RSS
Facebook
Twitter

Sunday, 23 October 2011

సత్తిరాజు అనగానే ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా వుందే అని మీకనిపించింది
కదూ ! అవును అది మన బాపు గారి ఇంటి పేరు, బాపుగారి పూర్తి పేరు
సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఈ శంకరనారాయణగారు బాపుగారి సోదరులు.
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. చిత్రలేఖనం
పై ఆశక్తితో పెన్సిల్, చార్కోల్ లతొ అద్భుతమైన ప్రముఖుల పొట్రైట్స్ 1500
పైగా వేశారు. అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్ నుంచి జానీ లీవర్ వరకూ
తెలుగు హిందీ కళాకారుల స్కెచ్ లు గీశారు. అలానే సంగీత కళాకారుల,సినీ
రాజకీయ ప్రముఖుల చిత్రాలను చిత్రించారు. "హాసరేఖలు" పేరిట ఆయన
చిత్రించిన హాస్య-సంగీత కళాకారుల రేఖాచిత్రాలతో హాసం ప్రచురణలు
ఓ అందమైన పుస్తకాన్ని, జూలై,2008లో ప్రచురించింది.


శ్రీశంకరనారాయణగారు చిత్రించిన ఈ రూపురేఖా చిత్రాల ప్రదర్శన ఈ
నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ICCR ART GALLERYలో
(రవీంద్రభారతి) అభిమానులకు కనువిందు చేయబోతున్నది.



శ్రీ శంకర్ సృష్టించిన ఈ రూపురేఖలు ప్రదర్శనను శ్రీమతి స్వాతీ శోమనాధ్
గారు ప్రారంభిస్తున్నారు ఈ ప్రదర్శన ఉదయం 11 గంటలనుండి రాత్రి
7 గంటలవరకు 26వతేదీ నుండి 28 తేదీవరకు నిర్వహించబడుతుంది.
కళాభిమానులందరినీ ఈ చిత్రప్రదర్శన అలరిస్తుంది.

Tuesday, 18 October 2011

ఇక్కడ వున్న ఒక అణా విలువైన పోస్టేజి స్టాంపులు ముద్రణలో పొరబాటు
జరిగి కుడి ఎడమలుగా అచ్చయ్యాయి. తరువాత తప్పు గుర్తించి సరిచేసి
కొత్తగా విడుదల చేశారు. ఇవి 1950 ప్రాంతంలో విడుదలయ్యాయని గుర్తు.
మా నాన్నగారికున్న హాబీలలో నాణేల సేకరణతో బాటు స్టాంపు కలెక్షన్
కూడా వుండేది. ఆయన సేకరించిన ఆనాటి అపురూపమైన స్టాంపులను
మీకు చూపిస్తున్నాను. ఆ రోజుల్లో కవరుకు ఒక అణా స్టాంపునే అంటించే
వారు. ఈ బొమ్మ కూర్చున్న భంగిమలో నున్న భోదిస్వత్తునిది.

స్టాంపులపై జోకులు :)
:" అమ్మా , ఈ కవరు బరువు ఎక్కువగా వుంది.
మరిన్ని స్టాంపులు అతికించాలి."
" ఇప్పటికే కవరు బరువుందంటున్నావ్! మరిన్ని
అతికిస్తే, మరింత బరువు పెరగదూ?!"
<><><><><><><>

" ఆ రాజకీయ నాయకురాలంటే నీకు పడదు గదా,
మరి ఆవిడ బొమ్మ వున్న స్టాంపునే కవరుకు
అతికిస్తున్నావ్ ?"
"నిజమే! పోస్టాఫీసులో ఆ బొమ్మ మీద ఠఫీ ఠపీ మని
సీలుతో గుద్దుతారు కదా! అలా నా కోపం తీర్చుకుంటా"

