RSS
Facebook
Twitter

Monday, 28 February 2011






మన తెలుగు అక్షరాలలో "ఱ" అనే అక్షరం ఉపయోగం తక్కువే! ఆ మాటకు
వస్తే ఇప్పుడెవరూ " ఱ " ( బండి ర ) ను ఉపయోగించడంలేదు కూడా. ఆ
" ఱ " ని యుపయోగించి ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ బాబు ( కొలను వెంకట దుర్గా
ప్రసాద్ ) ఓ కార్టూన్ గీశారు. భాపుగారు ఆ కార్టూన్ చూసి వెంటనే తన స్పందనను
లేఖ ద్వారా ( స్వాతి ) తెలిపారు. నిజంగా ఎంతో అర్ధవంతంగా ఉన్న ఆ కార్టూన్
చాలామంది కార్టూన్ ఇష్టులు చూసేవుంటారు. ఇదివరలో ఆంధ్ర వారపత్రికలో,
అటు తరువాత " స్వాతి " సపరివారపత్రికలో బాబు గారి కార్టూన్లు వచ్చాయి.
శ్రీ బాబు ఇదివరలో కధాచిత్రాలకు కూడా బొమ్మలు వేశారు. ఆంధ్ర వార పత్రికలో
1982-83 లలో " జీవన్ మృతులు " ( బ్రామ్ స్ట్రోకర్ రచన ) సీరియల్ నవల
ఆయన స్వయంగా అనువాదం చేయటమే కాకుండా ఆ కధకు బొమ్మలూ
వేశారు. బాబు కార్టూన్స్ పేరిట 1981లో స్వాతి పబ్లికేషన్స్ ద్వారా పుస్తక
రూపంలో వెలువడింది ఈ పుస్తకం ప్రత్యేకత..ముందు పేజీలో శ్రీ బాపుగారి
"బాబు గీతపై బాపు "గీతా"మృతం !

Sunday, 27 February 2011



ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రొగ్రాములు గంటసేపు జరిగేవి. కధలు, నాటికలు,
పాటలు ఎన్నో..అవి అయ్యాక బాలన్నయ్యగారు అందరికీ స్వీటు హాటు కూల్ డ్రింకూ,
పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కాఫీ,టీ యిప్పించే వారు-ఆ టిఫిను ప్రొగ్రాంకి నేనూ,
అన్నయ్యగారి అన్నయ్యగారబ్బాయి రాఘవా,తమ్ముడు గోపాల్ ఇన్చార్జిలమి. ప్రొగ్రాం
రిహార్సిలు అవుతుండగా పిల్లలెందరో పెద్దలెందరో లెక్క రాసుకొని కాంటీనుకి వెళ్ళి ఇన్ని
టిఫిన్లు,ఇన్ని కాఫీలు అని ఆర్డరు చెప్పేవాళ్ళం,ఆ రకంగా పిల్లల్లో మొతుబర్లం కాబట్టి
కాంటీనువాడువాడు మా నేస్తం. మేము ఒక వడ,రెండు కూల్ డ్రింకులు,కలర్ షోడా-తాగేసే.
వాళ్ళం.దొంగలెక్కలు అన్నమాట-సాయంత్రం బిల్లులో కలిపేసే వాళ్ళం.ఓసారి కలర్ తాగుతూ
జోకేసుకొని నవ్వాం-నాలుగు చుక్కలు తుళ్ళి చొక్కాలమీద పడ్డాయి-మేమూ చూసు
కోలేదు.ఆ రోజు సాయంత్రం ప్రొగ్రాం అయిపోయి టిఫినులు తినేసి అందరం వాన్
ఎక్కుతుండగా అన్నయ్యగారు రవణా,రాఘవా అని పిల్చారు-కొచెం దూరంలో చెట్టు
కిందే ఒక్కరే నిలబడ్డారు-ఎందుకో అని వెళ్ళాము.
"మీరు ఇవాళ ఒక తప్పు చేశారు-ఇప్పుడు నిజం దాస్తే రెండు తప్పులు-అబద్ధం చెప్పితే
మూడు తప్పులవుతాయి-చెప్పండి" అన్నారు అన్నయ్యగారు-మా రంగుల మచ్చల మీద
మునివేళ్లతో నిమురుతూ.
మేం ఒకళ్లనొకళ్ళను చూసుకున్నాం.కళ్లవెంట నీరు తిరిగింది.దండాలు పెట్టేశాం-
"క్-క్కలర్ సోడాలు తాగాం"అనేశాం
"గుడ్-వెరీ గుడ్"అన్నారు అన్నయ్యగారు మా తలలు నిమురుతూ-మేం ఆశ్చర్య
పడిపోయాం.
"కలర్ సోడాలు తాగినందుకు కాదు-నిజం ఒప్పుకున్నందుకు" అని హహహహ అని
నవ్వేశారు.
"నవ్య" వార పత్రిక సౌజన్యంతో...............
(రేడియో అన్నయ్య గారంటే మొట్టమొదటి పిల్లల పత్రిక "బాల" వ్యవస్ఠాపకులు శ్రీ న్యాయపతి
రాఘవరావు గారు)

Saturday, 26 February 2011

హాయ్! రమణా...నేను బుడుగుని...


ఆదివారం ఈనాడు లో ప్రచురించిన "నాన్నోయ్..." అంటూ
ముళ్లపూడివారిపై ప్రచురించిన ఒక రచన చదివి, మీ
అందరికీ కూడా నచ్చుతుందన్ననమ్మకంతో ఇక్కడ
వుంచుతున్నాను.
( "ఈనాడు" సౌజన్యంతో).

