసురిడికి పది ముఖాలు. ఒక
ముఖానికే పౌడర్లూ స్నోలు రాసుకోవలంటేను, షేవ్ చేసు
కోవాలంటేను ఎంత ఇబ్బంది. శ్రీరాముని చేతిలో చివరికి
చచ్చేడుకానీ రోజూ ఎంత చచ్చేవాడో కదా!!పాపం !!


పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఈ రోజు ఆఫీసులో
మేనేజర్ నుంచి శ్రీముఖం అందుకున్నాను అంటారు.
నిజానికి వాడు బ్రష్ చేసుకుంటూ చూసుకున్నది వాష్
బేసిన్ అద్దంలో వాడి ముఖారవిందమే.ఒక సినిమాలో
ఇప్పటి కేంద్ర మంత్రిగారు " ఓసారి ఫేసు టర్నింగిచ్చుకో"
అంటుంటారు. అలా ఫేసు టర్నింగు ఇచ్చుకొని ఆయన
నిజ జీవితంలో మంత్రి పదవిని అలంకరించేశారు! చూశారా
మరి ఈ ఫేసు గొప్పతనం !! (జ్యొతి మాసపత్రికలోని కార్టూన్
ఉపయోగించినందుకు శ్రీ బాపుగారికి, ఆనాటి జ్యోతి మాస
పత్రికకు ఫేసు(తల)వంచి నమస్కరిస్తున్నాను)

Monday, 1 July 2013

డాక్టర్స్ డే !!


 ఇప్పుడొచ్చే అన్ని రకాల రోజుల్తో బాటు " డాక్టర్స్ డే "కూడా వుంది.
ఐనా డాక్టర్స్ తో పని లేని వాడెవరైనా వుంటారా చెప్పండి. అందుకే
వైద్యోనారాయణ హరి: అని మన పెద్దలన్నారు. మా చిన్నతనంలో
మా నాన్నగారి ఆప్త మిత్రులు డా: కె.యం.సుందరం గారని వుండే
వారు. ఆయన్నిమేము మామయ్యగారు అని పిలిచే వాళ్ళం. మాకు
వైద్యమంతా ఫ్రీ. ఇప్పుడు మాకు ఆప్త మిత్రులు డా"రాఘవమూర్తి
గారు. ఈయన సాహితీ ప్రియులు. రోజూ మా ఇంటికి ఎదురుగా వున్న
ఆయన  హాస్పటల్ కు వెళ్ళే ముందు ఉదయం తొమ్మిది గంటలకు
మా ఇంటికి వచ్చి సినిమాలు, పాటలు, గళ్ళనుడి కట్లు పూర్తి చేసి
హాస్పటల్ కు వెళతారు. ఆయన హాస్పటల్లో కాసేపు కూర్చుంటే
నా కెన్నో కార్టూన్ ఐడియాలు తడుతుంటాయి. అలా తట్టినవి
నేను గీసిన కొన్ని కార్టూన్లతో, శ్రీ ముళ్లపూడివారి నవ్వితే నవ్వండి
లోని కొన్ని  డాక్టర్ల జోకులతో డాక్టర్లందరికీ శుభాకాంక్షలు.





రోగి: ఈ బాధ భరించలేను డాక్టర్....ఇంతకన్నా చావే నయం
డాక్టర్: ఆ గొడవ నాకొదిలేయండి నే చూసుకుంటాగా !!
                  *****************************

కొత్తగా పెళ్ళయిన డాక్టరుగారికి రాత్రి పదింటికి పేకాట స్నేహితులు
ఫోను చేశారు.
డాక్టరుగారి భార్య ఫోను అందుకుంది
"ఎమర్జన్సీ అని చెప్పమ్మా" అన్నాడు పేకాటవికుడు.
"గురూ, ఇక్కడ ముగ్గురమే ఉన్నాం, ఓ చేయి తక్కువయింది. ఆటాగి
పోయింది.రాక తప్పదు" అన్నాడు స్నేహితుడు ఫోనులో.
"ఏవండీ-కేసు సీరియస్సా" అంది భార్య.
"ప్చ్-చాలా.ఇప్పటికే అక్కడ ముగ్గురు డాక్టర్లున్నారు. నన్ను కూడా
రమ్మంటున్నారు"అన్నాడు డాక్టరుగారు.
          
