RSS
Facebook
Twitter

Tuesday, 18 May 2010

" మండే " ఎండలు !!


ఈ ఎండాకాలం ఎప్పుడు ఎండవుతుందో ! అంటూ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళూ రోజులు
లెక్కపెట్టుకుంటున్నారు. ఐనా మనకు ఏ కాలం నచ్చుతుంది చెప్పండి. వర్షాకాలం
వచ్చాక, పాడు వర్షాలు ఇంట్లోంచి కదలటానికి లేదు. ఆ ఎండాకాలమే నయం. హాయిగా
ఉక్కపోసి చమట పట్టినా షవరుక్రింద స్నానం ఎన్నిసార్లు చేసినా ఎంతో’ హాయిగా వుండేది.
కరెంట్ కోతతో ఉక్కపోతతో వళ్ళంతా తడిసిపోయాక కరెంట్ వచ్చి ఫాను తిరుగుతుంటే
ఆ హాయే హాయి అని అనుకుంటాం. రాజకీయనాయకుల్లా క్షణాల్లో మాట మార్చేస్తాం !
ఇప్పుడు వార్తల్లో ఎండకు ఇంతమంది పరలోక యాత్ర అని వేస్తున్నట్లే వానాకాలంలో
రోడ్లన్నీ వర్షంనీళ్ళతో నిండి డ్రయనేజ్ కన్నాల్లో పడి కొట్టుకుపోయారని వార్తలు స్క్రోలింగ్లో
చూస్తాం. ఐనా పాపం ఆ సూరీడు ( మాజీ సీయం. ఆప్తుడువిషయం కాదండోయ్) తన పేరేగల ఆది
వారంకూడా రెస్ట్ తీసుకోకుండా పూర్తిగా తన ప్రతాపం చూపిస్తాడు. పోనీ మరునాడైన "మండే"
నాడు సెలవు తీసుకోకుండా మరింత "మండి" పొతాడు ! ’మండే’ రోజుగదా మరి ! ఆయన్ని
పాపం ఏమనలేం. పైగా ఇవి అయనకు ప్రతి వారాలూ మండేలే గదా ! "ఫ్రై" డే నాడైతే మరింత "ఫ్రై" చేస్తాడు
మనకు కావాలి టీ, కాఫీ హాట్ హాట్ గా !
ఉండాలి పేపర్,టీవీల్లో వార్తలు హాట్ హాట్ గా ! !
సిన్మాల్లో సీన్లు కనిపించాలి హాట్ హాట్ గా ! !
ఐనా సూరీడు మాత్రం తన ప్రతాపం చూపకూడదు హట్ హట్ గా ! !
ఇలా హాట్ హాట్ గా రాసి బుర్ర వేడెక్కి ఓ కప్పు కాఫీ ఇమ్మంటే శ్రిమతి ఏమందో నా కార్టూన్లోనే
చూడండి మరి. ఇక కట్ అంటూ కరెంట్ కట్టయింది ! ఉంటా టా టా టా !!

Monday, 17 May 2010






ఎంతమందో శాస్త్రవేత్తలు మనం ఈ నాడు అనుభవిస్తున్న ఎన్నో వస్తువులను
కనుగొన్నారు. వాళ్ళందరిలో నాకు చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టమైన శాస్త్రవేత్త
ధామస్ అల్వా ఎడిసన్. ఈ రోజు మనం చీకట్లో వెలుగును చూస్తున్నామంటేనూ,
మాధుర్యమైన పాటలను, సంగీతాన్ని వీనులవిందుగా ఆనందిస్తున్నామంటేనూ,
అలనాటి ప్రముఖుల స్వరాన్ని పదిలపరచుకుని ఈ తరం వారికీ వినిపిస్తున్నా
మంటేనూ దానికి మూల కారకుడు ధామస్ అల్వా ఎడిసనే. ఎలట్రిక్ బల్బు, గ్రామ
ఫోన్ మొదలైన పరికరాలను దాదాపు 1300 కనిపెట్టాడు. బల్బు కనిపెట్టడానికి
ముందు 299 సార్లు విఫలమైనప్పుడు ఎడిసన్ భార్య వేళాకోలం చేస్తే, " నేను బల్బు
కనిపెట్టడంలో ఫెయిలవ లేదు. ఏ విధంగా చేస్తే బల్బు కనిపెట్టలేమో అన్నది 299
పధ్దతుల్లొ తెలుసుకున్నాను" అని జవబిచ్చాడట., ఓటమి నుంచి కూడా పార్థాలు
నేర్చుకోవచ్చని ఎడిసన్ నిరూపించాడు. ఎడిసన్ ఒక సారి చిన్న దీపం పెట్టుకొని
చదువుకుంటూ వుండగా గాలికి దీపం ఆరిపోయింది. గాలి తగిలినా కూడా ఆరిపోని
దీపాన్ని కనుక్కోవాలనే ప్రయత్నమే ఆయన సృష్టించిన నేటి ఎలట్రిక్ బల్బుకు నాంది
అయింది. ఇక్కడ మీరు చూసే బొమ్మల్లో ఎడిసన్ కనుగొన్న మొదటి గ్రామఫోన్
ప్రకటన, వాక్స్ సిలిండర్ మీద పాటను రెకార్డు చేయటం, మొదటి ఎలట్రిక్ బల్బు,
అలనాటి గ్రామఫోన్ ( ఈ గ్రామఫోన్ నా దగ్గర వుంది) ఎల్పీ రికార్డు, నేటి అదునాతన
సిడీ బొమ్మలున్నాయి.

