RSS
Facebook
Twitter

Saturday, 15 December 2012


         1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీనారాయణ
అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారిపోయి అందమైన
బొమ్మాయిల సృష్ఠికర్త అవుతాడానీ, తెలుగు భాష రాత, గీత
రెండూ మారిపోతాయని తెలుగుజాతి ఖ్యాతి ఖండాంతరాలలో
వెలిగే సిన్మాలు తయారవుతాయనీ ఊహించి వుండరు. ఈనాడు
బాపుగారి అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దు
కొన్నాయి. రాదుగా ప్రచురుణ సంస్థ (రష్యా) "అందాల అఆలు" అనే
 బాపుగారి తెలుగుఅక్షరాల పుస్తకాన్ని ప్రచురించందంటే తెలుగు
 వాళ్ళంగా మనమెంత అదృష్టవంతులం.

                      బాపుగారి తొలిబొమ్మ బాలన్నయ్య,బాలక్కయ్యల పిల్లల పత్రికలో
తొలిసారిగా1945లో అచ్చయింది. బాపు జంట ముళ్లపూడి వెంకట
రమణగారి తొలి రచనకూడా అప్పుడే "బాల"లో వచ్చింది.

              సాధారణంగా ఓ చిత్రకారుడు కార్టూనిస్ట్ గానో, మంచి తైల, నీటి వర్ణ
చిత్రకారుడిగానో ఏదో ఒక రంగంలోనే ప్రతిభావంతుడవటం చూస్తాం.
కాని, బాపు తన చిన్ననాటి  ఆర్ట్ స్కూల్లో చేరాలన్న కోరిక తీరకపోయినా
  అసమామనచిత్రకారుడిగా పేరుపొందారు. .దేముళ్ళందరూ మేమింత
అందంగా వుంటామని బాపుగారి బొమ్మలద్వారా తెలిపారు.

               శ్రీ ఆరుద్ర బాపు గురించి తన కూనలమ్మ పదాల్లో ఇలా అన్నారు.
             కొంటె బొమ్మల బాపు
             కొన్నితరముల సేపు
             గుండె వుయ్యెల నూపు
             ఓ కూనలమ్మా!
నిజమే శ్రీ బాపు కొన్ని తరాలదాకా అభిమానులను తన చిత్రాలద్వారా
అలరిస్తూనే వుంటారు. శ్రీ బాపు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Saturday, 8 December 2012

రోజులు మారాయ్ !!

