RSS
Facebook
Twitter

Wednesday, 12 October 2011

క్రిందకూ, పైకీ.......!!!


Wednesday, 5 October 2011




ఆడువారు అంటే "ఆడు" వారు కాదండి ! మాటలాడువారని నా భావన!
మాటలకు అర్ధాలు ఎలా మారిపోతున్నాయో ! అదే మన తెలుగు భాష
కున్న సౌకర్యం.తెలుగుతో మాటలాడుకోవడమే కాదు ( ఐనా మన తెలుగు
వాళ్ళు తెలుగులో మాట్లాడు కోవడం తక్కువే కదా ) ఆ మాటలతో ఆటలు
ఆడుకోవచ్చు! ఒక్కో సంధర్భాన్ని బట్టి , ప్రాంతాలను బట్టి అర్ధాలు ఇట్టే
మారిపోతాయి. మీరు కొత్తగా స్కూటరో , బైకో కొనుక్కుని బయటకు
వచ్చారనుకోండి. వెంటనే మీకు ఎదురయ్యే ప్రశ్న, "పెట్రోల్ ఎంతిస్తుంది?"
అని. అసలే పెట్రోలు ధర పెట్రోలులా మండిపోతుంటే ఆ ప్రశ్నతో మనకు
మరింత మండి పోతుంది ! అదేమన్నా కామధేనువా, కాకపోతే ఏ ఆవా,
గేదా, పాలిచ్చినట్లు పెట్రొలు ఇవ్వడానికి.


ఇక నేను బ్యాంకు నుంచి రిటైరైన కొత్తలో,; కనిపించిన ప్రతి వాడూ "ఏంటీ,
అప్పుడే రిటైరై ఫోయారా? అని ఆడిగే వారు. నేనూ, " మీరు విన్నది సగం
నిజం, సగం అబద్ధం ! ఏమంటే నేను రిటైరయ్యాను అన్నది నిజం. కానీ
ఫొయిన మాట మాత్రం అబద్ధం. ఇదిగో దయ్యంలా మీ ముందు నిలబడి
వున్నాకాబట్టి" అని జవాబిచ్చేవాడిని. ఇలా ఈ ప్రశ్నలను బట్టి ఓ కార్టూన్
కూడా వేసేశా!
నేను శ్రీకాకుళం స్టేటు బ్యాంకులో క్యాషియరుగా 1963లో చేరినప్పుడు
బ్యాంకు మెసెంజరు ( అతని పేరూ అప్పారావే, ఉత్తరాంధ్రలో చాలా
పేర్లు అవే ఉంటాయి) "ఇక్కడ దోమలు లావు ! జాగ్రత్తండీ " అన్నాడు.
నే కంగారు పడుతుంటే క్యాష్ ఆఫీసరు కామేశ్వరరావుగారు "కంగారు
పడకు. లావంటే ఏనుగుల్లా లావని కాదు. ఎక్కువ అని అర్ధం" అన్నారు.
అక్కడ బైటకు వెళ్ళారనడానికి పైకి వేళ్ళారంటారు. నేనొకసారి వైజాగులో
పనిచేస్తున్నప్పుడు ఒకరింటికి వెళ్ళి ఉన్నారా అని అడిగితే " పైకి
వెళ్ళారు" అని జవాబిచ్చారు వారి శ్రీమతి. నేను ఆయన మేడమీద
ఉన్నారేమోననుకొని "ఒకసారి పిలుస్తారా" అనంటే "బజారులో ఎంత
దూరంలో వున్నారో ఎలా వీలవుతుందండీ?"అన్నారు. అప్పుడు తెలిసింది
పైకి అంటే బయటకు అని. ఇప్పటిలా అదృష్టంకొద్దీ అప్పుడు సెల్ ఫోన్లు
లేవుగా!!
"టిఫిను చెయ్యడం ,టిఫిను తీసుకొని రావడం": ఈ మాటల్లోనూ తిరకాసు
వుంది. చాలాకాలం తరువాత ఉదయాన్నే ఇంటికొచ్చిన స్నేహితుడితో
హలో హలో పలకరింపులయ్యాక "కూర్చోవోయ్ ! పదినిముషాల్లో టిఫిన్
తీసుకొనస్తా" అంటూ లోపలికి వెళ్ళిన ఫ్రెండు ఓ పదిహేను నిముషాల
తరువాత ఖాళీ చేతుల్తో బైటకు వస్తే ఆశగా టిఫిన్ తీసుకొస్తాడేమోనని
ఎదురు చూసిన స్నేహితుడి బుర్రకు అప్పుడర్ఢమవుతుంది అతను లోపల
టిఫిన్ తీసుకొని (కానిచ్చి) వచ్చాడని. అలానే టిఫిన్ చేద్దూగాని అంటూ
బజార్లో అగుపించిన మితృన్ని ( అతడు అన్ని రకాల (పిండి)వంటలూ
బాగా చేస్తాడని తెలుసుకొని) ఇంటికి పిలవడమ్లోనూ వేరే అర్ధముంటుంది.





