RSS
Facebook
Twitter

Wednesday, 12 May 2010

జనార్ధనునివెన్నముద్దలు’!! ఓ మంచి పుస్తకం

మీలో ఎవరైనా శ్రీ జనార్ధనమహర్షి వ్రాసిన వెన్నముద్దలు కవితల పుస్తకం
ఇంతవరకూ చదవకపోతే వెంటనే కొని చదవండి. నాకు ఆయన కవితలు
చదువుతుంటే ఓ మాంచి బాపూ బొమ్మ చూసిన ఆనందం ఇప్పటికీ కలుగు
తునే వుంటుంది.
వెన్నముద్దలు లో కొన్ని నవనీతాల్ని మీ ముందు వుంచుతున్నాను.
* మా అమ్మ
మా ఆవిడ
నా రెండు కళ్ళు
. . . . .
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు.
. . , , , .
* కడుపులో బిడ్డ
తిరగబడ్డాడు
పెద్దాపరేషన్
కోలుకోవడానికి
రెండేళ్ళు పట్టింది.
.. . . . .
ఇరవై రెండేళ్ళ తర్వాత
మళ్ళీ తిరగబడ్డాడు
ఇంకేం కోలుకుంటుంది.
* * * *
చివరిగా....
* మార్నింగ్ వాకులు
తక్కువై అతనికి,
ఈవినింగ్ వాకులు
ఎక్కువై ఆమెకి,
. . ,.. ,.
కడుపొచ్చింది.
ఇలాటి వెన్నముద్దలు ప్రతి పేజీలోను మిమ్మల్ని అలరిస్తాయి.ఆలోచింపజేస్తాయి.
అన్నిటికంటే ఈ పుస్తకంలో ప్రతి పేజీ పైన ఒక్కో కవి అపురూపమైన ఫొటోలు
వుంచండం జనార్ధన మహర్షి గారి అభిరుచికి, ఆ కవులపై ఆయనకున్న గౌరవాన్ని
అభినందించకుండా వుండలేం !


Sunday, 9 May 2010

అమ్మను సదా తలచుకొందాం ! !



అమ్మను తలచుకుందాం !
ఈ రోజు మాతృ మూర్తులందరినీ తలచుకొవాలసిన మంచిరోజు.ఈ నాడే కాదు కలకాలం
అమ్మను ఎలా మరచిపోగలం.. శ్రీ ముళ్లపూడి వెంకటరమణ తన సాహితీ సర్వస్వం మొదటి
సంపుటాన్ని తనని పెంచి పెద్ద చేసిన అమ్మ ముళ్లపూడి ఆదిలక్ష్మి గారితో బాటు తనను
తల్లిలా ఆదరించిన మహీపతి సూరమ్మ, కొవ్వలి సత్యవతి, చల్లా సీతా మహాలక్ష్మి,వీరఘంటం
సీతాబాయి, పున్నావఝుల (రేడియో) భానుమతి, మండలీక సుబ్బులక్ష్మి, శివలెంక కామాక్షమ్మ,
సత్తిరాజు సూర్యకాంతం ( బాపూ గారి అమ్మ గారు) ఈ మాతృమూర్తులందరికీ అంకితం ఇచ్చారు.
అమ్మను శ్రీ ఆత్రేయ చక్రవర్తి సంగీత దర్శకత్వంలో చక్రవర్తి పాడిన పాటను ఇలావ్రాశారు.
అమ్మంటే అమ్మ
ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ
రక్తాన్ని అర్పించి - ప్రాణాన్ని పూరించి
చేస్తుంది నీ బొమ్మ
మరణాన్ని ఎదిరించి - మరోసారి జన్మించి
ఇస్తుంది నీకు జన్మ
ధనం పోసి కొనలేము - రుణం తీర్చుకోలేము
అందుకే అమ్మ
విధి ఆడే ఆటల్లో - విడిపోయే బ్రతుకుల్లో
మిగిలేదే మమకారం
మిగులుండే మమతల్ని
తెగిపోని బంధాల్ని
కలిపేదే తల్లి రక్తం
తనకు కన్ను నీవైతే - నీకు రెప్ప తానౌతుంది
అందుకే అమ్మ
అమ్మంటే అమ్మ
ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ.
జగతిలోని అమ్మలందరికీ పాదాభివందనాలు !
అమ్మను అందంగా చూపించిన బాపూ గారికి కృతజ్నతలతో.......


