RSS
Facebook
Twitter

Friday, 28 May 2010

మా "హాసం క్లబ్" వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి శుభాకాంక్షలు
ఓ హాసం క్లబ్బూ !
పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి
నవ్వులు గుబాళించే హహహహ ! హమామ్ సబ్బూ !
ను - వ్వొస్తానంటే
న - వ్విస్తానంటే
నేనొద్దాంటానా !

ఆకూవక్కా సున్నంలాగే
జోకూ నేనూ నువ్వూ కలిస్తే
నవ్వుల తాంబూలం !
అది నే వద్దంటానా ?

కాని - ఐతే- నువ్వు మాత్రం హాయిగా నవ్వక పోయావో
భకరా ( అను భమిడిపాటి కామేశ్వరరావు గారు )
పబ్లిగ్గా పగలబడి నవ్వినంతొట్టు

ఆంధ్రుల్లో ఐకమత్యం కాలరెత్తుకున్నంత ఒట్టు
గిరీశం మధుర వాణికి తాళి కట్టినంత ఒట్టు
గంగా కావేరి నదులు
కాశీ రామేస్రాల్లో సరిగంగా స్తానాలు చేసినంత ఒట్టు
శివుడి తలమీద గంగ కూర్చుందని
గౌరి కంటనీరు పెడితే
శివ శివా! గంగ నా శిరసున కాదే !
నీ కళ్లలోనే తిరుగుతోందే చూస్కో
అని శివుడు నవ్వించి నవ్వినంత ఒట్టు
హాసం క్లబ్ ! హాపీబర్త్ డే ! !
---శ్రీ ముళ్లపూడి వెంకట రమణ (చెన్నై)

శ్రీ రమణ గారు నాపై ఎంతో ప్రేమతో , నే కోరిన వెంటనే మా "హాసం క్లబ్" ను
ఆశీర్వదిస్తూ వ్రాసి పంపారు. మీతో ఆ నవ్వుల దీవెనలను పంచుకోవాలనిపించింది.
అన్నట్టు ఈ రోజు నా పుట్టిన రోజు ( మే 28 ) సరిగ్గా ఓ నెల రోజుల తరువాత జూన్
28 న ముళ్లపూడి మా రాజమండ్రి ,ఆల్కాట్ గార్దెన్స్ లోని లూధరన్ హాస్పటల్లో
నవ్వుతూ, నవ్విస్తూ పుట్టారు !! అన్నట్టు మరచే పోయా. ఈ రోజుతో 70 లోకి
అడుగు పెడుతున్న నాకు మతిమరపు సహజమేగా ! ఈ రోజు మహానటుడు ,నటరత్న
యంటీఆర్ జయంతి.. తెలుగువాళ్ళ ఉనికిని దేశానికి చాటిన ఆ మహవ్యక్తి కి తెలుగు
జనాలందరి తరఫున జోహార్లు.


Thursday, 27 May 2010

అప్పు తుచ్చులను అక్షరాలు అక్షరాలా ఖూనీ !!