"ఏమిటో ఈ బందులతో మహా ఇబ్బందిగా వుంది.ఊరికెల్దామంటే బస్సులూ,
రైల్లూ తిరగడంలేదు" అన్నాడో మితృడు రెండు రోజుల క్రితం. "బస్సులు
తిరిగితే మాత్రం నువ్వు మీ ఊరెళ్ళడం కుదరదు కదా అన్నా". "ఏం? ఎందుకు
కుదరదు?" అన్నాడు "!బస్సులు నడవాలిగాని,అదే తిరిగితే ఇక్కడే ఉంటావు"
అన్నా. "బస్సులు నడవడానికి వాటికి కాళ్ళుంటాయా?! తిరగడం అన్న మాటే
కరెక్ట్ అన్నాడు. "సరే! తిరగడం, నడవడం రెండూ తప్పే! చక్రాలుంటాయి కాబట్టి
దొర్లడం అనటమే కరెక్ట్ మాట అన్నాను. " ఈ మధ్య బస్సులూ రోడ్లమీద తరచు
దొర్లుతూనే ఉన్నాయ్"అన్నాడు మరొ మితృడు మధ్యలో కలగచేసుకొని.
పడటమన్నా నానా అర్ధాలున్నాయి. "ఈ మధ్య మీ కార్టూన్లేమన్నా పత్రికల్లో
పడ్డాయా" అంటూ మా మితృడు హనుమంతరావడిగితే, " పత్రికలవాళ్ళు
త్రిప్పి పంపిన కార్టూన్లు పోస్ట్మాన్ విసిరితే హాల్లొ పడ్డాయ్!" అంటూ మా పద్మ
జోకెయ్యగానే, వెంటనే ఆ ఐడియాతో కార్టూన్ వేయగానే నిజంగానే "రచన"
పత్రికలో ఆ కార్టూన్ పడింది. అలానే పడటం మీద " నాకు ఏసీ పడదు " అని
ఒకాయన అంటే ఆ "పడటం" మీద ఓ కార్టూన్ వేశాను. శ్రీ ముళ్లపూడి వెంకట
రమణగారు ఈ నా కార్టూన్లను ఎడా-పెడా-ర్ధాల కార్టూన్లంటూ నా కార్టూన్ల
పుస్తకానికి ముందుమాట చెబుతూ అన్నారు.
పెద్దల మాటలకు అర్ధాలే వేరులే !!
*ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీ శ్రీ కనబడితే మొక్కపాటి
నరసింహశాస్త్రిగారు " ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " శ్రీ శ్రీ సమాధానం.
<><><><><>
*ఈ రెండో జోకులోనూ శ్రీ శ్రీ గారే కధానాయకుడు.మదరాసులో
పూర్వం ఒక తెలుగు కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు.
కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినవి ఆర్డరిస్తున్నాము. శ్రీశ్రీ
తనకి సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి
"శ్రీ శ్రీ గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు " అన్నాడు.
<><><><><><>
"ఎచటికండీ అంత త్వరగా బోవుచుంటిరి ?"
"జపానికి"
"అమ్మో అంతదూరమే ?"
"జపానికి కాదండీ-జపమునకు" అని వాని తెలివితక్కువకు
నవ్వుకొనుచు జపాన్ కు బోవును.
ఈ జ్యోకులు బాపు రమణల బృందం అందించిన "జ్యోతి" మాస పత్రికనుంచి
వారికి తెలియకుండగ సంగ్రహించ బడినవి. అందులకు నేనెంతయో వారికి
కృతజ్ఞతలు చెప్పుచున్న వాడను.
.