Monday, 17 October 2011

దేవదాసు (1953) సినిమా నవల



గతంలో సినిమా కధలు, మాటలు పాటలతో పుస్తకరూపంలో విడుదలవడం
అన్నపూర్ణావారి "తోడికోడళ్ళు" చిత్రంతో మొదలయింది. అటుతరువాత చాలా
మణిపూసలనతగ్గ చిత్రాల నవలలు పెద్ద సైజులో మంచి ముద్రణతొ వచ్చాయి.
ఇప్పుడు సెప్టెంబరు 12,2011న క్రియేటివ్ లింక్స్ వారు అందంగా పాటలు,
మాటలు, ఆచిత్ర విశేషాలు అపురూపమైన చాయాచిత్రాలతో,పాటల సిడీని
జతపరచి విడుదలచేయడం ప్రశంశనీయం. శ్రీ టి.యస్.జగన్మోహన్ చక్కగా
నవలీకరించారు. ఆయన ముందు మాటలో ఇలా అంటారు.
"దేవదాసు"ని వెండితెర నవలగా మలిచే సమయంలో, ఎ
పర్వతం వంటి శరత్ బాబు ! ఎక్కడ అతి చిన్న అణువు వంటి నేను న్నోసార్లు నా
హృదయం వికలమై, కళ్ళు చెమర్చాయి.ఎన్నేన్నోసార్లు నా స్మృతులలో
"శరత్ బాబు" దివ్యరూపం కదలాడి, మనసు ఆనందంతో పరవిశించేది.
ఆనందం కలిగిందంటే కలగదూ? ఎక్కడ సాహిత్య ప్రపంచంలో మేరు
పర్వతం వంటి శరత్ బాబు ! ఎక్కడ అతి చిన్న అణువు వంటి నేను !"
అక్టోబరు 24వ తేదీ 1951 న "దేవదాసు" చిత్రం ప్రారంభోత్సవం జరిగింది.
ఆనాటి ప్రారంభోత్సవం ఫొటోలో రచయిత సముద్రాల, దర్శకులు వేదాంతం
రాఘవయ్య, హీరో అక్కినేని, బేబీ అనురాధలను చూడవచ్చు. ఇలాటి ఎన్నో
అపురూప చిత్రాలతో బాటు సంగీత దర్శకులు కీ"శే" సుబ్బురామన్ విశేషాలను
చదవవచ్చు. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ విఏకె. రంగారావుగారి నిందా స్తుతిలో
"దేవదాసు" తరువాతి కాలంలో ఎల్పీ రికార్డుగా విడుదలైనప్పుడు స్లీవ్ మీద
వేసిన తప్పులు గ్రామఫోను కంపెనీ ముద్రించడం తదితర విషయాలను ప్రస్తా
వించారు
చిన్న దేవదాసుగా సుధాకర్, చిన్న పార్వతిగా బేబీ అనురాధ.ఈ చిత్రం
26-6-1953 న విడుదలయింది.
పతాక సన్నివేశంలో బండివాడిగా సీతారాం నటన మరువలేనిది. ఇక అక్కినేని
నటన చూసి కన్నీళ్ళు కార్చని వాళ్ళుండరు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని
వెండి తెర నవలగా ప్రచురించిన క్రియేటివ్ లింక్ పబ్లికేషన్స్ ,హైద్రాబాదు వారు
అభినందనీయులు. 152 పేజీల ఈ పుస్తకం వెల, పాటల సిడీతో బాటు 150/-
రూపాయలు. అక్కినేని 70 వసంతాల నటజీవితానికి నవనవోన్మేష దర్పణం
అన్న ప్రచురుణకర్తల మాట ఈ పుస్తకం చూశాక మీరు తప్పక ఒప్పుకుంటారు.