అచ్చులో అక్షరాల కూర్పులో తప్పులు దొర్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి భావమే
పూర్తిగా మారిపోయి నవ్వూ తెప్పించవచ్చు , కొందరికి కోపం కలిగించవచ్చు. అచ్చయే ముందు
ప్రూఫ్ ను తీసి అందులో తప్పులులను దిద్దేవారు. వాళ్ళని ప్రూఫ్ రీడర్స్ అంటారు. అలాజాగ్రత్తగా
తప్పులను దిద్దినా ఇంకా కొన్ని తప్పులు అలానే ఉండిపోయేవి. అప్పుడు పుస్తకం చివరాఖరున
( చివర అన్నా , ఆఖరున అన్నా ఒకటే , మరి గేటు గుమ్మం లా ,అగ్గినిప్పులా చివరాఖరని తరచు
రచనలలో కనిపిస్తున్నది ! )గతంలో తప్పొప్పులు అంటూచివరి పేజీలో తప్పు దానికెదురుగా ఒప్పు అని
వేసే వారు. ఇప్పుడు కంపొజింగు అంతా కంప్యూటర్ల ద్వారా జరుగుతున్నది కనుక అక్కడే పొరబాట్లు
సరిదిద్దుతున్నారు ఐనా అక్కడక్కడా తప్పులు దొర్లుతూ వినోదాన్ని అందిస్తుంటాయి. మా రాజమండ్రి
లో ఒక స్ధానిక దిన పత్రికలో తరచు అచ్చు తప్పులు వచ్చేవి. పత్రిక మైయిన్ హెడ్డింగ్ క్రింద సంపుటి,
సంచిక ప్రక్క రెండు పేచీలు, వెల పది పెసలు అన్ని చాలా కాలం వరకు అచ్చయేది. మరో సారి వార్తలు
అచ్చేస్తూ , చైర్మన్ చే రంకు స్ధాపన (శంకు స్దాపనకు వచ్చిన ప్రమాదం అని ఈ పాటికి మీరు గ్రహించే
ఉంటారు ).బ్యాంకులో కే.వీ.శాస్త్రి అనే మా కొలీగ్ ఇలాటివి పత్రికల్లో పట్టుకొని మాకు వినొదాన్ని పంచే
వాడు. ఇన్ని చెప్పిన నేనే గత బ్లాగులో ఫేర్లగురించి వ్రాస్తూ చివర వేటూరికి ఘటిస్తూఅనడానికి
బదులు గటిస్తూ అని వ్రాసా. ఆ తప్పుని, ఇంకా నే తెలియకుండా చేసిన అక్షర ఖూనీలను మన్నించమని
కోరుతున్నాను.
అప్పు తుచ్చులతో కొన్ని వాఖ్యాలను శ్రీ ఆరుద్ర "జ్యోతి" మాస పత్రికలో వ్రాసారు. వాటిలో కొన్ని ’చెత్త
గించండి
సత్యం వధ ధర్మంచెర
ఎంతవారలైనా కొంత దాసులే
చల్ మోహనరంగా ! నీకూ నాకూ జోడు కరచెను గదరా
డబ్బిచ్చి మార్కులు వేయించుకున్నవారు చదువు కొన్న వారు
చచ్చుబుడ్డి బాగా వెలగదు
డాక్టర్లు రోగి పర్సు చూసి వైద్యం చేస్తారు.
అక్కరకు రాని చట్టము
లోకులు క్రాకుల వంటి వారు.

Tuesday, 25 May 2010

పేరులో " నేముంది " ?


పేరులో "నేము" ముంది ? !

