RSS
Facebook
Twitter

Sunday, 14 November 2010

బాలల దినోత్సవం ఈ రొజే!!


నవంబరు పద్నాలుగో తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది బాలల
పండుగ, జవహర్ లాల్ నెహ్రూ !! కాని బాలల కోసం అహర్నిసలూ
కృషి చేసినతెలుగు వ్యక్తులను మన తెలుగు వాళ్ళు ఎంతమంది గుర్తు
చేసుకుంటున్నారు. ఈ నాటి యువతరానికి, వాళ్ళ పిల్లలకు అలాటి
గొప్ప వ్యక్తుల గురించి చెప్పవలసిన భాధ్యత మనందరి పైనా వుంది.
వారే బాలన్నయ్య,బాలక్కయ్యలుగా ఆనాటి బాలల మనసు దోచుకొన్న
శ్రీ న్యాయపతి రాఘవరావు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి. మా చిన్న
తనంలో ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వాళ్ళం. ఆనాడు వచ్చే
పిల్లల కార్యక్రమం కోసం రేడియో ముందుఆతృతగా కూర్చొనేవాళ్ళం. చుట్టు
ప్రక్కల ఇళ్ళల్లోని పిల్లలూ ఠంచనుగా ఆ సమయానికి వచ్చేవారు. వాళ్ళకోసం
మా అమ్మగారు, చేగోడీలు, కారంపూసా రెడీగా వుంచేవారు ఇప్పటికీ పిల్లల
కార్యక్రమం ముందు వచ్చే ఆ పాట నా చెవుల్లో వినిపిస్తూనే వుంటుంది

రారె చిన్ని పిల్లలార
రారె చిట్టి తల్లులార
ఆటపాటలన్ని చేరి
ఆడికూడి పాడుదాం-ఆడుదాం
దాచుకోండి పుస్తకాలు
పాఠములిక చాలు చాలు
చేయి చేయి కలిపి-చెంగు
చెంగున పరుగెత్తుదాము.
ఈ క్షణం విన్నదే మర్చిపోతున్ననాకు దాదాపు అరవైఐదుఏళ్ళనాటి
పాట నాకింకా గుర్తుంది! 1940 లో బాలన్నయ్య,బాలక్కయ్యగార్లు
బాలానందం సంఘం స్థాపించి పిల్లల వినోద, వికాసాలకోసం ఎనలేని
కృషి చేసారు. 1945 లో "బాల" పేరిట తెలుగులో పిల్లలకు మొదటి
మాస పత్రికను ప్రారంభించారు. 1959 వరకు ఆ పత్రిక ప్రచురించ
బడింది. ఏప్రియల్ 2005 లో రచన శాయి గారు నాలుగు వాల్యూములుగా
బాల సంచికలను ప్రచురించారు మద్రాసు నుంచి హైద్రాబాదుకు మారాక
ఈ పుణ్యదంపతులు నారాయణగూడాలోని తమ ఇంటిని బాలానంద
సంఘానికి వ్రాసి ఇచ్చారు. పిల్లలు లేని ఆ దంపతులు భావితరంలోని
పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేసారు మన భాపు,రమణ
గార్ల రచనా వ్యాసంగం "బాల"తోనే మొదలయింది."కోతికొమ్మచ్చి"లో
రమణగారు ఇలా అన్నారు."బాలలోనే బాపు బొమ్మ, నా కధలూ,పద్యాలూ
అచ్చు అయ్యాయి. ఆయన మా ఇద్దర్నీ మౌంట్ రోడ్ లోని హిగిన్బాతమ్స్
బుక్ షాపుకు తీసుకెళ్ళి డ్రాయింగ్ పేపరూ,ఇండియన్ యింకూ,బ్రష్ లూ,
బొమ్మలున్నకధల పుస్తకాలు కొనిపెట్టేవారు" శ్రీ బాలన్నయ్య "అంతా ఒక్కటే
మనమంతా ఒక్కటే" అనే గీతాన్ని రచించారు.

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
తెలంగాణము రాయలసీమయు
కోస్తా ప్రాంతపు తెలుగు దేశము "అంతా"
ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి ఐనా గుజరాతైనా
పంజాబైనా బాంగ్లా ఐనా "అంతా"
భాషలు వేరైనాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్
జాతులు మతములు వేర్వేరైనా
నీతులు అన్నీ ఒకటేనోయ్ "అంతా"
దేశాలన్నీ ఒకటే ఐతే
ద్వేషాలేవీ ఉండవుగా
బాల ప్రపంచం భావి ప్రపంచం
భావి భారత వారసులం "అంతా"
ఈ గీతం ఈ నాటి బాలలకు స్ఫూర్తిదాయకం. బాలల పండుగ రోజున
బాలన్నయ్య,బాలక్కయ్యలకు బాలందరి తర్ఫున నివాళులు.

( శ్రీ బాపు గీసిన పై చిత్రం వాహిని బుక్ట్రస్ట్, హైద్రాబాదు వారి సౌజన్యంతో)

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About