RSS
Facebook
Twitter

Wednesday, 14 April 2010

నవ్వుల సందడి

మన టీవీ చానెల్లకు,న్యూస్ పేపర్లకు ఏదో ఓ విషయం దొరికిందంటే ఇక
ఆ సుబ్జెక్ట్ మీదే ఊదరగొట్టేస్తుంటారు. కొంతకాలం నిత్యానందమ్ గొడవ. టీవీ ఆన్
చేస్తే బెడ్రూమ్ గొడవే!.ఇప్పుడు సానియా, షోయబ్ల పెళ్ళి కబుర్లు! అమ్మయ్య! పెళ్ళయింది
అనుకుంటూంటే ఇప్పుడు మెహందీట.తరువాత మరోటి.హనీమూన్ విశేషాలు! దీనికీ
రహస్య కమేరాలు వాడి, ఎక్స్లూజివ్ ఫలానా చాలన్ అంటారేమోనని భయమేస్తూంది!
క్రికెట్,టెన్నీస్ల పెళ్ళి వార్త విన్నాక నాకో ఐడియా తట్టి పై కార్టూన్ గీయాలనిపించింది.
ఇక ఆనాటి ’జ్యోతి’లోని కొన్ని మంచి జోకులను మీకోసం.
* "నేను మీ ఇంటికి భోజనానికొస్తున్నట్లు మీ ఆవిడకు తెలుసా ?"
"బలే వాడివోయ్, నిన్ను భోజనానికి పిలిచినందుకు మా ఆవిడకి నాకూ
ప్రొద్దున పెద్ద దెబ్బలాటైతేను !"
++ ++ ++ ++ ++ ++ ++
ఒకడు : నా పెళ్ళిరోజున మా అత్తగారు,మామగారు తెగ మురిసి పోయారు. మా ఆవిడ
కాపరానికొచ్చిన తరవాతగాని వాళ్ళ సంతోషానికి కారణం గ్రహించలేక పోయాను.
++ ++ ++ ++ ++ ++ ++ ++ ++
"నువ్విదివరకు మన కాలేజీలో పద్మ అనే అమ్మాయిని ప్రేమించేవాడిననే వాడివి కదూ ?
ఆ తరవాతేమైంది ?"
" ప్రేమించడం మానేశాను."
"అదేం ?"
" ఆ అమ్మాయినేగా నే పెళ్ళిచేసుకుంది."
++ ++ ++ ++ ++ ++ ++ ++
మద్యప్రదేశ్ రాజధానిలో ఇద్దరు తాగుబోతులు తూలుకుంటూ వస్తున్నారు. రోడ్డు ప్రక్కన
వెలుగుతున్న లైటును చూసి అది చంద్రుడని ఒకడు, కాదు సూర్యుడని మరొకడు వాదులాడు
కొంటున్నారు. ఇంతలో ఆ దారిలో ఒక పెద్దమనిషి రావడం చూసి "మీరు చెప్పండి సార్,అది
చందురుడా,సూరీడా ?" అని అడిగారు.
"నాకూ తెలవదయ్యా, నే నీవూరికి కొత్తగా వచ్చాను" అని అతగాడు తూలుకుంటూ వెళ్ళిపోయాడు.
++ ++ ++ ++ ++ ++ ++
కొన్నేళ్ళక్రితం తమిళ చిత్రాలలో "హాస్య జంట"గా పేరుపొందిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ ; టి.ఏ. మధురం కలిసి
ఒకసారి ఏదో టీ పార్టీకి వెళ్ళారు. స్వీట్లు,హాట్లూ అయ్యక కాఫీ ఇవ్వబోతుండగా క్రిష్ణన్ "కాఫీ వద్దు,టీ
ఇయ్యండి" అన్నాడు.
"ఏం కాఫీ తాగరా ?" అన్నాడు ప్రక్కన కూర్చున్న తెలుగాయన.
"తాగుతానుగాని, టీ యే మధురం" అన్నాడు క్రిష్ణన్.
++ ++ ++ ++ ++ ++ ++++
రావణుడు,కుంభకర్ణుడు,ఖరుడు,దూషణుడు,విద్యుజ్జిహ్యుడు వాళ్ళ చిన్నతనంలో ఒక సారి
విభీషణుడితో దాగుడుమూతలాడుతున్నారు. విభీషణుడికి వాళ్ళకోసం వెతికి,వెతికి విసుగు
పుట్టింది. చివరికి " దాగుడుమూతలంటే ఎక్కడన్నా దాక్కోవాలిగాని, ఇలా నిజంగా మాయమై
పోతే నేనసలు ఆడను" అన్నాడు.
++ ++ ++ ++ ++ ++
ఇక అలనాటి "జ్యోతి" పత్రికకు ఇంత మంచి జోకులు చెప్పినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇక నేనూ
ఈనాటికి మాయమై పొతున్నా. ఉంటా టా టా టా టా......................