మన రూపాలు దేశాలు, రాస్ట్రాలు ,పరిసరాలబట్టి వేరు వేరుగా వున్నా మనను గుర్తించడానికి
మనవాళ్ళు పేర్లు పెట్టారు. అంతెందుకు మనుషులకే కాకుండా ,జంతువులకు, పక్షులకు, రక
రకాల వస్తువులకు కూడా వివిధమైన పేర్లుంటాయి. ఇక ఊర్లకు పేర్లుంటాయి. సముద్ర తీరాలు
దగ్గర గల ఊర్లకు విశాఖపట్నం, మచిలీ పట్నం, చెన్నపట్నం లాంటి ప్రత్యేక పేర్లుంటాయి. ఇక
మన దగ్గరకు వస్తే పేర్లను బట్టి కులాలను, వాళ్ళ వృత్తులను పూర్వం గుర్తించేవాళ్ళు. శాస్త్రీ, శర్మ,
గుప్త, శెట్టి, చౌదరి, రాజు, వర్మ, రెడ్డి ఇలా పేర్ల చివర తగిలించుకున్న వాటి వల్ల వాళేవరో తెలిస్తుంది.
కానీ రోజులు మారాయి. మారిన రోజులబట్టి కులాలకు ,మతాలకు ప్రత్యెకత తగ్గింది. పేర్లు కూడా
ఆధునికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామమే. గతంలో తమ పిల్లలకు తప్ప
కుండా తమ తల్లి దండ్రుల పేర్లను పెట్టే ఆనవాయితీ విధిగా పాటింఛేవారు. తమ తల్లిదండ్రులు
జీవించి వుండగానే తమ పిల్లలకు వారి ఫెరు పెట్టడంవల్ల తమ వంశంలో పెద్దల పేర్లు కొన్నితరాల
వరకు గుర్తుండి పోయే వీలు వుంటుంది. ఇప్పుడు అలా పేర్లు పెట్టినా చివరగా ఆ పేర్లకు ఆధునిక
పేర్లను చేర్చడం వల్ల చివరకు పెద్దల పేర్లు మరుగున పడిపోతూనే వున్నాయి. మా ఇద్దరమ్మాయిలకు
మా నాయనమ్మగారిపేరు, అమ్మమ్మ పేర్లతో వెంకట లక్ష్మీ మాధురి, లక్ష్మీ మాధవి అన్న పేర్లు పెట్టినా
వాళ్ళను పూర్తి పేరుతో ఏ నాడూ పిలవలేదు. ఇక ఇంటి పేర్ల విషయానికి వస్తే కొన్ని ఇంటి పేర్లు
వినడానికి కూడా చాలా బాగుంటాయి. మా ఇంటి పేరు " మట్టెగుంట" అయితే స్కూళ్ళల్లో , ఓటర్ల
లిస్టుల్లో " మట్టి గుంట" అనే వ్రాస్తారు. నిజానికి మట్టెగుంట అనే ఊరు ఒంగోలు దగ్గర ఉందట.నేను
విశాఖపట్టణం యస్బీఐ లో పన్జేస్తున్నప్పుడు మా పెద్దామ్మాయి మాధురిని వాళ్ల స్నేహితురాలి
ఇంట్లో మచిలీపట్ట్ణం కి చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అగుపించి మీ ఇంటి ఫెరేమిటని అడిగితే "మట్టెగుంట"
అని చెప్పడానికి ఇష్టపడక ఎంతసేపటికీ చెప్పలేదట. చివరకు ఆ స్నేహితురాలు వాళ్ళ ఇంటి పేరు
మీ ఇంటి పేరే అని చెప్పగానే ఆయన నేను మీ తాతగారికి కజిన్ అవుతాను. ఫెరు చెప్పటానికి సిగ్గు
పడటంవళ్ళ నువ్వేవరో నాకు ఇంతవరకూ తెలియలేదాన్నారు. కొన్ని ఇంటి పేర్లు నిజంగా బాగుంటాయి.
సామవేదం, సంధ్యావందనం, పమిడిఘంటం, ఆవుల, ప్రతివాద భయంకర ఇలా ఎన్నేన్నో! కొన్నిపేర్లు
నేతుల, పచ్చిపులుసు లాటివికూడా వుంటాయి. కొందరి అసలు పేర్లకన్నా వాళ్ళ ఇంటి పేర్లు చెబితేనే
గుర్తుకు వస్తారు. హాస్య నటుడు వెంకటరామయ్య అంటే తెలియదు. అదే రేలంగి అంటె వెంటనే గుర్తుకొస్తుంది.
అలానే అక్కినేని, గుమ్మడి, ఘంటసాల, ఆదుర్తి ,పింగలి మొదలైన ప్రముఖుల పేర్లు వారి ఇంటిపేరుతోనే
గుర్తింపు పొందారు. ఇక కొందరు వాళ్ల పేర్లలోని వి(పొ)డి అక్షరాలతోనే ప్రాచుర్యం పొందారు. .ఉదాహరణకు
సినారే ( సి.నారాయణ రెడ్డి), శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీనివాసరావు) మొదలయిన వారు. ఇక సత్తిరాజు లక్శ్మీనారాయణ
గారు అన్న పేరు కంటే " బాపు" అన్న పేరే అందరి హృదయాల్లో నిలచిపోయింది. అయినా పేర్లలో నేముంది
చెప్పండి ? మన నడవడి , ప్రవర్తనల ద్వారానే మన పేరు కలకాలం నిలచి పోతుంది.
ఆఖరిగా అక్షర శిల్పి " వేటూరి" కి శ్రర్ధాంజలి గటిస్తూ శలవు తీసుకుంటా.