Friday, 7 May 2010

మనసుకవి పుట్టిన రోజు




మనసుకవి ఆత్రేయ
శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులు నెల్లూరు జిల్లా మంగళంపాడులో 7-05-1921 తేదీన
జన్మించిన ఆయన పేరులోని ఆచార్య,గోత్రంలోనిఆత్రేయ, రెండూ కలిపి ’ఆచార్య ఆత్రేయ" గా
పేరు పొందారు. ఆత్రేయ నెల్లూరు మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా, "జమీన్ రైతు" పత్రికలో
సహాయ సంపాదకుడిగా పనిచేసారు. ఆయన గౌతమ బుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తన,వాస్తవం,
ఎన్జీవో,ఈనాడు, విశ్వ శాంతి,కప్పలు,భయం,మనసువయసు మొదలైన నాటకాలు రచించారు.
ఆయన "దీక్ష" ( 1951) సినిమాతో పాటల రచయితగా "పోరా బాబూ పో..." అనే పాటతో సినిమా
రంగంలో ప్రవేసించారు. ఆనాటి నుంచి తిరుగులెని గీత రచయితగా దాదాపు నాలుగువందల
చిత్రాలకుపైగా మాటలు ,పాటలు రచించారు. ప్రేమనగర్,డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు
మమతలు, విచిత్రబంధం,అర్ధాంగి,అదృష్టవంతులు,ఆత్మబలం,చిలిపికృష్ణుడు,బంగారు బాబు,పునర్జన్మ,
చక్రవాకం,మంచివాడు,మూగమనసులు ( ఈ చిత్రంలో కొన్ని మాటలు ముళ్లపూడి రచించారు),జీవన
తరంగాలు మొ" పేరుతెచ్చిన చిత్రాలు.
’తోడి కోదళ్ళు’ చిత్రంలో ఆయన రాసిన ’కారులో షికారు కెళ్ళే’ పాటను చాలామంది శ్రీశ్రీ రచన
అని అనుకోవడం జరిగింది పాటలు సరైన టైముకి వ్రాసి ఇవ్వక నిర్మాతలను, వ్రాసాక శ్రోతలను ఆత్రేయ
ఏడిపిస్తారని ఆయన గురించి పరిశ్రమలో చమత్కరించే వారు. 13-9-1989 న ఆయన మద్రాసులో
కీర్తిశేషులయ్యారు.
ఈ రోజు , మే 7 వ తేదీ ఆయన జయంతి నాడు మనసుకవిని స్మరించుకొందాం.
వోల్గా వీడియోస్ సౌజన్యంతో ప్రేమనగర్ చిత్రం లోని ఓ ఆత్రేయ గీతం మీకోసం.

Thursday, 6 May 2010



రచన దాసరి సుబ్రహ్మణ్యం స్మృతి సంచిక
చందమామ అభిమానుల కోసం "రచన" మే నెల సంచిక 244 పేజీలతో
వెలువడింది. ఇందులో చందమామలో తోకచుక్క, మకరదేవత లాంటీ అద్భుత ధారా
వాహికలను వ్రాసిన జానపద నవలా సామ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి
కొదవటిగంటి రోహిణీ ప్రసాద్,డా.వెలగా వెంకటప్పయ్య, వసుంధర, యండమూరి వీరేంద్ర
నాధ్, మన తెలుగు చందమామ బ్లాగు నిర్వహుకులు శివరామప్రసాద్ కప్పగంతు,
చందమామ డాట్ కమ్ కె.రాజశేఖరరాజు, ,రచన శాయి మొదలయిన చందమామ
ప్రేమికుల రచనలతో బాటు అలనాటి చందమామ చిత్ర కారుడు "చిత్రా" గారి చిత్రాలు,
వారిపై ఈనాటికీ బొమ్మలు గీస్తున్న శ్రీ శంకర్ గారు వెలిబుచ్చిన జ్ణాపకాలు పొందుబరచ
బడ్డాయి. చందమామ అభిమానులు కలకాలం పదిలపరచుకోవాల్సిన ఈ "రచన" సంచికను
ఈ రోజే కొనుక్కోండి.. మీకు స్ధానికంగా దొరకక పోతే rachanapatrika@gmail.com కి
మైల్ చేసి తెప్పించుకోండి.

Sunday, 2 May 2010



నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికివ్వాలి !!!

