RSS
Facebook
Twitter

Thursday, 21 February 2013

అమ్మ మాట

         మనకు మాటలు నేర్పిన అమ్మే మొదట భాషను నేర్పిన గురువు.
అమ్మ ఏ భాష మాట్లాడితే ఆ భాషే పిల్లలకు వస్తుంది. అందుకే మనం
పలికే భాషనే (మాటనే) మాతృభాష అని వ్యవహరిస్తున్నాం. ఈ రోజే
ప్రపంచమంతా తమ మాతృభాషాదినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది.
ఇటీవలే మన ఘనత వహించిన ప్రభుత్వం  తెనుగు మహాసభలను
అట్ట(కటౌట్లతో) ఏర్పాటుచేశారు. మన ఆంధ్రులకు ఆరంభశూరత్వం
ఎక్కువనే అపవాదు వుంది. అది నిజమవకూడదనే భగవంతుని
ప్రార్ధిద్దాం. ఈ సభలను సార్ధకం చేయాలంటే మన పిల్లలకు అమ్మా,
నాన్నా అని పిలవడం అలవాటు చేయాలి. ఈమధ్యే మా ఆత్మీయుల
ఇంట జరిగిన ఓ శుభకార్యానికి వెళితే అక్కడ అన్ని వయసుల పిల్లల
నోట మమ్మీ, డాడీ అన్న మాటలే వినిపించాయి. యన్టీఆర్ తెలుగు
వాడకాన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రవేశపెడితే మనవాళ్ళే తెలుగు
తెగులు అంటూ వేళాకోలం చేసిన మాట ఇంకా గుర్తుండే వుంటుంది.



ఇతర భాషల వ్యక్తులు కలుసుకుంటే వాళ్ళ మాతృ భాషలోనే ఒకరి
నొకరు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. మరిమనమో
ఇంగ్లీషు తప్ప మాట్లాడం. ఎవరిమీదనైనా కోపం వచ్చినా ఇంగ్లీషులోనే
గట్టిగా అరుస్తాం.వాడు బాబోయ్ వీడు బాగా చదువుకున్నవాడని
భయపడతాడని. మీరు గమనించారా, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా
ప్రతి రెండు తెలుగు పదాలకూ "అండ్","అండ్" అని మధ్యలో అనడం
ఓ ఫాషనైపోయింది. మన తెలుగు భాషకున్న వరం పద్యం. మనకున్న
వేమన, సుమతీ శతకాలు పిల్లలకే కాదు పెద్దలకూ బుద్ధులు నేర్పుతాయి.
పిల్లలచేత అందులోని మంచి పద్యాలు ఒకటి రెండైనా వల్లె వేయించి
ఆప్తులు, మిత్రులు వచ్చినప్పుడు వాళ్ళచేత చెప్పిస్తె, కొత్తవాళ్ళ దగ్గర
స్టేజీలమీదా భయం పోతుంది.   శ్రీ నార్ల చిరంజీవి బాలగేయాలు
"తెలుగు పూలు" పుస్తకం మీరు చదివారనుకుంటాను.అందులోని
గేయాలు ప్రతి తెలుగు పిల్లవాడు తప్పక నేర్చుకోవాలి.
           మధుర మధురమైన మనభాష కంటెను
           చక్కనైన భాష జగతి లేదు
           తల్లిపాల కంటె తనయుల కే పాలు
           బలము నీయగలవు ? తెలుగు బిడ్డ
మన తెలుగు భాషలో నుడికారాలు, చమత్కారాలు మరో భాషలో
లేవు. ఉదాహరణకు "చెప్పు" అన్న మాటకు పాదరక్ష అనీ,  ఏదైనా
విషయాన్ని తెలియజేయమని (చెప్పు) అనే భావం కూడా వుంది..
ఒకసారి మహాకవి శ్రీశ్రీ మద్రాసు నగరంలో మండుటెండలో చెప్పులు
లేకుండా రావటం చూసిన ఓ మిత్రుడు " అదేమిటి ఇంత ఎండలో
చెప్పులు లేకుండా!" అంటే శ్రీశ్రీ " చెప్పుకొనలేనే పరిస్థితి   " అన్నారట!
ఇదే తెలుగుభాషలోని మహత్తు. మన పిల్లలకు "అంకుల్" అని
పిలిచే కుళ్ళుమాట మానిపించి మామయ్యగారూ అనిపిలిచే మంచి
అలవాటును నేర్పిద్దాం!!



0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About