_

Tuesday, 13 April 2010

మా ఊరి కధ





రాజమహేంద్రవరం ఆంగ్లేయుల కాలంలో రాజమండ్రిగా రూపాంతం చెందింది.
ఒక నాడు వేంగి చాళుక్యుల రాజధాని నగరంగా వెలిగి రాజరాజనరేంద్రుని
పాలనలో కళలకు పుట్టినిల్లుగా కీర్తిని పొందింది. కవిసార్వభౌమ్యుడు శ్రీనాధుడు
ఈ నగరంలో కొంతకాలం నివాసముండి తన సారస్వత కార్యక్రమాన్ని కొనసాగించాడు.
వేదశాస్త్రాలకు,కళాకారులకు జన్మస్తానమిది. శ్రీనాధుడు ఈ నగరాన్ని కొనియాడుతూ
పద్యాలు వ్రాసాడు. రాజులూ,వారి రాజ్యాలకే కాకుండా సంఘసంస్కరణలకు ఇది
జన్మభూమి. కందుకూరి వీరేశలింగం సాంఘిక దురాచారలను ఎదురించి కొత్త శకానికి
మార్గాలను చూపించింది ఇక్కడనే. ఆది కవి నన్నయ భారత రచన చేసింది ఈ నగరంలోనే!
సర్ ఆర్ధర్ కాటన్ గోదావరికి ఆనకట్టను ధవళేశ్వరం వద్ద నిర్మించాడు. దామెర్లరామారావు
లాంటి గొప్ప చిత్రకారులు,స్వాతంత్ర సమరంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ పద్యాలు వ్రాసిన
చిలకమర్తి, నిన్న మనం చెప్పుకున్న కాశీమజిలీ కధలను తెలుగుదేశానికి అందించిన
సుబ్బయ్య దీక్శితులు ఇక్కడివారే! ప్రఖ్యాత కధకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి,కవికొండల
వెంకటరావు,’హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు, రాజమండ్రి నగరానికి ఎనలేని
ఖ్యాతిని తెచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంశులు యమ్మెస్.సుబ్రహ్మణ్య శర్మ, మ్రుదంగ
విద్వాంసులు కమలాకరరావు ఈ నగరం వారే. మొట్టమొదటి సారిగా గోదావరి అందాలను
తన ’మూగమనసులు’ చిత్రమ్ ద్వారా పూర్తి ఔట్ డోర్లో చూపించిన ఆదుర్తి ఈ ఊరి వాడే.
గత పుష్కరాలకు "ఆనాటి" ప్రభుత్వం రాజమండ్రికి ఎన్నో కొత్త అందాలను కూర్చింది. గౌతమీ
ఘాట్లో దేవాలయ సముదాయానికి అవకాశం కల్పించింది. ఇస్కాన్ అతి పెద్ద శ్రి క్రిష్ణ దేవాలయాన్ని
నిర్మించింది. అంతే కాదు వ్యాపారానికి,ముఖ్యంగా వస్త్రవ్యాపారానికి ప్రసిద్ధి. ఈనాడు రాష్త్ర వ్యాప్తంగా
విస్తరించిన బొమ్మన,చందన వ్యపార సంస్తలు ఇక్కడివే !
ఆరుద్ర ఈ నగరం గురించి ఇలా అనారు--
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంగా శోబిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

Monday, 12 April 2010

కాశీమజిలీ కధల కధ !


