RSS
Facebook
Twitter

Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Friday, 13 April 2012

మన తెలుగులో వున్న మరో విచిత్రమేమంటే మాటలకూ అర్ధాలు మరోలా ఒక్కోసారి మారిపోతుంటాయి. "చిన్నతనం" అన్న మాట చూడండి. దానికి "అవమానం" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు. మా చిన్నతనానికి, ఇప్పటి కాలానికి ఎన్నెన్నో మార్పులొచ్చాయి. ఆనాటి విషయాలు, ఆనాడు మేము తొడుక్కున్న బట్టలు ఈ కాలం పిల్లలకు వేసుకోడానికే చిన్నతనంగా వుంటాయి. ఇక్కడి మా చిన్నప్పటి ఫొటొ చూడండి. నాపాంటు ఎలా వున్నా వేసుకున్న షర్టు మాత్రం పొడుగ్గా, చొక్కా చేతులేమో మోచేతుల దాకా వుంది. ఇప్పుడు చూస్తుంటే నిజంగా నాకు చిన్నతనంగానే వుంది. మా చెన్నై మనవడు చి"నృపేష్ " తాతా! ఆ షర్టు అంత పొడుగ్గా కుట్టించుకున్నావేం ? " అన్నాడు !ఇక మా చెల్లి కస్తూరి గౌను కన్నా లోపల వేసుకున్న డ్రాయరే పొడుగ్గావుంది!ఇక మా అక్కయ్య సరోజిని లంగా మీద గౌనేసుకుంది !! ఏమో మాచిన్నతనంలో అలా బట్టలేసుకోడానికి మాకేమాత్రం చిన్నతనం అనిపించలేదు.
ఇక్కడ మా ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువులో మా అక్కయ్య ఇద్దరు అబ్బాయిలూ,చెల్లి అమ్మాయిలూ, మా ఇద్దరు అమ్మాయిలు మాధురి, మాధవి, అబ్బాయి కృష్ణ సాయి వున్నారు. వాళ్ల డ్రెస్సులు చూశారుగా. ఆ రోజుల్లో పిల్లలందరికీ ఒకేరకం బట్టలు కుట్టించేవారు. ఈ రోజుల్లో అలా కాదు. వాళ్ళకు నచ్చకపొతే అవి ఎంతటి ఖరీదుపెట్టి మనం కొన్నా వేసుకోరు. మా చిన్నతనంలో నిక్కర్లు , అవి జారిపోకుండా క్రాసుగా భుజాలమీదికి గుడ్ద స్ట్రాపులూ. మా రోజుల్లో ఇలా ఇన్నిరకాల షూలూ లేవు, షాపులూ లేవు. రాజమండ్రిలో ఆ రోజుల్లో బాటా , ఫ్లెక్స్ షూ షాపులు మాత్రమే వుండేవి. బ్రౌను కాన్వాస్ లేస్ షూస్ వేసుకుంటే చాలా గొప్పగా ఫీలయ్యే వాళ్లం ! స్కూలు జీవితం కూడా బాగా వుండేది. క్వార్టర్లీ ,హాఫ్ ఇయర్లీ పరీక్షలు అవగానే సెలవులిచ్చేవారు. హాయిగా సెలవులను మామయ్య ఊరికీ, అమ్మా నాన్నల్తో వేళ్ళేవాళ్లం!



ఇప్పటిలా టీవీలు , కార్టూన్ నెట్ వర్కులు లేవు. కాలక్షేపానికి చందమామ, బాలపత్రికలలో నెల నెలా కధలు చదువుకొనే వాళ్లం. ఆదివారం రేడియోలో బాలన్నయ్య, బాలక్కయ్యల బాలానందం ప్రోగ్రాములు ఆసక్తిగా వినే వాళ్ళం. మిక్కీమౌస్ లాటి కార్టూన్లు నాన్నగారితో ఆదివారం ఇంగ్లీషు సినిమాలకు మార్నింగ్ షోలకు వెళ్ళినప్పుడు అసలు సినిమాకు ముందు చూపించినప్పుడు ఓ పదినిముషాలు చూసి ఆనందించేవాళ్లం. ఇప్పటిలా ప్రతి వాళ్లనీ అంకుల్ , ఆంటీ అని పిలవటం మాకు తెలియదు. నాన్న, అమ్మ స్నేహితుల్ని మామయ్యగారూ, అత్తయ్యగారూ అని పిలిచే వాళ్ళం .1950లో మొదటి సారిగా నాన్నగారు STEWART WARNER అనే రేడియో కొన్నారు. ఇంట్లో వున్న హెచ్యమ్వీ గ్రామఫోను అమ్మేస్తుంటే నేను ఏడ్చి గోలపెడుతుంటే, నాకు ఇంకా బాగా గుర్తు అక్కయ్య "రేడియోలో మంచి పాటలు, పిల్లల పోగ్రాములూ వస్తాయిరా " అని చెప్పి ఓదార్చింది.


