RSS
Facebook
Twitter

Monday, 18 January 2010





జనవరి 18 వ తేది నందమూరి తారక రామారావు గారి 14 వ వర్ద్హంతి.తెలుగు సినీ పరిశ్రమలో యన్టీఆర్,ఏయన్నార్ ఒకరికి ఒకరు పోటీగా వివిధ పాత్రలలో నటించి తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా ఈ నాటికి పరిశ్రమ చేత ,అశేష ప్రేక్షక అభిమానులచేత ప్రశంసలు పొందారు. శ్రీ రామారావు శ్రి కృష్ణుడు,శ్రీ రాముడి పాత్రల్లో దేముడి రూపం ఇంత సౌందర్యంగా వుంటుందనే భావన ప్రెక్షకుల్లో నిలచిపోయింది.ఇక అక్కినేని మొదట్లో బాలరాజు,కీలుగుర్రం లాంటి ఎన్నో జానపద చిత్రాల్లో,చెంచులక్ష్మి ,మాయాబజార్ లాంటి విజయవంతమైన పౌరాణిక చితాల్లో నటించారు.ఆ రొజుల్లో శ్రీ ముళ్లపూడి తన "నవ్వితే నవ్వండి" లో వీళిద్దరి పై ఈ క్రింది జోక్ వ్రాసారు. పాతాళ భైరవి చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి.అప్పటికింకా ఎన్.టి. రామారావుకు నాగేశ్వర్రావుకున్నంత పేరు రాలేదు.నాగేశ్వర్రావు జానపదాల హీరోగా బాగా పేరు మోశాడు.చితం చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇవతలికి రాగానే " ఆ మొసలి పోరాటం ఉంది చూశావ్? అబ్బ...ఎంత సేపు పోరడాడయ్యా ఆ రామారావు?" అన్నాడు ఒకడు. "అంతేలే.రామారావు కొత్త గదా.అంచేత అరగంట పట్టింది.అదే మన నాగేశ్వర్రావైతేనా- చిటికలో చంపేసి ఊండును" అన్నాడు మితృడు.


ఇక్కడ మీరు చూసే యంటీఆర్,ఏయన్నార్ ఫొటో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక 20-3-1970 (నలభై ఏళ్ళ నాడు) వేసిన ముఖచిత్రం!

Sunday, 17 January 2010

అలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం కూడా ఆశ్చర్య పోయాము. నా దగ్గర ఉన్న పాత కాలపు కీ గ్రామ ఫోను చూసి అబ్బురపడి, అది తిప్పి అందులో పాట వినేంతవరకు వదలలేదు. చివరకు, ఆ గ్రామఫోను సూది వెతికి వెతికి, పదును పెట్టి, పాతకాలపు 78 RPM రికార్డు తిప్పి బాలానందం పాటలు విన్నాము. నేను ఆ రికార్డును మోగించటం తీసాము, అది ఈ కిందే ఉన్నది.

గ్రామఫోను అంటే తెలియని ఈ రోజులలో, కరెంటు అవసరం లేకుండా పూర్తీ యాంత్రిక శక్తితో (గడియారం లాగ కీ ఇస్తే పని చేస్తుంది) నడిచే ఈ వినోద పరికరం తెలియని వారు చూడటానికి ఇక్కడ ఇస్తున్నాను.

Wednesday, 13 January 2010




















ఈ ఫొటోలు చూస్తున్నారు గదా! ఇదేమిటి ఈ మనిషి ఫొటో పుతిన్ తన మీటింగ్ హాల్లో ఎలా పెట్టుకున్నాడా అని ఆశ్చర్య పడకండి.ఆ కధ చెబుతా.2003లో మా రాజమండ్రి లో జరిగిన గోదావరి పుష్క రాలకి పుతిన్ రహస్యంగా వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ జారి పడ్డాడు.ఆయన పెట్టిన కేకలు విని నే ధైర్యంగా వెళ్ళి బయటకు లాగాను.
"నేను రష్యన్లో అరిస్తే ఎలా అర్ధమయింది?" అని పుతిన్ అడిగాడు.
"నాకు మీ అరుపులు అమ్మోయ్,నాయనోయ్ అన్నట్లు వినిపించింది" అన్నాను.
పుతిన్ ఎంతో ఆనందించి తన విషయం ఎవరికీ చెప్పొద్దని నా ఫొటో తీసుకుని వెళ్ళాడు.కృతజ్ణతగా నా ఫొటో తన ఆఫీస్లోనే కాకుండా వీధుల్లో .స్కూళ్ళల్లో బ్లాకు బోర్డుల మీద, ఎగ్జిబిషన్లో, టీకప్పుల మీద,ఇంటి కప్పుల మీద ,కాలెందర్లు వేయించాడు.ఇది చూసి అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ డాలర్ల మీద,మాగజై న్స్ మీద కూడా వేసారు. నేను తెలుగువాణ్ణి కాబట్టి ఒక్క తెలుగు పత్రిక కూడా ఈ విషయం బయట పెట్టలేదు.నాకు పబ్లిసిటీ ఇస్టం లేక పోయినా మీ కొక్కరికే ఈ సంగతి చెప్పా! ఈ ఆకట్టు కొనే కట్టు కధ మీరు నమ్మాలి!!

