Posted by Unknown on Tuesday, December 29, 2009 with 1 comment
దాదాపు నలభై ఆరేళ్ళక్రితం ఆంధ్ర వార పత్రికలో "సరాగమాల" పేరిట వచ్చిన శీర్షికలో సినిమా సంగీతం మంచి చెడులగురించి వ్రాసిన శ్రీ వి.ఏ.కె.రంగారావు గారి పేరు సుపరిచితం.ఆయన పూర్తి పేరు వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు.నాకు మంచి సినిమా సంగీతమంటే అభిమానం వుండటంచేత ప్రతి వారం "సరాగమాల" శీర్షికను చదివేవాడిని.ఐదేళ్ళ క్రితం 2005 జూన్ 7వ తేదీన చెన్నై పైక్రాఫ్ట్ రోడ్ లోని ఆయన రామ్మహల్ ఇంటికి వెళ్ళి కలిసే అదృస్టం నాకు కలిగింది.సరాగమాల శీర్షిక ఆంధ్రపత్రికలో రావడానికి బాపు రమణలే ముఖ్య కారకులు.శ్రీ రంగారావు గారు ఎంతగానో అభిమానించే శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే "సరాగమాల" అనే పేరుని సూచించారట. "సరాగమాల" లో మొదటి సారి శ్రీ మల్లాది "కలిమిలేములు" సిన్మా కోసం వ్రాసిన "కొమ్మల మీద కోతి కొమ్మచ్చులాడింది తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ, నేల మీద వాలింది వాలుమొగ్గ లేసింది నల్లానల్లని ఓ బుచ్చి నీడ" పాట గురించే రంగారావు వ్రాయటం జరిగింది.ఇన్నాళ్ళకు శ్రీ ముళ్ళపూడి తన ఆత్మ కధకు "కోతి కొమ్మచ్చి" అని పేరు పెట్టడం ఒక విశేషం!.
ఆయన దగ్గర 40,000 పైగా వివిధ గ్రామఫోన్ రికార్డుల కలెక్షన్ ఉంది. ఆ రికార్డులకోసం ఎంతోకాలం కష్టపడి ఎన్నేన్నో ఊర్లు తిరిగి సేకరింఛారు.అంతే కాదు సాహితీ విలువలున్న ఎన్నో ఆంగ్ల,తెలుగు పుస్తకాల గ్రంధాలయం ఉంది. ఆయన మంచి నాట్యాచారుడు కూడా! కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ రంగారావు ప్రతి ఏటా స్వామి ఎదుట నట్యనివేదనం చేస్తారు. వార్త పత్రికలో వ్రాసిన సంగీత విమర్శలను "ఆలాపన" అనే పుస్తకంగా వెలు వడింది.అలనాటి సినిమాల సంగీత విమర్శనాత్మక వ్యాసాలు సంగీత ప్రియులను అలరిస్తాయి.
Posted by Unknown on Sunday, December 27, 2009 with 1 comment
ఈ మధ్య నేను పుస్తక ప్రదర్శన జరుగుతున్న షాపులో 1921లో శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు వ్రాసిన నాటకం కొన్నాను.ఈ నాటికనే 1939లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్టిండియా ఫిలిమ్స్ వారు పుష్పవల్లి,భానుమతి లతో సినిమాగా నిర్మించారు.ఇదే భాను మతి మొదటి చిత్రం.ఈ నాటికలో సింగరాజు లింగరాజు పెళ్ళికుమార్తె తండ్రికి వ్రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ఇలా వుంటుంది!
బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి,సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు.మీ కుమార్తె చి"సౌ"కాళిందిని చి"బసవ రాజునకు చేసుకొనుటకును, అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల నైదువందల రూపాయలు రొక్కమును(చిక్కిన నేటీ రుపాయలకు లక్షతో సమానం) రవ్వల యుంగరము,వెండి చెంబులు,వెండి కంచము, వెండి పావుకోళ్ళు,పట్టు తాబితాలు,వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకును,ప్రతి పూట పెండ్లివారిని బ్యాండుతో బిలుచుటకును, రాకపోకలకు బండ్లు.రాత్రులు దివిటీలు ఏర్పాటు చేయుటకును, రోజుకు రెండు సార్లు పిండివంటలతో భోజనములను, మూడు సార్లు కాఫీ,ఉప్మా,ఇడ్డెనులు, దోశె,రవ్వలడ్డు,కాజా,మైసూరు పాకాలతో ఫలహారములు మా ఇస్టానుసారము అయిదు దినములు మమ్ము గౌరవించుటకు,అంపకాలనాడు మాకు పట్టు బట్టలను మాతో వచ్చు వారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకొని బజానా క్రింద 10 రూపాయలు ఇచ్చినారు గాన ముట్టినది. --సింగరాజు లింగరాజు వ్రాలు
ఇది నాటికలో కాళ్ళకూరి వరవిక్రయం లోని ఓ మచ్చుతునక.
