RSS
Facebook
Twitter

Tuesday, 2 November 2010

రాజకీయ మాయాజాలం !!



ఉదయాన్నే హడవిడిగా పచ్చా త్రిరంగారావు మా ఇంట్లోకి
స్వీట్ పాకెట్తో అడుగుపెట్టగానే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాను.
" నే నందించే స్వీట్ కోసం మీరు నోరు తెరచి రెడీగా
వున్నారన్నమాట" అన్నాడు త్రిరంగారావు." పచ్చపార్టీ
నీకు కార్పరేటర్ గా సీటిచ్చినా రాత్రికి రాత్రి ఎగస్పార్టీలో
చేరిపోయి ఇలా ప్రత్యక్షమైతే ఆశ్చర్యంతో నోరు తెరిచా,
అంతే" అన్నా.
" ఏమండోయ్! నేనిప్పుడు నా మాతృ,అదే "అమ్మ" పార్టీ
లోకి వచ్చేశా! కార్పెరేటర్ గా అమ్మ దయతో పోటీ చేస్తున్నా"
అన్నాడు, రాబోయే ఎలక్షన్స్ కోసం వానలో వేసిన సిసీ
రోడ్డు నుంచి బయటపడ్డ కంకరరాళ్ళలా పళ్లు బయటపెట్టి
ఇకిలిస్తూ.
" అదేమిటోయ్, ముందు రాత్రి దాకా పచ్చజండా వేసుకొని
తిరిగావు!ఏవిటి సడన్ గా ప్లేట్ మార్చావు". అంటూ శ్రీమతితో
"ఇదిగో మన పచ్చాత్రిరంగారావొచ్చాడు.కాఫీ పట్రా"అన్ననా మాట
నోటినుంచి పూర్తిగా రాకుండానే, "కాఫీనా?! ఎలా చేయమంటారు?
ఆ దిక్కుమాలిన గాస్ నిన్ననే ఐపోయింది.మరో నెల దాకా
కాఫీ,భోజనం మాట ఎత్తకండి. ఇక హోటల్ కారియరే గతి"
అంటూ ఓకేక పెట్టింది. కాఫీ కోసం ఆతృతగా ఎదురుచూసిన
త్రిరంగం టికెట్ దొరకని అభ్యర్ధిలా ముఖం పెట్టి" ఆమాట,గాస్
దొరకని విషయం కాదు, పార్టి మారిన విషయం నిజమే. మందు
సారీ, ముందు రాత్రి అంతా ఆలొచించి పార్టీ మారిపోయానండి’
అన్నాడు.
": నీ అన్యాయం కూలా! రౌడీజం పెరిగిపోయిందనీ,గాస్ కు
ఎన్నడూలేని కొరత వచ్చి పడిందని,దొంగతనాలు, దోపిడీలూ,
రేపులూ కిడ్నాపులూ, త్రాగుబొతుల చిందులూ పెరిగిపోయాయని,
చలికాలంలోనూ చీటికీ మాటికీ చీకట్లో ముంచుతూ దోమల మోతతో
కరెంట్ కోతలనీ గోల పెట్టేవాడివి కదా?!" అన్నా మరోసారి ఆశ్చర్య
పడబోయి, నిలద్దొక్కుకుంటూ.
" అలా ప్రతి సారీ పడకండి సార్! పెద్దవారు అలా పడి ఏ కాలో
విరిగితే, మాకో ఓటు పోగలదు.మీ సందేహాలన్నిటినీ తీరుస్తా.
ఓపికగా వినండి. ఈ కరెంట్ కట్ వల్ల మా ఆవిడ ఆ దిక్కుమాలిన