ఆరోజుల్లో ప్రతి ఆదివారం రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం పేరిట సినిమాలు వచ్చేవి. ఈ ప్రొగ్రాములు తెలుసుకోవడానికి ఆకాశవాణి వారి "వాణి " అనే పక్షపత్రిక వచ్చేది. నేను కాలేజీలో చదివే రోజుల్లోనే మా నాన్నగారితో చెప్పి తిరిగి గ్రామఫోను కొనుక్కున్నాను. ఉద్యోగంలో చేరాక ఫిలిప్స్ స్టీరియో రికార్డు ప్లేయరు కొన్నాను. నాకు ఇప్పటికీ గ్రామఫోన్ రికార్డులు వినటమంటేనే చాలా ఇష్టం. ఎన్నేనా చెప్పండి ! ఇప్పటిలా టీవీలు, కంప్యూటర్లు,డిజిటల్ కమేరాలు మా కాలంలో లేకపోవచ్చు. ఐనా నాకు మాచిన్ననాటి రోజులే బాగున్నాయ్ అని చెప్పటానికి నా కేమాత్రం చిన్నతనంగా లేదు. బాపుగారు "చిన్న.నాటి రోజులు మళ్ళీరావురా" అంటూ ఎంత చక్కటి కార్టూనేశారో చూడండి ( బాపు కార్టూన్లు సంపుటి-1 ,పేజీ 103 సౌజన్యంతో)

Tuesday, 27 March 2012

"పన్" డుగ-పంచాంగం

ఉగాది పండుగంటే పంచాంగాల పండుగ. ప్రతి వాళ్ళూ కొత్త పంచాంగం ఇంటికి తెచ్చుకుంటారు. ఈ మధ్య టివీ వార్తల్లో ఈ పంచాంగం మీద మహిళా సంఘాల వాళ్ళు ఆడవాళ్ల గురించి ఏవేవో వ్రాసారంటూ పెద్ద గొడవ చేశారు. ఇంకేం టీవీ న్యూస్ చానళ్ళ వారికి పండగే పండగ. టీవీల్లో ఓ నలుగురిని పిలిచి దీని మీద వాదోపవాదాలు ! చివరికి అది అచ్చ తెలుగులొ విపులంగా వ్రాసిన పంచాంగకర్త ఈ ఏడాది నా జాతకం బాలేదు. ఈ ఏడాదంతా దూరంగా వుంటాను బాబోయ్ అని చేతులెత్తేశాడు. ఐనా అందులో ఏదో రాశారని ఇంత గొడవ చేయకబోతే అసలు ఈ విషయం ఎవరికీ తెలిసేదే కాదు. ఎంత మంది అమ్మాయిలు పంచాంగాన్ని చదువుతారు. టీవీల్లో వచ్చే సీరియల్స్ లో ఆడవారిని పక్కా విలన్లుగా చూపిస్తే ఈ మహిళా సంఘాలవాళ్ళు నోరేళ్లబెట్టుకొని చూస్తారు. సినిమాలలో ఆడవాళ్లని ఎంత అసభ్యంగా చూపించినా , బూతు మా(పా)టలాడినా తప్పులేదు!



మా చిన్నతనంలో గుప్తావారి పంచాంగం అని పేద్ద లావుపాటి పంచాంగం వచ్చేది.అందులో శృంగార ప్రకటనలు, స్త్రీ వశీకరణకు మార్గాలు, సూత్రాలు వగైరా వుండేవి. ఆనాటి వాటితో పోల్చితే ఇప్పటి పంచాంగాలలో వున్నది అతి తక్కువ.పంచాంగమంటే గుర్తుకొచ్చింది. 1963 లో బాపు రమణల బృందం వారి "జ్యొతి" మాస పత్రికతో ఓ నవ్వుల "పన్"చాంగాన్ని ఏప్రిల్ సంచికతో విడుదల చేసింది. ఆ పంచాంగం వినోద భరితంగా తమాషా ప్రకటనలతో సహా నవ్వులు కురిపించింది.ఆ పంచాంగం ఇలా వుంటుంది!


వినోదమస్తు! వినోదమస్తు!! వినోదమస్తు
శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ జ్యోతీ పన్చాంగమ్
యంబ్రహ్మశ్రీ శ్రీమజ్జోక్కుల వినోదాచార్య సిద్ధాన్తిన : అద్వితీయ పుత్రేణ
వికటానందశాస్త్రిణా ప్రణీతమ్


ఇక ప్రకటనలు నవ్వులు కురిపించి మీపొట్టలుచెక్కలవుతాయి. అటు తరువాత నవ్వులచెక్కల్తో మీరు మీ ఇంటికి తలుపులూ గట్రా చేయించుకుంటే తలుపులు తీసినప్పుడల్లా "హాహాహీహీహొహొ " అంటూ చప్పుడు చేస్తుంటాయి. మాయాస్పెషల్ ఉంగరం ప్రకటనలో ( ఇప్పుడు టీవీల్లో వచ్చే తాయెత్తుల ప్రకటనలలా) ఉంగరాన్నిచేతికి పెట్టుకొని తలకు మందు రాసుకున్నచో తలనొప్పి పోతుందని చెబుతారు.అలా అద్భుత గారడీ సిద్ధ కళ్ళద్దాల ప్రకటన నవ్విస్తుంది. నవ్వేజనాసుఖినోభవతు ! స్వస్తి.



Saturday, 13 March 2010

రాజకీయ కార్టూనిస్టులలో శ్రీ శంకర్ ను ఆయన 1948 లో ప్రారంభించిన "శంకర్స్ వీక్లీ" ని
ఎన్నటికీ మరచిపోలేము.ఆయన తరువాత అంతటి ప్రాచూర్యం పొందినది శ్రీ ఆర్కే.లక్ష్మణ్,ఇక
మన తెలుగు లో ఈనాడు శ్రీధర్ గార్లే!.

శ్రీ శంకర్ పూర్తి పేరు కేశవ శంకర పిళ్ళై.1902,జూలై 31న కేరళలోని ఓ పల్లెటూరిలో
జన్మించారు.చిన్న నాటి నుంచి చిత్ర కళ పై ఆసక్తి తో బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్
లో జేరుదామనుకొంటే కనీస అర్హత లేదని ఆయన అభ్యర్ధనను త్రోసిపుచ్చారు.తరువాత మన
బాపు గారిలా లా చదివి ఓ షిప్పింగ్ కంపెని లో ఉద్యోగం చేసారు.చిత్రకళ పై గల ప్రేమతొ
ఉద్యోగం వదలి బాంబే క్రానికల్, ఫ్రీ ప్రెస్ జర్నల్ లలో కార్టూనిస్ట్ గా పరిచయమయ్యారు.