శ్రీ బాపు ముఖ చిత్రంతో వెలువడిన ఈ పుస్తకం ధర రూ.25/-.విశాలాంధ్రలో దొరుకుతుంది. మీ దగ్గర లేకపోతే తప్పక కొని చదువవలసిన మరో మంచి పుస్తకం! ****సురేఖ
Posted by Unknown on Wednesday, December 23, 2009 with 5 comments
అందాల పాపికొండలు చూడాలంటే రాజమండ్రి కి దగ్గర లోనున్న పట్టిసీమకు వెళ్ళి అక్కడనుంచి లాంచీలో ప్రయాణం చేయాలి.లాంచీలుకూడా రెండస్తులతో క్రింద మన్ఛి రెస్టారెంట్,టాయ్లెట్ సౌకర్యాలతో వుంటాయి.పట్టిసీమ చేరాక వేరే నావలో వెళ్ళి అక్కడ గల శివాలయం చూడవచ్చు.ఆ గుడిని మీరు "మేఘ సందేశం" సినిమాలో చూసివుంటారు.మహా శివుడు వీరభదృడిగా, మహా విష్ణువు భావనారాయణుని పేరిట క్షేత్రపాలకునిగా అవతరింఛారని చెబుతారు.ఆలయంలో శివలింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది.తిరిగి లాంచి ఎక్కి ప్రయణిస్తుంటే దారిలో ఓ కొండ ఏనుగు ఆకారంలో అగుపిస్తుంది.దాని తరువాత మనకు నందీ శ్వరఆలయం అగుపిస్తుంది."జానకి రాముడు" ఈ గుడి ప్రాంగణంలోనే చిత్రీకరించారట. అలానే గండిపోసమ్మ ఆలయాన్ని చూదవచ్చు.మరికొంత దూరము ప్రయాణించాక దేవీపట్నం పోలీస్ స్టేషన్ వస్తుంది.ఈ పోలీస్ స్టేషన్ పైనే అల్లూరి సీతారామ రాజు దాడి చేసాడు.ఆనాటి పోలీస్ స్టేషన్ ఇప్పుడూ చూడవచ్చు! అటు తరువాత లాంచిని ట్రైబల్ విలేజ్ రిసార్ట్ దగ్గర ఆపి ప్రయాణీకులకు లంచ్ ఏర్పాటు చేస్తారు.ఈ రిసార్ట్ లో రాతృలు గడపాలనుకునే వారికి ఏసి/నాన్ ఏసీ గదులు వున్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణంలో గోదావరి వెడల్పు రాను రాను తగ్గుతుంది.అటూ ఇటూ రెండు కొండల మధ్య నుంచి లాంచి ప్రయాణిస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండుగా వుంటుంది. గోదావరికి ఇరువైపులా సన్నని పాపిడి తీసినట్లు రెండు కొండలు వున్నందున ఈ కొండలకు పాపిడి కొండలని పేరొచ్చింది.చివరికవి జనాల నోట్లో పాపి కొండలుగా మారి పోయాయి. పాపి కొండలు దాటాక పేరంటాఅలపల్లి శివాలయం వుంది.అక్కడి కొండలనుంచి పారే సెలయేర్లలో కాళ్ళు కడుగుకోంటే ఎంతో హాయిగా వుటుంది.శివుణ్ణి దర్శనం చేసుకున్నాక లాంచి తిరిగి రాజమండ్రి వైపు సాగిపోతుంది.పాపికొండల ప్రయాణం ఓ మధురానుభూతిగా మనకు మిగులుతుంది!
