RSS
Facebook
Twitter

Sunday, 18 July 2010




ఇంతకుముందు మనం ఏ ఆఫీసుకు వెళ్లినా టైపు రైటర్ చేసే టిక్ టిక్ శబ్దాలు
వినిపిస్తుండేవి. ఇక ఆ టైపు నేర్పటానికి ప్రతి వీధికి ఒక ఇన్స్టిట్యూట్ అగుపించేది.
కాల క్రమాన కంప్యూటర్లు ప్రవేశించాక టైపు మిషన్లు అగుపించడం దాదాపు మానే
సాయి.ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు ఉండేవాడు. ఇప్పుడో ప్రతి బల్ల
మీదా కంప్యూటర్లే ! కావలిసిన మాటర్ని టైపు చేసి సులువుగా సేవ్ చేసుకొనే
సదుపాయం కలిగింది. మరో విషయం టైపు రైటర్ అనగానే సాధారణంగా అమ్మాయిలే
టైపిస్టులుగా ఉండేవారు. మీకు "పెళ్ళినాటి ప్రమాణాలు" సినిమా గుర్తుందా. అందులో
రాజసులోచన టైపిస్టు. ఆ అమ్మాయిని ఇష్టపడే ఇద్దరు ముసలి గుమాస్తాలు అల్లు,
చదలవాడ కుటుంబరావులు చేసే కోతి చేష్టలు భలే నవ్వులు కురిపిస్తాయి.1868లో
క్రిష్టఫర్ లాతమ్ షోల్స్ మొట్టమొదటి టైపు రైటర్ కనుక్కొన్నాడు.తరువాత అతని నుంచి
రెమింగ్టన్ కంపెనీ రైట్స్ సంపాదించి ఉత్పత్తిని ప్రారంభించింది. టైపు రైటర్ని ఉపయోగించిన
ప్రముఖ రచయితలు మార్కట్వైన్,లియో టాల్స్టాయ్.. తమ రచనలకు టైపు రైటర్నే
ఉపయోగించే వారట. కొత్తది రాగానే పాతది కనుమరుగవటం సాధారణమే. కానీ OLD
IS GOLD అని మన పెద్దలమాటను గౌరవిస్తూ మీ దగ్గర ఓ వేళ పాత టైపు మిషన్ ఉంటె
పారేయకండి. పాత తరం గుర్తుగా జాగ్రత్త చేయండి. నా దగ్గర ఆ నాటి పాత టైపు మిషను
ఇంకా వుంది. ఇలా టైపు రైటర్ గురించి మీతో చెప్పటానికి కారణం ఈ మధ్య బొంబాయి
TIMES OF INDIA పత్రికలో DEATH OF THE TYPEWRITER అన్న ఆర్టికల్
చదివి, రాజమండ్రి కి తిరిగి రాగానే నా టైపు రైటర్ని ఆప్యాయంగా మరోసారి తనివి తీరా
చూసుకున్నాను.




!

Friday, 9 July 2010

నవ్వుల జల్లులు కురిపిస్తున్న ఈ రమణీయుణ్ణి, బాపురే అనిపిస్తూ చిత్రగీతలని గీస్తున్న
యువ జంటని గుర్తుపట్టారా ! ఈ ఇద్దరబ్బాయిలూ అశేషాభిమానుల గుండెల్లో
నిత్యయవ్వనులుగా నిలచిన బాపూరమణీయులు !! ఇప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు
మరో బాలు(డు)గారితో ఈటీవీ ’పాడుతా తీయగా’ ప్రేక్షక శ్రోతలకు వీ(క)నులను రమణీ
యం చేయబోతున్నారు. ఇంకేం, ఈ నెల 12వ తేదీ సోమవారం రాత్రి 9-30 గంటలకు
ప్రసారం అవుతున్న బాలు(పూ) రమణీయం అనే "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని
తప్పక చూడండి. బాపు చిత్రాల్లోని (అదే నండీ సినిమాల్లోని) క(ర)మణీయ పాటలను
!ఆస్వాదించండి!

Wednesday, 7 July 2010


ముత్యాల ముగ్గులేసిన చిన్నారి పిచ్చుకమ్మ!!