టివీ ముందు కూర్చొని చండాలపు సీరియల్స్ చూడటం కుదరక
నేనింటికి రాగానే నా ముఖాన ఇంత ముద్ద పడేస్తున్నది.ఇక పట్ట
పగలు జరుగుతున్న దోపిడీలు వల్ల ఎంత మేలో నే చెబితే మీరు
కూడా మా ఇంట్లోకి కూడా ఎప్పుడొస్తారా ఆ దోపిడిదొంగలు అని ఎదురు
చూస్తారు! మొన్న ఆదివారం మధ్యాహ్ణం కరెంట్ ఆనవాయితీగా
పోగానే మేం అలా పెరట్లో చెట్టునీడన కూర్చున్నామా, ఎవడో దర్జాగా
వచ్చి హాల్లోని టీవీని ఠీవిగా ఎత్తుకు చక్కాపోయి ఎంతో మేలు చేశాడు!
దోపిడీలవల్ల ఎంత మేలు జరిగిందో చూశారుగా! ఇక రౌడీజం అంటారా?
అది అమ్మ పార్టీ అంటే గిట్టని వాళ్ళ మాట. ఎక్కడున్నారండీ రౌడీలు.?
అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో దర్జాగా ఎన్నికై పోయారు
కదా పాపం! సెకండ్ షోలంటూ రాత్రుల్లు బలాదూర్ తిరిగే మా అబ్బాయి,
సాయంత్రం షాపింగంటూ ఇల్లు గుల్ల చేస్తున్న మా అమ్మాయి, మా
ఆవిడ వీధి వీధికి వున్న దేవదాసులను చూసి భయపడి బయటకు
వెళ్ళటమే మానేశారు. ఇంటింటికీ ఇరవైనాల్గు గంటలూ నీళ్ళంటే,
వీళ్ళ మొహం అని మీలాటి వాళ్ళంతా ఎగతాలి జేశారు కాని, మొన్నటి
నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల్తో వీధి వీధికి, ఇంటింటికి
రోజుల తరబడి నీళ్ళే నీళ్ళు. కాదన్న వాళ్ళ కళ్ళు పోవా చెప్పండి. అందు
చేత ఇన్ని మేల్లు జరుగుతున్న పార్టీలో నే జేరటం తప్పటారా? పెద్దవారు
మీరే చెప్పండి. ఇలా నే పార్టి మారినందుకు పచ్చపార్టీ వాళ్ళు నా దిష్ఠి
బొమ్మలు తగలపెడుతున్నారట. నే అర్జంటుగా వెళ్ళి వాళ్ళ దిష్ఠి బొమ్మలూ
తగలేయడానికి ఏర్పాట్లు చేయాలి.మరో మాటండి. చెప్పటమే మర్చిపోయా.
మా వాడిచేత "దిష్ఠిబొమ్మల సప్లైకంపెనీ" మొన్నే మొదలెట్టించా.ఒక సీజనంటూ
లేని ఈ వ్యాపారం మహ జోరుగా మీ ఆశీర్వాదబలంతో సాగుతుందని మనవి
చేస్తున్నా" అంటూ నా నోట్లో ఓ స్వీటు కుక్కి బయటికి పరుగుతీశాడు పచ్చా
త్రిరంగారావు.
"ఔరా! అంటూ ఆశ్చర్యపడ్ద నేను మా శ్రీమతి చెయ్యందించి లేపేదాకా
లేవలేకపోయాను.
>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<