Sunday, 16 May 2010






దామెర్ల మెమోరియల్ ఆర్ట్ గాలరీ, రాజమండ్రి
ఆంధ్రదేశ చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరు.
అంతటి కళాకారుడు జీవించినది అతి కొద్ది కాలమైనా ( ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు
లోనే ఆయన అకాలమరణం చెందారు).ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ
మరువలేనిది. గోదావరి రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆనంకళాకేంద్రం వెనుక శ్రీ రామారావు
పేరు మీద ఓ ఆర్ట్ గాలరీ నిర్మించారు. శ్రీ రామారావు 1887 మార్చి 8వ తేదీన రాజమండ్రి
లో జన్మించారు. అతి పిన్న వయసులోనే ఆయన పెన్సిలు తో బొమ్మలు వేస్తుండేవారట.
పదేళ్ళ వయసులో వారి మేనమామ బహుకరించిన వాటర్ కలర్స్ తో ఆయన చిత్రకళా
ప్రతిభ దినదినాభివృద్ధి మానమయింది. ఆయన కుంచె నుంచి జాలువారిన రంగుల చిత్రాలు
కొన్ని ఇక్కడ మీకోసం. మీరెప్పుడైనా రాజమండ్రి వస్తే దామెర్ల రామారావు గారి చిత్రాలను
చూడటం మరచిపోకండి.ఈ ఆర్ట్ గాలరీ ప్రభుత్వ నిర్వహణలో వుంది కాబట్టి సందర్శకులు
చూడటానికి నిర్ణయించిన టైమ్ మాత్రం అంత సదుపాయంగా లేదనే చెప్పాలి. ఆఫీస్ టైముల్లా
ఉదయం 9-00 గంటల నుంచి మధ్యహ్నం 12-00 గంటల వరకు తిరిగి 2-00 గంటల నుంచి
సాయంత్రం 5-00 గంటల దాకా అనుమతించడం బాగుండలేదు. శుక్రవారం సెలవుతో ఆదివారం
తెరచి వుంచడం మాత్రం కాస్త ఊరట కలిగించే విషయం.