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ! అసలు కొందరు అసలు నవ్వినట్లు కనిపించరు.
ఉదాహరణగా చెప్పుకోవాలంటే "హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించే
చెప్పుకోవచ్చు. ఆయన చూడటానికి చాలా సీరియస్ గా అగుపించేవారు. కాని ఆయన
ఎన్నో హాస్యరచనలు చేశారు. రోడ్డు మీద ఎవరో అరటిపండు తొక్క మీద కాలేసి జారి
పడ్డారనుకోండి. అప్పుడూ నవ్వు రావచ్చునేమో కాని అది హాస్యమనిపించుకోదుగదా.
కొంతకాలంవరకు తెలుగు సినిమాల్లో ఓ కామేడియన్ మరో వ్యక్తిని కాలితో తన్నితే
అదీ హాస్యంగా చలామణి ఐపోయింది. ఇక ఇప్పుడు హాస్యమంటె బూతుకు పర్యాయ
పదమైపోయింది. ఒకనాటి మన తెలుగు సినిమాల్లొ రేలంగి తెరపై అగుపించగానే జనం
గొల్లున నవ్వే వాళ్ళు. ఇక హాస్య నటుల పాత్రలుకూడా కధలోని ముఖ్య పాత్రల్తో కలసి
సాగిపోయేవి. రేలంగి,రమణారెడ్డి పాత్రలకు ఉండే హాస్యగీతాలు కూడా సందేశాత్మ్కంగా
వుండేవి. ఇక్కడ మీరు "రాముడు-భీముడు" చిత్రం లో రేలంగిరిజలపై చిత్రీకరించిన
’సరదా సరదా సిగరెట్టు’ అన్న పాటను చూడండి. హాస్యానికి తోడు సిగరెట్ చేసే మంచీ
చెడులను కొసరాజుగారు అద్భుతంగా వ్రాసారు.
ప్రముఖుల చమత్కారాలు కూడా నవ్వును పుట్టిస్తాయనడానికి ఇవే మంచి
ఉదాహరణలు. శ్రి దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ఓ సారి జట్కాలో వెలుతున్నారట. ముందు
వైపు బరువు చాలక జట్కా వాడు "కొంచెం పైకి రండి సార్" అని అంటే "ఇంతకాలానికి
నువ్వొక్కడీవి కనిపించావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధృణ్ణి పైకి రమ్మన్నవాడివి" అంటూ
మెచ్చుకొన్నారు !. భమిడిపాటి కామేశ్వరరావుగారికికూడా తెలుగువాళ్ళపై ఇలాటి
అభిప్రాయమే వుండేది. ఆయన ఓ సంధర్భంలో "తెలుగువాడు దుర్యోధనుడి లాంటి వాడు.
దుర్యోధనుడు తనకేమీకావాలని అడగడు. ధర్మరాజుకి మాత్రం ఏమీ ఉండకూడదని కోరు
కుంటాడు" అని అన్నారు.
మీకు కొన్ని నవ్వుల చిట్కాలు!
ఉదయాన్నే లేచాక మంచి జోకులు పుస్తకం చదవండి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
మీకు తెలిసిన జోకులను ఇతరులతో పంచుకోండి. మీరూ మీ ఊళ్ళో "హాసం క్లబ్" ప్రారంభించండి.
నెలలో మూడో ఆదివారం ఏర్పాటు చేయండి. మీకు ఎందరో కొత్త కొత్త హాస్య ప్రియులు పరిచయ
మవుతారు. మీకు పత్రికల్లో బాగానచ్చిన కార్టూన్లను కత్తిరించి ఓ ఆల్బమ్ తయారు చేయండి.
అప్పుడప్పూడూ ఆ పుస్తకం తిరగేస్తుంటే మనసు ఉత్సాహంగా వుంటుంది. ఇక ఈ నవ్వుల రోజుకు
సెలవు తీసుకుంటూ ఆఖరుగా ఓ చిన్న జోకు...
"ఏవిటోయ్, అప్పారావ్, సుబ్బారావు అంత మంచి జోక్ చెబితే మేమంతా నవ్వేంకదా, నువ్వు
నవ్వవేం?" అడిగారు మితృలు.
" వాడంటే నాకు వళ్ళు మంట ! ఇంటికి వెళ్ళి నవ్వుకుంటా" అన్నాడు అప్పారావు..
  • Blogger news

  • Blogroll

  • About