తరచు పార్టీలు మారే రాచకీచకులగురించి నే నాడో వ్రాసిన ఈ వ్యంగ్య
కధనం కాగితాలు సర్దుతుంటె దొరికింది. ఎప్పటి కీ నూతనంగా వుండే ఈ
కధనం అందరికీ నచ్చుతుందనే ధైర్యంతో మీ ముందు వుంచుతున్నాను.

Monday, 1 November 2010

నంబర్ల సంబరాలు!!

ఈ రోజు నవంబరు ఒకటి.కదా! సంబరాలు వద్దంటూ
కొందరు హడావిడీ చేస్తున్నారు. ఇవన్నీ మనకెందుకు
గానీ ,ఈ మధ్య తేదీలు గమ్మత్తుగా వస్తున్నాయి! గతనెల
పదో తేదీ ఇలా వచ్చింది10.10.10 !! మరి ఈ రోజు తారీఖు
చూశారుగా ! నాలుగు ఒకట్లు వచ్చాయి.

011110

నేను దాదాపు యాభై ఏళ్లక్రితం ఆంధ్రవారపత్రికలో వేసిన
లెఖ్కల మాష్టారి కార్టూన్ చూడండి.

Sunday, 31 October 2010

నిజ జీవితంలో హాస్యం!!



హాస్యం ఎక్కడినుంచో పుట్టదు. మనం రోజూ చూస్తున్న మన
చుట్టూ వున్న జనం నుంచే పుడుతుంది. మేం బాంకులో
పని చేసే రోజుల్లో బాంకవగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మితృ
లంతా పుష్కర్ ఘాట్ దగ్గర వున్న "పంచవటి" హోటల్లో
కాసేపు గడిపేవాళ్ళం ప్రొప్రయిటర్ విశ్వేశ్వరరావు కూడా
మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పే వారు. అప్పట్లో రాజమండ్రి
పరిసారార్లో ఏ సినిమా షూటింగ్ జరిగినా హిందీ తారలు,
తెలుగు తారలు అక్కడే దిగేవారు. ఒక సారి ఓమితృడు
విశ్వేశ్వరరావుని "ఏమండీ, మీ కస్టమర్లని వాష్ బేసిన్
కడగమని మరీ బోర్డు పెట్టడం ఏం బాగుంది?" అంటూ
అడిగాడు. అలా ఎక్కడ పెట్టామండీ? అన్నాడాయన.
"ఇదుగో చూడండి! ఇక్కడ ఏం బోర్డుందో! "వాష్ బేసిన్"
అంటే కడగమనే కదా, అర్ధం" అనగానే ఆయన విరగబడి
నవ్వాడు. మరో సారి టిఫిన్ చేసి హోటల్ పోర్టికోలో
నిలబడ్డాం. ఎస్సెస్వీ.సుబ్బారావనే మా కొలీగ్ ఫోల్డింగ్
చెయిర్ కొని వెంట తెచ్చుకున్నాడు. కష్టమర్లు తిరుగు
తుండే ఆ బిజీ పోర్టికోలో మధ్యగా దారికి అడ్డంగా తన
కొత్త కుర్చీ వేసుకొని కాలిమీదకాలు వేసుకూర్చున్నాడు.
నేను " అదేమిటి, సుబ్బారావు ,దారిలో కూర్చున్నావు.?
ఎవరైనా చూస్తే బాగుండదు కదా?" అన్నాను. "ఎందుకు
బాగోదు? నా కొత్త కుర్చీ, నా ఇష్టం" అన్నాడు. "ఐతే ఎదురుగా
వున్న ఆ రోడ్డు మీద ఇలా కూర్చోగలవా?" అనగానే "ఎంత