Saturday, 15 October 2011



నిన్ననే నా సన్నిహితులు ఏజెయమ్.గాంధి నాకు పాతవన్నీ ఇష్టమని, ఆయనకు
నర్సాపురం వారి అత్తగారి ఇంట్లో దొరికిన ఆంధ్రప్రభ దినపత్రికలు 1956-57 నాటివి
ఇచ్చారు. వాళ్ళింట్లో వున్న వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మామగారు, అత్తగార్ల
ఫోటోలకు కొత్త ఫ్రేములు కట్టించడానికి వాటిని విప్పితే ఆ ఫొటోల అట్ట వెనుక ఈ
పత్రికలు 55 ఏళ్ళక్రితంవి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అగుపించాయట. వెంటనే
నేను గుర్తుకొచ్చి నాకు తెచ్చి ఇచ్చారు. 1956 డిసెంబరు 29 తేదీ సంచిక పతాక
శీర్షిక "ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన పరతిపాదనలు- పార్లమెంటరీ
నియోజకవర్గాలు 35 ; అసెంబ్లీకి సంబంధించినవి 249. 43పార్లమెంటరీ స్థానాలు;
301అసెంబ్లీ స్థానాలు-అసెంబ్లీలో తెలంగాణాకు మరి నాలుగు స్థానాలు." శ్రీ నార్ల
ఆంధ్రప్రభకు సంపాదకులుగా వుండేవారు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక వున్నా ఆంధ్ర
ప్రభ అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా వుండేది. ఆ సంచికలో "10 రూపాయలకే
కట్టుడు పళ్ళు" అన్న వార్త చూడవచ్చు. ఆరు పేజీల పత్రిక వెల ఒక అణా, అంటే
ఆరు పైసలన్నమాట!.


ఆ సంచికలో రెండో పేజీలో వేసిన రాజకీయ కార్టూన్ చూడండి.ప్రసిద్ధ బ్రిటిష్ వ్యంగ్య
చిత్రకారుడు డేవిడ్ లో "మాంచెస్టర్ గార్డియన్" వేసిన కార్టూన్ను మార్పు చేసి
చిత్రకారుడు శ్రీ వాసు గీశారు.


జనవరి 4, 1957 ఆంధ్రప్రభలో కాశ్మీరు సమస్యను పాకిస్థాన్ తిరగతోడుతున్న
విషయాన్ని శ్రీ వాసు గీశారు. ఆ రోజుల్లో కార్టూన్ లోని విషయాన్ని విపులీకరించే
వారు. " కాశ్మీర్ సమస్యను తిరిగి పరిశీలించవలసిందిగా భద్రతాసంఘాన్ని పాకిస్థాన్
తిరిగి కోరింది" --వార్త ! విచిత్ర మేమంటే ఇన్ని సంవత్సరాలైనా కాశ్మీర్ సమస్య
అలానే వుంది !!


జనవరి 11, 1957 ప్రభలో "ఈడెన్ రాజీనామాను ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ కు
బ్రహ్మాండమైన విజయంగా పరిగణించాలి" --వాషింగ్టన్ లోని కామన్వెల్త్ వర్గాల
వార్త.... శ్రీ వాసు చిత్రించిన మరో కార్టూన్! మరోసారి ఆనాటి పత్రికలలోని వ్యాపార
ప్రకటనలను చూద్దాం !!

Thursday, 13 October 2011

విమానాలు= వి మానవతులు !!



