RSS
Facebook
Twitter

Sunday, 29 November 2009

గోదావరి చిత్ర గాన లహరి


అందాల గోదావరికి తెలుగు చిత్ర పరిశ్రమకు మూగమనసులు సినిమాతో అనుబంధం ఏర్పడింది.
బాపు రమణలు ఒకరు ప.గో,మరొకరు తూ.గో జిల్లాలకు చెందిన వారు కాబట్టి తమ సినిమాలను
ఎక్కువగా గోదావరి తీరంలోనే నిర్మించారు.ఐనా తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమా పాటలలో
గోదావరికి సముచిత స్ఠానం ఇచ్చారు.

మొదటి సారి 1952 లో వచ్చిన మరదలు పెళ్ళి లో ఇలా వినిపిస్తుంది. "పిలిచె గోదారొడ్డు,నోరూరించే బందరు లడ్డు" అని శ్రీశ్రీ రచించారు.

తరువాత యన్టీఆర్,జమున నటించిన చిరంజీవులు లో
"నీ ఆశ అడియాస,నీ బ్రతుకు అమవాస...
కన్నులలో గోదారి కలువలే కట్టింది." అంటూ ఆరుద్ర వ్రాసారు.

అలానే పెద్దమనుషులు చిత్రంలో,
"కుక్క తోక పట్టుకొని గోదావరీదితే కోటిపల్లి కాడ తేలేనయా" అని కొసరాజు రచించారు.

ఇక పల్లెటూరు చిత్రంలో,
"కల్లోల గౌతమి,వెల్లువల క్రిష్ణమ్మ,..."అని వేములపల్లి శ్రీకృష్ణ కలం నుంచి వచ్చింది.



విచిత్ర కుటుంబం చిత్రం కోసం సినారే,
"ఆదికవి నన్నయ అవతరించిన నేల
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయనిక్షీరధారలై
జీవకళ లొలుకు గోదావరీ తరంగాల..."అంటూ సాగిపోతుంది రచన!

1963లో కోటిపల్లి,నర్సాపురం రేవుల్లో మూగమనసులు పాటలు,
"గోదారీ గట్టుంది,గట్టు మీద చెట్టుంది",తల్లీ గోదారికీ ఎల్లువస్తే అందం,
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం"

అనుపమ వారి ఉయ్యాల-జంపాల చిత్రం లో ఆరుద్ర గీతం "కొండగాలి తిరిగింది,గుండె వూసులాడింది,
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది" ఎంత మంచి పాట!!

బాపురమణల ముత్యాలముగ్గు లో శేషేంద్రశర్మ రఛన
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బులారా నదిని దోచుకుపోతున్న నావను ఆపండి గుర్తుండేవుంటుంది.


దేవత సిన్మాలో "ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడుతూ వుంటే" పాట రచయిత శ్రీ వేటూరి.

సితార లో"వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం",

ప్రేమించి పెళ్ళాడు లో "ఒయ్యరి గోదారమ్మఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం",

ఆంధ్రకేసరి కోసం ఆరుద్ర రాసిన
"వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా భాసించే రాజమహేంద్రి" గీతం గోదావరి ప్రాసత్యాన్ని,రాజమండ్రి వైభవాన్నివివరిస్తూ
"కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు,వీరేశ లింగ మొకడు మిగిలెను చాలు" కలకాలం నిలిచిపోయే
పాట.


ఇలా తల్లి గోదారి పై ఎన్నెన్నో పాటలు!!

Tuesday, 24 November 2009

నేను -- నాడు... నేడు...




















ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఈరోజు నేనేంటి అని కాక నిన్న ఎలా ఉన్నాను. ఇపుడు ఎలా ఉన్నాను.రేపు ఎలా ఉండాలి అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నాడైనా, నేడైనా ప్రతీ అనుభవం ఒక జీవితపాఠంలా మలుచుకుని సాగిపోతూ ఉండాలి. ముప్పై నాలుగేళ్ల క్రిందటి చిత్రాన్ని చూసుకుంటే అప్పటి ఆలోచనలు, పోరాటాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి.