1931లో హిందూస్తాన్ టైమ్స్ లో ప్రతి దినం కార్టూన్లేయడం ప్రారంభించారు.అతని కార్టూన్లు ప్రతి చోటా
చర్చనీయాంసంగా వుండేవి.సాధారణంగా కార్టూనిస్ట్ కార్టున్ చూసి ఎడిటర్ అనుమతి పొందాకే
ప్రచురించబడుతుంది.కాని,శంకర్ విషయంలో ఆ నియమం ఉండేది కాదట.అదే ఆయన ప్రత్యేకత!
1941 హిందూస్తాన్ టైమ్స్ లో శంకర్ అప్పటి భారత దేశ వైస్రాయి లార్డ్విన్విత్గో కాళికాదేవి లా
పుర్రెలు మెళ్ళోవేసుకొని స్మశానంలో కరాళ నృత్యం చేస్తున్నట్లు బొమ్మ వేసారు. ఊదయాన్నే ఆ
బొమ్మ చూసిన ఎడిటర్ బ్రిటిష్ ప్రభుత్వం తన పత్రికను నిషేధించడం తప్పదనుకున్నాడట.అనుకున్నట్లు
గానే వైస్రాయి ఆఫీసు నుంచి మీ కార్టూనిస్ట్ ను మా ఆఫీస్ కు పంపించండి అంటూ ఫోనొచ్చింది.
భయపడూతూ శంకర్ వైస్రాయి గదిలోకి అడుగుపెట్టాడు.వైస్రాయి లార్డ్ విన్త్ గో తన సీటులోంచి లేఛి
కరచాలనంచేసి" నీ కార్టూన్ అద్భుతంగా వుంది.కీప్ ఇట్ అప్.ఆ కార్టూన్ ఒరిజినల్ నాకివ్వగలవా?,
దాచుకొంటాను"అన్నాడట.అలా తన కార్టూన్లను భారతీయ నాయకుల్లో అభిమానించినది,గాంధీ,నెహృలని
శంకర్ అనేవారు.


1948 లో "శంకర్స్ వీక్లీ"ని ప్రారంభించి నప్పుడు నెహౄ "నా మీద కూడా నువ్వు
కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా"అని నెహౄ కోరారట.నా చిన్న
తనంలో మా నాన్న గారు "శంకర్స్ వీక్లీ" తేగానే ముందుగా మధ్య పేజీలని ఆత్రంగా చూసేవాళ్ళం.
ఆ పేజీలో గాదిదల తలలతో ఆడ,మగ మనుషుల బొమ్మలతో కార్టూన్లుండేవి!నా కార్టూన్లు చూసి
నవ్వుకోవాలి,అందులోని వ్యక్తులైనా సరే అనే వారటశంకర్. ప్రతి ఏడాది నవంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు చిత్రకళా పోటీలు ఏర్పాటు చెశేవారు.ఢిల్లీలో ప్రపంచ దేశాల్లోని పిల్లల బొమ్మలు సేకరించి మ్యూజియం ఏర్పాటు చేసారు శ్రీ శంకర్.


ఓ పత్రికలో ఆయన ఫొటో చూసి నా మిడి మిడి జ్ఞానంతో బొమ్మ గీయడానికి ప్రయత్నీంచా!
శంకర్ గారి కొన్ని కార్టూన్లు మీ కోసం.చివరిగా ఓ విన్నపం.మన బ్లాగర్ మితృలెవరి దగ్గరైనా
"శంకర్శ్ వీక్లీ" కాపీలుంటే జిరాక్స్ కాపీ పంపించ గలరా! దానికి అయ్యే కర్సులు అవీ తరువాత
చూసుకోందారండి.



Tuesday, 2 March 2010



1975 ఎమర్జన్సీ రోజులు.ఆ చీకటి రోజుల్లో హాస్యమేమిటా అని తిట్టుకోకండి. ఆప్పుడు
పుట్టని వాళ్ళకి ఆ ఎమర్జన్సీ విషయాలు తెలియక పోవచ్చు. శంకర్శ్ వీక్లీ లాంటి మంచి
కార్టూన్ పత్రిక ను శ్రీ శంకర్ నిరశనగా ఆపివేశారు. సరే అసలు కధకు వద్దాం! ఎమర్జన్సీ
పేరు చెప్పి మా రాజమండ్రికి ఒక మంచి జరిగింది.ఆ మంచి పని మైన్ రోడ్డు వెడల్పు
చేయడం. మా మితృడు కాంతీలాల్ జైన్ కు మైన్ రోడ్డు కు ప్రక్క నున్న నల్లమందు సందు
అనే పేరుగల వీధిలో షాపు వుంది.అక్కడ నల్ల మందు అమ్మరుగాని,అలా ఆ పేరు ఎందుకు
వచ్చిందో మరోసారి చెప్పుకుందాం గాని ఆ వీధిలో ఫాన్సీ షాపులు మన వాళ్ళవి,జైన్ మితృలువి
చాలా ఉన్నాయి.అంతా హోల్సేల్ వ్యాపారం. మైన్రోడ్డు కొట్టేయడానికి మార్కింగ్ చేసినప్పుడల్లా
కాంతీలాల్ మా బ్యాంక్ కు ఫోన్ చేసి " స్పెషల్ న్యూస్, ఈ రోజు ఫలానా కొట్టుకు మార్కింగ్
పెట్టారు.ఇంటికి వెళ్ళేడప్పుడు రండి" చెప్పేవాడు. నాకు బాధ కలిగించిన విషయమేమిటంటే నేను
అభిమానించే మాగజైన్స్ షాపు పూర్తిగా ఆ విస్తరణలో పోయింది.తరువాత ఆ షాపు అక్కడనుండి
గోదావరి బండుకు వెళ్ళే దారిలో పెద్ద ఆంజనేయస్వామి గుడికి ఎదురుగా మార్ఛారు. ఓ నాడు
బ్యాంకు నుంచి రాత్రి తిరిగి వస్తూ ఆ షాపు దగ్గర ఆగి షాపులో పెట్రోమాక్స్ లైట్ వెలిగింఛి వుండటం
వల్ల(అప్పటికీంకా ఎమర్జమ్సీ లైట్లు రాలేదు) "కరెంటు రాలేదా?" అని అడిగా. దానికి షాపతను
"రాలేదండి. బ్లిడ్జ్ వచ్చిందండి" అన్నాడు. ఇదేమిటి ఇలా అంటాడు అనుకుంటుండగానే,వెంటనే
నవ్వోచ్చింది. ఇందులో నవ్వు రావడానికి ఏ ముందా అని అనుకుంటున్నారా?! ఆ రోజుల్లో
"కరెంట్" అనే పేరు గల రాజకీయవార పత్రిక, "బ్లిడ్జ్" (ఆర్కే.కరంజియా సంపాదకుడు)అనే
వార పత్రిక వచ్చేవి. అతను కరెంట్ అంటే వీక్లీ అనుకున్నాడన్న మాట! పనిలో పని 1977లో
"బ్లిడ్జ్" ఇంగ్లీష్ వార పత్రికలో పడ్డ నా బొమ్మలు చూడండి.మరి!!