                   ****************************


ఒక రోగి ఆపరేషను బల్ల ఎక్కుతూ-
"మరే  ప్రమాదం లేదుగా డాక్టరుగారు?" అన్నాడు.
"చాల్చాల్లేవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన
ఆపరేషనెవడు చేస్తాడు, బలేవాడివేలే."



(శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారి "నవ్వితే నవ్వండి-మాకభ్యంతరంలేదు
సౌజన్యంతో. ఇలాటి మంచి మంచి జోకులు, రమణగారి పూర్తి సాహిత్యం
చదవాలంటే నేడే ముళ్లపూడి  వెంకట రమణ సాహితీసర్వస్వం ఎనిమిది
సంపుటాలు తెచ్చెసుకోండి. అరువుగా కాదు సుమా )

Friday, 28 June 2013


 బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమాను
లందరికీ పండుగే.  ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావు
పేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడు
నాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు)
అప్పారావు పేరు పెట్టినందుకు తెగ బాధపడిపోయేవాడిని. స్కూల్లో
చాలా మంది పేర్లు కృష్ణ అనో, రామారావనో, ప్రభాకర్ అనో,రవి అనో
వుండేవి. తరువాత పెద్దయ్యాక మా రమణగారి హీరో పేరు ముందు
చూపుగా మా అమ్మ నాన్నగారు పెట్టినందుకు కాలరెత్తుకుంటున్నాను.
తన హీరో పేరయినంద్కే నేమో రమణగారికి నేనంటే అంత ప్రేమ.


రమణగారి మాటలన్నీ ముత్యాలమూటలే!! ఎన్నని చెబుతాం !!
ఒకటా రెండా ? ఋణానందలహరిలో నాయకుడు నా చేత (సారీ)
అప్పారావు చేత ఇలా అనిపిస్తారు. 
        "మంచీ చెడ్డా అనేవి రిలెటివ్. మనిషికీ మనిషికీ
         వుండే చుట్టరికాన్ని బట్టి వుంటాయి. నేనంటే మీకు
         గిట్టనప్పుడు నాకు మంచిదైంది మీకు చెడ్డది"
అందులోనే రమణగారు జంతువుల భాషను చెప్పారు !!
       కాకివి  "కావు కేకలు" అవి ఆవులిస్తే "కావులింతలు"
       కాకులకు "రెక్కాడితేగాని డొక్కాడదట"
ఇక చీమల భాష :
        చీమలవి " చిమ చిమ నవ్వులు" మన ముసి ముసి
నవ్వులన్నమాట! పాములు ఒకరితో ఒకరు " దోబుసలాడు
కోవడం"! అవి " కొంపదీసి" అనవట! వాటి భాషలో ఐతే "పుట్ట
తీసి" అని అంటాయట! ఇలా ఎన్నెన్ని చమత్కారాలో !!



           

శ్రీ బాపు, శ్రీ రమణల మొదటి సినిమా " సాక్షి " లో నాయకి
చుక్క ( విజయనిర్మల) నోట ఈ మాటలనిపిస్తారు.
    "మంచోళ్ళు, సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు
     మావా! మంచీ సెడ్డా కలిస్తేనే మనిసి"

     ఆంధ్రసచిత్ర వార పత్రికలో నవంబరు 1956 నుండి
ఏప్రియల్ 1957 వరకూ వచ్చిన "బుడుగు-చిచ్చుల
పిడుగు" ఆబాలగోపాలాన్ని అలరించింది. బుడుగు
అచ్చయిన రోజుల్లో బాపు బొమ్మలు తెలుసుగానీ
రచయిత ఎవరో మాకు తెలియదు. సీరియల్ ముగింపు
సంచికలో పై బొమ్మ అచ్చు భుడుగు మాటల్లాగే వేశారు.