             రోజులు మారటమే కాదు చాలా తొందరగా రోజు రోజుకూ మారిపోతున్నాయ్. అప్పుడే మరో
మూడు వారాలకు కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేస్తున్నాం. మా రోజుల్లో పిల్లల దగ్గర నుంచి
పెద్దలదాకా జీవనం ఇంత వేగంగాలేదు. మేం స్కూల్లో చదువుతున్నప్పుడు పరీక్షలయ్యాక
హాయిగా సెలవులుండేవి. ఇక స్కూలు మరచి పోయి మామయ్య ఊరికో, నాయనమ్మవూరికో
వెళ్ళి గడిపేవాళ్ళం. ఇప్పుడు LKG పిల్లలకూ , వాళ్ల తల్లితండ్రులకూ తీరెకే లేదు. ఇక్కడ మీరు
చూస్తున్న మేడ కు( రాజమండ్రి)  నాకు నాలుగేళ్ళ వయసప్పుడు అద్దెకు వచ్చాము. నేను,
అక్కయ్య, చెల్లాయి ఈ ఇంట్లోనే ఎలిమెంటరీ చదువు నుంచి పై చదువులుదాకా పూర్తి చేశాం.
తరువాత మానాన్నగారు స్టేట్ బ్యాంకులో ఇంకో ఆర్నెల్లకు రిటైరవుతారనగా మా సొంత వూరు
బాపట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తిరిగి నేను బ్యాంకులో ఉద్యోగంలో చేరాక 1972 లో
రాజమండ్రి వచ్చాక అదే ఇంట్లో సొంత ఇల్లుకొనుక్కునేదాక  మా పిలల్తోవున్నాము. అంటే ఈ
మేడలో మూడుతరాల వాళ్లము వున్నామన్న మాట. ఈ మేడ క్రింద గోడౌన్లుండేవి. పైన పెంకుల
పెద్ద ఇల్లు. పై వరండాలో చెక్క కిటికీల తలుపుల చెక్కలు కదిపితే తెరచుకొనేవి. లోపల చాలా
పెద్ద హాలు ఆ హలుకు రెండు వైపులా రెండేసి గదులు, మొత్తం నాలుగు గదులుండేవి. మేడ
మీదకు వెళ్ళటానికి చెక్క మెట్లుండేవి. పైన పెంకులు కనిపించకుండా గదులపైన చెక్కతో సరంబీ
( ఇప్పటి ఫాల్స్ సీలింగన్నమాట) వుండేది. ఆ ఇంటి ఫొటో తీద్దామనుకుంటుండగానే రెండేళ్ళక్రితం
పడగొట్టి షాపింగ్ కామ్ప్లెక్స్ గామార్చారు.. మనసులో బాగా నాటుకు పోయిన ఆ ఇంటి బొమ్మను
అచ్చు అలానే గీయగలిగాను.
 ఆ రోజుల్లో మాకు వినోదం కొతకాలం వరకూ గ్రామఫోను, అటు తరువాత రేడియో.
మా చిన్నపటినుంచే ఈ బొమ్మలో చూపిస్తున పెద్ద గ్రామఫోనుండేది. తరువాత
1947లో మా నాన్నగారు STEWART WARNER అనే అమెరికన్ రేడియో
కొన్నారు. అప్పుడే ఆ గ్రామఫోనూ రికార్డులూ అమ్మేశారు. నాకింకా బాగా గుర్తు
కొనుక్కున్న వాళ్ళు గ్రామఫోను తీసుకు వెల్తుంటే నేను చాలా గొడవ చేశాను.
అక్కయ్య రేడియోలో మంచి పాటలు, పిల్లల పోగ్రాములూ వస్తాయిరా అని చెప్పి
మరపించింది. రేడియోలో ఏ మైనా మంచి పాట వస్తే ఆ పాటనుమళ్ళీ పెట్టమని
గోలచేసేవాడిని. గ్రామఫోనులా అలా కుదరదురా అని అక్కయ్య చెప్పేది. ప్రతి ఆది
వారం మధ్యాహ్నం 2-15 నుంచి ౩-౦౦ గంతలవరకూ రేడియో అక్కయ,అన్నయ్యల
పిల్లల ప్రోగ్రాములోచ్చేవి. చుట్టుప్రక్కల పిల్లలంతాఆ సమయానికి మా ఇంటికి చేరే