Tuesday, 23 February 2010

ప్రముఖుల (ప్రేమ) లేఖలు


















ఆ మైల్ పోయి ఈనాడు ఈ మైల్ వచ్చాక పోస్ట్ మ్యాన్ కోసం
ఎదురు చూపులే పోయాయి. ఐనా ఇంకా కొందరైనా ఉత్తరాలు
వ్రాస్తూనే ఉన్నారు. అలాటి ఉత్తరాలు జాగ్రత్త చేసుకొని అప్పుడప్పుడు
తీసి చదువుకుంటుంటే అదో అనుభూతి.నాకు వచ్చిన కొన్ని ఉత్తరాలను
మీతో పంచుకుంటున్నాను.శ్రి బాపు,ముళ్ళపూడి,జయదేవ్,అక్కినేని,
ఈనాడు రామోజీరావు,సరసి, బ్నిమ్,నేనెంతో అభిమానించే గాయకులు
శ్రీ యస్పీ.బాలసుబ్ర్హ్మణ్యం ప్రెమతో వ్రాసిన ఉత్తరాలు చూడండి.మా పిల్లలకు
చందమామ సంపాదకులు కీ"శే"కొడవటిగంటి కుటుంబరావు గారు 1980లో
వ్రాసిన ఉత్తరం కూడా ఉంది!!

"ఆ" మైల్-"ఈ"మైల్

ఈ"మాస్: ఏజ్ లో ఉత్తరాల పలకరింపులు లేవు;
అన్నీ మెసేజ్ లే!
అక్షరాల కత్తిరింపులతో,స్పెల్లింగ్ కిల్లింగ్ లతో అన్నీ
భాషను ఖూనీ చేసే డామేజీలే!!
అనుభంధాలను అందించే ఉత్తరం ఎంతెంతో దూరం!
గుండె చప్పుళ్ళను అక్జరాలతో నింపి వ్రాసే ఉత్తరం కోసం
పోస్ట్ మాన్ తెరచే గేట్ చప్పుళ్ళు ఇక వినిపించవు!!
ఇంకా ఎన్నాళ్ళకో "ఆ"మైల్ రోజులు?!
నేడు "ఈ" మైల్ పైనే అందరికీ మోజులు!!

Friday, 19 February 2010






ఒక్కొక్కసారి వేవ్లెంత్ కుదిరే కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు వస్తుంటాయి.
అతణ్ణి చూసి కాపీ కొట్టేశాడనే అపోహ కూడా ఒక్కోసారి కలుగుతుంది,ఈ
విషయం తెలియని కొందరికి!!"ఈనాడు" శ్రీధర్ గారు ఫిబ్రవరీ 1వ తేదీన
ఇదీ సంగతి పాకెట్ కార్టూన్ ఐదీయానే,7వ తేదీ "డెక్కన్ క్రానికల్" లో
కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ తైలాంగ్ వేశారు.కార్టూనిస్ట్ లకు ఒకే ఐడియా తట్టే
విషయం ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ నాకు వ్రాసిన ఉత్తరంలో
ఇలా వ్రాశారు.
"మీకు తట్టినవే నాకు తట్టాయి! కార్టూనిస్టులకు ఐడింటికల్ ఐడియాస్
ఫ్లాష్ అవుతాయనటానికి పైది ఒక నిదర్శనం! శ్రీధర్,చంద్ర, నాకు అనేక
మార్లు ఐడెంటికల్ ఐడియాస్ తడూతుంటాయి! మీతో వేవ్లెంత్ కుదరడం నా
కెంతో సంతోషాన్నిచ్చింది.అందులో ఒకటి మీరు వేసిన "గెడ్డం" కార్టూన్!!"

ఇలా మా కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు తడతాయనటానికి ఇక్కడ మీకు
చూపిస్తున్న కార్టూన్లు ఓ చిన్న ఉదాహరణ!!