Sunday, 22 November 2009




ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో ఇట్టే తెరపై ఏ మిక్కీమౌసో ప్రత్యక్షమై అట్టే మాయమైపోయేది. ఒక్కోసారి అసలు చూపించేవాళ్ళేకాదు! ఇక మాకు నిరాశే మిగిలేది.ఆ మార్నింగ్ షోలకు క్లాస్ కన్షెషన్ వుండేది. అంటే బాల్కనీ టిక్కెట్టు దాని క్రిందిక్ల్లాస్ ధరకే ఇచ్చేవారు.




ఆదివారం మాకు మరో ఆటవిడుపు ఇంగ్లీష్ పేపరే! ఇండియన్ ఎక్సప్రెస్ ఆదివారం సండేస్టాండర్డ్ పేరుతో వచ్చేది.అందులో మెజీషియన్ మాండ్రేక్, బ్రింగింగ్ అప్ ఫాదర్,లిటిల్ కింగ్,ప్రిన్స్ వాలియంట్ మొదలయిన బొమ్మల కధలు రంగుల్లో వచ్చేవి.మావి కాన్వెంట్ చదువులు కాదు కాబట్టి నాన్నగారు చదివి చెప్పేవారు. కొంతకాలం తరువాత మమ్మల్నే చదవమని అర్ధం చెప్పమనేవారు. మాకు అదో ఇంగ్లీష్ పాఠంలా వుండేది. ది మెడ్రాస్ మెయిల్,ఇండియన్ ఎక్స్ప్రెస్ చివరి పేజీల్లో కర్లీవీ,టార్ఝన్ బొమ్మల కధలు ప్రతి రోజూ వేసేవారు.ఆంధ్రపత్రిక వీక్లీలో బాపు బంగారం-సింగారం,లంకె బిందెలు.రాజు-రైతు, విశ్వాత్ముల నరసింహమూర్తి పంచతంత్రం, చందమామలో బాపు గలివర్ ట్రావల్స్ మొ" బొమ్మల కధలు చదవేవాళ్ళం.కార్టూన్ చిత్రాల సృష్టికర్త వాల్ట్ డిస్నీమిక్కీమౌస్ లాంటి కార్టూన్లే కాకుండా డిస్నీ లాండ్ నిర్మించి అనేక అస్కార్ ఎవార్డ్స్ పొందాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంద్రజాల్ కామిక్స్ పేరిట ఫాంటమ్, చందమామ సంస్ధ క్లాసిక్స్ ‍‍అండ్ కామిక్స్ పేర డిస్నీ కామిక్స్,ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్ర కధ పేరిట ట్వింకిల్, భారత రామాయణాలు బొమ్మల కధలుగా ప్రఛురించారు.కొంతకాలంవరకు ట్వింకిల్ తెలుగులో కూడా వెలువడింది.

Saturday, 21 November 2009



నేను ఆడవాళ్ళ సాంప్రదాయాల గురించి వ్రాయటం ఏమిటని అనుకోకండి!
మన అభ్యున్నతికి తొడ్పడేది ముందుగా ఆడవాళ్ళే అన్నమాట కాదనలేం.
కొందరు ఉద్యోగాలకు బైటకు వెల్తున్నా మన సాంప్రదాయాలను చక్కగా
పాటిస్తున్నారు.ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.






