RSS
Facebook
Twitter

Sunday, 24 April 2011

శ్రీ సత్యసాయి భగవాన్



సత్య సాయి బాబా మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారు.
బాబా నిరంతర భక్తి గురించి ఇలా అన్నారు.
" భక్తి ఉండవలసినది ఒక్క భజన సమయంలోనే కాదు,
ఎల్లప్పుడు నుండవలెను. గురువారము సాయంకాలం
తగిలించుకొని భజనకు వచ్చి, భజన ముగిసి ఇంటికి
వెళ్ళుటతోనే తీసి దూరంగా పడవేయుటకు అది "యూని
ఫామ్" కాదు: మానసిక సంస్కారముఎడతెగక యుండ
వలెను.భక్తివలన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వయో
ధికులు మొదలగు పూజ్యులయెడ నుండవలసిన గౌరవము,
నమ్రభావము వృద్ధి కావలెను. దేహమునకు ఆహారమెట్లు
పోషక పదార్ధమో హృదయమునకు భక్తి అట్లు పోషక
పదార్ధము. దిక్సూచి యంత్రములోని ముల్లు ఎల్లప్పుడు
ఉత్తర దిక్కునే చూపుచుండును: మరియొక దిక్కుకు
మరలనే మరలదు. మనము మరలించినను అది వెంటనే
తన దృష్టిని మరల ఉత్తరమునకే తిప్పును. అట్లే, భక్తుడు
ఎల్లప్పుడును భగవంతునకు అభిముఖుడై ఉండవలెను.
అట్లు ఉండినప్పుడే అతడానందమును పొందగలడు."


ప్రభుత్వాలు చేయలేని ప్రజోపయోగమైన పనులను శ్రీ సత్యసాయి
ప్రజలకు అందించారు. చెన్నై పౌరులకోసం శ్రీ సత్యసాయి గంగ కాలువ,
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, నీటిని శుద్ధి
చేసే ప్లాంటులను విద్యాలయాలను ఎన్నో ప్రజలకు అందజేసారు. మంచి
పనులు చేసేవారిని, కష్టకాలంలో ఆదుకొని సహాయ సహకారాలను
అందించేవారిని మనము దేముడు అంటాము. మరి సత్యసాయిని దేముడని
అనటంలో ఏమాత్రం అసమంజసంకాదు కదా!
WORLD PACIFIC (AMERICA) ప్రసాంతి నిలయంలో బాబా
ప్రసంగాన్ని, భజనలను LP రికార్డుగా 1960 లో విడుదలచేసింది




Saturday, 23 April 2011

సరస్వతీ నమస్త్యుభ్యం






ఈ రోజు పుస్తకప్రియులకు అసలైన పండుగ రోజు .పుస్తకాలను ఆరాధించే వారికి
పుస్తకాలయాలు , అవి గ్రంధాలయాలయినా , పుస్తక విక్రయ కేంద్రాలయినా
నిజమైన దేవాళయాలు! 23 ఏప్రియల్ "వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే" గా ప్రపంచ
వ్యాప్త పుస్తకాబిమానులు జరుపుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే
విపరీతమైన ఇష్టం. ఈ అభిరుచి నాకు మా నాన్నగారు నేర్పారు. అలా మానాన్న
గారు కొన్న పుస్తకాలు , నాకు పుట్టిన రోజు కానుకలుగా మా పిల్లలు ఇచ్చే పుస్తకాలతో
బాటు,నేను కొన్నవాటితో నా దగ్గర చాలా మంచి లైబ్రరీ వుంది. మా ఇంట్లోకి ప్రవేశించగానే
మొట్టమొదట అగుపించేవి నా పుస్తకాలే. .


83ఏళ్ళ చరిత్ర గల న్యూయార్కులోని స్ట్రాండ్ బుక్ స్టోర్ ఐదంతస్తుల భవనంలో
ఎటుచూసినా పుస్తకాలే అగుపిస్తాయట! ఈ పుస్తక దుకాణాన్ని రోజూ ఆరువేల పైగా
పుస్తకప్రియులు సందర్శిస్తారట!! పెద్దనగరాల్లో "పేజెస్" లాంటి పెద్ద పుస్తక విక్రయ
కేంద్రాలు వివిధరకాల పుస్తకాలను పాఠకులకు అందిస్తున్నాయి.
పుస్తకాల గురించి ఆరుద్ర గారు ఇంటింటి పజ్యాలలో ఇలా చెప్పారు:
ఎరువిచ్చిన పుస్తకాలు
ఎప్పుడూ తిరిగే త్రిపాది నక్షత్రాలు
ఆనందమూర్తి దగ్గర్నుంచి రాంబాబు పట్టుకెళితే
ఆయన దగ్గర నుంచి రంగయ్య తీసుకొన్నది
అక్షరాలా ఆదిలో నువ్వు కొన్నది
ఆ బుక్కు వాళ్ళింట్లో చూసినప్పుడు
నువ్వేం బాధపడకు
అయిదు నిముషాలసేపైనా కళ్ళారా
చూడగలిగావు కడకు
ఎరువిచ్చిన బుక్కు
మళ్ళీ చూడ్డంకూడా గొప్ప లక్కు !
<><><><><><><><><><><><><><><>