వాళ్ళు. చాలా సందడిగా వుండేది. ఆ ప్రోగ్రాములో పొట్టిబావ-చిట్టిమరదలూ, తాతయ్య,
మొద్దబ్బాయి మాటలు, కబుర్లూ చాలా బాగుండేవి. మేం పెద్దయ్యాక సాయంత్రం
సిలోన్ లో శ్రీమతి మీనాక్షీ పొన్నుదొరై నిర్వహించే తెలుగు సినిమా పాటలు స్కూలు
నుంచి రాగానే వినే వాళ్ళం. అటు తరువాత ప్రతి బుధవారం రాత్రి ఎనిమిదింటికి
రేడియో సిలోన్లో అమీన్ సయాని అద్భుతంగా నిర్వహించే.బినాకా గీత్ మాలా వినే
వాళ్ళం. అప్పటిరోజుల్లో మాకు అవే వినోదాలు. ఆదివారం తెలుగు సినిమాలు సంక్షిప్త
శబ్దచిత్రాలుగా వచ్చేవి. ఇక బాల, చందమామ విడవకుండా చదివే వాళ్లం .బాల
పత్రికలు దాచుకోలెదు కాని అప్పటి చందమామలు ఇప్పటికీ నా దగ్గర వున్నాయ్.
 మా చిన్నప్పుడు వంటకు కుంపట్లు వాడేవారు. బొగ్గుల కుంపటి అన్నమాట  ! బొగ్గుల కుంపటిలో
నెమ్మదిగా కాగిన పాలు చాలా రుచిగా వుండేవి. పులుసు చేయడానికి రాచ్చిప్పలు (అదో రకం
రాయి చెక్కి చేసేవారు) వాడేవారు. అందులో కాగిన పులుసు , చారు చాలా రుచిగా వుంటుందనే
వారు. ఇప్పటిలా నాన్ స్టిక్ పాన్లూ వుండేవి కావి. కూరలూ, పిండి వంటలకూ బాండీ ( బూరెల
మూకుడు) వుపయోగించే వారు. పచ్చళ్ళు చేయడానికి , గారెల పిండి రుబ్బటానికి రోలూ-పొత్రం
వాడేవారు. రోట్లో మా అమ్మగారు చేసిన కంది పచ్చడి రుచే వేరుగా వుండేది..ఇప్పట్లా ప్రెషర్ కుక్కర్లు
లేకపోయినా ఆ రొజుల్లో మా ఇంట్లో రుక్మినీ కుక్కర్ అని వుండేది. గిన్నెలో నీరుపోసి, ఒక గిన్నె మీద
మరో గిన్నె పెట్టి పైన మరో గిన్నె బోర్లిస్తే ఆవిరితో అన్నం ,పప్పూ, కూరలూ వుడికేవి. కానీ దాదాపూ
గంటదాకా పట్టేది.
 అటుతరువాత మా  నాన్నగారు  ఇంగ్లాండులో తయారయిన ఫాక్స్ కిరోసిన్  స్టవ్, మద్రాసు పాపట్
జమాల్ షాపు నుంచి కొన్నారు. ఇప్పటి గాస్ స్టవ్వులా రెండు పొయ్యిలు దానిలో రిబ్బన్ షేపులో
మెటలుతీగతో అల్లిన కాటన్ వత్తులూ , కిరోసన్ రావటానికి ఓ పెద్ద  గ్లాసు సీసా వుండేది. కిరోసిన్, సీసాలో
పోసి బోర్లించి పెడితే స్టవ్వులోకి కొద్ది కొద్దిగా వెళుతూ స్టవ్వు వెలిగేది. కిరోసిన్ ఫ్లో తగ్గించి హెచ్చించ
టానికి కంట్రోలు నాబ్స్ స్టవ్వుకు వుండేవి. కిరసిన్ వెల్తున్నప్పుడల్లా సీసాలో బుడగలు వచ్చేవి. మాకు
ఆ బుడగలు చూడటం అదో సరదా!
  ఆ రోజుల్లో ఇప్పటిలా వాటర్ హీటర్లు, గీజర్లూ లేవు. నీళ్ళను రాగి కాగుల్లో కట్టెల పొయ్యిమీద
 కాచే వారు.తరువాత మేము రాగి బాయిలర్ కొన్నాము.  దీనిలో పాత్ర మధ్యలో రాగి గొట్టం
 వుంటుంది. చుట్టూ నీళ్ళతో నింపి మధ్య గొట్టంలో బొగ్గులు వేసి వెలిగిస్తే వేడికి చుట్టూ వున్న
  నీళ్ళు మరుగుతాయి. వేడి నీళ్ళను పట్టుకోడానికి వీలుగా టాప్ వుంటుంది.