     రమణగారికి కాస్త ఒంట్లో నలతగా వున్నప్పుడు నేను
ఫోను చేస్తే నవ్వుతూ " ఒళ్ళు కాస్త రిపేరు కొచ్చిందండీ"
అనేవారు. ఆయన వాసే ఉత్తరాల్లోనూ చమత్కారమే.
బాపుగారి సంతకం కూడా ఆయనే చేసేసి Authorised
forgery అని వ్రాస్తారు. మా రమణగారికి పుట్టిన రోజు
జేజేలు.


Wednesday, 26 June 2013


 "అక్కినేని అదృష్టవంతుడు !" జానపదహీరోగా పాప్యులరైన అక్కినేనిని
ఇలా అన్నది శ్రీమతి భానుమతి!! ఆమె మాట ముమ్మాటికీ నిజమని
ఋజువు చేశారు అక్కినేని దేవదాసు పాత్రతో !! ఇంకా దేవదాసును
తెలుగు ప్రజలు మరచిపోలేదు అనడానికి 60 ఏళ్ళయినా దేవదాసును
పాటలను ఇంకా తలుస్తూ వుండటమే! మరో విశేషమేమంటే తెలుగు
కంటే తమీళ దేవదాసే మరింత విజయవంతమయింది. తెలుగులో
మరో యువనటుడితో తీశారుకానీ శివాజీలాంటి నటులున్నా ఏ తమిళ
నిర్మాత తీసే సాహసం చేయలేదు.


 2011లో దేవదాసు నవలారూపంలో టి.ఎస్.జగన్మోహన్ అందించారు.
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ అందించిన ఈ పుస్తకంలో పాటల CD
కూడా కానుకగా అందజేశారు. దేవదాసు రెండోసారి విడుదలయిన
సందర్భంలో గ్రామఫొన్ కంపెనీ శ్రీ అక్కినేని వ్యాఖ్యానంతో LP RECORD
గా విడుదలచేశారు


ఆనాడు పదిహేను కేంద్రాలలో విడుదలయిన( 26-6-1953) దేవదాసు
ఏడు కేంద్రాలలో శతదినోత్సవమ్ జరుపుకుంది. రాజమండ్రిలో శత
దినోత్సవం జరిగిన రోజుల్లో (ఆగష్టు)గోదావరికి వరదలు  వచ్చాయి.
మా మేనమామగారు (Manager, I.L.T.D.Co)అప్పుడు ఆల్కాట్ గార్డెన్స్
లోవుండేవారు. వరదలకారణంగా రాజమండ్రిలో దానవాయిపేటలో
ఓ జమిందారుగారి భవనంలో వున్నారు. శ్రీ నాగేశ్వరరావుకు, సావిత్రికీ
ఆదే భవనం పై అంతస్తులో వసతి ఏర్పాటుచేశారు. అప్పుడు  హీరో
హీరోయిన్ల ఆటోగ్రాఫ్ మా నాన్నగారు తయారు చేసిన సినీ నటుల
ఆల్బంలో తీసుకున్నాము. తక్కిన బొమ్మలన్నీ చినిగిపోయాయికానీ
సావిత్రి సంతకం మాత్రం కొద్దిగా మిగలడం అదృష్టమనే చెప్పాలి.
షష్ఠి పూర్తి చేసుకుంటున్న ఆ దేవదాసుకు, మరో మూడునెలలో
తొంభైలోకి అడుగితున్న ఎవ్వర్ గ్రీన్ నాగేశ్వరరావుగారికి అభినందనలు.

Saturday, 15 June 2013

నాన్నల పండుగ

   నాన్నల పండుగ

ధర్మదాత సినిమాలో నాన్నగురించి మనసు కవి ఆత్రేయ ఇలా
అంటారు.
     "ముళ్లబాటలో నీవు నడిచావు
       పూలతోటలో మమ్ము నడిపావు
       ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
       పరమాన్నం మాకు దాచి వుంచావు"
       పుట్టింది అమ్మకడుపులోనైనా-పాలు
       పట్టింది నీ చేతితోనే
       ఊగింది ఊయ్యాలలోనైనా
       నేను దాగింది నీ చల్లని ఒడిలోన
       చల్లని ఒడిలోన"
 అలసిసొలసి నాన్న ఇంటికి రాగానే పిల్లలంతా నాన్న ఒడి
లోకే చేరిపోతారు. నాన్నంటే ఎంత భయం వుంటుందో అంత
ప్రేమ పిల్లలకు వుంటుంది.