Friday, 25 February 2011

బుడుగు వెంకట రమణగారు






బుడుగు వెంకటరమణ ముళ్లపూడి
అక్షరాలా అక్షరాలతో చేశారు గారడి
అప్పారావు బుడుగు సీగాన పెసూనాంబ రాధాగోపాలం
వీళ్లందరితో మీరు పంచిన నవ్వులు సదా మా గుండెల్లోపదిలం !!
<><><><><><><><><>

రమణగారు పౌరాణిక కధలను , హాస్యకధలను, కరుణగాధలను రమణీయంగా
వ్రాయగలరు. ఆయన వెండితెర నవలలను తన చమత్కారాల మసాలాలను నూరి
పాఠకులకు నవరసాలను అక్షరాలతో ఆడుకుంటూ విందులను పంచారు. "ఇద్దరు
మితృలు" సినిమా నవలను హీరో గురించి ఇలా ప్రారంభిస్తారు.
"పైనున్నవాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం,చిన్నంత్రం లేకుండా అందరినీ
ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడాగా, "వీడి"కి
వజ్రాలూ,"వాడి"కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి,కప్పురంలా గుబాలించాలన్న
ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా
చూస్తాడు. జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని
కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసుగారు (భద్రాచలం తాలూకా కాదు)
అన్నట్టు,-అంధా "వాడి" లీల."
ఆయన తెలుగు అక్షరాలతో ఆటలాడుకున్న తీరు అన్యులకు రాదు. ఇలాటి
చమక్కుల చమత్కారేలెన్నో రమణగారు చేశారు.
రమణగారూ, మీకు మా జోహార్లు!

Thursday, 24 February 2011

నేనంటే మీకెంత ప్రేమండి ?!




గతనెల జనవరి 26 న ఆయన పెళ్ళిరోజుకు శుభాకాంక్షలు పంపితే
వెంటనే ఫొను చేసి ఆయన అన్న మాట " నేనంటే మీకెంత ప్రేమండి"
అదే ఆయన దగ్గరనుంచి వచ్చే ఆఖరి ఫోనని నేననుకోలేదు. బాపురమణ
లంటె కవలలుకాని కవలలు. ఏ పని చేసినా ఇద్దరూ చేయవలసినదే.
ఓ పెర్సనల్ పని పై రాజమండ్రి వచ్చి మేం ఫలానాచోట వున్నాం అంటూ
ఆప్యాయతగా ఫోను చేసేవారు. ఈ ఉదయాన్నే బి.విజయవర్ధన్ గారి
మెయిల్ చూడగానే పెద్దగా ఏడ్చేశాను. భగవంతుడు ఇలా ఎందుకు
చేశాడా అనిపించింది. ఈ రోజు నేను కోటిఅందాల కోనసీమ గురించి
నా బ్లాగులో వ్రాస్తూ అంతర్వేది అన్న మాట రాగానే ముత్యాలముగ్గులో
కాంట్రాక్టరుకు ఆయన వ్రాసిన డైలాగు గుర్తువచ్చింది.
ఆయన ఇంటికి వెళ్ళితే ఆయన చూపే ఆప్యాయత ఎలా మర్చిపోగలను.
నాకు కానుకగా ఇచ్చే ఏ పుస్తకాన్నైనా బాపుగారు సంతకంచేసి, రమణ
గారిని సంతకం చేయమనేవారు. మొదటిసారి బాపురమణ గార్లను కలసి
నప్పుడు ఆయన సాహితీసర్వస్వం పుస్తకం పై సంతకం చేసి, క్రింద
బాపు సంతకంకూడా ఆయనే చేసి బ్రాకెట్లో ఆధరైజ్డు ఫోర్జరీ అని వ్రాసారు.
తరువాత ఆ పుస్తకాన్ని పోగొట్టుకున్నాను. ఆ విషయం ఆయనకు చెబితే
వెంటనే కోరియర్లో సంతకంచేసి మరోటి పంపిచారు. ఫోను చేయగానే ఆయనే
ముందు నమస్కారమండీ అంటు పలకరిస్తుంటే చాలా ఇబ్బందికరంగా
వుండేది.
.నా కార్టూన్ పుస్తకానికి ముందుమాట వ్రాయమని కోరగానే వ్రాసి పంపి.,
అది అంత తృప్తిగా లేదంటూ మరోటి వ్రాసి పంపిన రమణగారి మంచి మనసును
నాలాటి సామాన్యుడు ఎలా వర్ణించగలడు. భాపుగారికి ఆ శ్రీరాముడు ఈ విషాదాన్ని
తట్టుకొనే శక్తినిచ్చి మాలాటి అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ, రమణగారి
కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను
అవును రమణ గారూ, మేమంటే మీకెంత ప్రేమండీ ? !
.అశృధారలతో, మీ అభిమాన అభిమాని అప్పారావు ( మీరు సృష్టించిన పాత్ర పేరు
కూడా అప్పారావే అవడం నే చేసుకొన్న అదృష్టం!) రమణగారు ఇక మన మధ్యలేరు
అన్నమాటను వ్రాయలేక ఈ రచన మొదలు పెట్టినప్పుడు నా చేతులు వ్రాయలేక
పోయాయి. ఆయన రచనలు చదివినప్పుడు ప్రతిసారి, నవ్వితేనవ్వండిలోని జోకులు
గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మన చెంతనే వుంటారు.
  • Blogger news

  • Blogroll

  • About