Thursday, 7 January 2010




ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారి కార్టూన్లు చక్కని గీతల్తో అద్భుతంగా ఉంటాయని వేరే చెప్పాలా!కొత్త సంవత్సరానికి మంచి సందేశంతో ఆయన మితృలకు పంపిన కార్టూన్ మీ అందరితో పంచు కోవాలనే కోరికతో ఇక్కడ వుంఛాను.గతంలో ఆయన తన సంతకంతొ అమ్మాయి జడతో గీసిన బొమ్మ చూసేవుంటారు. ఈ సారి శ్రీ జయదేవ్ 2010ని తన బొమ్మలో చూపించారు.రీడర్స్ డైజెస్ట్ లాంటి అంతర్జాతీయ పత్రికలో ఆయన చిత్రాలు చోటు చేసుకున్నాయంటే ప్రతి తెలుగు వాడు గర్వించాలి.ఏమంటారు.?

Friday, 1 January 2010

చెత్త కబుర్లు

తెలుగు బ్లాగర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .. సంవత్సరపు మొదటి రోజు ఈ చెత్త కబుర్లేంటా? అని అనుకుంటున్నారా?

ఒక్కోసారి చెత్త కబుర్లు కూడా వింటానికి బాగానే ఉంటాయి! నిజమండి!! ఏమిటీ చెత్త కబుర్లను కుంటున్నారా? ఈ నాటి సినిమాల్లోని హాస్యం చూడండి! చెత్త గా ఉండటములే! ఆ చెత్త చూసి మన జనాలు పడీ పడీ నవ్విపోటంలే! ఇల్లరికం సినిమాలో రేలంగి మామ రమణారెడ్డి తొ ఏదోలే మామయ్యా, రెండు రాత్రులుండి పోవాలని వచ్చా అంటాడు.అప్పుడు అత్తగారు అదేమిటి నాయనా,రెండు రోజులేనా? అంటుంది. అప్పుడు రేలంగి "అదే అత్తయ్యా! శివరాత్రి నుంచి సంకురాత్రి దాకా" అని అంటాడు.ఈ జోకు ఈ కాలం కుర్రవాళ్ళకు చాలామందికి అర్ధం కాకపోవచ్చు.అదే రెండర్థాల చెత్త జోకనుకోండి వెంటనే నవ్వు కుంటారు.

సరే చెత్తకబుర్లలోకి వచ్చేస్తున్నాను.నేను మా ఆవిడా దీపావళికి మా అక్కయ్య,బావ దగ్గరికి వైజాగ్ వెళ్ళాము.ఉదయాన్నే "చెత్తమ్మగారు,మీ చెత్త! చెత్త తల్లీ! చెత్త" అంటూ స్పీకర్లో కేకలు వినిపింఛాయి.ఇదేమిటి పొద్దున్నే ఇలా లౌడ్ స్పీకరెట్టుకొని మరీ తిడుతున్నాడని ఆశ్చర్యపడి లేవగానే మా మేనల్లుడు విజయభాస్కర్ "కంగారు పడకు మావయ్యా " పిలిచేది,మా వైజాగ్ కార్పొరేషన్ చెత్త కలెక్ట్ చేసే వ్యాన్ వాళ్ళు!" అన్నాడు.ఎందుకోగాని "చెత్తమ్మగారు,చెత్త తల్లి" అన్నమాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు నవ్వాగదు! ఇదండీ నే చెప్పాలను కున్న చెత్త కబుర్లు! మరీ చెత్తగా ఉంటే క్షమించి పారేయండి!


సురేఖ
  • Blogger news

  • Blogroll

  • About