పందెం?" అని కుర్చీ తీసుకొని రోడ్డుకు సెంటర్లో వేసుకొని
కూర్చొని ,కుర్చీ తీసుకు వచ్చి మళ్ళీ వచ్చి పోర్టికోలో
కూర్చున్నాడు ఆ రోడ్డు కూడలి. అటు కోటగుమ్మం వైపు
నుంచి, గోదావరి బండ్ నుంచి పెద్దఆంజనేయస్వామి గుడి
వైపుగా వచ్చే బిజీ దారి. ఇలా ప్రాక్టికల్ జోకులు వేసుకొనే
వాళ్ళం. నేను ఆఫీసర్ అని వాళ్ళు ఎవార్డు స్టాఫ్ అనె తేడా
వుండేది కాదు. ఆ రోజులు అలా హాపీగా బ్యాంకులో గడిచాయి.
అసలు సిసలైన ఓ ప్రాక్టికల్ జోకుతో ముగిస్తా. నన్ను బ్రాంచి
మేనేజర్ గా ప్రొమోట్ చేసి కోనసీమలోని ఓ బ్రాంచికి వేశారు.
బ్రాంచి ఎలా వుంటుందో చూద్దాము రండి అంటూ మా కొలీగ్
కేయస్.వెంకటేశ్వర రావు నన్నో రోజు ఉదయాన్నే స్కూటర్
మీద ఆ ఊరికి తీసుకు వెళ్ళాడు. బ్రాంచికి వెళ్ళి బియమ్
రెసిడెన్స్ బ్రాంచి మీదే కదా అని ఇద్దరం వెళ్ళాము. బియమ్
అబ్బాయి వచ్చి" మీరెవరండీ?"అని అడిగాడు. మా కేయస్
"ఇన్నీస్పేట(రాజమండ్రి లో ఓ బ్రాంచి) నుంచి వచ్చాము "అని
చెప్పమన్నాడు. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి ఏం చెప్పాడో
కాని, వెంటనే మాకు రాచమర్యాదలు ప్రారంభమయ్యాయి.
ఇంట్లోవాళ్ళంతా కంగారుపడటం మాకు తెలుస్తూనే వుంది.
కొద్ది సేపట్లొనే వేడి వేడి టిఫినీలు, కాపీలు వచ్చాయి. తరువాత
ఆ బ్రాంచి మేనేజరుగారు నీట్ గా తయారయి బయటకు వచ్చి
మమ్మల్ని చూసి ఆశ్చర్యపడి, వెంటనే లేచి సర్దుకొని,"మరి మా
అబ్బాయితో అలా చెప్పారేం?" అన్నాడు. "ఏం చెప్పాడండి,మీ
అబ్బాయి" అని ఒకే సారి అడిగాం. " మీరు బాంకు ఇన్సెపెక్టర్సు
అని చెప్పారటగా?" అన్నాడు. అప్పుడు మాకు అర్ధమయింది !
రాచమర్యాదలు అన్నీ ఎందుకు చేశాడో! మేమన్నాం"మీ వాడు
సరిగా విని వుండడు.మేం ఇన్నీస్పేట నుంచి వచ్చాం" అని చెప్పా
మన్నాము.ఆయన మరో సారి ఆశ్చర్యపడ్డాడు!. తరువాత ఆయన
వాళ్ళ అబ్బాయికీ మర్యాద బాగా చేసి వుంటాడని అనుకున్నాం.
ఇది 1983 సంవత్సరం లో జరిగింది.ఇన్నేళ్ళు గడిచినా ఆ
నాటి విషయాన్ని తలచుకొని నేనూ, మా కేయస్ తెగ నవ్వు
కుంటాం!! ఇప్పుడా "పంచవటి"హోటల్ లేదు.ఐనా అటువేపు
వెళ్ళినప్పుడల్లా ఆనాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి.!

