RSS
Facebook
Twitter

Showing posts with label బాపూ రమణీయం. Show all posts
Showing posts with label బాపూ రమణీయం. Show all posts

Friday, 6 April 2012

సుందరాకాండ బహుసుందరం


వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం హనుమనోట మరోసారి ఈ కాండలో వింటాం. లంకా నగర వర్ణన, మహర్షి వాల్మీకి కన్నులకు కట్టేటట్లు వర్ణించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్టకాలంలో ఎలా ఆలోచించి ధైర్యంతో ముందుకు సాగాలో హనుమ చెబుతారు.


ఈనాటి యువతరానికి ఆనాడే వ్రాసిన మహత్తర మనోవికాస గ్రంధం రామాయణం! " రామాయణం " పుస్తకాన్ని అందంగా శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు రచిస్తే మరింత సుందరంగా బాపుగారు బొమ్మలు గీశారు. ఆ పుస్తకంలోని సుందరకాండ లోని బహుసుందరమైన బొమ్మలు ఈ హనుమజ్జయంతి రోజున మీకోసం, శ్రీబాపుగారికి కృతజ్ఞతలతో. ఈ అందాల బొమ్మల " రామాయణం " నేడే కొనండి. మీ పిల్లలచేత చదివించండి. వాళ్ళకి చదవడం రాకపోతే మీరే చదివి వినిపించండి. మీకూ రాకపోతే వాళ్ళ తాతగారు,బామ్మగార్లచేత చదివి వినిపించండి.




Saturday, 24 December 2011

బాపూ రమణీయం !!




ఈ బాపూరమణీయం రెండు దశాబ్దాలక్రితం నవో (వ్వో)దయ వారు , ఏప్రియల్
1990 లో అచ్చోసి అభిమానులపైకి వదిలారు. యాభైలనాటి సినిమా రివ్యూలు
కార్టూన్లు, కార్ట్యూన్లు, జోకులు, మకతికలు, వగైరా కలిపి పాఠకులను రంజింప
చేసింది అపురూప పుస్తకం. దీని ఖరీదు మామూలు ఎడిషన్ అరవై రూపాయలు,
మేలు ప్రతి ధర ( గట్టి అట్టతో బైండింగు చేసినది) ఎనభైఐదు రూపాయలు. ఆ నాటి
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు వ్రాసిన అద్భుత చనత్కారాల సమీక్షలు,జోకులు,
బాపు గారి కార్ట్యూన్లు,కార్టూన్లు ఎన్నెన్నో!

పుస్తకం వెనుక కవరు పై బాపుగారు, రమణగారు ఇలా వ్రాసారు :
నలభై ఏళ్లనాటి రాతలూ గీతలూ
దులిపి బజార్లో ఆరెయ్యడం
కల్తీలేని అహంకారం
-కొందరు
కాదులే పాపం !-మమకారం
-మరి కొందరు
అలా మాట సవిరించడం
అదోరకం చమత్కారం
-ఇంకొందరు
నిజానికిది ఏకారమో నిర్ణయించే
పాఠకులకి (వాళ్లది
యమ టేస్టు లెండి )
మా నమస్కారం
--బాపు
రమణ
(ప్రమోదూత)



ఇక ఈ బాపురమణీయం పుస్తకం మీద తెలుగు మాస్టారు, అదేనండి
హాస్యనటులు శ్రీ రావి కొండలరావు అవిష్కణ సభలో చేసిన అల్లరి ప్రసంగ
పాఠం సంక్షిప్తంగా మీ కోసం :