విజయవాడలో జరిగిన ఓ పుస్తకాల పండుగలో శ్రీ ముళ్లపూడి వెంకట రమణ చేసిన
మాటల ముత్యాల ప్రసంగంలో రాలిన కొన్ని ఆణిముత్యాలు.............
కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులు చదువుకోసమని తన కొడుక్కి
డబ్బులిస్తాడు ఆ వెంకటేశం ఆ డబ్బుతో పుస్తకాలు కొందాం అన్నాడు.
దాంతో గిరీశం షాకైపోయాడు.
"మైగాడ్ ! బయింగ్ బుక్సా! పుస్తకాలు కొనడమా?? ధిక్ ధిక్! ఇటీజ్ వర్స్ దాన్
సెల్లింగ్ గరళ్స్-అనగా పిల్లనమ్ముకోడంకన్నా కనిష్టం" అన్నాడు.
అదే గిరీశం చేత రమణగారు ఇల్లాను చెప్పించారు!
బుక్ రీడింగ్ పెరిగినది-మంచి బుక్స్ వల్లనే కాదు. ఈనాటి టీవీల్లో బంకజోళ్ళ
సీరియళ్ళ దయవళ్ళ..ట్ట!
పూర్వం బస్సొచ్చి బళ్ళను కొట్టింది.రైళ్ళొచ్చి బస్సులను కొట్టాయి. నాటకాన్ని
సినిమా కొట్టింది సినిమాని టీవీ కొట్టింది.కానీ బుక్స్ ని ఏదీ కొట్టలేదు.కొట్టబోదు
నా చిన్నప్పుడూ-నేను వయసు మీదున్నప్పుడూ-నేడు వయసు నా మీదున్నప్పుడూ-
ఎప్పుడూ ఆ దృశ్యాలు నా మనసులో పటంకట్టి వుంటాయి.ఒక దృశ్యం-ఒక బాపు బొమ్మ
గుమ్మంలో ముగ్గు వేస్తున్నది.రెండోది, ఒక చదువరి పుస్తకం చదువుతున్న చిత్రం.రెండుకి
రెండూ ఎంత చూసినా తనివితీరని గొప్ప చిత్రాలు. బంతిపూల రధంలాంటి బాపుబొమ్మ
గొబ్బెమ్మ దగ్గర మోకరిల్లి ముగ్గులు రచిస్తుంది. ఆ సొగసు చూడతరమా! వహవ్ వా!!
ఇంతకన్నా ఆనందమేమి? ..ఉంది..మహప్రభో..ఉంది.దీనిన మించిన భువన మోహన
దృశ్యం మరొక్కటి వుంది. అది ఒక చదువరి -చేతిలో తెరచిన పుస్తకం !
అప్పట్లో పబ్లిషర్లను కృతిభర్తలు అనేవారు..నన్నయ తర్వాత మధురకవి పోతన్నగారిని
ఒక రాజు అడిగాడు కాని ఆయన వద్దన్నారు. పోతన తన భాగవతానికి శ్రీరామచంద్రుడినే
పబ్లిషరుగా ఎన్నుకొన్నాడు.
దరిమిలా తాటాకులదశ దాటాక,యంత్రాలు వచ్చాక పబ్లిషర్ల సంఖ్య పెరిగింది.
ఆంధ్రప్రచారిణి,ఆంధ్ర గ్రంధమాల,వావిళ్ళ,విజయనగర,పిఠాపుర సంస్థానాలు,త్రివేణి,విశాలాంధ్ర,
ప్రజాశక్తి,ఎమెస్కో, నవోదయ-1 & 2, నవభారత్, న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్,నవజ్యోతి,
కొండపల్లి, కాళహస్తి,రామా, వెంకటరామా,అశోక్,ఠాగూర్,సాహిత్య అకాడమీలు...ఇలా ఎన్నెన్నో,
ఈ అఖండ పుస్తకజ్యోతికి...
ఇదే ఈ అక్షర నీరాజనం.
శ్రీ ముళ్లపూడి ప్రసంగ పాఠం నుండి
<><><><><><><><>
" E" అక్షరం ఉపయోగించకుండా నవలా రచన !!
ఎర్నెస్ట్ విన్సెంట్ కాల్పనిక నవల, "గాడ్విబ్" ను ఇంగ్లీషు అక్షరం "E" ని
ఉపయోగించకుండా 50,110 మాటలతో రచించాడు. "E" అనే అక్షరం
లేకుండా రాసిన ఈ నవల వ్రాయడానికి రచయితకు 165 రోజులు పట్టిందట!
మొదట 1939లో అమెరికాలో ప్రచురించినప్పుడు ఈ పుస్తకం ధర 3 డాలర్లు.
ఇప్పుడు ఈ పుస్తకం ధర $1000 !!
( మనమీదేనర్రోయ్! కార్టూన్ మితృలు శ్రీ సరసి గారి సౌజన్యంతో,
బాపూగారి బొమ్మాయిల బొమ్మకర్టసీ: బాపు చిత్రకళా ప్రదర్శన (1974)సావనీర్)