మా నాన్నగారు ఆరోజుల్లో బ్యాంకునుంచి ఇంటికి వచ్చేటప్పటికి
చాలా పొద్దుపోయేది. రాత్రి పది గంటలవరకు నాన్నకోసం నిద్ర
ఆపుకొని ఎదురు చూసే వాళ్లం. నెలలో మొదటి వారమైతే ఆయన
మాకోసం తిసుకొని వచ్చే బాల, చందమామలకోసం నేను, అక్క
చెల్లి ఎదురుచూసే వాళ్ళం. మా నాన్నగారికి పుస్తకాలు, పత్రికలు
అంటే చాలా ఇష్టం అమ్మకోసం ఆంధ్రపత్రిక వీక్లీ, గృహలక్ష్మి
(స్త్రీల పత్రిక), తను Illustrated Weekly of India, Sankar's weekly,
Tit-Bits, Reader's Digest  పత్రికలు, Madras Mail దిన పత్రిక ,
ఆదివారం Sunday Stanadard (ఆదివారం ఆ పేరుతో Indian
Express వచ్చేది), ఆంధ్రపత్రిక, ఆంధ్రపభ దినపత్రికలు కొనే
వారు. ఇలా మాకు ఆయన మాకు పుస్తకాల పై అంతులేని
అభిరుచిని పెంచారు.


ఒకసారి స్కూల్లో మా తెలుగు మాస్టారు "మీరు బ్రాహ్మలా?’"
అని అడిగారు. "అవునన్నాను. "వైదీకులా?నియోగులా?"
అని అడిగారు. "తెలియదండీ" అన్నాను.ఆ రోజు రాత్రి నాన్న
గారిని అదే ప్రశ్న అడిగాను. "మనం మనుషులం" అన్నారు,
కొంచెం కోపంగా. నాన్నగారు ఇలాటి విషయాలంటే ఇష్టపడే
వారు కాదు. మాకు ఆదివారం పేపర్లో వచ్చే కామిక్స్ ( బొమ్మల
కధలు ) చదివి చెప్పేవారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు
మా  రాజమండ్రిలో ఉదయం ఆటలు వేసేవారు. మమ్మల్ని
సినిమా మొదట్లో చూపించే కార్టూన్ల సినిమాల కోసం తీసుకుని
వెళ్ళేవారు. కార్టూన్ సినిమాలు వరుసగా బొమ్మలు వేసి ఎలా తీస్తారో
చెప్పేవారు.


ఇలాటి నాన్నలను పిల్లలెలా మర్చిపోగలరు. కానీ ఈ రోజుల్లో
కాలం మారిపోయింది. కొందరు అమ్మలనూ నాన్నలను
వృర్ధాశ్రమాల్లో వుంచుతున్నారు. అందరూ అలా వుంటారని
అననుకానీ వృర్ధాశ్రమంలో వుంచడం ఓ ఫాషనుగా మారిపోయింది.
నాన్నలందరికీ పిల్లలందరీ తరఫున శుభాకాంక్షలు చెబుదాం !!
నాన్నలూ జిందాబాద్ !!


Sunday, 12 May 2013

అమ్మా నీకు వందనం !

       అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు
       తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి
       పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి
       కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను
       తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి
       మాట "అమ్మా!" అనే!