Posted by Unknown on Sunday, December 20, 2009 with No comments
పత్రికలలో అప్పుడప్పుడు ప్రచురించే రాజకీయనాయకుల ఫొటోలు,ప్రకటనల కోసం వేసే ఫొటోలు చూసినప్పుడు నాకు వచ్చే ఆలోచనలు ఇలా చూపించడానికి చేసిన ప్రయత్నం ఎలా వుందో మీరు చెప్పండి.
Posted by Unknown on Tuesday, December 15, 2009 with 3 comments
1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీ నారాయణ అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారి అందమైన బొమ్మాయిల సృస్టికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత,గీత రెండూ మారిపోతాయని, తెలుగుజాతి ఖండాంతరాలలో వెలిగిపోయే సినిమాలు తయారవుతాయని ఎవరూ ఊహించివుండరు! ఈ నాడు బాపు అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దుకున్నాయంటేను,రష్యాలో రాదుగా ప్రచురుణ సంస్ధ "అందాల అఆలు" తెలుగుపుస్తకం ముద్రించారంటేను ఆనంద,ఆశ్చ్రర్యరాలతో పొంగి పోని తెలుగువాడుంటాడా?!ఆయన బికాం అవగానే ఎల్ యల్బీ చేసాక ఆయన కామ్ గా లాయర్ అయుంటే తెలుగుజాతి ఓ మంచి చిత్రకారున్ని,చిత్ర దర్శకున్నీ పోగొట్టుకొని వుండేది.
బాపు తొలిబొమ్మ రేడియో అన్నయ్య "బాల" పత్రికలో1945 అచ్చయింది.ఆయన చిన్ననాటి,ఈనాటి మితృడు ముళ్ళపూడి తొలి రచన కూడా "బాల"లోనే అచ్చయింది. ప్రచారాలకు,పొగడ్తలకు ఆమడ దూరం వుండే శ్రీ బాపు వాల్టర్ ధాంప్సన్,ఎఫ్.డీ.స్టూవర్ట్,ఎఫిషెంట్ పబ్లిసిటీస్ లలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ప్రఛారాలకే ప్రచారం తెచ్చారు! ఆయన కార్టూన్లు చూసి ఎంతోమంది కార్టూనిస్టులుగా నాలా చాలా మంది ఆయన ఏకలవ్య శిష్యులైనారు.కొంత కాలం బాపు "రేఖ"పేరుతో కధలకు బొమ్మలు వెసేవారు.ఆ పేరు చూసే నేను "రేఖ" అనే పేరుకు "సు" అక్షరం చేర్చి "సురేఖ" గా కార్టూన్లు వేయడం మొదలెట్టా!
కీ"శే" ఎమ్వీయల్ బాపు గురించి ఇలా అన్నారు" కొండంత పెరిగి, గరికపరకలా తల వంచడం చాలా కస్టం.కానీ అంత విజ్ఞానంతో అనంతంగా పెరిగినా నిత్య విధ్యార్ధిలా వినయంతో తలవంచి జీవించడం అతనికి ఇష్టం". ఈ పుట్టిన రోజు శుభ సమయాన శ్రీ బాపు గారికి మన మితృలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ,
బాపూ బొమ్మలంటే నాకెంతో కసి! ఆ బొమ్మల్ని చూసి చూడగానే చింపేస్తా!! ఆ పై అంటించేస్తా!! కలకాలం నా ఆల్బ మ్స్ లో దాచేస్తా!!!!
Posted by Unknown on Tuesday, December 08, 2009 with 2 comments
సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి. ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితా సంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ, డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్ ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడా చోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితో పాలుపంచుకుంటున్నాను.
గాన సరస్వతి యం.యస్.సుబ్బులక్ష్మి!
నేడు అమృతం సేవించే దేవతలకు గానా అమృతం పంచుతున్నది!!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో నింగి లోని తారల తళుకులు మసక బారాయి!!
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం- ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది!!!