Wednesday, 20 April 2011


కోర్టులో ఓ న్యాయవాది అనర్గలంగా వాదిస్తున్నాడు. అదే సమయంలో ఆయన
ఓ టెలిగ్రాం అందుకొని చదివి జేబులో పెట్టుకొని తన వాదనను తిరిగి ప్రారంభించాడు.
వాదన ముగిశాక ఆ టెలిగ్రాం చూసిన మితృలు ఆశ్చర్యపోయారు. ఏమంటే ఆ
టెలిగ్రాములో వున్న విషయం సామాన్యమైన విషయమేమీ కాదు. ఆ న్యాయవాది భార్య
మరణ వార్త ఆ టెలిగ్ర్రాములో వుంది.! ఆ న్యాయవాదే ఉక్కుమనిషిగా పేరు పొందిన
సర్దార్ వల్లభాయ్ పటేల్! వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావానికి అదో ఉదాహరణ.
మన దేశానికి ఒక స్పష్టమైన రూపాన్ని సృష్టించిన శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్.
రాజ సంస్థాలలను భారతదేశంలో కలిపి, లొంగని హైద్రాబాద్ నవాబు మెడలు వంచి
అంగీకరింప జేసిన గొప్ప వ్యక్తి. లేకుంటే హైద్రాబాదు ఇంకా కాష్మీర్ సమస్యలాగే వుండేది.
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశ తొలి హోమ్ మంత్రిగా నియమింప
బడటం మన దేశం చేసుకున్న అదృష్టం. గుజరాత్ లో అక్టోబరు 31, 1875లో జన్మించిన
పటేల్ పేరు వల్లభాయ్ ఝవేర్భాయ్ పటేల్. ఆయన ఆలస్యంగా స్వాతంత్ర పోరాటంలో
ప్రవేశించినా, ముందు తరాలవారందరికీ ఆదర్శంగా నిలిచాడు. మహత్మా గాంధీ
నాయకత్వం పై ప్రభావితుడైన ఆయన తన న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర
ఉద్యమం లోకి ప్రవేశించాడు. రైతు సమస్యల పట్ల ఆసక్తితో చంపారన్ రైతుల కోసం
గాంధీజీ చేసిన ఉద్యమంలో పాల్గొన్నాడు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ముందుండి
నడిపించాడు. బ్రిటిష్ వారు గాంధీని అరెస్టు చేస్తే తన తరఫున సత్యాగ్రహం కొనసాగించాడానికి
గాంధి పటేల్ ను నియమించాడు. 1942లో పటేల్ చేసిన "విజయమో-వీరస్వర్గమో" అన్న
ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరచింది. 1931 లో పటేల్ కాంగ్రెస్ అద్యక్షుడయ్యాడు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రధాని కావలని కాంగ్రెస్ కార్యకర్తల కోరిక. కానీ గాంధీ
ఆ పదవిని నెహ్రూకి కట్టబెట్టాడు. గాంధీజీకి ఎదురు చెప్పనని పటేల్ తప్పుకున్నాడు.
ఆయనే ప్రధాని అయి వుండినట్టయితే కాష్మీర్ సమస్య ఇంతకాలం పరిష్కారంకాకుండా
వుండేది కాదు. మన దేశచరిత్ర మరో విధంగా వుండేది. విధిని తప్పించలేము కదా? !
ఇలాటి ధృఢచిత్తంగల నాయకులు ఇప్పుడు మనకేరి?
.