ఆంధ్రప్రదేష్ లో చాలా నగరాల్లోని పిల్లలకు పిచ్చుకలంటే ఏమిటో తెలియదు.
అలనాటి డైనొసార్ల లాగ కనుమరుగైఫోయాయి. కాని, ఈ ముంబాయి మహా
నగరంలో మాత్రం ప్రతి రోజూ పిచ్చుకలు ప్రత్యక్షమవుతూ కనువిందుకలిగిస్తు
న్నాయి! బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చి గెంతులేస్తూ చిరు ఎండ లో
పడిన గ్రిల్ల్ నీడను ముక్కుతో పొడుస్తుంటే తన చిన్నారి ముక్కుతో ముగ్గు
లేస్తున్నట్లు అనిపించింది ! వెంటనే నా కమేరాలో ఆ పిచ్చుకమ్మ కళానైపుణ్యాన్ని
దాచేశా!

Tuesday, 6 July 2010




ఒక్కొక్కప్పుడు మనం ఈ కాలంలో పుట్టివుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది. కానీ ఈ నాటి
చిన్నారుల కష్టాలు (వాళ్ళ నాన్నల,అమ్మల దృష్ఠిలో కాకపోవచ్చు) చూస్తుంటే మనం (మా వయసు
వాళ్ళ మాట సుమా నే చెప్పేది) ఈ కాలంలో పూట్టకపోవడమే దేముడిచ్చిన వరమెమోననిపిస్తుంది.
మా రోజుల్లో ఇప్పటిలా ఇంగ్లీష్ కాన్వెంట్లు లేక పోవచ్చు. మంచి చదువు చెప్పే బడులుండేవి. టీచర్లు
వ్యక్తిగత శ్రర్ధ తీసుకొనేవారు. అప్పుడు ఆ స్కూళ్లల్లో చదివిన వాళ్ళు గొప్ప డాక్టర్లయ్యారు,ఇంజనీర్లయ్యారు,
టీచర్లు,ప్రొఫెసర్లయ్యారు. నేను చదివిన మా రాజమండ్రి శ్రీ రామచంద్రా సిటీ హైస్కూల్లో 1956 SSLC
బాచ్ క్లాసులో అందరం పాసయ్యాము. మాకు ప్రతి ఆదివారం ఉదయం ఇంగ్లీష్ ప్రయవేట్ క్లాసు పెట్టే
వారు. లెఖ్ఖల మాస్టారు ప్రతి రోజూ ధీరమ్స్ అన్ని ప్రతి ఒక్కరిచేత ఐదు సార్లు ఇంపొజిషన్ వ్రాయించి
ఉదయాన్నే ఆయన టేబిల్ మీద ఉంచమనే వారు.అందుచేత లెఖ్ఖల్లో మొద్దబ్బాయి నైన నాకూ కంఠతా
వచ్చేవి. పరిక్షలవగానే శెలవులిచ్చేవారు. శెలవుళ్ళో మా బామ్మగారి ఊరు బాపట్లకి వేళ్ళేవాళ్ళం.ఏదీ
ఇప్పటి పిల్లలకు విశ్రాంతి ఎక్కడ? వాళ్ళు డిగ్రీ లేక పోతే ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యెదాకా చదువే
చదువు.
బొంబాయిలో మా అబ్బాయి దగ్గర ఓనెల గడప టానికి వచ్చిన మాకు,మా మనవడు చి" కౌస్థుభ్ ను
(వాడికి నిండా మూడేళ్ళు లేవు) ఉదయం ఆరింటికే నిద్రలేపి స్నానాలు పానాలు బలవంతంగా పూర్తి
చేయించి యూనిఫాం, మెళ్ళో ఓ బిళ్ళ ( అదే నండి, ఫొటో గట్రా) తగిలించి, వీపు వెనుక ఓ బ్యాగు,అందులో
ఓ రైన్కోటు, టిఫిన్ బాక్సు,వాటర్ బాటిల్ వగైరా ఉంచి, 7.30 కల్లా వచ్చే స్కూల్ బస్లో(తోసి)ఎక్కించి
మావాడు పని చేసే మలాడ్ లో ఉన్న ఆఫీస్ కు ఉరుకులూ పరుగులతో బయలుదేరటం చూస్తూంటే
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మాకు అలవాటై పోయింది,మీరేం వర్రీ కాకండి అంటాడు. ఈ సంధర్భంలో
నాకు నే చదివిన పాత చందమామలోని కధ జ్ణాపకం వస్తుంది. ఆ కధలో తండ్రి చెట్టుక్రింద నీడలో కూర్చుని
ఉంటే కొడుకు మిట్టమధ్యహ్నం ఇల్లు నేస్తుంటాడు.ఎండగా ఉంది కాసేపు దిగరా అంటె కొడుకు వినిపించు
కోడు. అప్పుడు తండ్రి ఏడాది మనవణ్ణి తీసుకొచ్చి ఎండలో కూర్చోపెడతాడు. వెంటనే కొడుకు దిగి వచ్చి
అదేమిటి పిళ్ళాణ్ణి ఎండలో ఉంచారు అంటాడు కోపంగా.ఇప్పుడు తెలిసిందా తండ్రి ప్రేమంటే ఏమిటో అని
తండ్రి జవాబిస్తాడు. పిల్లలు పెద్దవాళ్ళైనా మనకు (మాకు) చిన్నవాళ్ళే కదండీ.