Posted by Unknown on Sunday, December 06, 2009 with 2 comments
ఈ నాడు డబ్బున్న వాళ్లను జనాలు గౌరవిస్తారు.వాళ్ళకు ఎలాంటి అవలక్షణాలున్నా అవేవీ అగుపించవు!కాని డబ్బు మనుషులకు అంత విలువనిస్తున్నా ఆ డబ్బుకు మాత్రం ఈనాడు రోజు రోజుకు విలువ తగ్గి పోతున్నది.ఒక నాడు పెద్దగా వుండే వంద రూపాయలనోటు ఈనాడు చిన్నదవటంమే కాకుండా విలువే లేకుండా పోయింది. వంద దాకా ఎందుకు మా చిన్నతనంలో పది రూపాయల నోటు పెద్దదిగా వుండేది. ఈనాటి వంద కంటే ఎంతో విలువా వుండేది.ఆ రోజుల్లో ఒక రూపాయికి నాలుగు అణాలు. ఆంధ్ర పత్రిక వీక్లీ ఖరీదు పావాలా.నెలకి అంటే నాల్గు వారాలకి ఒక రూపాయన్న మాట! ఇప్పుడు వీక్లీ ఖరీదు పది రూపయలు.అలానే చందమామ ఆరు అణాలు. ఏడాది చందా రూ.4.50పై ! ఆనాటి ,నే పుట్టకముందు నాటి ఒక రూపాయి నోట్లు (1917,1935), 1949,50ల నాటి పది,ఐదు రూపాయల నోట్లు నా దగ్గర వున్నవి మీకు చుపిస్తున్నాను. ఇప్పటి పది రూపాయల నోటు నంబరు చూడండి! ప్రత్యేకంగా లేదూ!! పాత రూపాయల నోట్లు మా నాన్నగారు కలెక్ట్ చేసినవి.ఆయన స్టేట్ బాంక్ లో కాష్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ప్రీంటింగ్ లో పొరపాటుగా ప్రింటయినవి ప్రత్యేకంగా సేకరించేవారు.మీకు షోలే సిన్మా గుర్తుందా? అందులో అమితాబ్ బొమ్మా బొరుసా వేసిన రూపాయికి రెండు వైపులా బొమ్మే వుండటం ధర్మేంద్ర గుర్తిస్తాడు. ఇరువైపులా బొరుసు వున్న రూపాయి (మా నాన్న గారు సేకరించింది) ఇంకా నా దగ్గర వుంది.అన్నట్టు మా నాన్న గారు 1959లో బాంకు లో రిటైర్ అయినప్పుడు ఆయన సేలరీ నెలకు 500/-రూపాయలు!!
Posted by Unknown on Tuesday, December 01, 2009 with No comments
నాకు నిత్య జీవితంలో హాస్యంగా మాట్లాడట మంటే చాలా ఇస్టం.బ్యాంకులో కూడా కొలీగ్స్ తో,కస్టమర్ల తో అలానే మాట్లాడే వాడిని.ఒక సారి ఓ కస్టమర్ని డిపాజిట్ వేయమని అడిగితే,"ఎలాగండి, డబ్బంతా ఇంటి మీద పెట్టేసాం,సార్" అని అన్నాడు."అదేంటి?! ఇంటి మీద పెడితే గాలొచ్చినా,వానొచ్చినా ప్రమాదం కదా? దయచేసి మా బ్యాంకులో పెడితే సురక్షితం!"అన్నాను.ఆయన పెద్దగా నవ్వి మర్నాడు డిపాజిట్ ఇచ్చాడు.అలానే నే అవార్డు స్టాప్ఫ్ గా వున్నప్పుడు మా కాష్ ఆఫీసర్ "ఈ రోజు కౌంటర్ చెయ్యండి" అంటే "కార్పెంటర్ చేత చేయించు కోండి" అని నవ్వుతూ అనే వాడిని.ఐనా అవతలి వారిక్కూడాఆ సెన్స్సఫ్ హ్యూమర్ లేక పోతే ప్రమోదం ప్రమాదంగా మారి పోతుంది.శ్రీ వరప్రసాదరెడ్డి,యమ్బీయస్.ప్రసాద్ గారి ప్రోత్సాహంతో మా బాంకు మితృడు డివీ.హనుమంతరావు నేను మా ఇంటి డాబా మీద ప్రసాద్ గారు,యస్వీ.రామారావు గారి అధ్వర్యంలో ప్రారంభించాము.ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ప్రతి నెలా 3వ ఆదివారమ్ విజయవంతంగా నిర్వహిస్తున్నము.