RSS
Facebook
Twitter

Sunday, 2 May 2010



నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికివ్వాలి !!!

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ! అసలు కొందరు అసలు నవ్వినట్లు కనిపించరు.
ఉదాహరణగా చెప్పుకోవాలంటే "హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించే
చెప్పుకోవచ్చు. ఆయన చూడటానికి చాలా సీరియస్ గా అగుపించేవారు. కాని ఆయన
ఎన్నో హాస్యరచనలు చేశారు. రోడ్డు మీద ఎవరో అరటిపండు తొక్క మీద కాలేసి జారి
పడ్డారనుకోండి. అప్పుడూ నవ్వు రావచ్చునేమో కాని అది హాస్యమనిపించుకోదుగదా.
కొంతకాలంవరకు తెలుగు సినిమాల్లో ఓ కామేడియన్ మరో వ్యక్తిని కాలితో తన్నితే
అదీ హాస్యంగా చలామణి ఐపోయింది. ఇక ఇప్పుడు హాస్యమంటె బూతుకు పర్యాయ
పదమైపోయింది. ఒకనాటి మన తెలుగు సినిమాల్లొ రేలంగి తెరపై అగుపించగానే జనం
గొల్లున నవ్వే వాళ్ళు. ఇక హాస్య నటుల పాత్రలుకూడా కధలోని ముఖ్య పాత్రల్తో కలసి
సాగిపోయేవి. రేలంగి,రమణారెడ్డి పాత్రలకు ఉండే హాస్యగీతాలు కూడా సందేశాత్మ్కంగా
వుండేవి. ఇక్కడ మీరు "రాముడు-భీముడు" చిత్రం లో రేలంగిరిజలపై చిత్రీకరించిన
’సరదా సరదా సిగరెట్టు’ అన్న పాటను చూడండి. హాస్యానికి తోడు సిగరెట్ చేసే మంచీ
చెడులను కొసరాజుగారు అద్భుతంగా వ్రాసారు.
ప్రముఖుల చమత్కారాలు కూడా నవ్వును పుట్టిస్తాయనడానికి ఇవే మంచి
ఉదాహరణలు. శ్రి దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ఓ సారి జట్కాలో వెలుతున్నారట. ముందు
వైపు బరువు చాలక జట్కా వాడు "కొంచెం పైకి రండి సార్" అని అంటే "ఇంతకాలానికి
నువ్వొక్కడీవి కనిపించావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధృణ్ణి పైకి రమ్మన్నవాడివి" అంటూ
మెచ్చుకొన్నారు !. భమిడిపాటి కామేశ్వరరావుగారికికూడా తెలుగువాళ్ళపై ఇలాటి
అభిప్రాయమే వుండేది. ఆయన ఓ సంధర్భంలో "తెలుగువాడు దుర్యోధనుడి లాంటి వాడు.
దుర్యోధనుడు తనకేమీకావాలని అడగడు. ధర్మరాజుకి మాత్రం ఏమీ ఉండకూడదని కోరు
కుంటాడు" అని అన్నారు.
మీకు కొన్ని నవ్వుల చిట్కాలు!
ఉదయాన్నే లేచాక మంచి జోకులు పుస్తకం చదవండి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
మీకు తెలిసిన జోకులను ఇతరులతో పంచుకోండి. మీరూ మీ ఊళ్ళో "హాసం క్లబ్" ప్రారంభించండి.
నెలలో మూడో ఆదివారం ఏర్పాటు చేయండి. మీకు ఎందరో కొత్త కొత్త హాస్య ప్రియులు పరిచయ
మవుతారు. మీకు పత్రికల్లో బాగానచ్చిన కార్టూన్లను కత్తిరించి ఓ ఆల్బమ్ తయారు చేయండి.
అప్పుడప్పూడూ ఆ పుస్తకం తిరగేస్తుంటే మనసు ఉత్సాహంగా వుంటుంది. ఇక ఈ నవ్వుల రోజుకు
సెలవు తీసుకుంటూ ఆఖరుగా ఓ చిన్న జోకు...
"ఏవిటోయ్, అప్పారావ్, సుబ్బారావు అంత మంచి జోక్ చెబితే మేమంతా నవ్వేంకదా, నువ్వు
నవ్వవేం?" అడిగారు మితృలు.
" వాడంటే నాకు వళ్ళు మంట ! ఇంటికి వెళ్ళి నవ్వుకుంటా" అన్నాడు అప్పారావు..

