RSS
Facebook
Twitter

Tuesday, 2 November 2010

రాజకీయ మాయాజాలం !!



ఉదయాన్నే హడవిడిగా పచ్చా త్రిరంగారావు మా ఇంట్లోకి
స్వీట్ పాకెట్తో అడుగుపెట్టగానే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాను.
" నే నందించే స్వీట్ కోసం మీరు నోరు తెరచి రెడీగా
వున్నారన్నమాట" అన్నాడు త్రిరంగారావు." పచ్చపార్టీ
నీకు కార్పరేటర్ గా సీటిచ్చినా రాత్రికి రాత్రి ఎగస్పార్టీలో
చేరిపోయి ఇలా ప్రత్యక్షమైతే ఆశ్చర్యంతో నోరు తెరిచా,
అంతే" అన్నా.
" ఏమండోయ్! నేనిప్పుడు నా మాతృ,అదే "అమ్మ" పార్టీ
లోకి వచ్చేశా! కార్పెరేటర్ గా అమ్మ దయతో పోటీ చేస్తున్నా"
అన్నాడు, రాబోయే ఎలక్షన్స్ కోసం వానలో వేసిన సిసీ
రోడ్డు నుంచి బయటపడ్డ కంకరరాళ్ళలా పళ్లు బయటపెట్టి
ఇకిలిస్తూ.
" అదేమిటోయ్, ముందు రాత్రి దాకా పచ్చజండా వేసుకొని
తిరిగావు!ఏవిటి సడన్ గా ప్లేట్ మార్చావు". అంటూ శ్రీమతితో
"ఇదిగో మన పచ్చాత్రిరంగారావొచ్చాడు.కాఫీ పట్రా"అన్ననా మాట
నోటినుంచి పూర్తిగా రాకుండానే, "కాఫీనా?! ఎలా చేయమంటారు?
ఆ దిక్కుమాలిన గాస్ నిన్ననే ఐపోయింది.మరో నెల దాకా
కాఫీ,భోజనం మాట ఎత్తకండి. ఇక హోటల్ కారియరే గతి"
అంటూ ఓకేక పెట్టింది. కాఫీ కోసం ఆతృతగా ఎదురుచూసిన
త్రిరంగం టికెట్ దొరకని అభ్యర్ధిలా ముఖం పెట్టి" ఆమాట,గాస్
దొరకని విషయం కాదు, పార్టి మారిన విషయం నిజమే. మందు
సారీ, ముందు రాత్రి అంతా ఆలొచించి పార్టీ మారిపోయానండి’
అన్నాడు.
": నీ అన్యాయం కూలా! రౌడీజం పెరిగిపోయిందనీ,గాస్ కు
ఎన్నడూలేని కొరత వచ్చి పడిందని,దొంగతనాలు, దోపిడీలూ,
రేపులూ కిడ్నాపులూ, త్రాగుబొతుల చిందులూ పెరిగిపోయాయని,
చలికాలంలోనూ చీటికీ మాటికీ చీకట్లో ముంచుతూ దోమల మోతతో
కరెంట్ కోతలనీ గోల పెట్టేవాడివి కదా?!" అన్నా మరోసారి ఆశ్చర్య
పడబోయి, నిలద్దొక్కుకుంటూ.
" అలా ప్రతి సారీ పడకండి సార్! పెద్దవారు అలా పడి ఏ కాలో
విరిగితే, మాకో ఓటు పోగలదు.మీ సందేహాలన్నిటినీ తీరుస్తా.
ఓపికగా వినండి. ఈ కరెంట్ కట్ వల్ల మా ఆవిడ ఆ దిక్కుమాలిన
టివీ ముందు కూర్చొని చండాలపు సీరియల్స్ చూడటం కుదరక
నేనింటికి రాగానే నా ముఖాన ఇంత ముద్ద పడేస్తున్నది.ఇక పట్ట
పగలు జరుగుతున్న దోపిడీలు వల్ల ఎంత మేలో నే చెబితే మీరు
కూడా మా ఇంట్లోకి కూడా ఎప్పుడొస్తారా ఆ దోపిడిదొంగలు అని ఎదురు
చూస్తారు! మొన్న ఆదివారం మధ్యాహ్ణం కరెంట్ ఆనవాయితీగా
పోగానే మేం అలా పెరట్లో చెట్టునీడన కూర్చున్నామా, ఎవడో దర్జాగా
వచ్చి హాల్లోని టీవీని ఠీవిగా ఎత్తుకు చక్కాపోయి ఎంతో మేలు చేశాడు!
దోపిడీలవల్ల ఎంత మేలు జరిగిందో చూశారుగా! ఇక రౌడీజం అంటారా?
అది అమ్మ పార్టీ అంటే గిట్టని వాళ్ళ మాట. ఎక్కడున్నారండీ రౌడీలు.?
అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో దర్జాగా ఎన్నికై పోయారు
కదా పాపం! సెకండ్ షోలంటూ రాత్రుల్లు బలాదూర్ తిరిగే మా అబ్బాయి,
సాయంత్రం షాపింగంటూ ఇల్లు గుల్ల చేస్తున్న మా అమ్మాయి, మా
ఆవిడ వీధి వీధికి వున్న దేవదాసులను చూసి భయపడి బయటకు
వెళ్ళటమే మానేశారు. ఇంటింటికీ ఇరవైనాల్గు గంటలూ నీళ్ళంటే,
వీళ్ళ మొహం అని మీలాటి వాళ్ళంతా ఎగతాలి జేశారు కాని, మొన్నటి
నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల్తో వీధి వీధికి, ఇంటింటికి
రోజుల తరబడి నీళ్ళే నీళ్ళు. కాదన్న వాళ్ళ కళ్ళు పోవా చెప్పండి. అందు
చేత ఇన్ని మేల్లు జరుగుతున్న పార్టీలో నే జేరటం తప్పటారా? పెద్దవారు
మీరే చెప్పండి. ఇలా నే పార్టి మారినందుకు పచ్చపార్టీ వాళ్ళు నా దిష్ఠి
బొమ్మలు తగలపెడుతున్నారట. నే అర్జంటుగా వెళ్ళి వాళ్ళ దిష్ఠి బొమ్మలూ
తగలేయడానికి ఏర్పాట్లు చేయాలి.మరో మాటండి. చెప్పటమే మర్చిపోయా.
మా వాడిచేత "దిష్ఠిబొమ్మల సప్లైకంపెనీ" మొన్నే మొదలెట్టించా.ఒక సీజనంటూ
లేని ఈ వ్యాపారం మహ జోరుగా మీ ఆశీర్వాదబలంతో సాగుతుందని మనవి
చేస్తున్నా" అంటూ నా నోట్లో ఓ స్వీటు కుక్కి బయటికి పరుగుతీశాడు పచ్చా
త్రిరంగారావు.
"ఔరా! అంటూ ఆశ్చర్యపడ్ద నేను మా శ్రీమతి చెయ్యందించి లేపేదాకా
లేవలేకపోయాను.
>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<


తరచు పార్టీలు మారే రాచకీచకులగురించి నే నాడో వ్రాసిన ఈ వ్యంగ్య
కధనం కాగితాలు సర్దుతుంటె దొరికింది. ఎప్పటి కీ నూతనంగా వుండే ఈ
కధనం అందరికీ నచ్చుతుందనే ధైర్యంతో మీ ముందు వుంచుతున్నాను.

1 comment:

  1. బాగుంది.ఇలాంటివి కాలానికి అతీతంగా పనికి వచ్చే సబ్ జెక్ట్ లు

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About