ఇది వరలొ మనకు 'బాల','చందమామ' పత్రికలు లేనప్పుడు
రాజమండ్రికి చెందిన మధిర సుబ్బయ్య దీక్షితులు వ్రాసిన 12 భాగాల
కాశీమజలీ కధలు చదివి, అమ్మమ్మలూ, తాతయ్యలు తమ మనవలకు,
మనవరాళ్లకు చెప్పేవారు.
19 శతాబ్దంలో ఆ నాటి పాఠకులను ఈ కధలు ఉర్రూతలూగించాయి.ఈ
కాశీమజిలీ కధలు దక్షిణ కాశీ అని పిలవబడే రాజమండ్రిలోనే పుట్టాయి.
కాశీకి వెళ్లడం అంటే కాటికి వెళ్లడం అనుకొనే రోజులవి.పూర్వం కాశీ వెళ్ళడం
అంటే అలా అలా అడవుల మధ్య నుంచి ఊళ్ళను దాటుకుంటూ, మధ్యలో
ఆహారం దొరకదని ఆహర పదార్ధాలను మూటలు కట్టుకొని కాలినడకను వెళ్ళే
వారు.ఎప్పటికి చేరేవారో,తిరిగి ఎప్పటికి ఇంటికి చేరేవారో దేముడికెరుక!
మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా 1896లో ఈ కధలను రచించారు.
అప్పటి నుంచి ఈ నాటి వరకు ఆ కధలు ప్రచురించబడుతూనే ఉన్నాయి.
శ్రీ సుబ్బన్న దీక్షితులు నివసించిన ఇల్లు ఇప్పటికీ రాజమండ్రి ఉల్లితోట వీధిలో
ఉంది.చాలా కాలం వరకు ఆ ఇంటి పై కశీమజిలీ భవనం అనే అక్షరాలు ఉండేవి.
ఆ కధలన్నీ గొలుసుకట్టుగా,పురాణ కధలు, దైవ మహత్యాలు,నీతులు,నియమాలు,
ధర్మాలు,సాహసాలు ఇలా సాగిపోతుంటాయి.కాశీకి శిష్యులతో ప్రయాణిస్తూ గురువు
ప్రతి మజిలీలోను చెప్పే ఆశక్తికరమైన కధలే ఈ కధలు.అవకాశం దొరికితే ఈ కధలను
తప్పక చదవండి.పిల్లలకు చెప్పండి.వాళ్ళు చదివే, చూసే హారీపాటర్ ,క్లాష్ ఆఫ్ ది
టైటాన్స్ కన్నా అద్భుతంగా ఉంటాయి!

Sunday, 11 April 2010





1963 జనవరి 26వ తేదీన శ్రీ అక్కినేని చేతుల మీదుగా 'జ్యోతి' నవర(మా)స
పత్రిక ప్రారంభమయింది. సర్వశ్రీ బాపు,ముళ్లపూడి, నండూరి రామమోహనరావు,
ఆరుద్ర,వి.ఏ.కె.రంగారావు,రావి కొందలరావు,కీ"శే" యమ్వీయల్ మొ" అతిరధ
మహారధుల సారధ్యంలో వెలువడిన 'జ్యోతి' ప్రతి పేజీ ఒక రస గుళికే!ఆనాటి"జ్యోతి'
శ్రి కృష్ణ జయంతి సంధర్భంగా కృష్ణుడి పై కార్టూనులు, హాశ్య రచనలతో ప్రత్యేక సంచిక
వెలువడింది.
'పురాణ హాస్యము' పేరిట ఆనాడు 'జ్యోతి'లోని కొన్ని రసగుళికలు ఆస్వాదించండి.

శ్రీ కృష్ణుడు : మా యింట్లో రోజూ సత్యాగ్రహమే!

విష్ణుమూర్తి : ఏక పత్నీ వ్రతంమీద మోజు తీరి కృష్ణావతారం ఎత్తాను.

కుంభకర్ణుడితో రాక్షసులు -లేక లక్ష్మణుడితో ఊర్మిళ :-
"ఏమండోయ్, నిదుర లేవండోయ్."

సూర్యుడు బాల హనుమంతుడితో:- "ఏవిటోయ్,మింగే సేట్టు చూస్తున్నావ్?"