Tuesday, 4 October 2011

యన్టీయార్ "పాండురంగ మహత్మ్యం", "నర్తనశాల", ఏఎన్నార్ "మహాకవి కాళిదాసు"
లాంటి పౌరాణిక చిత్రాలతో తెలుగు చిత్రాలకు అఖండ విజయంతో బాటు విదేశాలు,
మధ్యప్రదేశ్ లాంటి ప్రక్క రాష్ట్రాలలో కూడా పేరు ప్రఖ్యాతులను గడించిపెట్టిన దర్శకులు
శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఆయన పౌరాణిక చిత్రాలే కాదు
"గుండమ్మ కధ" చిత్రంతో హాశ్యాన్ని పండించారు ఇంతటి ప్రతిభావంతుడైన ఈయన
దాదాపు యాభై చిత్రాలకే పరిమితమవడం ఆశ్చర్యమే !! ఆయన పౌరాణిక చిత్రనిర్మాణం
లోని ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత హిందీ చిత్ర నిర్మాత రామానంద సాగర్ తాను తీయ
బోయే హిందీ పౌరాణిక ధారావహికలకుముందుగా కామేశ్వరరావుగారి చిత్రాలను
పరిశీలించారంటే ,అదిఆయన ప్రతిభకు నిదర్శనం.ఆయన హెచ్ యమ్ రెడ్డి, బియన్.రెడ్డి,
కె.వి.రెడ్డిల దగ్గరచిత్ర నిర్మాణ మెలుకవలు నేర్చుకున్నారు. దర్శకుడిగా ఆయన చిత్రాలు
"చంద్రహారం", "గుణసుందరి కధ" (తమిళం), "పెంకిపెళ్ళాం" వరుసగా అపజయం చెందినా
కామేశ్వరరావుగారు అపజయాలనూండే పట్టుదలతో విజయాలను సాధించారు.
ఆయనను అమితంగా గౌరవించే యన్టీ రామారావు తన చిత్రం "పాండురంగ మహాత్మ్యం"
దర్శకత్వాన్నిఆయనకు అప్పగించి అఫూర్వ విజయాన్ని సాధించారు
తను దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటిలోకి "నర్తనశాల" ఆయనకు బాగా
నచ్చిన చిత్రం. అందులో యన్టీయార్ ను బృహన్నలపాత్రలో అద్భుతంగా చూపించారు
శ్రీ కామేశ్వరరావు. ఆ పాత్రను శ్రీ రామారావు అనన్యసామన్యంగా పోషించారు.


"నర్తనశాల" చిత్రంలో కీచకునిగా నటించిన యస్వీ.రంగారావును "విశ్వనట చక్రవర్తి"
గాచేసింది. జకర్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటునిగా, ఆ చిత్ర
కళాదర్శకుడికి పురస్కారాన్నిగెలుచుకున్నది. ఈ ఫొటోలో జకర్తాలో జరిగిన
ఆసియా-ఆఫ్రికా పిల్ము ఫెస్టివల్లో ఆనాటి ఇండోనేషియా అద్యక్షుడు శ్రీ సుకర్నోతో
యస్వీ రంగారావు, సావిత్రి, నిర్మాత లక్ష్మీరాజ్యం.