Friday, 2 July 2010




"స్వాతి" వార పత్రికలో వారం వారం పంచ రత్నాల లాంటి పంచ రంగుల కార్టూన్లను
శ్రీ బాపు అందిస్తున్నారు.గతంలో వచ్చిన300 కార్టూన్లను ఋషి బుక్ హౌస్ వారు
మంచి ఆర్ట్ పేపర్ మీద రంగుల్లోగట్టి అట్టతో ’అట్ట’ హాసంగా అచ్చొత్తారు. మనకు ఏం
తోచనప్పుడూ, బోర్ కొట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేకుండా బయట వర్షం
కురుస్తున్నప్పుడు ( ఐనా వర్షం బయటగాక ఇంట్లో కురుస్తుందా ) సరదాగా పదే
పదే చూసి ( ఆ అందమైన బొమ్మలు చూసినా చాలు) చదివి నవ్వుకోవచ్చు. ఈ బాపు
గారి కార్టూన్లు ఒట్టి సంసార పక్షంవి, శృంగార పక్షంవి,,దేముళ్ళు దేవతలవీ, ఆ నాటి ఈ
నాటి కవులవి. రాజులవి, రాజకీ(చ)య నాయకులవీ,డాక్టర్లవి వాళ్ల పేషంట్లవీ, కారులూ,
కళాకారులవీ, గుళ్ళూ వాటి పూజారులు వాళ్ళ భార్యలవీ ( బాపు గారు గుళ్ళను ఎంత
అందంగా వేశారో), జంతువులూ, వాటి సంసారాలవి మనకు ప్రతి పేజీలోనూ
అగుపడి ( పేజీ ఒకే రంగుల బొమ్మే నండి) నవ్వుతూ పలకరిస్తాయి.
రిమోట్ నొక్కగానే మాయమైపోయే టీవీ ( పే.15), ఇంటిల్లిపాదీ టివికి అతుక్కుపోతే,
తన క్లాసు పుస్తకాలకు అతుక్కుపోయిన చంటాణ్ణి చూసి తెగ బెంగ పడిపోతున్న అమ్మ
( పే 35), కోడలి మూగనోము గురించి సంబరపడిపోతున్న అత్త (పే 57),ఇంటికి వచ్చిన
అతిధులు ఎంతకీ కదలకపోతే ఇది తమ ఇళ్ళు కాదేమో తామే వాళ్ళింటికి వచ్చామేమో
అని అనుమాన పడుతున్న భర్త ( పే157),తన రూముకు వచ్చిన స్నేహితురాలితో " ఆ
విక్కీ గాడితో పార్కుకు వెళ్ళావేమిటే" అంటున్న అమ్మడు( పే261) .ఈ కార్టూన్ చూడగానే
బాపు గారి భావం మీకు వెంటనే స్ఫురిస్తే మీరు మంచి శృంగార పురుషులన్నమాటే.!! ఇలా
ఒకటేమిటి ప్రతి కార్టూనూ ఓ ఆణిముత్యమే!మీ దగ్గర ఈ నవ్వుల రంగుల కార్టూన్ పుస్తకం
లేకపోతే ఇప్పుడే తీసు"కొనండి" !!
  • Blogger news

  • Blogroll

  • About