Wednesday, 28 April 2010




కవులు వర్ణించిన ఆ నాటి ప్రభంధ కన్యలు నిజంగా అలానే ఉంటే ? !
ఎలా వుంటుందో ఊహించండి. మన తెలుగులో మొట్టమొదటి కార్టూనిస్ట్
శ్రీ తలిశెట్టి రామారావు 1931 లో ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో
కవులు వర్ణించిన స్త్రీ రూపాన్ని ఊహించి చిత్రంగా గీసారు. ఈ చిత్రాన్ని
నాకు మితృలు, "రచన" శాయిగారు పంపిచారు. అలానే మరో చిత్రం 1950
లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ పత్రిక " The Illustrated Weekly of India"
లో The Indian Look పేరుతో శ్రీ యస్.యమ్.రాస్ గీసినది. ఈ బొమ్మళ్ళొ
తుమ్మెద రెక్కలలాంటి కురులు, సంపంగి మొగ్గలాంటి ముక్కు, ధనస్సు లాంటి
కనుబొమ్మలు, చేపల్లాంటి కళ్ళు, తూనీగ నడుము (అతి సన్నని), అరటి దూటల
లాంటి కాళ్ళు, కమల ఫూవు రేకల లాంటి పాదాలు నిజంగా ఊంటే ఆ వనిత రూపు
ఎలా వుంటుందో చూపించారు.


!

Tuesday, 27 April 2010

ఈ టీవీ 2 లో నేను !



గత మార్చి లో ఈటీవీ -2 వారు నా పుస్తకాలు,రికార్డులు, స్టాంపు,నాణేల సేకరణ
గురించి చిత్రీకరించి ప్రసారం చేసారు.. ఆ ప్రసార విశేషాలు ..


Monday, 26 April 2010

"హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించి ఇదివరలో వ్రాసాను. ఆయన అబ్బాయి
శ్రీ భమిడిపాటి రాధకృష్ణ గారు పండిత పుత్ర శుంఠహ: అనే నానుడి తప్పని రుజువు
చేసారు. ఆయన హాస్యరచయితగా ఎన్నో నాటకాలు వ్రాసారు. అలానే దాదాపు డెభై తెలుగు
సాంఘిక సినిమాలకు కధా మాటలు కూర్చారు. ’బ్రహ్మచారి’, ’భలే కోదళ్ళు’, "వింత
కాపురం", ’గోవుల గోపన్న’, ’నేనంటే నేనే’, ’పెళ్ళి కూతురు’.’సిపాయి చిన్నయ్య’, ’కధా
నాయకుడు’, ’అల్లుడే మేనల్లుడు’అందులోకొన్ని. ఆయన బియస్సీ చదివాక ఇంజనీరింగ్
చదవాలనిపించి తండ్రికి తెలియకుండా రెకమెండేషన్ మీద సీటు సంపాదించాడు. ఈ విషయం
తెలుసుకున్న కామేశ్వరరావుగారు ఆ కాలేజీకి వెళ్ళి వీడు ఈ సీటుకు అర్హుడు కాదు. అర్హత
వున్న కుర్రవాడికి ఇవ్వండి అని చెప్పి నిజాయితీగా రాధాకృష్ణగారిని చేరనివ్వలేదు.తరువాత
ఆయన సిఏ చేసేలోపల ఖాళీగా వుండటం ఎందుకు నాలా కొంతకాలం టీచర్ ఉద్యోగం చెయ్య
మన్న తండ్రి కోరిక మన్నించి రాజమండ్రిలో సిటీ హైస్కూల్లో కొద్దికాలం టీచరుగా పనిచేసారు.
అప్పుడే అయన వద్ద నాకు స్టూడెంటుగా చదువుకునే అదృష్టం కలిగింది. ఆయన
సినిమా రంగం వదలిపెట్టివచ్చి ఇక్కడరాజమండ్రి దానవాయిపేటలోని ఆయన స్వంత ఇంట్లో వుంటుండగా
కలసినప్పుడు నేను చెప్పకుండానే నే నాయన స్టూడెంట్నని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఆయన రచించిన అమోఘ పుస్తకం " DAY -TO-DAY CALENDAR FROM 45 B.C. TO
5555 A.D " నాకు కానుకగా ఇస్తూ నా ఇంటిపేరుతో సహా వ్రాసి సంతకం చేసి ఇవ్వడం అయన
జ్ణాపకశక్తి కి నిదర్శనం. ఆపుస్తకానికి ఆయన "భమిడిపాటి కాలెండర్": అని పేరుపెట్టారు. సినిమాల
నుంచి విరమించాక ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నారు. తెలుగు అక్షరాలకు, దీర్ఘాలు,గుణింతాలు
సహా ప్రతి అక్షరానికీ ఒక్కో సంఖ్యను కూర్చి కొన్నిలక్షల అంకెలను తెలుగు అక్షరాలకు కూర్చారు !
తెలుగులో వ్రాసిన ఓ వ్యక్తి పేరును బట్టి ఆ అక్షరాలకు వచ్చిన అంకెలను బట్టి పుట్టిన తేదీని ఖచ్చితంగా
చెప్పగలిగే వారు. యన్టీఆర్ అలా తన పేరును బట్టి పుట్టిన రోజు చెప్పమంటే ఆయన పుట్టినరోజు కరెక్ట్ గా
రాలేదట. మీరు నా విషయంలో తప్పారని యన్టీఆర్ అంటే మీ పేరులోనే ఏదో తప్పుంది, మీ అసలు పూర్తి
పేరేమిటొ తెలుసుకోండి అన్నారట.అప్పుడు ఆయన నిమ్మకూరులోని స్కూలు రికార్డులు పరిశీలిస్తే ఆయన
పేరు నందమూరి తారక రామారావు చౌదరి అని వుందట. ఆ అక్షరాలతో అంకెలను కూర్చితే పుట్టిన తేదీ
సరిపోయింది ! అలానే సినీ నటుడు విక్రం విషయంలోను. అతని అసలు పేరు కెన్నేడీ అని వ్రాస్తేనే కరక్టుగా
వచ్చింది. ఈ విషయాలన్నీటినీ ఆయన్ని కలిసినప్పుడల్లా చెప్పేవారు.’భజంత్రీలు’,’మనస్తత్వాలు’,’అంతా
ఇంతే’,’పెళ్ళి పందాలు’, "పేటెంట్ మందు’, నాటికలు, ’ఇదేవిటి”దైవశాసనం’,’కీర్తిశేషులు’లాంటి నాటకాలు
వ్రాసారు. "కీర్తిశేషులు" నాటిక గురించి నవ్వుతూ ఓ విషయం చెప్పేవారు. ఆయన "కీర్తిశేషులు" నాటకానికి
చాలా పరిషత్తులలో బహుమతులొచ్చాయి. బహుమతులు వచ్చిన వారి ఫొటోలను ఒక పత్రిక ప్రచురిస్తూ
’కీర్తిశేషులు భమిడిపాటి’ అనిప్రచురించింది.ఇది చూసిన చాలా మంది వారింటికి సంతాపలేఖలు వ్రాసారట.
ఒక ఊళ్ళో ఏకంగా సంతాప సభ ఏర్పాటు చేసారని నవ్వుతూ చెప్పేవారు.
సెప్టెంబరు 4, 2007 న నిజంగా ఆయన కీర్తిశేషులయ్యారు. విచిత్ర మేమంటే అయన మరణ తేదీని
డైరీలో ముందుగా వ్రాసిపెట్టుకోవడం ! ఆయనను సన్మానించుకోనే అదృష్టం మా "హాసం క్లబ్"కు అంతకు
ముందే జరిగింది.