"మహాకవి కాళిదాసు" చిత్రం ఈనాటికి ఓ కావ్యంగా నిలిచిపోయిందంటే అందుకు
ఏయన్నార్ తో బాటు ఆ చిత్రానికి పనిచేసిన కవి నాగేంద్రరావుగారు, సంగీత
దర్శకుడు పెండ్యాలగారు, కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేగారు ,ఈ మహామహుల
సహకారంతో శ్రీ కామేశ్వరరావుగారు దర్శకప్రతిభే ముఖ్యకారణం. ఈ చిత్రం అక్కినేనికి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ"Ratna of Kalidas Academi" పురస్కారం లభించడం విశేషం.
షరా మామూలుగా ఇంతటి ప్రతిభావంతుడైన దర్శకునికి ప్రభుత్వంనుంచి ఎలాంటి
గౌరవం పురస్కారం లభించలేదు. కళాభిమానులందరి తరఫున ఈ మహనీయుని
శతజయంతి సంధర్భంగా నివాళులు

Sunday, 2 October 2011



ఈ ఫొటోలొని నటున్నికాదు కాదు గాయకుణ్ణి చూశారా! ఆయనే శ్రీపాద జిత్మోహన్ మిత్రా!
పేరుని బట్టి మరోలా అనుకోకండి. ఈయన నూరుపాళ్ల తెలుగువాడే. జిత్ అనే మేమంతా
పిలుస్తాం. జిత్ పాడితే అచ్చు కిషోర్ పాడినట్లే వుంటుంది. అందుకే జిత్ ఆంధ్రా కిషోర్ గా
పేరుపొందాడు. రాజమండ్రి పరిసారాల్లో సినిమా షూటింగ్ అంటే నిర్మాతలకు అన్నివిధాలా
సహకరాన్ని జిత్ అందిస్తాడు. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" సినిమాలో
శంకరశాస్త్రిని "హల్లో శంకరశాస్త్రి" అంటూ పాటపాడుతూ గోలచేసిన పాత్రలో మీరు జిత్ ను
చూసే వుంటారు. కె.విశ్వనాధ్ జిత్ గురించి చెబుతూ "రాజమండ్రి పేరు చెప్పగానే మాకు
ముందు గుర్తుకొచ్చే పేరు జిత్మోహన్ మిత్రా. గోదావరి అందాలు,నది ప్రక్కన దేవాలయాలు
నర్సరీలు వంటి అందమైన లొకేషన్సుని మేము వెండితెరపై చూపెడుతున్నామంటే దానికి,
ముఖ్యకారకుడు, స్పూర్తి, మార్గదర్శి మా జిత్మోహనే. "శారద" తీస్తున్నప్పుడు ఆయనతో
అయిన పరిచయం ఆ తరువాత "సిరిసిరిమువ్వ","శంకరాభరణం","స్వాతిముత్యం" వంటి
చిత్రాలతో బాగా బలపడింది." హాస్యనటుడు ఆలీని తెలుగుతెరకు జిత్ పరిచయం చేసిన
విషయాన్ని ఈ నాటికి శ్రీ ఆలీ చెబుతుంటాడు. 30-3-1943 లో జన్మించిన జిత్ నాన్న
గారు శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడరు గుమాస్తా. ఆయన మంచి రంగస్థల నటులు. జిత్ సోదరుడు
కీ"శే" పఠాభి కూడా నటుడిగా పేరుపోందారు. జిత్ శ్రీమతి R&B శాఖలో అసెస్టెంట్
ఇంజనీరుగా పనిచేసి రెటైరయ్యారు. జిత్ 1954లోమొట్టమొదటిసారిగా తను చదివే
మునిసిపల్ హైస్కూళ్ళొ "బైజుబావరా’ చిత్రంలోని "ఓ దునియా కే రఖ్ వాలే" అనే పాటతో
తన గానకళకు స్వీకారం చుట్టాడు. జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా పేరిట 1970లో
స్వంత బృందం ఏర్పరిచి ఇప్పటివరకూ 3000 ప్రొగ్రాములపైగా నిర్వహించాడు.
1975లో మొదటిసారిగా శ్రీ బాపు దర్శకత్వంలో "ముత్యాలముగ్గు" సినిమాద్వారా సినీ
రంగ ప్రవేశం చేశాడు.
సప్తపది చిత్రంలో శ్రీమతిజానకి పాడిన "గోవుల్లుతెల్లన, గోపయ్య నల్లన" పాటలో
తన కుమార్తె లలితతోనటించిన సన్నివేశం ఆ పాట లాగానే ప్రేక్షకుల హృదయాల్లో
ఈనాటికీ నిలచిపోయింది.