Saturday, 22 May 2010

కడియం నందన వనాలు


మొక్కలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతే కాదు మనకు పండ్లను ,కాయగూరలను అందిస్తాయి.
రకరకాల రంగురంగుల పూలను అందిస్తాయి. వాతావరణము లోకి ఆక్సిజన్ను వదలి కార్బన్ డైయక్సైడ్
ను తీసుకుంటాయి. ఎన్నోరకాల పూలమొక్కలను పెంచే నర్సరీలకు ఆదాయాన్ని, ఎంతో మందికి జీవనో
పాధిని అందిస్తున్నాయి. రాజమండ్రికి సమీపంలో (తూర్పు గోదావరి జిల్లా) కడియం,కడియపులంకలలో
గల నర్సరీలు ఇందుకు నిదర్శనం. అపార్ట్మెంట్ సంస్కృతి మొదలయిన తరువాత ఇంట్లో మొక్కలతో
గార్డెన్ పెంచుకొనే అభిలాష తగ్గిపోయినా ఇంకా మొక్కలను అమితంగా ప్రేమించే వాళ్ళు కుండీలలో
వివిధ మొక్కలను పెంచుకుంటూనే ఉన్నారు.
కడియంలోని నర్సరీలకు ఎంతో చరిత్ర వుంది. మొదట్లో అందరిలాగానే ఇక్కడ కూడా కంది,రాగులు,జొన్న
లాంటి పంటలు వేసేవారు. ఈ పంటలతో లాభాలు అంతగాలేకపోవటం చేత మరో వ్యవసాయ పద్ధతులకోసం
ప్రయత్నించి పూల,పండ్ల మొక్కల సాగును ప్రారంభించారు. సాధారణంగా అన్ని ప్రాంతాలలో అన్ని రకాల
మొక్కలు పెరగవు. కానీ గోదావరి నేల అన్ని రకాలమొక్కలకు అనువుగావుంటుంది. 1950 నుండి నర్సరీ
బాగా అభివృద్ధి చెందటం మొదలయింది. ఒకరిని చూసిమరొకరు ఈ వ్యాపారంలోకి ప్రవేసించారు.. శ్రీ పల్లా వెంకన్న,
శ్రీ గంగుమల్లు సత్యనారాయణ లాంటి ప్రముఖ వ్యాపారులు ఆధునిక పోకడలను అనుసరించి వ్యాపారాన్ని
అభివృద్ధి చేసారు. ఇప్పుడు కడియం, పరిసరాల్లో దాదాపు 600 పైగా నర్సరీ తోటలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో
పెరిగే ఫలానా మొక్క మా గార్డెన్స్ లో దొరుకుతుందని ఇక్కడి నర్సరీ వ్యాపారులు గర్వం గా చెప్పుకొనే స్దాయికి
ఎదిగారు. గులాబి,బంతి, చేమంతి, మల్లె, జాజి, లిల్లి, కనకాంబరం లాంటి పూల మొక్కలనే కాకుండా ఒక్క మందారం
పూలలోనే 500 రకాల మందారాలు ఇక్కడ దొరుకుతాయి. జామ,మామిడి, సపోటా, బత్తాయి, అరటి, దానిమ్మ పండ్ల
మొక్కలే కాకుండా అలంకరణకు ఉపయోగించే సైకస్, క్రిస్టమస్ ట్రీ, యాస్పరేగస్, యుఫోర్బియా,కాక్టస్, అగలోనేమా
మొదలైన 1500 రకాల మొక్కలు లభిస్తాయి. ఇండియాలో ఏ రకం కొత్త మొక్క వచ్చినా అది కడియం నర్సరీలలో
అగుపించాలనేదే ఇక్కడి వ్యాపారుల ధ్యేయం..ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడినుండి మొక్కలు మన రాష్ట్రంలోనే
కాకుండా ఢీల్లీ,గోవా, మధ్యప్రదేష్, మహరాష్ట్ర, బెంగాల్,అస్సాం,రాజస్తాన్ మొదలయిన చోట్లకు కూడా ఎగుమతి అవుతాయి !
ఈ మొక్కలను చాలావరకు స్దానికంగా అభివృధి చేయటమే కాకుండా మరికొన్ని ఇతర చోట్లనుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ
అభివృద్ధి చేయడం మరో ప్రత్యేకత. ఇక్కడి రైతులకు అంతగా చదువు లేక పోయినా ప్రతి మొక్క గురించి క్షుణ్ణంగా తెలుసు.
నోరు తిరగని శాస్త్రీయ నామాలను కూడా టకటకా చెప్పేయగలరు. కడియం నర్సరీలను ప్రతి రోజూ వేలాది మంది వివిధ
ప్రాంతాల ప్రజలు సందర్శిస్తుంటారు.వారిలో విదేశీయులుకూడా ఈ మొక్కలను చూసి రైతుల వ్యాపార ప్రావీణ్యానికి,
ముగ్ధులవుతుంటారు. ఈ సారి సెలవులకు రాజమండ్రి వచ్చినప్పుడు కడియం నర్సరీలను చూడటం మర్చిపోకండి.