ఒకప్పుడు విమానాలు సామాన్యూడికి అందుబాటులో ( ఎక్కడో పైన ఎగిరేవి గొప్పోళ్లకు
మాత్రం అందుబాటులా వుంటాయా?!) వుండేవికాదు గానీ ఇప్పుడు రైల్టిక్కెట్లు (రైలు టిక్కెట్ల
కోసం ఇక్కట్లు ఎక్కువై) దొరకటం అంత సులువు కాకపోవటం వల్ల అందరూ విమానాల
వైపు పరుగెడుతున్నారు. అసలు విమానాలను కనుక్కొన్నది రైటు సోదరులని అంటారు
కానీ అది రైటుకాదని నా అనుమానం. ఏమంటే మన పురాణాల కాలం నుంచే విమానాలు,
(పుష్పకవిమానాలు, ఇవి ఇప్పుడుంటే అంతులేకుండా టిక్కెట్లు ఎంచక్కా అమ్ముకోవచ్చు)!
వుండేవి. రామాయణకాలంలో జెట్లూ వుండేవి, అదేనండి మీరు రామాయణంలో జటాయువు
గురించి చదవలే! ఇప్పటి విమానాల్లో మనకి అన్ని సదుపాయాలూ చూడటానికి ఉన్న వనితలను
ఎయిర్ హోస్టెస్స్ లంటారు. అచ్చతెలుగులో విమానవతులు అని పిలవాలన్నమాట. నిజ జీవితంలో
ఎయిర్ హోస్టెస్ ఐన కాంచన ( దర్శకుడు శ్రీధర్ విమానప్రయాణంలో చూశాక) "కాదలిక్క నేరమిల్లై"
లో నాయకిగా నటించి సినిమాతారగా మారిపోయింది. అలానే నటి వాణిశ్రీ" ప్రేమనగర్" సినిమాలో
ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించింది.
విమానాల మీద ప్రయాణమే కాదు ఎన్నెన్నో జోకులూ, కార్టూన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు
చూస్తున్న కార్టూన్ బ్రిటిష్ వార పత్రిక TIT BITS ( 1950) సంచికలోనిది.
ఈ కార్టూన్ రైల్వే జంక్షన్లలో రైళ్ళు మారేటట్లు విమానాలు మారుతే ఎలా వుంటుందో అనే సరదా
ఊహతో వేసింది..

అలానే అమ్మాయి మెడలో విమానం బొమ్మ లాకెట్ పై నేను గీసిన చిలిపికార్టూన్. ఈ నా కార్టూన్
చూసి ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారు తన్ అభిప్రాయాన్నెంత చిలిపిగా చెప్పారో చూడండి.!!
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తమ "కోతికొమ్మచ్చి"లో విమాన సాహస యాత్ర గురించి ఇలా
చెప్పారు. "అప్పట్లో హిందూ పేపరు వారు మెద్రాసు-హైద్రాబాదు విమాన సర్వీసు నడిపేవారు....
అది తెల్లవారుఝామున మెద్రాసులో మూడుగంటలకు హిందూ డెయిలీ, స్పోర్ట్స్ మెన్ వీక్లీ
పత్రికలు వేసుకొని హైద్రాబాదు వెళ్ళి అక్కడ ఓ పెద్ద లోడ్ దించేది. అక్కడనుంచి విజయవాడకి
షార్ట్ హాల్ హాప్, అక్కడ మిగతా పేపర్లు దించేవారు. అక్కడినుంచి బండి ఖాళీ కాబట్టి ఐదుగురు
పాసెంజర్లను ఎక్కించుకొనేవారు. టిక్కెట్ విజయవాడ నించి మెడ్రాసుకు నలభైఐదు రూపాయలు.
ప్రయాణం కూడా నలభైఐదు నిముషాలే... సుఖాలు మరిగిన పాసెంజర్లు ఎక్కడానికి జంకేవారు-
నాలాటివాళ్ళు సాహసించేవాళ్ళు-ఇది ప్లేను-చవక కాబట్టీ."
శ్రీ ముళ్లపూడి విమానం పై చెప్పిన ఓ జోకు:
ఒక నేలయ్యగారు తొలిసారి విమానం ఎక్కారు ఢిల్లీకి. ఇంజను హోరెత్తగానే కిటికీలోంచి
చూచి కెవ్వుమన్నాడు.
"అయ్య బాబోయ్, అప్పుడే ఎంతెత్తు కెగిరిపోయామో చూడండి, చూడండి, కిందని ఆ జనం
చీమలబారులా ఎలా కనిపిస్తున్నారో ?" అన్నాడు.
"అయ్యా, విమానం ఇంకా పైకి లేవలేదు. మీరు చూసేది జనం కాదు, నిజంగానే చీమలబారు"
అన్నాడు పక్కాయన.

  • Blogger news

  • Blogroll

  • About