      అమ్మ మీద ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలూ వచ్చాయో!
       శ్రీ సినారె " మనుషులు మట్టిబొమ్మలు " చిత్రానికి వ్రాసిన
       ఈ పాట విన్నారనుకుంటాను.
           అమ్మా అని నోరారా పిలవరా
            ఆ పిలుపే అందరు నోచని వరమురా-వరమురా
          పలుపు తెంచుకొని లేగ దూడ
          పరవశించును"అంబా" అని
          గొంతుపెకలని గువ్వ పిల్ల
          కువకువలాడును "అమ్మా"అని
          ఆ పిలుపే ఈ యిలకే
          కమ్మని మమతల కానుకరా
          దేవకి కడుపున వెలసిన కృష్ణయ్య
          తలచె యశోదను "తల్లి" అని
          ఆ తలపే తన అణువణువు నిండగ
          పిలువలేదా " అమ్మా" అని
          ఆ పిలుపే నిను నడిపే - ఆరని వెలుగుల దీపికరా
          అమ్మా అని నోరారా పిలవరా
          ఆ పిలుపే అందరు నోచని వరమురా

    శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తన సాహితీ సర్వస్వం
     మొదటి భాగం "కధారమణీయం-1"  తొమ్మిది మంది
     తల్లులకు అంకితమిస్తూ ఇలా అంటారు..
          "నన్నుకనిపెంచి
          పెద్ద చేసిన -
           ముళ్లపూడి ఆదిలక్ష్మి
           మహాపతి సూరమ్మ
           కొవ్వలి సత్యావతి
           చల్లా సీతామహాలక్ష్మి
          వీరఘంటం సీతాబాయి
      
          పున్నావఝ్జుల(రేడియో) భానుమతి
          మండలీక సుబ్బులక్ష్మి
          శివలెంక కామాక్షమ్మ
          సత్తిరాజు సూర్యకాంతం
         
          ఈ తొమ్మండుగురు అమ్మలను స్మరిస్తూ"
           జన్మనిచ్చిన అమ్మతోబాటు తనను ప్రేమతో
           ఆదరించిన తల్లులను ఆయన మర్చిపోలేదు.


  మా అమ్మ మట్టెగుంట సీత గారికి సాహిత్యమంటే ఎంతో
 ఇష్టం. తెలుగుపత్రికలన్నీ చదివే వారు. ఆ రోజుల్లో ఆంధ్ర
సచిత్రవారపత్రికలో  ప్రసిద్ధ ఇంగ్లీషు నవలల అనువాదాలు
సీరియల్సుగా వచ్చేవి. వాటిలో మా అమ్మగారికి అలెగ్జాండర్
డ్యూమాస్ రచన కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో అంటే చాలా ఇష్టం
పుస్తకరూపంలో ఆ నవల    రెండు భాగాలుగా వెలువడినప్పుడు
కొని తరచు చదివే వారు. ఆపుస్తకం ఇప్పటికీ అమ్మ గుర్తుగా
నా దగ్గర వుంది. నేటి మాతృదినోత్సవం రోజున అమ్మలందరికీ
పాదాభివందనాలు.

Sunday, 5 May 2013

 నవ్వటం నిజంగా నవ్వులాటకాదు. మన నవ్వు మనల్ని నవ్వులపాలు 
చేయకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా వున్నప్పుడె ఆ నవ్వుకు
విలువ. అందుకే మేము మా హాసంక్లబ్ లో జోకు చెప్పేవాళ్ళకు, ఒక మతాన్ని
కాని, వర్గాన్నికాని  ఉదహరించకుండా జోకులు చెప్పాలని కోరుతుంటాం.
చాలామంది పంజాబీల గురించి జోకులు చెబుతుంటారు. పంజాబీలలో
ఎంతోమంది మేధావులున్నారు. ఇక అమాయకులు, తెలివి తక్కువవారు
అన్ని రకాలమనుషుల్లోనూ వుంటారు కదా!?