Friday, 21 May 2010





రోజులు మారాయి. పూర్వపు రోజుల్లో బాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే బాంకు పనిచేసే
టైములోపలే తీసుకోవాల్సి వచ్చేది. మరిప్పుడో, అర్ఢ రాత్రి, అపరాత్రి మనకు ఇష్టం వచ్చినప్పుడు
డబ్బు తీసుకొవచ్చు.( అదేలెండి ! మన ఖాతాలో బాలన్స్ ఉంటేనే !!). అదేకాదు, మనం ఏ ఊరెల్లినా
అక్కడే డబ్బు తీసుకొనే సదుపాయం వచ్చింది. అదే ఏటీయం.! ఈ యంత్రాన్ని ( ఆటొమేటెడ్ టెల్లర్
మిషన్) జాన్ షెపర్డ్ బారన్ కనిపెట్టాడు. ఓ సారి అత్యవసరంగా బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవాలను
కొంటే బ్యాంకు టైమ్ ఐపోయిందట. బారన్ కు డబ్బును అందజేసే మిషన్ ఉంటే బాగుంటుందనే
ఆలోచన వచ్చింది. 1967 లో మొట్టమొదటి టెల్లర్ మిషను లండనులోని ఒక బ్యాంకు వద్ద ఏర్పాటు
చేశారు. ఒక ప్రత్యేకమైన చెక్కును మిషన్లో ఉంచితే దాని సంకేతక సంఖ్యను సరిపోల్చి నగదును
ఇచ్చేది. తరువాత ప్లాస్టిక్ కార్డులు ప్రవేశించాయి. ఏటీయం లాంటి సదుపాయాన్ని ప్రపంచ ప్రజానీకానికి
అందించిన జాన్ షెపర్డ్ బారన్ గత శని వారం తన 84 ఏట ఉత్తర స్కాట్లాండ్లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు.
* * * * * * * * * * * * * *
మన ఖాతాలో డబ్బులు లేక పోతే ఏటీయం ఏటీయియ్యం అంటుంది !!
* * * * * * * * * * * * * *
ఓ సారి అలనాటి నటుడు వంగర వేంకట సుబ్బయ్య ( మాయాబజార్ సినిమాలో అల్లుతో శర్మ,శాస్త్రీ జంట
గా అగుపించారు ) వేషాలకోసం ప్రయత్నిస్తుంటే ," ఏవియం లో ప్రయత్నించక పొయారా ? అని ఒక మితృడంటే
వంగర " వాళ్ళేమిస్తారయ్యా ! స్టూడియో బయట ’ఏవియ్యం ’ అని పెద్ద బోర్డు పెట్టుకున్నారు కదా !" అని
సహజ ధోరణిలో చమత్కరించారట.
+ + + + + + + + + + + + +


  • Blogger news

  • Blogroll

  • About