మన సాంప్రదాయంలో కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వటం
మంచి అలవాటు.పసుపు మంచి యాంటీ సెప్టిక్ గుణాలు కలిగివున్న విషయం
అందరికి తెలిసిన విషయమే.ఇంతకు ముందు గుమ్మాలకు పసుపు వ్రాసి పసుపు
తోనే చేసిన కుంకుమ,వరి పిండి తో బొట్లు పెట్టే వారు.ఇప్పుడు ముందు గుమ్మం
తప్ప ఇతర గదులకు గుమ్మాలే వుండటం లేదు.ఉన్న ఒక్క గుమ్మానికి పసుపు
పెయింట్ వేయించి ఏవేవో డిజైన్లు వేయిస్తున్నాం.పసుపు వ్రాయటం వల్ల కీటకాలు,
అనారోగ్యం కలిగించే క్రిములు రావని మన పూర్వికులు ఇలాటి సంప్రదాయాలని
ఏర్పాటు చేసారు.






ఇప్పుడు ప్రతి ఇంట్లో వంటింట్లోనే పంపు వుంటున్నది.పూర్వం ఎంతటివారైనా
చెరువుకో,నదికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొనేవారు.పాదాలు నీటిలో ప్రతి రోజూ
నానటంవల్ల వేళ్ళ మధ్య పుండ్లు పడేవి.రోజూ స్నానం చేసి పాదాలకు పసుపు
రాసుకోవటం వల్ల మందులా పని చేసి పుండ్లు తగ్గేవి.అలానే గుమ్మాలకు కట్టే
మామిడి ఆకుల తోరణాలు.ఆ ఆకుల ద్వారా మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇంటి ముందు వరి పిండితో ముగ్గులు పెడీతే చీమలు లాంటి చిన్నజీవులకు
ఆహారం అందించే అలవాటును కూడా మన పెద్దలు తెలిపారు.
ఇప్పుడు ఇంట్లో కాలికి పసుపురాస్తే మార్బుల్ నేల పాడై పోతుందని భయపడు
తున్నారు.అలాటప్పుడు కాళ్ళ క్రింద ఓ ప్లాస్టిక్ షీట్ వేసి పసుపు ధైర్యంగా రాయొచ్చు.

Thursday, 19 November 2009


ఈ ఫొటో నేను రాజమండ్రి యస్.ఆర్.సిటీ.హైస్కూల్లో SSLC చదువుకునేటప్పుడు మార్చి 1956 లో తీసినది. ఇందులో నేను పైనుంచి రెండవ వరుసలో కుడివైపు నుంచి నాల్గవ వాడిని! ఆ వరుసలో మొదట వున్నది నక్కిన శ్రీరామమూర్తి. ఇక్కడే క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు.అదే వరుసలో ఎడమవైపున మొదట వున్నది భాగవతుల మంగశర్మ.భిలై స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ గా రిటైరై ఇక్కడే వుంటున్నారు.తరచు కలుస్తుంటాము.ఆయన సతీమణి భాగవతుల లలిత మంచి కధా రచయిత్రి. "తీరనిఋణం" పేరిట ఆమె కధా సంకలనం వెలువడింది.పై వరుసలో కుడి నుంచి రెండో అతను వీర్రాజు.పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసాడు.తక్కిన మితృలు ఎవరైనా ఈ ఫొటో ఛూసి జవాబిస్తారని ఆశిస్తున్నాను.ఇక టీచర్లలో కూర్చున్న వాళ్ళలో ఎడమనుంచి నాలుగో సోషల్ మేస్టారు పి.సూర్యనారాయనమూర్తి గారు.ఆయన దివంగత సినీ హాస్య నటుడు రాజబాబు మేనమామ! అదే వరుసలో చివరవున్నది మాధ్స్ మేస్టారు చలపతి రావు గారు.మా అబ్బాయి సాయి చదివిన స్కూల్లో (టౌన్ హై స్కూల్)ప్రధాన ఉపాద్యాయుడుగా పనిచేసి రెటైర్ అయ్యారు. అంటే నేను,మా అబ్బాయి (ఇప్పుడు వాడు బొంబాయిలో ఓ సంస్దలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు) ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నామన్న మాట!
  • Blogger news

  • Blogroll

  • About