Sunday, 25 April 2010

" శ్రీ శ్రీ పుట్టిన తేదీ 15-4-1910 కావచ్చు.లేదా 30-4-1910 కావచ్చు. అతడు మాత్రం
తాను 2-1-1910 నాడు జన్మించానని విశ్వసించాడు.ఇది శ్రీశ్రీగా సుపరిచితుడైన శ్రీరంగం
శ్రీనివాసరావు జన్మ విశేషం. ఒక పరిశోధకుడి ప్రకారం శ్రిణివాసరావు సాధారణ నామ
సంవత్సర చైత్ర శుద్ధ సష్టినాడు- అంటే 1910 ఏప్రియల్ 15వ తేదీన జన్మించాడు .
విశాఖపట్ణం పురపాలక సంఘం వారు ఖరారుచేసిన తేదీ 30-4-1910 అని విరసం వారు
సృష్టీకరిస్తున్నారు. అతడు 1910లో జన్మించాడనేది నిర్వివాదాంశం"--( మహాకవి శ్రీశ్రీ-
బూదరాజు రాధాకృష్ణ-సాహిత్య అకాడమీ ,ఢిల్లీ ప్రచురణ ) ఆయన శత జయంతి ఈ నెలలోనే.
టోకున శ్రీశ్రీ జోకులు
* ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీశ్రీ కనబడితే మొక్కపాటి నరసింహశాస్త్రిగారు
" ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " అని శ్రీ శ్రీ సమాధానం.
** ** ** ** ** ** ** ** ** ** **
* ఈ రెండో జోకులోనూ శ్రీశ్రీ గారే కధానాయకుడు. మదరాసులో పూర్వం ఒక తెలుగు
కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు. కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినివి
ఆర్డరిస్తున్నాం.శ్రీశ్రీ తనకు సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి "శ్రీశ్రీ
గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు" అన్నాడు.
** ** ** ** ** ** ** ** ** **
* ఒకసారి....ఈసారి మదరాసులో కాదు, విశాఖపట్టణంలొ, ఆందులోనూ సముద్రతీరాన శ్రీ శ్రీ
గారు, వేదుల సత్యనారాయణశాస్త్రిగారూ కలసి నడుస్తున్నారు. వేదులవారు అనే రోలు శ్రీ శ్రీ అనే
మద్దెలతో తన కష్టాలు చెప్పుకొని " ఎందుకొచ్చిన బ్రతుకు శ్రీ శ్రీ ! మనిషిగా, పైపెచ్చు తెలుగు కవిగా
పుట్టడం కన్న ఈ సముద్రతీరంలో పీతగా పుట్టినా బాగుండెది, ఈ కష్టాలు లేకపోను " అన్నారట.
శ్రీ శ్రీ " పీత కష్టాలు పీతవి ! " అని ఫిలాసఫించాడు.
** ** ** ** ** ** ** **
"జ్యోతి " ( 1963) సౌజన్యంతో........................
  • Blogger news

  • Blogroll

  • About