RSS
Facebook
Twitter

Showing posts with label అవి ఇవి. Show all posts
Showing posts with label అవి ఇవి. Show all posts

Thursday, 19 April 2012

నవ్వించే పూతరేకులు

మా తూర్పుగోదావరి ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. ఉలిపిరి (ఉల్లిపొరనే ఉలిపిరి అంటారేమో) కాగితంలా అతిసన్నగా వుండే పూతరేకుల పొరలలో నెయ్యి పంచదార పొడి వేసి మడతలుగా పెడతారు. ఇప్పుడయితే అన్నీ కుక్కర్ వంటలు వచ్చాయిగాని పూర్వం గిన్నెలలోనే అన్నం వండేవారు. గిన్నె పైన మూత పెడితే ఉడుకుతున్నప్పుడు పై మూత ఆవిరికి కదులుతూ గంజి, మూత సందులోంచి వచ్చి గిన్నె అంచులకు తగిలి సన్నని గంజి పొర కాగితంలా తేలేది. దీనికి మూలమే పూత రేకుల తయారీ !

ఇలాటి పూతరేకులనే సుధామ అనే ఆయన హైద్రాబాదులో తయారు చేసి వదిలారు. ఈ పూత రేకుల ప్రత్యేకత ఎన్నిసార్లు మీరూ వీటిని ఆస్వాదించినా అక్షయ పాత్రలా తరిగిపోవు. అసలు పూతరేకుల్లాగే మీ నోట్లో కరిగిపోతూ మీ నోటిలో ( అదేనండి మీ నోరుండేది మీ ముఖారవిందం లోనే కదా) నవ్వులు చిందిస్తుంది. శ్రీ సుధామ కార్టూనిస్టుగా, కాలమిస్టుగా, కధారచయితగా, పదబంధ ప్రహేళికల కూర్పరిగా ( రచన, నవ్య ), సాహితీవేత్తగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. దాదాపు పాతికేళ్ళ వయసులోనే శ్రీ సుధామ 1972 లో "యువ భారతి " సంస్థ ప్రచురించిన "మహతి" లో ఆయన వ్రాసిన "తెలుగు పత్రికలలో కార్టూనులు - జోకులు " రచన ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.

ఆ రచనలో శ్రీ సుధామ ఇలా అంటారు " పత్రిక తిరగేస్తున్నారు. పది పేజీలకో మరింకొన్ని పేజీలకో ఒక్కొక్కసారి అనుకోకుండా మీ పెదవులమీద చిరునవ్వు మెరుస్తుంది. ఒక్కోసారి ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తున్నారు ఆమధుర దరస్మితవదనానికి ప్రేరణ ఏమిటి? కార్టూన్లు, జోకులు..." ఇప్పుడు "పూతరేకులు " పేరిట పాఠకులకు ఆయన తయారు చేసి అందించిన ఈ మధుర వంటకం ప్రతి పొరా (ప్రతి పేజీ) నవ్వుల పసందే. జోకులే కాదు అక్కడక్కడా మనల్ని హి/టింగ్లీషు ( ఈ భాషే వేరు) జీడిపలుకుల్లా పలకిరించి చక్కిలిగింతలు పెట్టిస్తాయ్. ఇంకోచోట S.M.S లు ( సరదా మాటల శైలి) కవ్వింతలు పెట్టిస్తాయి. ఒక చోట ఓ చిన్ని శాంపిలు జోకు :
" మీ పత్రిక రెండు రూపాయలేట కదా బాగా పోతుందా ?"
" ఆ (!... కాని కిలోల్లో "
ఇలా ఎన్నెన్నొ అచ్చ తెలుగు జోకులు. నేడే పూతరేకులు కొని తెచ్చుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి. తీపి పడని వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసు "కొన" వచ్చును.

Monday, 2 April 2012

అనాకారి బాతుపిల్ల



ఈ రోజు ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం. బాలల కోసం దేశవిదేశ రచయితలెందరో ఎన్నో బాలసాహిత్యాలను అందజేశారు. వారిలో హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ ఒకరు. ఆయన వ్రాసిన పుస్తకాలలో జానపదకధలను పిల్లల్కు మరింత దగ్గరగా తీసుకొచ్చాడు. ఆయన రచనలు The Little Mermaid , The Snow Queen, The Ugly Duckling , Tumbelina కధలు బహుళ ప్రాచుర్యం పొందాయి.