నేను 1981 లో నా గ్రామఫోను కోరిక తీర్చుకోడానికి  ఫిలిప్స్ స్టీరియో రికార్డు ప్లేయర్
  కొన్నాను. ఐనా నాకు నా చిన్ననాటి కీ ఇస్తే పనిచేసే గ్రామఫోను అంటే మక్కువ పోలేదు.
  మా అబ్బాయి అలాటి పాతకాలం గ్రామఫోను కొని నా పుట్టిన రోజు కానుకగా ఐదేళ్లక్రితం
  ఇచ్చాడు. ఈనాడు సిడీలు, విసీడీ, డివీడీలొచ్చినా నాకు మాత్రం ఆ పాతకాలం రికార్డులూ,
  విసీఆర్లూ అంటే ఇంకా మక్కువ పోలేదు. ఎంతైనా పాతకాలం వాడినికదా !!

Friday, 7 December 2012

            ఎంతోమంది   తెలుగు తారలు సినీ ఆకాశంలో  ఇప్పటివరకు మెరిసినా సావిత్రి మాత్రం
 దక్షిణబారత వెండితెరపై ధృవతారగా వెలిగింది, మిగిలింది.  ఈ తరం తారలు తమ ఒళ్ళు
 చూపటమే , తమ నటనగా భావిస్తే సావిత్రి తన కళ్ళతో, పెదాల కదలికతో శృంగారం,
 విషాదాన్నీ నటించి చూపించి ప్రేక్షకులను కదలించిన మహానటి. నా 12 ఏళ్ళ వయసులో
 1953 లో దేవదాసు రాజమండ్రి అశోక్ మహల్లో విడుదలయింది. శతదినోత్సవం జరిగిన
 సమయంలో గోదావరి వరదలొచ్చాయి. మా మేనమామగారు అప్పుడు ఐ యల్ టీ డీ లో
 ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. ఆల్కాట్ గార్డెన్స్ అంతా వరదనీటిలో మునిగిపోవటం వలన
 కుటుంబమంతా దానవాయిపేటలోని ఓ జమీందారుగారి భవంతిలోకి మారారు. అదే భవనం
 మేడ మీద  దేవదాసు తారలంతా బస చేసారు. అప్పుడు నేను , మా బావతో కలసి మా
 నాన్నగారు తయారు చేసిన ఆల్బంలో సావిత్ర్రిగారి సంతకం తీసుకున్నాను. నాగేశ్వరరావు,
 ఇతర తారల బొమ్మలు కాగితం అరవైఏళ్ళు అవటం వల్ల చినిగిపోయినా సావిత్రి బొమ్మ
 సంతకం ఈనాటికీ మిగలడం ఓ వింత.
 సంసారం చిత్రంలో ఓ చిన్న పాత్రలో "టకు టకు టముకల బండి, కూర్చున్నాడో విగ్రహమండీ"
అనే పాటలో నాగేశ్వరరావును టీజ్ చేస్తున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా అగుపించిన
సావిత్రి అటుతరువాత అదే హీరో ప్రక్క ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల
అభిమాన జంటగా కలకాలం నిలచిపోయారు.

     తమిళచిత్రాలలో నటించి తమిళ తంబీల అభిమాన నటిగా పేరు పొంది ఎన్నో తమిళ చిత్రాల్లో
నాయకుడిగా నటించిన జెమినీ గణేశన్ న్ను వివాహమాడింది.(ఫొటోలు: విజయచిత్ర 1967 విశేష
సంచిక సౌజన్యంతో)
             ఆమె శరీరం ఎంత భారీగా మారినా ప్రేక్షకులకు  ఆమె అద్భుత నటన ముందు అదేమీ గుర్తుకు
రాలేదు. అందుకే బాపుగారు తమ  "బాపు కార్ట్యూనులు"లో " నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం
అంటూ చమత్కరించారు. మరువలేని మరపురాని నటీమణి సావిత్రి.
(శ్రీ బాపు గారికి కృతజ్ఞతలతో)

Tuesday, 4 December 2012

                              ఘంటసాల మాస్టారుగారి  90 వజయంతి నాడే కాదు ఆయన మధురగానం
                              ప్రతితెలుగింటా ప్రతిదినం ఏదో ఒక సమయంలో వినిపిస్తూనే వుంటుంది.
                              ఆయన గళం చిరంజీవి. పద్యమైనా, శ్లోకమైనా, హాస్యగీతమైనా, శృంగార
                              గానమైనా, విషాదగీతమైనా, భక్తి పాటైనా శ్రోతలను ఈనాటికి మైమరిపిస్తూనే
                              వుంటుంది. పాటలతో నటుల నటనకు మరింత నిండుదనం తెచ్చిన ఏకైక గాన
                              విశారదుడాయన.
                                 మధుర గానలోల ఘంటసాల అంటూ ఆయన పై శ్రీ దుర్భా శ్రీరామమూర్తి
                                 గేయ కవితాశతకం రచించారు!
                                      కలతపడితే మాకు నీపాట కావాలి
                                      కునుకుపడితే మనసు సేదదీరాలి
                                      కలవరింతలు కలల సౌఖ్యాలనివ్వాలి
                                      మధురగానలోల ఘంటసాల
                               తోటి గాయనీగాయకులతో శ్రీ ఘంటసాల- అపురూపమైన ఫొటొ .-హాసం సౌజన్యంతో
                                       యన్టీఆర్, ఏయన్నార్లతో !!

