RSS
Facebook
Twitter

Wednesday, 11 May 2011

తోడు నీడగా !!



నేను దాదాపూ నలభై ఐదు ఏళ్లక్రితం ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో
వేసిన గుర్రపు పందేల కార్టూన్ ( అప్పుడు నేను బాపట్ల ఎస్బీఐ లో
పని చేస్తున్నాను) పై మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారు
పెద్ద మనసుతో తన అమూల్యమైన అబిప్రాయాన్ని ఇలా తెలియ
జేశారు.
"సురేఖ గారి రేస్ కార్టూన్ NEW YORKER పత్రికలో చోటు చేసు
కోవలసిన గొప్ప కార్టూన్.అది చూసి స్ఫూర్తి చెంది ఈ కార్టూన్ గీశాను"
అంటూ ఓ చక్కని కార్టూన్ గీసారు. శ్రీ జయదేవ్ గారికి కృతజ్ఞతలు
తెలియజేసుకుంటూ ఆనాటి నా కార్టూన్ , అంతకంటే అద్భుతంగా గీసిన
జయదేవ్ గారి ఈనాటి కార్టూన్ మీ ముందు వుంచుతున్నాను.

Sunday, 8 May 2011

అమ్మమాట

అమ్మ అన్నపదం ఎంతో మధురమైన పదం! అమ్మను తలచు కోవడానికి
ప్రత్యేకంగా ఏడాదికి ఒకరోజును ఎన్నుకోడం మన సాంప్రదాయం కాదు !
అమ్మ ప్రతి క్షణం మన ముందూ వెనుకా వుంటూనే వుంటుంది. మా అమ్మ
ఫొటోలను మీకు ఇక్కడ వరుసగా చూపిస్తున్నాను.



మా అమ్మగారి దగ్గర కంటే నాన్నగారి దగ్గరే మాకు చనువెక్కువ. ఏమంటే
అమ్మ మేము తప్పుగా మాట్లాడినా,(వస్తది,పోతది లాటి మాటలు) విపరీతంగా
కోప్పడెది. ఆమె వల్లే ఎవరైనా పెద్దవాళ్లతో ఎట్లా మాట్లాడాలో, తోటివాళ్లతో ఎలా
స్నేహంగా వుండాలో నేర్చుకున్నాము. ఆదివారం మధ్యాహ్నం రేడియోలో
వచ్చే రేడియో అన్నయ్య, అక్కయ్య పిల్లల కార్యక్రమాలను వినడానికి వచ్చే
పక్కింటి పిల్లలకు ప్రత్యేకించి చేసిన పిండి వంటలను (ముఖ్యంగా మైసూర్
పాక్ ,లడ్డు చేయటంలో అమ్మ స్పెషలిస్ట్) పెట్టేది.

అమ్మకు పుస్తకాలు పత్రికలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆంధ్ర వార పత్రికలో
వచ్చే ప్రఖ్యాత ఇంగ్లీషు నవల అనువాద సీరియల్సు చదివేది. "కౌంట్ ఆఫ్ మాంట్
క్రిష్టో" ( శ్రీ సూరంపూడి సీతారాం అనువాదం) పుస్తకరూపంలో వచ్చాక ఆ నవల
కొని ఎక్కువ సార్లు చదివేది. ఆకధను ప్రక్కింటి స్నేహితులకు (ఇరుగుపొరుగులు)
సంక్షిప్తంగా చెబుతుండేది. ఈనాటికీ అమ్మ కొన్న ఆ నవల నా లైబ్రరీలో అమ్మ
గుర్తుగా పదిలంగా వుంది.

మనసుకవి ఆత్రేయ గారు అమ్మ గురించి ఓ పాటలో ఇట్లా అంటారు...
అమ్మ వంటిది
అంత మంచిది
అమ్మ ఒక్కటే !
అయ్యైనా జేజైనా
అమ్మ పిమ్మటే.........
అమ్మను అనుక్షణం తలుస్తూ మన అమ్మలందరికీ జేజేలు !!

