RSS
Facebook
Twitter

Showing posts with label అనుభూతులు. Show all posts
Showing posts with label అనుభూతులు. Show all posts

Monday, 15 March 2010

నవ్వులు-పువ్వులు




నవ్వు ఆరోగ్యకరం! అందుకే హాస్యబ్రహ్మ శ్రీ జ్యంధ్యాల అన్నారు. నవ్వటం ఓ భోగం! నవ్వలేకఫోవటం ఓ రోగం! ఈ సారి మీరు గుర్థుంచుకొని లెక్కపెట్టి చూడండి. సగటు మానవుడు రోజుకు కనీసం పదిహేడు సార్లయినా నవ్వుతాడట! మనకు నవ్వు దేవుడిచ్చిన వరం. రోజుల పాపాయి కూడా బోసి నవ్వులు నిద్రలో మెలుకవలో వలక బోస్తుంది. అంటే నవ్వు సహజంగా వచ్చిందే కానీ నేర్చుకొన్నది కాదన్నమాట. ఒక్కోసారి మనం ఒంటరిగా ఉన్నప్పుడు బాపూ కార్టూనో, ముళ్లపూడి గారి జోకో గుర్తు కొచ్చిందనుకోండి.మనకు తెలియకుండానే మనకు నవ్వొస్తుంది. ఈ సందర్భంలో మా హాసం మిత్రులు ఖాదర్ ఖాన్ తననుభవం చెప్పారు.ఒక సారి ఆయన బస్సులో వెలుతూ రమణగారి జోకులు జ్ణాపకం వచ్చి తనలో తాను నవ్వు కోవడం మొదలెట్టారట.ప్రక్కన కూర్చొన్న ప్రయాణికుడు ఆయన వైపు చూస్తూ ఏం అనుమానం వచ్చిందో భయం భయంగా సీట్లో నుంచి లేచి దూరంగా వున్న మరో సీట్లోకి మారాడట! తనలో తాను నవ్వుకోడం చూసిన అతడు తనను మెంటల్ కేసేమో నని అనుమానించాడట!! ఇలా మనం చదివినప్పుడు,జ్ణాపకం వచ్చినప్పుడు ఎందుకు నవ్వుతాం? శరీరంలో జరిగే ప్రతి చర్యకు మెదడుతో సంభంధంవుటుంది. ఈ విషయాన్ని విశదీకరించే శాస్తానికి జిలోటాలజీ అని పేరు పెట్టారు. రోట్మన్ రీసెర్చి ఇన్స్టీట్యూట్ చేసిన పరిశోధనలలో మెదడు కుడి భాగంలోని ఫ్రంటాల్ లోబ్ నవ్వుకు కారణమని కనుక్కున్నారట. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్యప్రమైన లాభాలున్నయి. ఎదుటి మనిషిది ఏ భాష ఐనా.ఏ దేశం ఐనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం. నవ్వుకు భాష లేదుకదా? అందుకే మేం ప్రతి నెలా మూడవ ఆదివారం మా హాసం క్లబ్ ద్వారా అందరం అన్ని వయసుల వారం కలుసుకొని నవ్వులు పంచుకుంటాం.

Monday, 18 January 2010





జనవరి 18 వ తేది నందమూరి తారక రామారావు గారి 14 వ వర్ద్హంతి.తెలుగు సినీ పరిశ్రమలో యన్టీఆర్,ఏయన్నార్ ఒకరికి ఒకరు పోటీగా వివిధ పాత్రలలో నటించి తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా ఈ నాటికి పరిశ్రమ చేత ,అశేష ప్రేక్షక అభిమానులచేత ప్రశంసలు పొందారు. శ్రీ రామారావు శ్రి కృష్ణుడు,శ్రీ రాముడి పాత్రల్లో దేముడి రూపం ఇంత సౌందర్యంగా వుంటుందనే భావన ప్రెక్షకుల్లో నిలచిపోయింది.ఇక అక్కినేని మొదట్లో బాలరాజు,కీలుగుర్రం లాంటి ఎన్నో జానపద చిత్రాల్లో,చెంచులక్ష్మి ,మాయాబజార్ లాంటి విజయవంతమైన పౌరాణిక చితాల్లో నటించారు.ఆ రొజుల్లో శ్రీ ముళ్లపూడి తన "నవ్వితే నవ్వండి" లో వీళిద్దరి పై ఈ క్రింది జోక్ వ్రాసారు. పాతాళ భైరవి చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి.అప్పటికింకా ఎన్.టి. రామారావుకు నాగేశ్వర్రావుకున్నంత పేరు రాలేదు.నాగేశ్వర్రావు జానపదాల హీరోగా బాగా పేరు మోశాడు.చితం చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇవతలికి రాగానే " ఆ మొసలి పోరాటం ఉంది చూశావ్? అబ్బ...ఎంత సేపు పోరడాడయ్యా ఆ రామారావు?" అన్నాడు ఒకడు. "అంతేలే.రామారావు కొత్త గదా.అంచేత అరగంట పట్టింది.అదే మన నాగేశ్వర్రావైతేనా- చిటికలో చంపేసి ఊండును" అన్నాడు మితృడు.