కళాతపస్వి దర్శకులు విశ్వనాధ్ గారిద్వారా సన్మానం అందుకున్నాడు శ్రీ జిత్..శ్రీ ముళ్లపూడి
తన ముక్కోతికొమ్మచ్చిలో "అందాలరాముడు" అవుట్ డోర్ షూటీంగ్ సమయంలో జై ఆంధ్రా
ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు జిత్మోహన్ ఎలా సహాయంచేశాడో రమణగారి మాటల్లో
"జై ఆంధ్రా ఉద్యమం అంత ఉధృతంగా ఉండగా వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు-చచ్చినా
జరగనివ్వమని జై ఆంధ్రా లీడర్సు కొందరూ- అక్కినేని షూటింగును ఎలా ఆపుతారో చూస్తామని
నై ఆంధ్రాలీడర్స్ కొందరూ రాజమండ్రినుంచి రెండు లారీల్లో దేవీపట్నం లోకేషనుకు బయలు
దేరుతారని కబురు వచ్చింది..నేనూ,సితారాముడూ కారు మీద ఎగిరి వెళ్ళాం.అక్కడ యూనియన్
లీడర్సులో ఒకడూ,నటుడూ,డాన్సరూ,లాయరూ,శ్రీపాద పఠాభిగారి తమ్ముడూ అయిన జిత్
మోహన మిత్రా గారి సహాయ సహకారాలతో ఆ ఊరేగింపు నాయకులను ఆపి, ఈ షూటింగ్
మూడునెలల క్రితమే నిర్ణయించుకున్నామనీ, అడవిలో ఏ మూలో కొండ కోనల్లో జరిగే పనులు
ఆపితే-రెండు మూడు వందల కుటుంబాల పొట్టకొట్టడమే అవుతుందనీ నచ్చచెప్పి ఒప్పించాం"
జిత్ సమర్ధతకు ఇదో చిన్న ఉదాహరణ. శంకరాభరణం షూటింగ్ సమయంలో కీ గ్రామఫోను
(అప్పటికి నా దగ్గర లేదు) కావాలని విశ్వనాధ్ గారు అంటే రాజమండ్రి అంతా గాలించి గ్రామఫోన్
సంపాదించి తెచ్చాడు జిత్!!
మా రాజమండ్రి హాసంక్లబ్ కార్యక్రమాలకు ప్రారంభం నుంచీ దాదాపూ తప్పక హాజరయ్యే జిత్
మోహనమిత్రాకు హైద్రాబాదు హాసం క్లబ్ వారు శ్రీ యమ్బీయస్.ప్రసాద్, శ్రీ యస్వీ.రామారావుగార్ల
అధ్వర్యంలో ఇటీవలే సత్కారం జరిగింది
శ్రీరామదాసు చిత్రంలో అక్కినేనితో జిత్.



"ముద్దమందారం" చిత్రంలో రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో జిత్ నటించి పాడిన "నా
షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి పాట" మీకు వినిపిసున్నాను. ఈ పాట ఎంతో పాప్యులర్
అయింది. Sea Record కంపెనీ మిని లాంగ్ ప్లే రికార్డుగా (33 1/3 RPM) 1981 ఆపాట
విడుదలయింది. సాధారణంగా 331/3 RPM రికార్డులు పెద్ద సైజులో వెలువడితే ఈ రికార్డు
చిన్న సైజులో వెలువడటం ఓ విశేషం !!

Saturday, 1 October 2011

హాస్యవల్లరి మన అల్లు !
తెలుగుతెరపై కురిపించాడు నవ్వుల పువ్వుల జల్లు !!
ఈనాటి తెలుగుతెరపై సిసలైన నవ్వులు నిల్లు !!
నవ్వులనే సంపదను పంచుతూ తెలుగువాళ్ళకు రాశాడు విల్లు !!
  • Blogger news

  • Blogroll

  • About