Monday, 8 February 2010


శ్రీమతి టంగుటూరి శూర్యకుమారి గురించి 21 జనవరిలో వ్రాశాను.నా పాత
రికార్డుల పుట్ట తిరగేసి చూస్తుంటే సూర్యకుమారి 45 ఆర్పీయం రికార్డ్ అగు
పించింది. 1971 లో రిలీజయిన ఆ రికార్డ్లొ ఆమె మనో బుద్ధి -నిర్వాన
శతకం ( శ్రీ ఆది శంకరాచార్య) పాడారు.ఆ రికార్డ్ స్లీవ్ వెనుక సూర్యకుమారి
గురించి ఇలా వ్రాసారు.

Suryakumari,born in RAJAHMUNDRY,educated in Madras,was a child prodigy
at the age of five for her singing.She was discovered by a film producer
at the age of ten and became famous as a film actress.Her early films were
in Tamil and Telugu; ;later in Hindi and still later in English. She was
tutored in classical vocal music under Shri Pratapam Natesiar,disciple of
Vidwan Shri Ariyakudi Ramanuja Iyengar and on violin under proffessor
Vidwan Shri Parur Sundaram Iyer.
She gave hundreds of concerts and made across of records before leaving for the West
to gain experience in stage production and television. From 1960 she has resided in New York,.
and in London.In New york she acted in Rbindranath tagore's drama "King Of The Dark Chamber"
which ran with great success for a full year and gained for her the O.B.Award for
distinguished performance.
She has made many appearance on television in America,England and Europe. She taught Carnatic music
at Columbia University.

Friday, 5 February 2010

నేను, మా సంగీతం మాస్టారు


ఈ బొమ్మ మా చెల్లాయి కస్తూరి గీసిన బొమ్మ.అప్పుడు దాని వయసు 10 ఏళ్ళు!
1954లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక దసరా పండుగకు ప్రత్యేకంగా పిల్లలకు
బొమ్మలు గీసే పోటీ పెట్టింది. ఆ సంచికకు నేను బొమ్మ గీసి పంపిచానుకాని
నా బొమ్మ పడలేదు. చెల్లికి బహుమానం కూడా వచ్చింది. ఆ బొమ్మను ఇక్కడ
ఇస్తున్నాను.అప్పుడు మా చెల్లి రాజమండ్రి లో యమ్మెస్.బాల సుబ్రహ్మణ్యం గారి
దగ్గర సంగీతం నేర్చుకొనేది. ఇది 56 ఏళ్ళ క్రితం జరిగిన తీపి గుర్తు.

Sunday, 31 January 2010



బాపు రమణ గార్లు ముత్యాల ముగ్గు ఎంత అందంగా తీసారో అంత
ముచ్చట గా వంద రోజుల ఆహ్వానం వేసారు! కాంట్రాక్టర్ వంద రోజుల
పండక్కి తన భాషలో పిల్చాడు . మిరే చిత్తగించండి!!

Thursday, 28 January 2010

కినిమా పజిల్



1963 అంటే 47 ఏళ్ళక్రితం నేను మద్రాసు నుంచి మధుమూర్తి
గారి సంపాదకత్వం లో వారపత్రికగా వెలువడిన "కినిమా" అనే
పత్రికలో వారం వారం సినిమా పజిల్స్ వేసేవాడిని.ఆ నాటి నా
పజిల్స్ రెంటిని ఇక్కడ ఇస్తున్నాను.అందులో ఒకటి సినీ నటి
శ్రీమతి జమున పూర్తీ చేసి జవాబు పంపారు.



రెండో పజిల్ చూడండి.ఇందులో మొదటి బొమ్మలో అక్కినేని,తరువాత లక్ష్మిదేవి వరాలు పొందుతున్న
భక్తుడు,ఆఖరి బొమ్మలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఎంబ్లం ఉన్నాయి.
ఈ బొమ్మకు జవాబు : అక్కినేని లక్ష్మి వర ప్రసాద్
అన్నమాట!(దర్శకుడు యల్వీ.ప్రసాద్)
అవండి,ఆ నాటి నా జ్ఞాపకాలు.

Monday, 25 January 2010

ఆ నాటి కుర్చీ కబుర్లు



ఇక్కడ మీరు చూసే ఈ కుర్ఛి ఆ కుర్ఛీ మీద దర్జాగా కూర్చున్న
ఫొటోకి ఓ కధ వుంది. ఇప్పుడా ఫొటోలో వున్న కుర్చీయే ఆ
కుర్చి. ఇక ఆ ఫొటోలో వున్నది మా నాన్నగారు,అమ్మగారు,
అక్కయ్య వరలక్ష్మి సరోజిని. ఇప్పుడు వైజాగ్లో వుంది.ఆ ఫోటో
మా అక్కయ్య కు మూడేళ్ళ వయస్సప్పుడు తీసింది. విచిత్రం
ఏమిటంటే ఇంకా ఆ కుర్ఛీ మా ఇంట్లో క్షేమంగా ఉంది.మొన్న
ఆదివారం (17-01-10) న మన సాహిత్యాభిమాని బ్లాగర్
శ్రీ శివరామప్రసాద్ గారు బెంగళూర్ నుంచి నన్ను కలవటానికి
రాజమండ్రి వచ్చి అలా అలనాటి ఆ కుర్చీ పై ఆ ఫొటోను పెట్టి
ఫొటో తీసారు. మీరు ఫొటొను జాగ్రత్తగా చూస్తే ఆ కుర్ఛీ కనిపిస్తుంది.
ఇదో మరపురాని అనుభూతి. మీతో పంచుకుంటున్నాను.
ఆ ఫొటో తీసిన సంవత్సరం 1939! అంటే 71 సంవత్సరాలయింది!!

Saturday, 23 January 2010

కుడి ఎడమైతే పొరబాటు కలదోయ్!





