హాస్యమందు అఋణ
అందెవేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా !! అంటూ తమ కూనలమ్మ పదాలలో ఆరుద్ర అన్నారు. అంతేకాదు రమణగారికి పెళ్ళి కానుకగా, శ్రీదేవి గారికి తోడుగా అందించారు.
రమణగారికి గోదావరి అంటే ఎంతో ఇష్టం. అందుకే బాపురమణలు తమ సినిమాల్లో గోదావరిని మరింత అందంగా చూపిస్తారు.1956 నవంబరు నుండి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర సచిత్ర వార పత్రిక ప్రచురించిన ఆయన " బుడుగు-చిచ్చుల పిడుగు" ధారావాహికగా వచ్చినప్పుడు నా వయసు 15 ఏళ్ళు ! ఆనాటివేలాది పాఠకులతో బాటు వారం వారం బుడుగు చేసే అల్లరి కోసం ఎదురుచూసే వారం బుడుగు అమ్మ,నాన్న రాధాగోపాలం, గర్ల్ ఫ్రెండు సీగానపెసూనాంబ, బాబాయి, రెండు జెళ్ళసీత,లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు, ప్రైవేటు మాస్టారులు , మధ్యలో వచ్చే డికిస్టీ వాడు ఇలా ఎన్నేన్నో పాత్రలు !
బుడుగు వీక్లీలో వచ్చే రోజుల్లో రచయిత ఎవరో మాలాటి వాళ్ళకి చివరివరకూ తెలియలేదు. చివరాఖరికి బుడుగు చెబుతాడు "ఇది రాసి పెట్టినవాడు ముళ్లపూడి వెంకటరమణ , బొమ్మలు వేసినవాడు బాపు " అని ! ఆనాటి నుంచే బాపు రమణ గార్లంటే విపరీతమైన అభిమానం. ఆరాధన.! తరువాత దాదాపు 50 ఏళ్ల తరువాత 2005లో బాపురమణ గార్లను కలిసే అదృష్టం కలిగింది. 2008 లో వచ్చిన నా "సురేఖార్టూన్స్ " పుస్తకానికి నా అభిమాన రచయిత శ్రీ ముళ్లపూడి జుబ్లీబాయ్ జిందాబాద్ అంటూ ముందు మాట వ్రాసారంటే అది నాకు వారిద్దరి ఆరాధ్యదైవం శ్రీరాముడి కృపే !
ఆయన రచనలు ఎన్నని చెప్పగలం ! ప్రతిదీ అద్భుతమే ! రాధా గోపాలం, ఇద్దరమ్మాయిలూ -ముగ్గురబ్బాయిలూ ,ఋణాలందలహరి, విక్రమార్కు సింహాసనం లతో బాటు ఎన్నో పిటీ 109 లాటి అనువాదాలు వున్నాయ్. శ్రీ ముళ్ళపూడి సాహితీ సర్వస్వం ఎనిమిది సంపుటాలుగా శ్రీ యమ్భీయస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడి వీశేష ఆదరణ పొందింది. ఋణానందలహరిలో ఆయన పంచతంత్రంలోలా జంతువుల చేత తెలుగు మాట్లాడిస్తారు! కాకులు ఆవులించవు, కావులిస్తాయి., కావు కేకలు పెడతాయి. బావురమని ఏడవవు ! కావురమని ఏడుస్తాయి.
అవి "రెక్కా"డితేగాని డొక్కాడనవి ! ఒకరితో ఒకరు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. ఇలా ఎన్నో చమత్కార ప్రయోగాలు చేశారు.
రమణగారి చేత మొట్టమొదటి సినిమా స్క్రిప్ట్ "దాగుడు మూతలు" చిత్రానికి శ్రీ డి.బి.నారాయయణ వ్రాయించారు. కాని రమణగారు వ్రాసిన రెండో చిత్రం " గుడిగంటలు" మొదట విడుదలయింది. హాస్యం వ్రాసే రమణ ఇలాటి బరువైన కధా చిత్రానికి.మాటలు రాయడమా అని విమర్శించిన వారే సినిమా విడుదలయాక ముళ్ళపూడిని మెచ్చుకున్నారు.అందాలరాముడు,బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, సీతాకళ్యాణం ( ఈ చిత్రం అంతర్జాతీయ ప్రశంసలందుకొంది ).లాటి ఆణిముత్యాలు తెలుగు తెరకు అందించారు. చిన్నతెరకు ఆయన వ్రాసి బాపు అందించిన శ్రీ భాగవతం 100 ఎపిసోడ్స్ ఈటీవీ ద్వరా శ్రీ రామోజీరావు సమర్పించారు..
శ్రీ భాగవతం లో ఒక పాటకు ఆయన మాటల గారడీ ఇలా ఓ నదిలా సాగిపోతుంది.
గలగల పారెడు నది యిది
కిలకిల నవ్వించు"నది" ఈ
వలపుల కౌగిలి మ"నది"-చలి
గిలగిలగిలల నలిగి "నది".......
శ్రీ రమణగారు "సాహితీ సర్వస్వం " పుస్తకం నాకు కానుకగా సంతకం చేసి ఇస్తూ క్రింద బాపు అని కూడా వ్రాసి బ్రాకెట్లో "ఆధరైజ్డ్ ఫోర్జరీ" అని చేర్చటం ఆయన అక్షరాలతో ఆటలాడుకుంటారనడానికో మచ్చుతునక. ఆయన అక్కినేని జీవితాన్ని కధానాయకుడు కధ పేరిట వ్రాశారు. ఆయన తన ఆత్మ కధ కాని కధను రమణీయంగా "కోతి
కొమ్మచ్చి" పేరుతో స్వాతిలో వ్రాశారు. ఈ కధ మామూలు ఆత్మకధ కాదు. ఈనాటి యువతరానికి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలను, నష్టాలను ఇష్టాలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగించేందుకు తోడ్పడే అద్భుత టానిక్ ! ’కోతికొమ్మచ్చిమీరు తెలుగు తెలిసి చదవటం రాక పోయినా హాయిగా బాలుగారి గొంతులో వినొచ్చు. వివరాలకు www.kothikommachi.com కు వెళితే సరి !! రమణగారూ మీరు నెలకొకసారైనా ఫోన్లో పలకరించేవారు. ఇప్పడు నాలాటి వేలాది గుండెల్లో నిత్యం నిలచి పలకరిస్తున్నారు !! మీ నవ్వితే నవ్వండి జోకులు గుర్తుచేస్తూ నవ్విస్తున్నారు. మీరు చిరంజీవి !!