RSS
Facebook
Twitter

Friday, 9 April 2010






ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు

కొందరు ప్రేమిస్తారు మొక్కలను !

కొందరికి పెంచడం ఇష్టం కుక్కలను !

నేను మాత్రం అమితంగా ప్రేమిస్తా బుక్కులను !

కదలకుండా కూర్చుని చూసే టెలివిజన్
కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది 'తెలి' విజన్ !!

సురేఖ



ఆ తరంవారికి 'బుడుగు' వెంకట రమణగా పిలువ బడే ముళ్లపూడి వారు
ఈ తరంవారికి కూడా 'కోతి కొమ్మచ్చి' వెంకట రమణగా పరిఛయం అయ్యారు.
విశాలాంధ్ర వారు 'ముళ్లపూడి సాహితీ సర్వస్వం'పేరిట ఆయన రచనలన్నీ 8
సంపుటాలుగా యం.బీ.యస్.ప్రసాద్ గారు ఏర్ఛి,కూర్చగా ప్రచురించారు.1,2
సంపుటాలలో 'కధా రమణీయం',3లో 'బుడుగు',4,5లలో కదంబ రమణీయం
ఇందులోనే నవ్వితే నవ్వండి జోకులున్నాయి!,6,7లలో సినీ రమణీయం,ఆఖరి
సంపుటంలో అనువాద రమణీయం వుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే 'డాక్టర్
జోకులు కదంబ రమణీయం లోనివి. ముళ్లపూడి మాటల్లోనే"నవ్వితే నవ్వండి,మాకు
అభ్యంతరం లేదు".

* * * * * * *
డాక్టరు: నిద్దట్లో పీడకలలు అన్నారు, నా మందు తీసుకొన్నాక ఎలా వుంది?

రోగి : ఏడిసినట్టుంది.ఇప్పుడు కలలో కూడా నిద్ర రావటం లేదు.
* * * * * * *

ఒక రోగి ఆపరేషన్ బల్ల ఎక్కుతూ--

మరే ప్రమాదం లేదుగా డాక్టరుగారూ? అన్నాడు.

చాల్చాల్లేవయ్యా! నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషనెవడు

చేస్తాడు,బలే వాడివేలే, అన్నాడు.

* * * * * * *

ఓ తల్లి అర్ధ రాత్రి వేళ బిడ్డను తీసుకొని డాక్టరింటికి వచ్చింది, వాతం కమ్మింది చూడమని.

"ఏం చేసారు? ఏం చేసారు?" అడిగాడు డాక్టర్.

"మీరిచ్చినదే.పిల్లాడికి నెలకో మాత్ర వెయ్యమన్నారుగా.వాడికి తొమ్మిదో నెలగదా అని తొమ్మిది

మాత్రలు తెప్పించి వేసాను." అంది.

* * * * * * *


Thursday, 8 April 2010



'భరాగో' అనే భమిడిపాటి రామగోపాలం గారు వ్లిశాఖపట్టణం లో నిన్న పరమంపందించారనే
వార్త తెలుగు హాస్యకధా ప్రియులకు మరువలేని వేదనను కలిగించింది. ఐదేళ్ల క్రితం ఆయన
కలం నుండి వెలువడిన రెండు సంపుటాల తెలుగు సినిమా పాటల వివరాలతో (1940-1985),
ప్రధానమైన పాటలు,అరుదైన చిత్రాలు,వివరణలతో ఆ పాటల రెండు సీడీ లతో పుస్తకాలు 'నూట
పదహార్లు' 'మరో నూట పదహార్లు' కోసం ఆయన ఇంటికి వేళ్ళాను.ఎంతో ఆదరనతో ఎన్నో విషయాలు
చెప్పారు. ఆ పుస్తకాలు కొని శెలవు తీస్కుని బయలుదేరబోతుండగా వెనక్కి పిలిఛి ఆ అలమారు పైనున్న
సరదా కధలు పుస్తకం తీసుకోండి అన్నారు. ఖరీదు చెల్లించబోగా, వద్దు ఆ పుస్తకం నా 'కానుక' అన్నారు.
ఐతే సంతకం చేసి ఇవ్వండి అంటే "నేను కదలలేను. ఆర్త్రిటిస్ తో నా వళ్ళు స్వాధీనంలో లేదు.సంతకం
చేయలేను"అన్నారు.1932, ఫిబ్రవరి 6న విజయనగరం జిల్లా ఆలమండ మండలం అన్నమరాజు పేటలో
'భరాగో' జన్మించారు.160 పైగా కధలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు రచించారు.కుండపెంకులు,
వంటొచ్చిన మొగాడు,వెన్నెల నీడ, కధన కుతూహలం కధా సంపుటాలు వెలువడ్డాయి.తన ఆత్మకధను
'ఆరామ గోపాలం' పేరిట వ్రాసారు.పాలువాయి భానుమతి మొ" ప్రముఖుల పై సచిత్ర పుస్తకాలను
వ్రాసారు
ఆయన్ని కలిసినప్పుడు ఆయన నాతో ఈ నాటి సినిమా తారల గురించి చెబుతూ" ఆ నాటి
తారలు భానుమతి,సావిత్రి మొ" చూసినప్పుడు ఇలాటి సోదరో, భార్యో వుంటే ఎంత బాగుంటుంది అనే
భావన కలిగేది.ఇప్పటి వాళ్ళని చూస్తుంటె ఏ మనిపిస్తుందో వేరే చెప్పాలా"