ఏమిటీ అలనాటి దేవదాసు తాగకుండా పాడేస్తున్నాడేమో నని ఆశ్సర్య
పడుతున్నారా?! అసలు కధ ఏమిటంటే 1950 ప్రాంతాలలో పోస్టల్ శాఖ
చేత విడుదలయిన ఒక అణా (నేటి విలువ ఆరు పైసలు) భొధిస్వతుని
బొమ్మతో వచ్చిన స్టాంప్ ఒక సారి కుడి వైపు తిరిగి కూర్చున్నట్లు మరో
సారి ఎడమవైపు కూర్చున్నట్లు వచ్చింది. అటు తరువాత తప్పును కనుక్కొని
ఎడమవైపుగా వున్న స్టాంపును పోస్టల్ శాఖ తొలగించిందట. అలా కుడి
ఎడమలతో విడుదలయిన రెండు తపాలా బిల్లలు నా స్టాంప్ కలెక్షన్స్ లో
వున్నాయి.వీటిని సేకరించింది మా నాన్న గారు. ఆ స్టాంపుల బొమ్మలను
ఇక్కడ మీ కోసం.

Thursday, 21 January 2010


మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం "మాదీ" వింధ్య హిమవత్ శ్రీ నీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి గంగా గోదావరీస హ్యాజా తుంగతరింగిత హృదయాల్ మావి "మాదీ" ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూత నేతిహాసం "మాదీ" అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర.... ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధి గౌతముల సువాక్కులు "మాదీ" స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు జననీ ఓ స్వతంత్ర దేవీ కొను మా నివాళులు మావి "మాదీ"


శ్రి బలాంత్రపు రజనీకాంతరావు గారు వ్రాసిన ఈ పాట టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో దేశప్రజలను ఉత్తేజపరిచింది.తెల్లవారి తుపాకీలకు ధైర్యంగా గుండెలు చూపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం తమ్ముడి కుమార్తె 1925లో విజయవాడలో జన్మించింది. సంగీతం,నృత్యంలో శిక్షణ పొందిన ఈమె కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసింది. సూర్యకుమారి మిస్ మద్రాసుగా సౌందర్య పోటీలోఎన్నికయింది.1937 లో విప్రనారాయణ తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిఛయమైంది.ఆమె తెలుగులో జయప్రద,రైతుబిడ్డ, చంద్రహాస,దేవత,దీనబంధు,భాగ్యలక్ష్మి,రామదాసు తమిళంలో విప్రనారాయణ,కటకం,సంసార నౌక కన్నడంలో భారతి హిందీలో వతన్,ఉడన్ఖటోలా(ఉత్తమనటి గా ఫిల్మ్ఫేర్ అవార్డ్).ఆమె మరదలుపెళ్ళి చిత్రంలో కధానాయకిగా కాకుండా నాగయ్య గారితో సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది.ఈ చిత్రానికి విలన్గా ప్రసిద్దికెక్కిన ముక్కామల దర్శకుడు.ఈ తరం వాళ్ళు ఆయణ్ణి ముత్యాలముగ్గు లో ఎంతటి సరసడువో తెలిసెరా అన్న పాటలో చూశారు.నాగయ్య గారిని అభిమానించే ఈమె "భక్తపోతన" చిత్రంలో సరస్వతిగా నటించింది.(ఫొటో చూడండి) కృష్ణప్రేమ చిత్రంలో నారదుడిగా చొక్కా వేసుకొని నటించీంది!





సూర్యకుమారి పాడిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. 1939లో నిర్మించిన రైతుబిడ్డ చిత్రం (పోస్ట్ కార్డు) వెనుక ప్రింటెడ్ ఇన్ జపాన్ అని వుండటం విశేషం.ఈ బొమ్మను నాకు ఫణి నాగేశ్వరరావు గారనే మితృలు ఇచ్చారు.మరో కలర్ బొమ్మ శ్రీ బాపు వేసినది. సూర్యకుమారి పై క్రియేటివ్ లింక్స్ పుస్తకం ప్రచురించారు.ఖరీదు రూ.3,990/-!

Tuesday, 15 December 2009




1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీ నారాయణ అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారి అందమైన బొమ్మాయిల సృస్టికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత,గీత రెండూ మారిపోతాయని, తెలుగుజాతి ఖండాంతరాలలో వెలిగిపోయే సినిమాలు తయారవుతాయని ఎవరూ ఊహించివుండరు! ఈ నాడు బాపు అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దుకున్నాయంటేను,రష్యాలో రాదుగా ప్రచురుణ సంస్ధ "అందాల అఆలు" తెలుగుపుస్తకం ముద్రించారంటేను ఆనంద,ఆశ్చ్రర్యరాలతో పొంగి పోని తెలుగువాడుంటాడా?!ఆయన బికాం అవగానే ఎల్ యల్బీ చేసాక ఆయన కామ్ గా లాయర్ అయుంటే తెలుగుజాతి ఓ మంచి చిత్రకారున్ని,చిత్ర దర్శకున్నీ పోగొట్టుకొని వుండేది.


బాపు తొలిబొమ్మ రేడియో అన్నయ్య "బాల" పత్రికలో1945 అచ్చయింది.ఆయన చిన్ననాటి,ఈనాటి మితృడు
ముళ్ళపూడి తొలి రచన కూడా "బాల"లోనే అచ్చయింది. ప్రచారాలకు,పొగడ్తలకు ఆమడ దూరం వుండే శ్రీ బాపు వాల్టర్ ధాంప్సన్,ఎఫ్.డీ.స్టూవర్ట్,ఎఫిషెంట్ పబ్లిసిటీస్ లలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ప్రఛారాలకే ప్రచారం తెచ్చారు! ఆయన కార్టూన్లు చూసి ఎంతోమంది కార్టూనిస్టులుగా నాలా చాలా మంది ఆయన ఏకలవ్య శిష్యులైనారు.కొంత కాలం బాపు "రేఖ"పేరుతో కధలకు బొమ్మలు వెసేవారు.ఆ పేరు చూసే నేను "రేఖ" అనే పేరుకు "సు" అక్షరం చేర్చి "సురేఖ" గా కార్టూన్లు వేయడం మొదలెట్టా!