                                        శ్రీ బాపు కార్ట్యూన్ అసలు పేరు గాన లోల, మారుపేరు ఘంటసాల !!
                                   నన్నుదోచుకొందువటే వన్నెల జవరాల- సినారే తో ఘంటసాల మాస్టారు

Thursday, 29 November 2012

కార్టూనిస్టుల పండుగ

               అప్పుడే నెల రోజులై పోయింది మా కార్టూనిస్టుల పండుగ హైద్రాబాదు పబ్లిక్ గార్దెన్స్ లో
   సమైక్యభారతి వారి ఆధ్వర్వంలో జరిగి. అక్టోబరు 28, 29, 30 తేదీలలో జరిగిన ఈ
   సమ్మేళనంలో ఒకే చోట అందరు కార్టూనిస్టు మిత్రులు కలుసుకొనె మహద్భాగ్యం
   నాలాటి వాళ్లకు కలిగింది. మిత్రులు జయదేవ్ గారు, శ్రీపుక్కళ్ళ రామకృష్ణ ,శ్రీ యం.యస్.
   రామకృష్ణ, శ్రీ శంకు, శ్రీ సుధామలతో ఇదివరలో నాకు పరిచయం వున్నా శ్రీ సరసి, శ్రీ సుభానీ,
   శ్రీ అన్వర్, శ్రీ బాలి, ఆంద్రజ్యొతి శ్రీ శేఖర్,శ్రీ శ్యాంమోహన్, శ్రీ మోహన్, శ్రీ మృత్యుంజయ,
   శ్రీ గీతా, శ్రీ బ్నిం, శ్రీ దేవగుప్తం చక్రవర్తి, శ్రీ సాయిరాం ఆకుండి, శ్రీ వర్చశ్వి, శ్రీ సత్యమూర్తి,
   శ్రీ టీవీ,, శ్రీ కళాసాగర్ , శ్రీ పొన్నాడ మూర్తి, శ్రీ దేవులపల్లి, శ్రీ బాచి, శ్రీ రాంపా, శ్రీ నాగిసెట్టి,
   శ్రీమతి రాజావరం ఉష ఇలా ఎందరో కార్టూనిస్ట్ మిత్రులను కొత్తగా పరిచయం చేసుకోనే
   అదృష్టం కలిగింది. ఫేస్ బుక్ పుణ్యమా అని ఎందరో కొత్త మిత్రులు నన్ను గుర్తు పట్టి
   ఆప్యాయంగా పలుకరించడం మరువలేని అనుభూతి.
    ఆనాటి ప్రారంభ సభ (28) సరస సంభాషణలతో కార్టూనిస్ట్ శ్రీ రాంపా వ్యాఖానాలను
   జోడించి సభకు చమత్కారాల తోరణాలు కట్టి మరింత శోభాయమానంగా అలరించారు.
   మూడురోజులు జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీజయదేవ్ బాబు తదితర ప్రముఖ కార్టూనిస్టులు,
   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ నరేంద్ర లూధర్, ఐఏయస్,డా"పొత్తూరి
   వెంకటేశ్వరరావు, పూర్వ అద్యక్షులు ప్రెస్ అకాడమీ,డా" కే.వి.రమణ, ఐఏయస్ (రి) రాష్ట్ర
   ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు పాల్గొన్నారు. సమైక్యభారతి నుండి ఆహ్వానాలు
   అందుకున్న తెలుగు కార్టూనిస్టులంతా ఈ పండుగలో పాల్గొన్నారు. చివరగా-అరవై ఏళ్ళు
   పైబడిన బాలి,జయదేవ్,శంకు,రామకృష్ణ, మోహన్ ,సత్యమూర్తి, రాంపా, ఎంవీ.ఆప్పారావు
   (సురేఖ)లతో బాటు బ్నిం ( ఆయన పుట్టినరోజూ ఆ రోజేకావడం విశేషం), బి.యస్.రాజు,
   పుక్కళ్ళ రామకృష్ణ, హాస్యానందం రాము, సుధామ, శ్యాంమోహన్లను శాలువా   ,
   మమోంటోలతో సత్కరించారు. సమైక్యభారతి సత్యనారాయణ వందన సమర్పణతో సభ
   ముగిసింది.
                  శ్రీ సత్యమూర్తి, జయదేవ్ బాబులతో నేను
                 ఫుట్టినరోజు సంధర్భంగా శ్రీ బ్నిం గారికి సత్కారం
                 డెక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ సుభానీ గారితో నేను
                        కార్టూనిస్టుగా నా జీవితంలో మరపురాని రోజు

                                        శ్రీ బాపు సోదరులు శ్రీ శంకర్ గీసిన నా బొమ్మ
                              శ్రీమతి రాజావరం ఉషగారు ఆమె గీసిన కార్టూన్ పై నాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫొటో
                              పబ్లిక్ గార్డెన్స్ హైద్రాబాదులో విరబూసిన నవ్వుల పువ్వులు
  • Blogger news

  • Blogroll

  • About