ఇక్కడ మీరు చూసే యంటీఆర్,ఏయన్నార్ ఫొటో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక 20-3-1970 (నలభై ఏళ్ళ నాడు) వేసిన ముఖచిత్రం!

Wednesday, 23 December 2009

గోదావరమ్మ పాపి(డి) కొండలు




అందాల పాపికొండలు చూడాలంటే రాజమండ్రి కి దగ్గర లోనున్న పట్టిసీమకు వెళ్ళి అక్కడనుంచి లాంచీలో ప్రయాణం చేయాలి.లాంచీలుకూడా రెండస్తులతో క్రింద మన్ఛి రెస్టారెంట్,టాయ్లెట్ సౌకర్యాలతో వుంటాయి.పట్టిసీమ చేరాక వేరే నావలో వెళ్ళి అక్కడ గల శివాలయం చూడవచ్చు.ఆ గుడిని మీరు "మేఘ సందేశం" సినిమాలో చూసివుంటారు.మహా శివుడు వీరభదృడిగా, మహా విష్ణువు భావనారాయణుని పేరిట క్షేత్రపాలకునిగా అవతరింఛారని చెబుతారు.ఆలయంలో శివలింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది.తిరిగి లాంచి ఎక్కి ప్రయణిస్తుంటే దారిలో ఓ కొండ ఏనుగు ఆకారంలో అగుపిస్తుంది.దాని తరువాత మనకు నందీ శ్వరఆలయం అగుపిస్తుంది."జానకి రాముడు" ఈ గుడి ప్రాంగణంలోనే చిత్రీకరించారట. అలానే గండిపోసమ్మ ఆలయాన్ని చూదవచ్చు.మరికొంత దూరము ప్రయాణించాక దేవీపట్నం పోలీస్ స్టేషన్ వస్తుంది.ఈ పోలీస్ స్టేషన్ పైనే అల్లూరి సీతారామ రాజు దాడి చేసాడు.ఆనాటి పోలీస్ స్టేషన్ ఇప్పుడూ చూడవచ్చు! అటు తరువాత లాంచిని ట్రైబల్ విలేజ్ రిసార్ట్ దగ్గర ఆపి ప్రయాణీకులకు లంచ్ ఏర్పాటు చేస్తారు.ఈ రిసార్ట్ లో రాతృలు గడపాలనుకునే వారికి ఏసి/నాన్ ఏసీ గదులు వున్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణంలో గోదావరి వెడల్పు రాను రాను తగ్గుతుంది.అటూ ఇటూ రెండు కొండల మధ్య నుంచి లాంచి ప్రయాణిస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండుగా వుంటుంది. గోదావరికి ఇరువైపులా సన్నని పాపిడి తీసినట్లు రెండు కొండలు వున్నందున ఈ కొండలకు పాపిడి కొండలని పేరొచ్చింది.చివరికవి జనాల నోట్లో పాపి కొండలుగా మారి పోయాయి. పాపి కొండలు దాటాక పేరంటాఅలపల్లి శివాలయం వుంది.అక్కడి కొండలనుంచి పారే సెలయేర్లలో కాళ్ళు కడుగుకోంటే ఎంతో హాయిగా వుటుంది.శివుణ్ణి దర్శనం చేసుకున్నాక లాంచి తిరిగి రాజమండ్రి వైపు సాగిపోతుంది.పాపికొండల ప్రయాణం ఓ మధురానుభూతిగా మనకు మిగులుతుంది!

Tuesday, 8 December 2009




సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతి
యం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి.
ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితా
సంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ,
డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్
ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడా
చోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితో
పాలుపంచుకుంటున్నాను.




గాన సరస్వతి
యం.యస్.సుబ్బులక్ష్మి!

నేడు అమృతం సేవించే దేవతలకు
గానా అమృతం పంచుతున్నది!!

గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగి లోని తారల తళుకులు మసక బారాయి!!

నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది!!!



**********సురేఖ

Sunday, 29 November 2009

గోదావరి చిత్ర గాన లహరి


అందాల గోదావరికి తెలుగు చిత్ర పరిశ్రమకు మూగమనసులు సినిమాతో అనుబంధం ఏర్పడింది.
బాపు రమణలు ఒకరు ప.గో,మరొకరు తూ.గో జిల్లాలకు చెందిన వారు కాబట్టి తమ సినిమాలను
ఎక్కువగా గోదావరి తీరంలోనే నిర్మించారు.ఐనా తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమా పాటలలో
గోదావరికి సముచిత స్ఠానం ఇచ్చారు.

మొదటి సారి 1952 లో వచ్చిన మరదలు పెళ్ళి లో ఇలా వినిపిస్తుంది. "పిలిచె గోదారొడ్డు,నోరూరించే బందరు లడ్డు" అని శ్రీశ్రీ రచించారు.

తరువాత యన్టీఆర్,జమున నటించిన చిరంజీవులు లో
"నీ ఆశ అడియాస,నీ బ్రతుకు అమవాస...
కన్నులలో గోదారి కలువలే కట్టింది." అంటూ ఆరుద్ర వ్రాసారు.

అలానే పెద్దమనుషులు చిత్రంలో,
"కుక్క తోక పట్టుకొని గోదావరీదితే కోటిపల్లి కాడ తేలేనయా" అని కొసరాజు రచించారు.

ఇక పల్లెటూరు చిత్రంలో,
"కల్లోల గౌతమి,వెల్లువల క్రిష్ణమ్మ,..."అని వేములపల్లి శ్రీకృష్ణ కలం నుంచి వచ్చింది.



విచిత్ర కుటుంబం చిత్రం కోసం సినారే,
"ఆదికవి నన్నయ అవతరించిన నేల
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయనిక్షీరధారలై
జీవకళ లొలుకు గోదావరీ తరంగాల..."అంటూ సాగిపోతుంది రచన!

1963లో కోటిపల్లి,నర్సాపురం రేవుల్లో మూగమనసులు పాటలు,
"గోదారీ గట్టుంది,గట్టు మీద చెట్టుంది",తల్లీ గోదారికీ ఎల్లువస్తే అందం,
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం"

అనుపమ వారి ఉయ్యాల-జంపాల చిత్రం లో ఆరుద్ర గీతం "కొండగాలి తిరిగింది,గుండె వూసులాడింది,
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది" ఎంత మంచి పాట!!

బాపురమణల ముత్యాలముగ్గు లో శేషేంద్రశర్మ రఛన
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బులారా నదిని దోచుకుపోతున్న నావను ఆపండి గుర్తుండేవుంటుంది.


దేవత సిన్మాలో "ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడుతూ వుంటే" పాట రచయిత శ్రీ వేటూరి.

సితార లో"వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం",

ప్రేమించి పెళ్ళాడు లో "ఒయ్యరి గోదారమ్మఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం",

ఆంధ్రకేసరి కోసం ఆరుద్ర రాసిన
"వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా భాసించే రాజమహేంద్రి" గీతం గోదావరి ప్రాసత్యాన్ని,రాజమండ్రి వైభవాన్నివివరిస్తూ
"కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు,వీరేశ లింగ మొకడు మిగిలెను చాలు" కలకాలం నిలిచిపోయే
పాట.


ఇలా తల్లి గోదారి పై ఎన్నెన్నో పాటలు!!

Tuesday, 10 November 2009




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

Monday, 9 November 2009



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

Tuesday, 27 October 2009

పుస్తకాలే మంచి నేస్తాలు



నేను నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను,అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లొ దొరుకుతాయి కాబట్టి, అలానే నా పాత పుస్తకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వను! ఏమంటే అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి అనే నా మాటలు ఛాలా మంది మిత్రులకు కోపంతెప్పిచ్చాయి! అయినా నేను నా మాటకే కట్టుబడి ఉంటున్నాను . అదే మాట పుస్తకప్రియులందరు పాటించాలని నా కోరిక




నేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన ఏడాది) సంపాదించాను. ఒక బ్యాంకు మితృడు మా ఇంట్లో అది చూసి చదివి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు సరికదా నే పేపర్ కోసం అడిగినప్పుడల్లా "ఏమిటి?తాతల్నాటి పేపర్ కోసం గొడవ చేస్తున్నావు, నిన్నటి పేపర్కు ఈ రోజు విలువ లేదు.పాత పేపర్లతో బాటు మా వాళ్ళు అమ్మేసారు, సారీ" అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికి నా పుస్తకం కానీ పత్రికలు కానీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పంటారా?