శచీదేవి ఇంద్రుడితో:-"అబ్బ; ఒళ్ళంతా కళ్ళుచేసుకొని అలా చూడకండి, సిగ్గేస్తుంది"

రాముడితో బాణం :-"ఒక్క నిముషంలో వచ్చేస్తా స్వామీ!"

విష్ణువు బ్రహ్మతో :- "ఈ రహస్యం మూడో కంటి వాడికి తెలియకూడదు"

ఏకలవ్యుడితో తల్లి:- "తప్పమ్మా,బొటన వేలు అలా నోట్లో పెట్టుకొని చీక్కోకూడదు,ఊడి

పోతుందంతే"

రతీదేవి మన్మధుడితో :-"ఏవండీ ! ఈమధ్య బొత్తిగా కనబట్టం లేదూ ?"

సరస్వతి పిలిస్తే బ్రహ్మ వెనక్కి తిరిగి చూస్తాడా ?

Saturday, 10 April 2010


'మూగ మనసులు' చిత్రంలో ఆచార్య ఆత్రేయ గీతం 'పోయినోళ్లందరూ మంచోళ్లూ, ఉన్నోళ్లు
పోయినోళ్ల తీపి గురుతులు'అని ఘంటసాల గాత్రం 'పాడుతా తీయగా చల్లగా' ఎంత కమనీయంగా
ఆలపించిందో, అలాటి ఎన్నో పాటలుగల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుగారు
రాజమండ్రిలో 1921లో జన్మించారు.ఆయన తొలి చిత్రం 'అమర సందేశం' చూసిన అన్నపూర్ణా
సంస్ధ తాము శరత్బాబు నవల 'నిష్కృతి' ఆధారంగా నిర్మించే 'తోడికోడళ్లు'చిత్రానికి
ఆదుర్తిని దర్శకుడిగా తీసుకున్నారు.అప్పటి నుంచి అన్నపూర్ణ నిర్మించిన చిత్రాలకు దాదాపు ఆస్ధాన
దర్శకులయ్యారు.ఆదుర్తి పూర్తిగా కొత్త నటీనటులతో 'తేనె మనసులు' నిర్మించి క్రిష్ణను 'సూపర్ స్టార్'ని
చేసారు.ఆయన దర్శకత్వం వహించిన 'నమ్మిన బంటు' విదేశాల్లో ప్రశంశలందుకొంది.ఆదుర్తి అక్కినేనితో
చక్రవర్తి చిత్ర సంస్ధ ద్వారా 'సుడిగుండాలు','మరో చరిత్ర' చిత్రాలు నిర్మించారు.డబ్బులు రాక పోయినా
ఆ చిత్రాలు మేధావుల, విమర్శకుల ప్రశంశలను అందుకొన్నాయి.
1954 నుంచి 1975లో అకాల మరణం పొందే వరకు ఆయన ఎన్నో హృద్యమైన చిత్రాలకు దర్శకత్వం
వహించారు.'మూగమనసులు' చిత్రాన్ని హిందీలో 'మిలన్'గా గోదావరీ తీరంలో సునిల్ దత్, నూతన్
మొదలయిన ప్రముఖ నటులతో నిర్మించారు.అలానే తమిళంలో'పెన్మనం','కట్టు రోజా' మొ" చిత్రాలు
నిర్మించారు.ఆదుర్తి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన శ్రీ కె.విశ్వనాధ్ ఆయన దర్శకత్వ ప్రతిభని
కల్పనా చాతుర్యాన్నీ అందుకున్నారు.శ్రీ విశ్వనాధ్ దర్శకత్వంలో 'శంకరాభరణం'లాంటి మంచి చిత్రాలు
రూపు దాల్చుకొన్నాఅయి.
ఆదుర్తి చిత్రాల లాగే ఆయన చిత్రాలలోని పాటలు కూడా చిరస్మరణీయాలే!
ఆదుర్తి రేఖాచిత్రాన్ని ఇక్కడ ఉపయోగించినందుకు శ్రి బాపు గారికి కృతజ్ణతలు.
  • Blogger news

  • Blogroll

  • About