కీ"శే" ఎమ్వీయల్ బాపు గురించి ఇలా అన్నారు" కొండంత పెరిగి, గరికపరకలా తల వంచడం చాలా కస్టం.కానీ అంత విజ్ఞానంతో అనంతంగా పెరిగినా నిత్య విధ్యార్ధిలా వినయంతో తలవంచి జీవించడం అతనికి ఇష్టం". ఈ పుట్టిన రోజు శుభ సమయాన శ్రీ బాపు గారికి మన మితృలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ,


బాపూ బొమ్మలంటే నాకెంతో కసి!
ఆ బొమ్మల్ని చూసి
చూడగానే చింపేస్తా!!
ఆ పై అంటించేస్తా!!
కలకాలం నా ఆల్బ మ్స్ లో దాచేస్తా!!!!

సురేఖ*

Sunday, 6 December 2009

రూపాయలు - రూపాంతరాలు




ఈ నాడు డబ్బున్న వాళ్లను జనాలు గౌరవిస్తారు.వాళ్ళకు ఎలాంటి
అవలక్షణాలున్నా అవేవీ అగుపించవు!కాని డబ్బు మనుషులకు అంత
విలువనిస్తున్నా ఆ డబ్బుకు మాత్రం ఈనాడు రోజు రోజుకు విలువ తగ్గి
పోతున్నది.ఒక నాడు పెద్దగా వుండే వంద రూపాయలనోటు ఈనాడు
చిన్నదవటంమే కాకుండా విలువే లేకుండా పోయింది. వంద దాకా ఎందుకు
మా చిన్నతనంలో పది రూపాయల నోటు పెద్దదిగా వుండేది. ఈనాటి వంద
కంటే ఎంతో విలువా వుండేది.ఆ రోజుల్లో ఒక రూపాయికి నాలుగు అణాలు.
ఆంధ్ర పత్రిక వీక్లీ ఖరీదు పావాలా.నెలకి అంటే నాల్గు వారాలకి ఒక రూపాయన్న
మాట! ఇప్పుడు వీక్లీ ఖరీదు పది రూపయలు.అలానే చందమామ ఆరు అణాలు.
ఏడాది చందా రూ.4.50పై ! ఆనాటి ,నే పుట్టకముందు నాటి ఒక రూపాయి
నోట్లు (1917,1935), 1949,50ల నాటి పది,ఐదు రూపాయల నోట్లు నా
దగ్గర వున్నవి మీకు చుపిస్తున్నాను. ఇప్పటి పది రూపాయల నోటు నంబరు
చూడండి! ప్రత్యేకంగా లేదూ!! పాత రూపాయల నోట్లు మా నాన్నగారు కలెక్ట్
చేసినవి.ఆయన స్టేట్ బాంక్ లో కాష్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ప్రీంటింగ్ లో
పొరపాటుగా ప్రింటయినవి ప్రత్యేకంగా సేకరించేవారు.మీకు షోలే సిన్మా గుర్తుందా?
అందులో అమితాబ్ బొమ్మా బొరుసా వేసిన రూపాయికి రెండు వైపులా బొమ్మే
వుండటం ధర్మేంద్ర గుర్తిస్తాడు. ఇరువైపులా బొరుసు వున్న రూపాయి (మా నాన్న
గారు సేకరించింది) ఇంకా నా దగ్గర వుంది.అన్నట్టు మా నాన్న గారు 1959లో
బాంకు లో రిటైర్ అయినప్పుడు ఆయన సేలరీ నెలకు 500/-రూపాయలు!!

Tuesday, 24 November 2009

నేను -- నాడు... నేడు...




















ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఈరోజు నేనేంటి అని కాక నిన్న ఎలా ఉన్నాను. ఇపుడు ఎలా ఉన్నాను.రేపు ఎలా ఉండాలి అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నాడైనా, నేడైనా ప్రతీ అనుభవం ఒక జీవితపాఠంలా మలుచుకుని సాగిపోతూ ఉండాలి. ముప్పై నాలుగేళ్ల క్రిందటి చిత్రాన్ని చూసుకుంటే అప్పటి ఆలోచనలు, పోరాటాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి.

Sunday, 22 November 2009




ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో ఇట్టే తెరపై ఏ మిక్కీమౌసో ప్రత్యక్షమై అట్టే మాయమైపోయేది. ఒక్కోసారి అసలు చూపించేవాళ్ళేకాదు! ఇక మాకు నిరాశే మిగిలేది.ఆ మార్నింగ్ షోలకు క్లాస్ కన్షెషన్ వుండేది. అంటే బాల్కనీ టిక్కెట్టు దాని క్రిందిక్ల్లాస్ ధరకే ఇచ్చేవారు.