నా దగ్గర 1914 "ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ ", 1928లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ సెక్స్ ,ఆంధ్రగ్రంధమాల (ఆంధ్రపత్రిక,1951) కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో తెలుగు సూరంపూడి సీతారాం అనువాదం, 1953 నుంచి చందమామలు, 1955 లో వెలువడిన విచిత్రకవలలు సీరియల్ నవల,బాపురమణ గార్ల పుస్తకాలు, ఆర్కేలక్ష్మన్, బాపు, జయదేవ్, ఈనాడు శ్రీధర్, సరసి, రాగతిపండరి కార్టూన్ పుస్తకాలు, 1944 రీడర్స్ డైజస్ట్ (మా నాన్నగారు మొదటి సారికొన్న ఆయన అభిమాన పత్రిక) 1954 ఆంధ్ర వార పత్రిక (దసరా పిల్లల ప్రత్యేక సంచిక,ఇందులో మా చెల్లి కస్తూరి వేసిన "నేను మా సంగీతం మేస్టారు" బొమ్మకు బహుమతి వచ్చింది),బుక్ ఆఫ్ నాలెడ్జ్ పుస్తకాలు ఎన్నో వున్నాయి.



ఎరువువెళ్ళిన పుస్తకం తమాషా: ... అమెరికాలో లొరెజొ బురోస్ 1849లో పార్లమెంట్ సభ్యుడుగా వుండగా ఒక పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకొన్నాడట! ఆయన వారసులు 140 ఏళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని జాగ్రత్త గా లైబ్రరీ కి చేర్చారట! ఎంత మంచి వాళ్ళో!!

Wednesday, 21 October 2009

మంచి మాట



ఉ(త్త)మ సలహాలు

మనము ఇష్టపడి ఏదైనా వస్తువుకొనుక్కొని ఇంటికి వచ్చిన ఏ మిత్రుడికో
చూపించామనుకోండి, "ఆ! ఇది కొన్నావా? మాకు తెలిసినవాళ్ళు ఇదే కొన్నారు.
రెండు రొజుల్లో పాడైపోయింది" అంటూ కామెంట్ చేస్తుంటారు.మనకు వెంటనే
మనసు చివుక్కు మంటుంది. ఒక వేళ కొనేముందు అలాటి సలహాలు (నిజమై
తేనే ) ఇవ్వచ్ఛు కాని ఎంతో ఉత్సాహంగా కొన్న వస్తువు చూపించినప్పుడు
ఇలాటి ఉత్త సలహాలు ఇచ్చే అలవాటు వున్నవాళ్ళు మానుకుంటే మంచిదని
నా అభిప్రాయం.మీరేమంటారు!

Friday, 16 October 2009

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్క్షలు
మీతో చెప్పాల్సింది చాలా వుంది. మళ్ళీ కలుద్దాం!
సురేఖ

Wednesday, 30 September 2009

నమస్సుమాంజలి



గత సంవత్సరం జైన్ సంఘంవాళ్లు నా దగ్గర ఉన్న చందమామ పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేసినప్పటి దృశ్యాలు..



సాహితీమిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు ఎం.వి.అప్పారావు."సురేఖ"పేరుతో 1958 నుండి వివిధ ఆంగ్ల, తెలుగు పత్రికలలో కార్టూన్లు వేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే బాపూ,రమణలకు వీరాభిమానిని. మీకందరికి ఓ పరమరహస్యం చెప్పనా..నాదగ్గర 1953 నుండి చందమామ పత్రికలన్నీ సేకరించి బైండ్ చేయించి ఉన్నాయోచ్. అలాగే బాపూగారు వేసిన కార్టూన్లు సేకరించి సుమారు ఆరు సంపుటాలుగా చేయించుకుని భద్రంగా దాచుకున్నాను. నా ప్రవృత్తి చెప్పాను. వృత్తి చెప్పలేదు కదూ..State Bank of India లో పనిచేసి రిటైరయ్యాను.. మిత్రులు భమిడిపాటి ఫణిబాబుగారి ప్రోత్సాహముతో ఈబ్లాగు ద్వారా ఈ అంతర్జాలంలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను.
  • Blogger news

  • Blogroll

  • About