సైలెన్స్ ! ఎవడక్కడ నీకు తెలుసా?..బాపూరమణీయము అని పుస్తకం చూశాను.
ఏదో బిల్హణీయము,స్వారోచిషమను సంభవము అన్నట్లుగా,బాపూరమణీయము,
అనగా, ఆ కోవకు చెందిన ప్రబంధమో, గ్రంధమో అనుకున్నాను.తీరా చూస్తే
ఎప్పుడో వచ్చిన సినిమాల మీద సమీక్షలు ఇప్పుడెందుకయ్యా బాబ్జీ !దేనికి?
సైలెన్స్! ఇప్పుడా సమీక్షలు చదివి ఆ సినిమాలు ఎవడు చూస్తాడోయ్! అసలు
చూడ్డానికి అవేవి,ఎక్కడున్నాయి గనక? నిన్న వచ్చిన సినిమాయే నేడుంటం
లేదు-అలాటిది ఎప్పుడో 1950 ఆ ప్రాంతాల వచ్చిన స్నిమాలు ఇప్పుడు ఎక్కడ
వుంటాయి ఆ పాతతరం సినిమా సమీక్షలతో ఓ పెద్ద పుస్తకం! దేనికి? ఏమి
ప్రయోజనం ? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. అన్ని పేజీలు,అంత పుస్తకం
పైగా 60 రూపాయలా? " మేలు ప్రతి 85, ఫిమేలు ప్రతి 60?"అని, అతనెవరూ,
శ్రీ రమణా- శ్రీ రమణ అని అతని చమత్కారం ఒకటి !సైలెన్స్! తన పేరు ముందు
ఎవడైనా శ్రీ పెడతాడో పెట్టడో అని, ముందే తగిలించేసుకున్నాడు."శ్రీ రమణ"అని.
ఇందులో ఓ కధ. "రామారావు రోడ్డుమీద నడుస్తున్నాడు" రామారావు రోడ్డు
మీద నడవక, నా బుర్ర మీద నడుస్తాడ్రా రాస్కేల్!.... ఈ పుస్తకంలో "కార్ట్యూన్లు"
అని వున్నాయి.అదేమిటా మాట? నాకు తెలీకడుగుతున్నాను.కార్టూను, ట్యూను
కలిపిన మాటా? అలా కలిపితే "కార్టూన్ల్యూను" అవాలి.. మరి కార్ట్యూన్ ఏమిటయ్యా-
ఎవడివా తెలివితేటలు?ఐనా ఇంగ్లీషు అనబడే ఆంగ్ల భాషలో,సంధులెక్కడ
వున్నాయోయ్ ! సైలెన్స్! అరవై రూపాయలు పెట్టిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు
దిద్దేవాడే లేకుండా పోయాడు! అన్నీ అలా వదిలేశారు ! "దాఋణం"."హెచ్చెరుక",
"నెస్ట్ పిశ్చర్", "తప్పులో కాలేయడం,"జానపధ బాటసారి","కధాశివబ్రహ్మం",
"రేలంగిరిజ", "కధోచితంగా," ఇలా అక్షరాల తప్పులు కోకొల్లలు! మరోసారి ప్రిటింగ్ గా
వున్నప్పుడైనా ఇవన్నీ దిద్దుకోమను! అతనెవరు-బాపు, కార్టూన్లు అని వేశాడు.అన్నీ
వంకరటింకర బొమ్మలే, అలాటివి నేను మాత్రం వెయ్యలేనా-ఎవడైనా వేస్తాడు-
నీకు శక్తి వున్నప్పుడు "శ్రీరామ పట్టాభిషేకము","దమయంతీ స్వయంవరము" లాటివి
వెయ్యి.ఇవెందుకూ-ఈగీతలబొమ్మలు !ఓ బొమ్మలో ఆ పిల్లెవరో మేకప్ తుడుచు
కుందిట-ముక్కూ,కళ్ళూ పోయాయట! అదెలాగది? ముఖంమీద రంగు పోతుంది
గాని,అవెలా పోతాయి వోయ్ ! మరో బొమ్మలో భార్య "ఏ సినిమాకెళ్ళారూ" అని
అడిగింది. "బుడ్డిమంతుడు" అన్నాడు.అలాంటి ఎక్కడుందోయ్? "బుద్ధిమంతుడు"
అనుకుంటాను!.......ఇలా సరదాగా చేసిన ఆయన ప్రసంగం విని నవ్వుల్లో మునిగారు
అభిమానులంతా!!