మాకు సాహిత్య అభిమాని,రిటైర్డ్ పోస్ట్ మాస్టార్ శ్రీ ఖాదర్ ఖాన్ తోడు గానిలచారు. నవ్వటం నిజంగా నవ్వులాట కాదు. నవ్వుల పాలవ కుండా మరొకర్ని కులాల పేరిట, మతాల పేరిట నవ్వులపాలు చెయ్యకుండా నవ్వించడం మా హాసం క్లబ్ ధ్యేయం.నవ్వు సహజమైన పైన్ కిల్లర్!నవ్వటానికి మన ముఖం లోని 17 కండరాలు పనిచేస్తే కోపం వచ్చిన ముఖానికి 43 కండరాలకు పని చెప్పాలట! గత ఏడాది మా హాసం క్లబ్ వార్షి కోత్సవం లో శ్రీ రావి కొండలరావు గారిని సత్కరించాము.శ్రీ కె.ఐ.వరప్రసాద రెడ్డి నా సురేఖార్టూన్స్ పుస్తకాన్ని,హనుమంతరావు,నేను ఖాన్ రాసిన"నవ్వుల పందిరి" స్కిట్స్ పుస్తకాలను అవిష్కరించారు.ప్రతి నెలా కార్యక్రమాలలో హాస్యప్రియులు సకుటుంబంగా పాల్గుంటున్నారు.అలనటీ ఆపాత మధురాలను యస్.కృష్ణారావు,సత్యనారాయణ గార్లు ప్రతి కార్యక్రమం లోను క్రమం తప్పకుండా ఆలపిస్తారు. ఎదుట మనిషిది ఏ భాషైనా,ఏ దేశం ఐనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం. మీరూ మీ ఊర్లో ఇలాటి క్లబ్ లేకుంటే వెంటనే ప్రారంభిస్తారని ఆశిస్తూ,
హసం హాస్య, సంగీత పక్ష పత్రిక 2001 అక్టోబర్ 1వ తేదీన మొదటి సంచికను శాంతా బయోటెక్నిక్స్ అధిపతి పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి గారు,శ్రీ యమ్బీయస్ ప్రసాద్ గారు మేనేజింగ్ ఎడిటర్ గా ప్రారంభించారు.మొదటి సంపాదకీయంలో"మాకు చేతనైన రీతిలో హాస్యాన్ని,సంగీతాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం.వివిధ ప్రాంతాలలో ఉన్న వివిధ వర్గాల పాఠకులు ఏదో ఒక మార్గంలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశ.ఆరోగ్యం అని ఎందుకంటున్నామంటే సేద తీరే మార్గాలు ఎన్నున్నా సరే అవి మోతాదు మించితే హాని చేస్తాయి.హాస్యం,సంగీతం విషయంలో ఆ భయాలు లేవు.పైగా అవి కుటుంబ సమేతంగా ఆనందించ తగ్గవి...." ఇలాటి మంచి పత్రిక డిసెంబర్ 2004,16 వ తేది సంచిక ఆఖరి సంచిక అని శ్రీ వరాప్రసాదరెడ్డి గారు భాధాతప్త హృదయంతో సంపాదకీయమ్ వ్రాసారు."హాస్య,సంగీతాలపై అభిరుచి ఉన్నవారందరికీ"హాసం" గురించి తెలిసి,ఆదరించి వుండి వుంటే ఈ లేఖ రాసే సంధర్భం వచ్చేది కాదు. తెలుగులో మంచి పత్రికలు రావని, మంచి సినిమాలు రావని వాపోయే వారికి"ఇదీ దీనికి కారణం.ఈ ప్రతికూల ఆలోచనా ధోరణి మారినప్పుడే మనకు మంచి కాలం" అని చెప్పడమే ఈ లేఖ ఉద్దేశ్యం అని ఆయన అన్నారు. కాని హాసం అభిమానులు మాత్రం చాలా ఆవేదన చెందారు.అంతకు ముందు ఏప్రియల్ నెల ఉగాది రోజున ఉదయం 10.30 గంటలకు రాజమండ్రి లో శ్రీ రామ్ నగర్లో మా ఇంట్లో హాసం క్లబ్ శ్రీ యమ్బీయస్స్.ప్రసాద్, శ్రీ యస్వీ రామారావు ప్రారంభించారు. ఆ విషయాలు మరునాడు చెప్పుకుందామా మరి......