నవ్వు సహజమయిన పెయిన్ కిల్లర్ ! బాధానివారిణి. ఇది టెన్షన్ యుగం!
ఆఫీసునుంచో, షాపింగ్ నుంచో మనం ఇంటికి తిరిగి వస్తుంటే ట్రాఫిక్ తో
ఎంతో టెన్షన్. ఇలాటి ఈ స్పీడ్ యుగంలో మనం ఈ టెన్షన్లనుంచి దూరం
అవాలంటే మంచి జోకుల పుస్తకమో, కార్టూన్ పుస్తకమో మంచి రిలీఫ్ !!
మంచి జోకైనా, కార్టూనైనా ఎన్ని సార్లు చదివినా చూసినా, లేకపోతే జ్ఞాపకం
వచ్చినా కొత్తగానే వుంటుంది. మరో విశేషమేమంటే నవ్వాలంటే మన
ముఖంలో  17 కండారాలకు పనికలిగితే అదే చిరాగ్గా కోపంగా వున్నప్పుడు
43 కండరాలు పనిచేయాలి. అటువంటప్పుడు ఆ కండరాలచేత ఓవర్
వర్క్ చేయించడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ నవ్వుల పండుగ రోజే
కాదు ఎప్పుడూ నవ్వుతూనే వుందాం! ఎదుటి మనిషిది ఏ భాషైనా, ఏ దేశం
యైనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం.
నవ్వుకు భాషలేదుకదా. "శాంతి నవ్వుతో ఆరంభమవుతుంది" అన్న మదర్
ధెరిస్సా మాట మీకు గుర్తుండే వుంటుంది. అందుకే మనం సదా నవ్వుదాం!
నవ్విద్దాం! మనసారా నవ్వుకుందాం !
                            "నవ్వేజనా సుఖినో భవంతు" 



Wednesday, 24 April 2013

పుస్తకాలే మంచి నేస్తాలు

              ఈ రోజు ప్రపంచ పుస్తక  ప్రేమికులంతా పుస్తకదినోత్సవాన్ని
జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మన పుస్తకాల చరిత్ర
కధలను మరోసారి నెమరు వేసు కుందాం. కొన్ని వేల ఏళ్లనాటి
నుంచి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు
ఈనాటికీ సజీవంగా వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ముద్రణాసౌకర్యాలు లేని ఆకాలంలో ఒకరి నుంచి ఒకరు నేర్చు
కుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు.

 ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారనీ,  రెండు వేదాలు వల్లె
వేసేవారిని ద్వివేదులనీ, మూడు వేదాలపై పట్టుగల వారిని
త్రివేదులనీ, నాలుగు వేదాల దిట్టలను చతుర్వేదులనీ
వ్య్వహరించే వారు. అట్లాగే పురాణాలను ప్రజలకు తెలియజేసే
వారు ’పురాణం’వారుగా వాడుకలోకి వచ్చారు. అటుతరువాత 
వాటిని లిఖిత రూపంగా రాళ్ళమీద, రాగి రేకుల పైనా, తాళ
పత్రాలమీద, ఆ తరువాత కాగితం కనుగొన్నాక దానిపై అచ్చొత్తి
నిక్షిప్తం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో
డిజిటల్ రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.

 పుస్తక ముద్రణ మొదలయ్యాక ఎందరో మేధావులు, రచయితలు
వెలుగులోకి వచ్చి పాఠకులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ
సాహిత్య సేవ చేస్తున్నారు. వేలాది సంవత్సరాల చరిత్ర, నాగరికత
లోకమంతా వ్యాప్తి చెందడానికి ఈ గ్రంధ ముద్రణ పక్రియ ఎంత
గానో తోడ్పడింది. చరిత్ర ఒకసారి తిరగ వేస్తే అశోక చక్రవర్తి ,
విలియంకారీ లాటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి.
అశోకుడు పాళి లిపిని అభివృర్ధి పరచి భౌధ్ధమత ప్రచారం కోసం
శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్ 
ప్రచారం కోసం తెలుగులో 1746-47 లో జర్మనీలో బ్లాక్స్ (BLOCKS)
సాయంతో అచ్చు వేయటం జరిగింది. 1901లో విలియం కేరీ
కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్ లో అచ్చు యంత్రంలొ కదిలే అచ్చు
అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు. అలా ఆ
అక్షరాలతో చేతితో కంపోజింగ్ మొదలయింది.