బాపూగారు గీసిన నటి గిరిజ చిత్రం...

Thursday, 12 November 2009

కోతి కొమ్మచ్చిలో నేను


నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే బాపు రమణల కోతి కొమ్మచ్సిలో చిన్న మాట చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను.


Saturday, 24 October 2009

బాపూ రమణీయం

బాపు రమణ గార్ల తో నా పరిచయం




నాకు కార్టూన్లను గీయాలనే అభిలాషను,హాస్య రచనలు చదవటం,హాస్యంగా మాట్లాడటం నేర్పింది ఇద్దరు మహానుభావులు! వారు ఒకరేమో శ్రీ లక్ష్మీనారాయణ,మరొకరు శ్రీ వెంకటరమణ.1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో వచ్చిన "బుడుగు-చిచ్చుల పిడుగు" (అప్పుడు నాకు 15 ఏళ్ళు)నా లాంటి అశేష పార్ఠకులను విశేషంగా ఆకర్షించింది.బుడుగు సీరియల్ పూర్తయ్యే వరకు ఛదువరులెవరికీ రచయిత ఎవరో తెలియదు! ముగింపు లో ఇది రాసి పెట్టినవాడి పేరు ముళ్లపూడి వెంకట రమణ, బొమ్మలు వేసినవాడి పేరు బాపు అని వేసారు. ఆ నాటి నుంచే బాపురమణల అభిమానిగా మారి పోయాను. రమణగారి పుస్తకాలన్నీ మా నాన్న గారి చేత కొనిపించుకొనే వాడిని.మా నాన్న గారు కూడా పుస్తకాలను అభిమానించేవారే కావటం నేను చేసుకున్న అదృష్టం! 2005 లో రమణగారి పుట్టిన రోజుకి స్వంతంగా తయారు చేసిన జన్మదిన శుభాకాంక్షలు పంపాను.అందగానే ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చింది.





మా పెద్దమ్మాయి మాధురి అత్తవారివూరు చెన్నై కాబట్టి ఈ సారి వచ్చినప్పుడు కలుస్తానని ఆనందంగా చెప్పాను.అక్టోబర్లో ఆయన ఇంటికి మా అమ్మాయితో కలసి మొదటి సారి వెళ్ళాను. బాపు ,రమణగార్లను అలా ప్రత్యక్క్షంగా కలవడం,నేనేనాడో చేసుకున్న పుణ్యంగా భావించాను.ఆ నాటి నుంచి ప్రతి ఏడాది రెండు సార్లు కల్సి వస్తూనే వున్నాను.మొదటి సారి వెళ్ళినప్పుడు కొద్ది సేపయిన తరువాత బాపుగారు వర్కు చేసుకోవాలని క్రిందకు వెళ్ళారు. నేను శ్రీ రమణ గారి సంతకం ముళ్లపూడి సాహితీ సర్వస్వం పుస్తకం మీద తీసుకుంటూ "బాపు గారి సంతకం తీసుకోవటం మరచిపోయా" అని అనగానే పుస్తకం తీసుకొని అచ్చు బాపు గారిలా సంతకం చేసి క్రింద బ్రాకెట్ లో 'ఆధరైజ్డ్ ఫోర్జరీ' అని వ్రాయటం కొసమెరుపు!! కొంచెం పేరు రాగానే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళనే ఏదో కొత్త ముఖాన్ని ఛూస్తున్నట్లు ప్రవర్తించే ఈరోజుల్లో బాపు రమణ లాంటి మంచి మనసున్న మనుషులున్నందుకు ఆ భగవానునికి నమోవాకాలు. వారి తో నా మరికొన్ని అనుభూతులు మరోసారి!!
  • Blogger news

  • Blogroll

  • About