Saturday, 30 October 2010

సుందరకాండ సుభాషితాలు







ఒక్కసారిగా సినిమాలనుంచి ఆధ్యాత్మిక విషయాలలోకి
దూకానని అనుకోకండి. రామాయణం ,ముఖ్యంగా సుందర
కాండ చదువుతుంటే ఈ నాటి యువతీయువకులు
తెలుసుకోవలిసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు
ఎన్నో ఎదురుపడతాయి! మా నాన్నగారి చిన్ననాటి
మితృలు శ్రీ శ్రినివాస శిరోమణి గారు రామాయణాన్ని
తేట తెలుగులోకి అనువదించారు. ఆంధ్రపత్రిక దిన
పత్రిక ఆదివారం అనుబంధమ్ లో వారం వారం ధారా
వాహికగా వెలువడేది.తరువాత పుస్తక రూపంలో
అనేక సార్లు ప్రచురించబడింది. నాకు నచ్చిన కొన్ని
సుందరకాండలోని మంచి మాటలను మీ ముందు
వుంచుతున్నాను
<<<<<<<<<<<<<<<<<<<<<


* ఏ పని చేయవలసిన పని, ఆ సమయంలో ఆ పని
చేయకపోయినట్లయితే సత్పురుషులకు కోపం
వస్తుంది.
* ఉపకారికి ప్రత్యుపకారం చేయడము సనాతన ధర్మము.
* ధర్మజ్ఞులకు, ధర్మజిజ్ఞాసువులకు అతిధి ప్రాకృతుడు
అయినప్పిటికిన్నీ పూజార్హుడు.
* హనుమంతునికి ఉన్నట్లు ధైర్యమూ, దూరదృష్ఠి,
మేధస్సూ,కార్యసాధన, సామర్ధ్యమూ ఎవడికి
ఉంటవో, వాడి పనులు ఏవీ చెడవు.
* ఆలోచనలేని దూతలు దేశకాల విరుద్ధముగా
ప్రవర్తిస్తే సూర్యోదయవేళ చీకట్లు పటాపంచలు
అయినట్లు, కాబోతున్న పనులు కూడా నాశనము
అయిపోతవి.
* శుభాశుభ స్థితులలో ఇంద్రియాల ప్రవర్తనకు మనస్సే
కారణము. మనస్సును బట్టే దేహేంద్రియాలు ప్రవర్తిస్తూ
వుంటవి.
* ఉత్సాహమే సర్వశుభాలకూ ఆధారము. ఉత్సాహమే
సర్వకార్యాలకు సాధనము. ఉత్సాహమువల్లే ఏ పని
అయినా సమకూరుతుంది.
* చనిపోవడం వలన (ఆత్మహత్య) అనేక దోషాలు వస్తవి.
జీవించి వుంటే ఎప్పటికైనా శుభాలు సంప్రాప్తము
అవుతవి.
* స్త్రీలకు ఆభరణాలకన్నా ఆభరణమైన వాడు భర్త.
* ప్రవాహములో కొట్టుకుపోయిన నీళ్ళు తిరిగి రావు.
అట్లాగే గడిచిపోయిన యౌవ్వనము తిరిగి రాదు.
*కృతఘ్నులు మాత్రమే స్నేహాన్ని విస్మరిస్తారు.
* బ్రతికి వుంటే నూరు సంవత్సరాలు అయిపోయిన
తరువాతను అయినా సంతోషము అనుభవించ వచ్చును.
* జఠరాగ్ని దీపనము ఎంత వున్నపటికినీ విషము
కలిపిన అన్నము తిని, జీర్ణము చేసుకొని జీవించి
వుండటము అశక్యము.
* కోపము రేగినప్పుడు నిప్పును నీళ్ళతోవలె కోపాన్ని
తన బుద్ధిబలముతో చల్లార్చుకోవలయును.
ఈ రోజు శనివారం.హనుమంతునికి ఎంతో ప్రీతి
పాత్రమైన రోజు. హనుమానుని వేషంలో వున్న
ఈ చిన్న వాడు మా దౌహితృడు చిరంజీవి కౌస్తుభ్
(ముంబాయి).బాపు గారు గీసిన హనుమంతుని బొమ్మలు
Inter Culture Asociates,Thompson,Connecticut,
U.S.A వారి కోసం సంస్కృతి ఇంటర్నేషనల్ ,మద్రాసు
వారు ఇంగ్లీషు,ఫ్రెంచి,శ్పానిష్ భాషలలో ప్రచురించిన
రామాయణం పుస్తకం సౌజన్యంతో. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణ గారు ఈ రామాయణాన్ని తెలుగులో
వ్రాశారు.శ్రీ బాపు అసలు సిసలు తెలుగు చిత్రకళ అయిన
కలంకారీ రీతుల్లో బొమ్మలు వేశారు.