The Ugly Duckling అనాకారి బాతు పిల్ల పేరిట 1960 సెప్టెంబరు చందమామలో బాపుగారి బొమ్మలతో ప్రచురించారు . కధ క్లుప్తంగా, ఒక బాతు కాలువ గట్టు ప్రక్కన పొదలోగుడ్లు పెడుతుంది.అందులో ఓ గుడ్డు కాస్త పెద్దదిగా వుంటుంది. గుడ్లు పొదిగాక మిగతా పిల్లలకంటే ఈ పిల్ల కాస్త పెద్దదిగా మిగతా పిల్లల కన్నా తేడాగా వుంటుంది. తల్లి బాతు, పిల్లలు ఈ పిల్లంటే అసహ్యంచుకుంటే బాధపడుతూ మరొచోటికి వెళ్ళిపోతుంది. అందరూ దాన్నిఅనాకారి బాతు అంటూ హేళన చేసేవారు.



ఒకనాడు చెరువులో ఈదుతుంటే పైన ఎగురుతూ పొడవైన అందమైన మెడలతో తెల్లని పక్షులు ఆ చెరువులో దిగుతాయి. "ఎంత అందమైన పక్షులు ! బాతులతో పొడిపించుకొనే కన్నా వీటి చేతిలో చావు మేలు ! అనుకొని ఆ హంసలకు ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళింది. అది వాటిని సమీపించి , "చంపండి" అంటూ తల వంచింది. మరుక్షణమే దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది ఆశ్చర్యపోయింది ! ఎందుకో తెలుసా ? అది కూడా ఆ హంసలాగే అందంగా వుంది. చుట్టుప్రక్కల పిల్లలు దాన్ని చూసి "మరో కొత్త హంస వచ్చింది" అంటూ కేరింతలు కొడుతుంటే ఎంతో ఆనందించింది. అదీ సంక్షిప్తంగా హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ పిల్లలకోసం వ్రాసిన్ ఓ కధ !

( చందమామ Sept 1960 , శ్రీ బాపు సౌజన్యంతో)

Wednesday, 28 March 2012

మధ్య నా బ్లాగు అభిమాని ఒకరు "దాదాపూ ప్రతి రోజూఏదో అడ్దమైన విషయం వ్రాసేవారు, మరిప్పుడు వ్రాయటం లేదు, మీకేం అవలేదు కదా ? " అంటూ కామెంటు పెట్టారు. అందుకు "నాకు బద్ధకం ఎక్కువయి వ్రాయటంలేదు" అని అబద్ధం చెప్పా.నిజానికి అసలు కారణం నేనో వ్యసనంలో చిక్కుకోవడమే. అంతకు ముందు ఇలా కొందరు సిగరెట్లకి , త్రాగుళ్ళకీ ఎందుకు బానిసలవుతారా అని అనుకుంటూ వుండేవాడిని. ఫేసుబుక్కు అనే సోషల్ నెట్ వర్క్ వలలో పడ్డాక కొంత సేపయినా పుస్తకాన్ని చదవలేక పోతున్నాను. సిస్టమ్ ఓపెన్ చేయగానే చూడొద్దు అనుకుంటూనే వదనపుస్తకాన్ని తెరవడం అందులో నేను వుంచిన "దానికి" ( మన ముఖ్యమంత్రి తెలుగులా) ఏమి కామెంట్లు పెట్టారా అని చూడటం, నేనూ ఏదో కామెంట్ వ్రాయడం ఇలా అంతూ పొంతూ లేకుండా గంటలు గంటలు కూర్ఛోవడం అటు తరవాత నడుమునొప్పి , మెడ నొప్పి ! శ్రీమతి ఇదివరలో నేను చిన్న నొప్పి అన్నా కంగారు పడి పెయిన్ బామో రాసేది. మొన్న నొప్పి అంటే "అలా పడుకోండి ! కంప్యూటర్ తెచ్చి నడుం మీద పడేస్తా, దెబ్బకి అన్ని నొప్పులూ వదలి పోతాయి " అన్నది..