Saturday, 15 May 2010




సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ 207 వ జయంతి నేడే ! ఆయన భారతదేశంలో పుట్టకపోయినా ఈ దేశప్రజల
శౌభాగ్యం కోసం తపించాడు. ఈనాడు ఉభయ గోదావరీ జిల్లాలు సస్యశామలంగా ఉన్నాయంటే ఆ మహాను
భావుడి నిరంతర కృషే కారణం. గోదావరి జిల్లాల రైతులోకం కాటన్ మహాశయుణ్ణి మరో భగవంతునిగా ఈ
నాటికీ ఆరాధిస్తారు. మానవుడికి అమరత్వం అతను చేసిన కృషి వల్లే కలుగుతుంది. గోదావరిపై ధవళేస్వరం
లో ఆనకట్ట నిర్మించి కరవు కాటకాలను రూపుమాపాడు. క్రీ"శ" 1803 మే 15వ తేదీన ( ఈ రోజే ) ఇంగ్లాండు
లోని ’కాంబర్మిర్ అబీ’ అనే గ్రామంలో హెన్రీ, కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ సంతానంగా కాటన్ జన్మిం
చాడు. 15వ ఏట మిలటరీ శిక్షణాలయంలో ఇంజనీర్గా శిక్షణ పొందాడు. పద్దెనిమిదోయేట ఈస్టిండియా కంపెనీ
వారిచే చెరువుల శాఖకు సంభందించిన సూపర్టెండెంట్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. కొంతకాలం తరు
వాత కాటన్ ను గోదావరి సీమలో నిర్మాణాత్మక కార్యక్రమాన్ని సూచించడానికి నియమించారు. అందుకోసం
రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరిని పరిశిలించి పంపిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 1847 ఏప్రియల్లో
నాలుగు భాగాలుగా ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా పన్నెమ్డు అడుగుల ఎత్తు గల రాతి కట్టడంతో ఆనకట్ట
నిర్మించాడు. 1852 మార్చి 31 నాటికి నిర్మాణం పూర్తిచేశాడు. నిర్మాణానికి ఐన ఖర్చు 16,60,000/- రూపాయలు.
ఆనకట్ట మొత్తం పొడవు 11,945 అడుగులు. దాదాపు వంద సంవత్సరాలు సేవలందించిన ఆనకట్ట పునాదులు
కుంగడంతో పాత ఆనకట్టకు నలభై మీటర్ల దూరంలో కొత్త ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 141 కోట్ల ఖర్చుతో నిర్మిం
చిన బారేజ్ 1982 అక్టోబర్ ఇరవతొమ్మిదిన ప్రారంభించబడ్డది. దానికి సర్ ఆర్ధర్ కాటన్ బారేజీ గా పేరు పెట్టారు.
కరవు గోదావరి జిల్లాలనుంచి మాయమైందంటే అది కాటన్ పుణ్యమే ! అందుకే కాటన్ కీర్తి గోదావరీ జలాల్లో
కలకాలం నిలచి వుంటుందనటంలో సందేహంలేదు. ఆ మహను భావుడి జయంతి రోజున తెలుగు ప్రజలందరి
తరుఫున నమోవాకాలు తెలియజేస్తున్నాను.

Thursday, 13 May 2010

పేరడీ జ్యొతి పంచాంగం !!




శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ
జ్యోతీ పన్చాంగమ్
1963 బాపు రమణగార్లు తమ మిత్ర బృందంతో ప్రారంభించిన "జ్యోతి" మాసపత్రిక ఉగాది
సంచికలో అనుభందంగా ఇచ్చిన పేరడీ పంచాంగం చదవడానికి చాలా సరదాగా వుంటుంది.
బాపురమణల ’ఇంకోతి కొమ్మచ్చి’లో ఈ పంచాంగం వేశారు. జ్యోతిలో ఆనాడు వేసిన
పంచాంగంలో వేసిన ప్రకటనలు కూడా నవ్వులు కురిపిస్తాయి. అలాటి ఓ ప్రకటన మచ్చుకి
చదవండి.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * **
బహుమతి ! బహుమతి ! !
అద్భుత మాయా స్పెషల్ సత్తు ఉంగరం
ఇది చేతి వేలుకు పెట్టుకొని, తలకు మందు రాసుకొన్నచో తలనొప్పి
పోవును. కోర్టులో జయము, అందమగు స్త్రీలు వశమూ,కీళ్ళ నొప్పులు
బస్సు కు డబ్బు లేనివారికి కాళ్ళ నొప్పులు, వీణ సితారు విధ్వాంసులకు
వేళ్ళ నొప్పులు . ఉంగరం వెల బేడ. స్పెషలు పావలా, ఎగస్ట్రా స్పెషలు
ఆరణాలు ! రెండు ఉంగరములు కొనినవారికి పదిహేను రూపాయల రోలీ
కెమేరా, ఇరవై ఐదు రూపాయల రిస్టువాచీ ఉచిత బహుమతి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ఈ పేరడీ ప్రకటన లాగానే ఇప్పుడు టీవీ చానల్లలో వస్తున్న తాయెత్తుల ప్రకటనలూ
వుంటున్నాయ్!!

అన్నట్లు మీకు ఈపాటికి తెలిసే వుంటుంది. భాపు రమణుల "కోతికొమ్మచ్చి" తెలుగు
అర్ధమై చదవటం రాని తెలుగువాళ్ళకోసం ఎస్ఫీ బాలు మధుర గాత్రంతో ఆడియో సిడీలు
గా విడుదలయ్యాయని.!!


  • Blogger news

  • Blogroll

  • About