Friday, 29 October 2010




ఒక సారి శ్రీ బాపూగారిని కలిసినప్పుడు మీ కార్టూన్
ఐడియాలు చాలా బాగుంటాయి అని నే నంటే ,"మన
చుట్టూ వున్న జనాల్ని బాగా పరిశీలిస్తే మీకూ ఐడియాలు
అవే వస్తాయి" అన్నారు.
మా ఇంటికి ఎదురుగా డాక్టర్.రాఘవమూర్తిగారి హాస్పటల్
వుంది. గత 35 ఏళ్ళ పైగాఆయన మా కుటుంబ ఆప్త మితృలు.
ఆయన అబ్బాయి డా.కృష్ణ మంచి పీడియాట్రిస్ట్. మాపిల్లలు
ఆయన పిల్లలు స్నేహితులే! డాక్టర్ గారు పేషేంట్లతో
ఎంత బిజీగా వున్నా ఆయన రూమ్ లోకి స్టాఫ్ నన్నువెంటనే
పంపిస్తారు. రకరకాల పేషెంట్లు, వాళ్ళు డాక్టర్ తో మాట్లాడే
తీరు భలే తమాషాగా వుంటుంది! ఇక డాక్టర్ గారు కూడా
వాళ్ళతో జోకులేస్తూ మాట్లాడుతుంటారు. ఇక నాకు ఐడియాలకు
లోటెక్కడ చెప్పండి. ఈ పై కార్టూన్లన్నీ కన్సల్టింగ్ రూమ్ లోంచి
పుట్టినవే!! కొందరు తమ కంప్లైన్ట్స్ ను విచిత్రం గా చెబుతుంటారు.
తలనొప్పి వస్తున్నది అని చెప్పటానికి డాక్టరుగారూ "విపరీతమైన
హెడ్ అటాక్ అండీ"అంటాడు ఒకడు. హార్ట్ పెయిన్ని అటాక్ అంటారు
కాబట్టి తల నొప్పికి కూడా "హెడ్ అటాక్" అని కొత్త మాటను
సృష్టించాడన్న మాట! ఇంకో పేషెంట్ " కుడి వైపు కిడ్నీ వాచిందండీ"
అన్నాడు. స్కాన్ తీయించుకొన్నావా? ఎలా తెలిసింది? అని ఆయన
అడిగితే ఎందుకండీ, బైటకు కనిపిస్తున్నది కదా అని జవాబు.
ఇలా ఎన్నెన్నో! స్కిన్ ఎలర్జీ కీ ఆయింట్మెంట్ రాస్తాననగానే
చొక్కా ఎత్తేసే ఆయనొకడు. వెంటనే"ఆగాగు నే వ్రాస్తానన్నది చీటీ
మీద కొనుక్కొని ఇంటి దగ్గర రాసుకో" అని డాక్టర్ గారు చొక్కా
దింపించేశారు.
మరో మాట మా డాక్టరు గారికి సినిమాలన్నా, పుస్తకాలన్నా
చాలా ఇష్టం. పాత సినిమాల గురించి ఏదడిగినా వాటి వివరాలు
కరెక్ట్ గా చెప్పెస్తారు. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటికి
వచ్చి పజిల్స్, సినిమాల విషయాలు చెబుతూ నాతో గడుపుతారు.
పిల్లంతా దూరంగా వున్నా మేం ఇంత ధైర్యంగా వుండ గలుగు
తున్నామంటె ఆయన స్నేహమే! ఒంట్లో నలతగా వున్నా ఉదయాన్నే
ఆయన్ని చూడగానే మామూలైఫొతాము. మా పిల్లలు కూడా వాళ్ళ
పిల్లలను అక్కడి డాక్టర్ల దగ్గరకు తీసుకొని వెళ్ళినా " అంకుల్" అంటూ
ఫోన్ చేస్తారు. ఆయనకు ఫోన్ చేస్తే త్వరగా తగ్గుతుందని వాళ్ళకో సెంటిమెంట్!
ఆయననవ్వుతూ అంటుంటారు." పూర్వం ,పాముల నర్శయ్య గారని వుండే
వాడు. ఫాము కరిస్తే ఆయనకు ఫోన్ చేస్తే తగ్గిపోయేదట! అలా వుంది
వీళ్ళ నమ్మకం" అని. ఇవండీ ఈ రోజు సరదా డాక్టర్ కార్టూన్ కబుర్లు..

  • Blogger news

  • Blogroll

  • About