ఆదివారం మాకు మరో ఆటవిడుపు ఇంగ్లీష్ పేపరే! ఇండియన్ ఎక్సప్రెస్ ఆదివారం సండేస్టాండర్డ్ పేరుతో వచ్చేది.అందులో మెజీషియన్ మాండ్రేక్, బ్రింగింగ్ అప్ ఫాదర్,లిటిల్ కింగ్,ప్రిన్స్ వాలియంట్ మొదలయిన బొమ్మల కధలు రంగుల్లో వచ్చేవి.మావి కాన్వెంట్ చదువులు కాదు కాబట్టి నాన్నగారు చదివి చెప్పేవారు. కొంతకాలం తరువాత మమ్మల్నే చదవమని అర్ధం చెప్పమనేవారు. మాకు అదో ఇంగ్లీష్ పాఠంలా వుండేది. ది మెడ్రాస్ మెయిల్,ఇండియన్ ఎక్స్ప్రెస్ చివరి పేజీల్లో కర్లీవీ,టార్ఝన్ బొమ్మల కధలు ప్రతి రోజూ వేసేవారు.ఆంధ్రపత్రిక వీక్లీలో బాపు బంగారం-సింగారం,లంకె బిందెలు.రాజు-రైతు, విశ్వాత్ముల నరసింహమూర్తి పంచతంత్రం, చందమామలో బాపు గలివర్ ట్రావల్స్ మొ" బొమ్మల కధలు చదవేవాళ్ళం.కార్టూన్ చిత్రాల సృష్టికర్త వాల్ట్ డిస్నీమిక్కీమౌస్ లాంటి కార్టూన్లే కాకుండా డిస్నీ లాండ్ నిర్మించి అనేక అస్కార్ ఎవార్డ్స్ పొందాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంద్రజాల్ కామిక్స్ పేరిట ఫాంటమ్, చందమామ సంస్ధ క్లాసిక్స్ ‍‍అండ్ కామిక్స్ పేర డిస్నీ కామిక్స్,ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్ర కధ పేరిట ట్వింకిల్, భారత రామాయణాలు బొమ్మల కధలుగా ప్రఛురించారు.కొంతకాలంవరకు ట్వింకిల్ తెలుగులో కూడా వెలువడింది.

Thursday, 19 November 2009


ఈ ఫొటో నేను రాజమండ్రి యస్.ఆర్.సిటీ.హైస్కూల్లో SSLC చదువుకునేటప్పుడు మార్చి 1956 లో తీసినది. ఇందులో నేను పైనుంచి రెండవ వరుసలో కుడివైపు నుంచి నాల్గవ వాడిని! ఆ వరుసలో మొదట వున్నది నక్కిన శ్రీరామమూర్తి. ఇక్కడే క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు.అదే వరుసలో ఎడమవైపున మొదట వున్నది భాగవతుల మంగశర్మ.భిలై స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ గా రిటైరై ఇక్కడే వుంటున్నారు.తరచు కలుస్తుంటాము.ఆయన సతీమణి భాగవతుల లలిత మంచి కధా రచయిత్రి. "తీరనిఋణం" పేరిట ఆమె కధా సంకలనం వెలువడింది.పై వరుసలో కుడి నుంచి రెండో అతను వీర్రాజు.పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసాడు.తక్కిన మితృలు ఎవరైనా ఈ ఫొటో ఛూసి జవాబిస్తారని ఆశిస్తున్నాను.ఇక టీచర్లలో కూర్చున్న వాళ్ళలో ఎడమనుంచి నాలుగో సోషల్ మేస్టారు పి.సూర్యనారాయనమూర్తి గారు.ఆయన దివంగత సినీ హాస్య నటుడు రాజబాబు మేనమామ! అదే వరుసలో చివరవున్నది మాధ్స్ మేస్టారు చలపతి రావు గారు.మా అబ్బాయి సాయి చదివిన స్కూల్లో (టౌన్ హై స్కూల్)ప్రధాన ఉపాద్యాయుడుగా పనిచేసి రెటైర్ అయ్యారు. అంటే నేను,మా అబ్బాయి (ఇప్పుడు వాడు బొంబాయిలో ఓ సంస్దలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు) ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నామన్న మాట!

Sunday, 15 November 2009



కీ"శే"వడ్డాది పాపయ్య వర్ణ ఛిత్రాలు చూడనివారు,అభిమానించని వారు ఎవ్వరు ఉండరు.కాని దురదృస్ట వశాత్తు ఆయన గురించి సరైన ప్రచారం జరగలేదని పిస్తుంది.చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చందమామ,యువ మాస పత్రికల ముఖచిత్రాలు, లోపలి కధలకు బొమ్మలు ఆయన వేలాదిగా వేసారు. చందమామకు ముందు బాలన్నయ్య,బాలక్కయ్యల "బాల" పత్రిక(1947)లో ఆయన లటుకు-చిటుకు శీర్షికకు,పోలికలు అనే బొమ్మలు,కార్టూన్లు వేసారు.ఆ బొమ్మలు (బాల) కూడా మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను.శ్రీ వడ్డాది శ్రీకాకుళం లో 1921 సెప్టెంబర్ 10న జన్మించారు.వీరి నాన్నగారు శ్రీరామమూర్తివృత్తి రిత్యా డ్రాయింగ్ టీచర్.శ్రి పాపయ్యగారు రేఖాచిత్రాలు,ఏక వర్ణ,బహు వర్ణ చిత్రాలు గీసారు.ఆయన చిత్రాలు స్త్రీ ల పైనే ఎక్కువగా వున్న మాట నిజమ ఐనా వివిధ విషయాలపై కూడా చిత్రాలు గీసారు.ఈనాడు యువతులపై ఆసిడ్ దాడులు చేస్తున్న కొందరు యువకుల్ని
మానవ మృగాలుగా మనం వర్ణిస్తున్నాము.ఆయన ఏనాడో "యువ"లో ఈనాటిఆధునిక యువకున్ని "మృగము"అనే బొమ్మ ద్వారా చిత్రించాడు.ఆయన చిత్రకళారంగం లో చూపిన ప్రతిభ మరువలేనిది.అందుకే ఆయన బొమ్మలు ఈ నాటికీ అభిమానుల గుండెల నుంచి చెరిగి పోలేదు.నేను సేకరించి ఆల్బం లో పదిలపర్చుకొన్న కొన్ని బొమ్మలు మీ కోసం.

Tuesday, 10 November 2009




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.
  • Blogger news

  • Blogroll

  • About