Saturday, 7 May 2011


మనసుకవిగా పేరుపొంది అభిమానుల మనసులు దోచుకున్న ఆత్రేయగారి జయంతి నేడు.
రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని ఆయన గురించి చమత్కరిస్తారు.
ఆయన వ్రాసిన ఎన్నో పాటల చరణాలు వింటే చాలు, ఆ పాటల సాహిత్యం కలకాలం
మన మనసులనుంచి చెరిగిపోవు. అలానే ఆయన సంభాషణలు అందించిన ప్రేమనగర్,
డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు మమతలు, అర్ధాంగి, విచిత్రబంధం,ఆత్మబలం,
చిలిపికృష్ణుడు, పునర్జన్మ, చక్రవాకం, మూగమనసులు ( శ్రీ ముళ్లపూడి వెంకట రమణ
గారితో) మరువలేని కమనీయ చిత్రాలు.
ఆయన వ్రాసిన పాటలలో కొన్నింటిని గుర్తు చేస్తాను. పాటల్లోని పదాలు తేలికగా
అగుపిస్తాయి, కానీ బరువైన భావంతో హృదయాల్ని కదలిస్తాయి ,కరగిస్తాయి.
వద్దురా కన్నయ్యా...వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా..అయ్యా
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్ళే వేళ.... (అర్ధాంగి)
<><><><><><><><>
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
(తోడికోడళ్ళు )
<><><><><><><><>
ఎవరికి ఎవరు కాపలా
బంధాలన్నీ నీకేలా
ఈ బంధాలన్నీ నీకేలా
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదలి తరలే వేళ
మన మనసే మనకు కాపలా.... ( ఇంటికి దీపం ఇల్లాలు )
<><><><><><><><><>
రేపంటి రూపం కంటి-పూవింటి తూపులవంటి
నీ కంటి చూపులు వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి-పూవింటి దొరనే కంటి
నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి.....(మంచీ చెడూ )
<><><><><><><><>
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేమునికొచ్చెను అనుమానం..
మనసులేని ఈ మనిసిని చూసి దేవుడు రాయైపోయాడు
దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు.... (దాగుడుమూతలు)
<><><><><><><><>
మానూ మాకును కాను
రాయి రప్పను కాను
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను....
మణిసి తోటి ఏలాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా
ఇరిగిపోతే అతకదు మల్లా.......... ( మూగమనసులు)
<><><><><><>
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ-నవ్వుతూ సావాలిరా
సచ్చినాక నవ్వలేవురా
ఎందరేడ్చినా బతికిరావురా-తిరిగిరావురా...అందుకే..11నవ్వు11\
(మాయదారి మల్లిగాడు)
ఇలా ఎన్నని చెప్పాలి ఏదని చెప్పాలి? అయినా మనసుండలేక మరి కొన్ని..
పేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం.
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
బుద్ధికి హృదయము లేక
హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ నరలోకం నరకం చేసాడు
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నెలాగైనా
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్ని మంచికని
అనుకోవడమే మనిషి పని.......
ఆహా! ఎంత చక్కటి పద ప్రయోగాలు! ఆత్రేయ చిరంజీవి !!

Thursday, 5 May 2011

స్మృతి కవిత లో నా కవిత


శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్మృతి కవిత పేరిట ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ
ఫౌండేషన్ ( MSSF ) వారు కవితలను పుస్తక రూపంలో నవంబరు
2006 లో ప్రచురించారు.ఆ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి డక్టర్ ఎ.పి.జె
అబ్దుల్ కలాం, లకుమ, డాక్టర్ బూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీమతి
నన్నపనేని రాజకుమారి, డాక్టర్ చిల్లర భవానీదేవి, కానూరి
వెంకటేశ్వర్లు, ఏ.వి.యస్ (సినీ నటుడు ), ఈతకోట సుబ్బారావు,
మొహమ్మద్ ఖాదర్ ఖాన్, డాక్టర్ ఎల్.కె.సుధాకర్,ఇ.రఘు,తనికెళ్ళ
భరణి (ప్రముఖ నటుడు, రచయిత) ,డాక్టర్ శిఖామణి గార్ల కవితల
మధ్య నా కవిత ప్రచురించబడింది !!
అప్పుడప్పుడు స్థానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం
సురేఖార్ట్యూన్లు పేర నేను వ్రాసిన కవితల్లోనుంచి ఎన్నుకొని నాకూ
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లాంటి మహనీయురాలి స్మృతి కవితలో చోటు
ఇచ్చినందుకు ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.
అమరగాన సరస్వతి
గాన సరస్వతి
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి !
నేడు అమృతం సేవించే దేవతలకు
గానామృతం పంచుతున్నది !!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగిలోని తారల తళకులు మసకబారాయి !!
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది !!

Sunday, 1 May 2011


నవ్వుల దినొత్సవం రోజున నేను గీసిన కొన్ని కార్టూన్లు
మీ ముందు వుంచుతున్నాను.
అందరికీ నవ్వుల శుభాకాంక్షలు !!



  • Blogger news

  • Blogroll

  • About