Monday, 18 April 2011

జై హనుమాన్


స్వామి భక్తికి, కార్యనిర్వహణకు హనుమంతునికి మించిన వారు లేరు.
వాల్మీకి రామాయణం ఆంజనేయుని ప్రవేశంతోనే పాఠకులను భక్తి
పారవశ్యంలోనికి తీసుకొని వెళుతుంది. ఆంజనేయ స్వామి తొమ్మిది
అవతారాలను ధరించాడు.
1. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
2.శ్రీ వీరాంజనేయ స్వామి
3.శ్రీ వింశతిభుజాంజనేయ స్వామి
4. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి
5. శ్రీ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి
6. శ్రీ సువర్చలాంజనేయ స్వామి
7..శ్రీ చతుర్భుజాంజనేయస్వామి
8.శ్రీ ద్వాత్రింశధ్భుజాంజనేయస్వామి
9.శ్రీ వానరాకార ఆంజనేయస్వామి
హనుమంతుడు కార్యశీలి. సీతాన్వేషణకు లంకకు వెళ్ళివచ్చిన తరువాత
"సీతాదేవిని ఛూశాను" అన్న ఏక వాక్యం చెబుతాడే కాని తను ఎంతటి
సాహసం చేసి సముద్రలంఖణతో లంకను చేరిన సంగతి ప్రస్తావించడు.
ఆ మాటను విన్న శ్రీరామచంద్రుడు వెంటనే లేచి హనుమంతుని గాఢంగా
కౌగలించుకుంటాడు. ప్రాజ్ఞుడైనవాడు తన కార్యసాధనలో తను చేసిన గొప్పలు
చెప్పుకోడు. హనుమంతునికి తన స్వామి ఆనందమే కావాలి. అందుకే ఒకే
ఒక వాఖ్యంతో " దృష్టా సీతా" అన్నాడు.
హనుమత్ స్తుతి
<><><><><><><>
బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం మరోగతాI
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్II
బుద్ధి,బలం,కీర్తి,ధైర్యం,నిర్భయత్వం,అనారోగ్యం వంటి జాడ్యాలు తొలగడం
వాక్పటుత్వం మొదలైనవన్నీ హనుమంతుని స్మరణతో లభిస్తాయి. ఈ నాటి
యువత తెలుసుకోవలిసిన ఎన్నో విషయాలు మనకు సుందరకాండలో
కనిపిస్తాయి.
హనుమానుని జయంతి శుభ దినాన అందరికీ ఆయన శుభాశీస్సులు
కలగాలని కోరుకుంటూ...
( శ్రీబాపు గీసిన ఈ సుందర హనుమానుని చిత్రం శ్రీ ముళ్లపూడి రచనతో
వెలువడిన "రామాయణం" పుస్తకం (సంస్కృతి ఇంటర్నేషనల్ మద్రాసు)
సౌజన్యంతో)

కార్టూన్ శ్రీ రామ కధ !!




1983లో నేను ఆంధ్రజ్యోతి, సచిత్ర వార పత్రికలో శ్రీరాముని మీద వేసిన
కార్టూన్ చూసిన కార్టూనిస్ట్ మితృలు శ్రీ రామశేషు ఆ నాటి నా
కార్టూనును, ఆనాటి రేడియో యుగం నుంచి నేటి కంప్యూటర్ యుగానికి
తీసుకొని వెళ్ళారు. శ్రీరామశేషు చేసిన మార్పును చూసిన మితృలు డాక్టర్
జయదేవ్ బాబు గారు మరో కొత్త కార్టూన్ను సృష్టించారు. ఇలా 28 ఏళ్ళ
క్రితం నేను గీసిన నా కార్టూనుకు ఇంతటి ప్రత్యేకతను కలుగచేసిన ఆ
ఇద్దరు మితృలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్టూన్ గురించి మరో విషయం మీతో పంచుకోవాలి. ఆంధ్ర
జ్యోతి వీక్లీలో ఆ కార్టూన్ పూర్తిగా ప్రకటనలతో నిండిన పేజీలో ఓ మూల
వేశారు. లేఔటు చేసిన ఆ ప్రకటనల మధ్య ఓ మూల వుండటం
వల్ల ఆ కార్టూన్ చాలా మంది పాఠకుల దృష్టిలో పడలేదు. నేనే వీక్లీ
చూస్తూ ఆపేజీని స్కిప్ చేయడం జరిగింది. తరువాత ఈ విషయం
క్రోక్విల్; హాస్య పత్రిక నిర్వహిస్తున్న శ్రీ శంకు గారికి తెలియజేస్తే, ఆయన
వెంటనే రెస్పాండ్ అయి పత్రిక వాళ్ళతో మాట్లాడి ఇలాటి అన్యాయం ఇక
ముందు ఏ కార్టూనిస్ట్ కు ఎదురుకాకుండా చూస్తానని చెప్పారు. అదీ
ఆ శ్రీరాముని కార్టూన్ కధ! ఈ నాటికి మళ్ళీ మన కార్టూనిస్టు మితృలు
నా కార్టూన్ కు గుర్తింపును తీసుకొచ్చారు. అంతా ఆ శ్రీరాముని దయ!!
<><><><><><><><><>
తెలుగు కార్టూనిస్టులు, వాళ్ళ కార్టూన్లు, విశేషాలు తెలుసుకొనడానికి
telugucartoon.com చూడండి.
<><><><><><><><><><><>

  • Blogger news

  • Blogroll

  • About