ప్రతి చెడు కీ ఓ మంచీ వుంటుంది. ఈ ఫేసుబుక్కు మూలాన నాకు ఎందరో దేశవిదేశాల మితృలు మరింత మంది దగ్గరయ్యారు.. అందులో కొంతమందిని ఇంతవరకూ నేను చూడకపోయినా అత్యంత ఆప్తులయ్యారు. ఇప్పుడు వైజాగు లాంటి ఊరికి వెళితే నన్ను బాబాయిగారూ అంటూ ఆప్యాయంగా పిలిచే జ్యోతిర్మయి లాటి అమ్మాయిలు ఎందరో. అలానే, ఎక్కడో సెటిలయిన పాతకాలం మితృలూ, మా పిల్లల స్నేహితులూ, అమెరికా, కెనడాల్లో వుండే మా మితృల పిల్లలు, ఆహా: ఎందరో ! సజ్జా నరేంద్ర అనే ఫేసుబుక్కు మితృడయితే నా ముఖాన్ని పట్టుకు చెక్కేసి ( అదే నండి చెక్కపై చెక్కి) ఇండియా వచ్చి నప్పుడు నాకు కానుకగా ఇస్తాను అన్నారు. ఆ చెక్కేసిన ముఖాన్ని ఫెసుబుక్కు లోకి ఎక్కించేశారు ! ఇక మా జయదేవ్ గారితొ, మితృలు పుక్కళ్ళరామకృష్ణ , హిందూ కార్టూనిస్టులు శ్రీ సురేంద్ర, శ్రీ కేశవ్ గార్లు రోజూ ముఖాముఖాలే !!


చికాగోలో వుంటూ విజయవాడ వచ్చిన శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారు ఫేసుబుక్కులో పరిచయమైన నన్ను కలవాలని, మధ్యలో ఆయన చిన్న నాడు చదువుకున్న చేబ్రోలు హైస్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అదే స్కూల్లో చదివిన నా శ్రీమతి అక్కగారిని కలసి రాజమండ్రి వెళుతున్నాని అంటే అక్కడమా చెల్లి పద్మ ఇంటికి వెళ్ళమని ఆమె చెబితే, విచిత్రం, ఇంతకీ ఆయన వెళుతున్నది మా ఇంటికే ! ఇక్కడకు వచ్చాక నాతో కంటే మా ఆవిడ, ఆయన తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. అప్పటి వరకు నేను కంప్యూటర్ ముందు కూర్చుంటే సనిగే మా శ్రీమతి యాభైఏళ్ల తరువాత తన చిన్న నాటి స్నేహితున్ని కలిపినందుకు ఫేసుబుక్కును పొగడడం మొదలెట్టింది .ఇక ముంబాయి, చన్నై లోని మా అమ్మాయిలు, అబ్బాయి ఫేసుబుక్కు లోనే కనబడుతున్నారు. ఏమైనా సుధామ గారు, శిష్టా రామచంద్రరావు గారు, జ్యోతి వలబోజు గారు, కంప్యూటర్ యెరా సంపాదకులు శ్రీ నల్లబోతు శ్రీధర్, శ్రీమతి రాజావరం ఉష ఇలా ఎందరమో ఫేసుబుక్కులో బుక్కయిపోయాం !!


Sunday, 17 January 2010

అలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం కూడా ఆశ్చర్య పోయాము. నా దగ్గర ఉన్న పాత కాలపు కీ గ్రామ ఫోను చూసి అబ్బురపడి, అది తిప్పి అందులో పాట వినేంతవరకు వదలలేదు. చివరకు, ఆ గ్రామఫోను సూది వెతికి వెతికి, పదును పెట్టి, పాతకాలపు 78 RPM రికార్డు తిప్పి బాలానందం పాటలు విన్నాము. నేను ఆ రికార్డును మోగించటం తీసాము, అది ఈ కిందే ఉన్నది.

గ్రామఫోను అంటే తెలియని ఈ రోజులలో, కరెంటు అవసరం లేకుండా పూర్తీ యాంత్రిక శక్తితో (గడియారం లాగ కీ ఇస్తే పని చేస్తుంది) నడిచే ఈ వినోద పరికరం తెలియని వారు చూడటానికి ఇక్కడ ఇస్తున్నాను.

  • Blogger news

  • Blogroll

  • About