 మన వేదాలను, పురాణాలను వావిళ్ల రామస్వామి , వెంకట్రామా&కో,
రామా &కో లాటి సంస్థలు ప్రచురించి సాహిత్య ప్రచారానికి అపార
సేవలు కలిగించాయి. అటుతరువాత రాజమండ్రిలో అద్దేపల్లి వారిచే
సరస్వతీ పవర్ ప్రెస్ ప్రారంభించ బడింది. మేము చదువుకునే
రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్యపుస్తకాలు ఈ ప్రెస్ లోనే
అచ్చయేవి.కొండపల్లి వీర వెంకయ్య & సన్స్ వారు భమిడిపాటి
మొ" ప్రముఖుల హాస్య రచనలు, కధలు ప్రచురించారు. అటు
తరువాత విజయవాడలో విశాలాంధ్ర, నవోదయ, యం.శేషాచలం
& కో సంస్థలు ఎన్నొ రకాల ప్రచురణలు ప్రచురిస్తున్నారు.



తెలుగునాట హాస్య రచయితలకు కొదువలేదు. శ్రీ మొక్కపాటి
నరసింహశాస్త్రిగారి "బారిస్టర్ పార్వతీశం" పాఠకుల వీశేష
ఆదరణ ఈనాటికీ పొందుతూనే వుంది. అలానే శ్రీ ముణిమాణిక్యం
నరసింహారావు గారి కాంతం కధల ద్వారా ప్రశిద్ధి పొందారు.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం "గణపతి" హాస్య రచన రేడియో
నాటకంగా కూడా ప్రశిద్ధి పొందింది. ఇక్కడో విశేష మేమిటంటే
ఈ ప్రముఖ హాస్యరచయితల పేర్లలో "నరసింహ" వుండటం 
 హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు తమ నాటికలు,
రచనల ద్వారా హాస్యాన్ని పండించారు. ఆయన తనయుడు
శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు రాజమండ్రి సిటీ హై స్కూల్లో
మా గురువు గారు. ఆయనచాలా హాస్యనాటికలు రచించారు.
బ్రహ్మచారి, మొ"చిత్రాలకు కధ మాటలు సమకూర్చారు.
1959-60 లలో శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు   " ఇద్దరు
అమ్మాయిలు-ముగ్గురు అబ్బాయిలు","ఋణానందలహరి",
"విక్రమార్కు మార్కు సింహాసనం" "బుడుగు-చిచ్చులపిడుగు"
లాటి ఎన్నో హాస్య రచనలు చేశారు. ఆయన కూర్చిన "నవ్వితే
నవ్వండి-మాకభ్యంతరం లేదు" జోకుల పుస్తకం ఈనాటికీ
పాఠకులకు తనివితీరని పుస్తకంగా నిలిచిపోయింది.


టీవీ సీరియల్స్ వచ్చాక  పుస్తకపఠనం తగ్గిపోయింది. కానీ
ఇటీవల పుస్తకపఠనంపై పాఠకులు శ్రర్ధచూపించడం శుభ
సూచకం. స్నేహితులకూ, ఆత్మీయులకు మనం అనేక
సంధర్బాలలో ఇచ్చే కానుకలకోసం గిఫ్ట్ హౌస్ లకు పరుగు
తీయకుండా ఓ మంచి పుస్తకాన్ని కానుకగా అందించడం
అలవాటు చేసుకోవాలి .
        నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను-అవిప్పుడు
        మీకు పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కనుక.....
        అలానే నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను-
        అవిప్పుడు నాకు ఎక్కడా  దొరకవు కనుక !!
              ఇదే నా పుస్తకాల గురించి నేను చెప్పే సుభాషితం.
నా పుస్తకాల గదిలోకి ఓ దొంగ ప్రవేశిస్తున్నట్లు ప్రముఖ  నా
కార్టూనిస్ట్ మిత్రులు డా" జయదేవ్ బాబు గారు తయారు
చేసిన ఫొటో కార్టూన్.

  • Blogger news

  • Blogroll

  • About