భరాగో గారి ఆత్మకు శాంతి కలగాలనీ ప్రార్ధిస్తూ,,,









ఇక్కడ మీరు చూస్తున్న బాపుగారి బొమ్మల్లో ఆయన జేవాల్టర్ ధాంప్సన్లో
పనిచేస్తున్నప్పుడు ఆమృతాంజన్ (1960)ప్రకటన బొమ్మ,1945లో ఫోర్త్
ఫారం చదివే రోజుల్లో 'బాల'పత్రికలో పడ్డ 'వింత జంతువు'బొమ్మ,ఆయన
మీదే గీసుకున్న కార్టూన్,'కులగోత్రాలు'సినిమాకి గీసిన ప్రకటన బొమ్మ మీకోసం.

Wednesday, 7 April 2010




ఆడు వారి మాటలకు అర్ధాలె వేరులే అంటే ఇక్కడ 'ఆడు' అంటే మాటలాడు
అని అర్ధం చెప్పుకోవాలి. ఆడైనా, మగైనా మనం అప్పుడప్పుడూ మాటలాడే
'మాటల'కు అర్ధాలు వేరుగా స్ఫురించవచ్చు.కొందరు ఏదైనా షాపుల్లో కొనడానికి
వెళ్ళి ఏ గాజు వస్తువో చూపించి 'ఎదెంత పడుతుందండీ' అని అడుగుతుంటారు.
ఇక్కడ 'పడటం'అంటే 'ధర'ట!.కొన్ని మాటలు చూడండి.'ఫొటోలు "దిగడం",
ఇంట్లోకి 'దిగడం' అంటుంటారు.మీరు కొత్తగా బైకో,స్కూటరో కొనగానే,మీకు పరిచయం
లేని వాళ్ళయినా సరే "పెట్రోలు ఎంతిస్తుందండీ?" అంటూ అడుగుతారు.పెట్రోలు ఇవ్వడానికి
అదేమన్నా ఆవా,గేదా చెప్పండి పాలిస్తున్నట్లు ఇవ్వడానికి!ఇక జిల్లా జిల్లాకి మాటలకి
అర్ధాలు మారి పోతాయి.నేను 1963లో ఎస్బీఐ,శ్రీకాకుళంలో ఉద్యోగంలో చేరినప్పుడు,
మెసెంజర్ "ఇక్కడ దోమలు లావండీ,జాగ్రత్త" అన్నాడు.'లావు' అంటే అక్కడ 'ఎక్కువ'
అని అర్ధంట.మన ఫామిలీ ఊరెళ్ళి,మనం ఒంటరిగా వున్నప్పుడు ఏ ఫ్రెండో వచ్చి "టిఫిన్
చేద్దూగాని మా ఇంటికి రా" అని పిలిస్తే, సంతోషపడి వెళ్ళామనుకోండి అక్కడ నిజంగానే
మన చేత టిఫిన్ (తయారు)చేయించే ప్రమాదం వుంది.ఏమంటే వాళ్ల ఫామిలీ కూడా
శెలవులకు ఊరెళ్ళి ఉండొచ్చు! ఇక సభల్లో చూడండి.వేదికను ఎంతో డబ్బు ఖర్చు చేసి
పూలతో డెకరేటర్స్ చేత చేయిస్తారు.కాని ఆ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తిని,ఆ ప్రక్క
ఆశీనులైన పెద్దమనుషులను,స్టేజీ పకి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరూ "వేదికను అలంకరించిన
పెద్దలకు నమస్కారం" అంటూ మొదలు పెడతారు.స్టేజీ అలంకరించినది ఒకరైతే దర్జాగా కూర్చున్న
వాళ్లను 'అలంకరించారు' అంటారు!ఇలా 'ఆడు మాటలకు' ఒక్కోసారి అర్ధాలు మరోలా
'అర్ధ' మవుతాయి.అందుచేత మన మాటలకు 'ఎడా-పెడా'ర్ధాలు (ముళ్లపూడి వారన్నట్లు)
తీసినప్పుడు ఒక్కో సారి ఆలోచిస్తే వినోదాన్ని కలిగిస్తుంటాయి.
  • Blogger news

  • Blogroll

  • About