RSS
Facebook
Twitter

Tuesday, 31 May 2011

స్టేట్ గ్యాలరీ, మాదాపూర్ లో జూన్ 4, 5 ,6 తేదీల్లో బాపుగారి ఒరిజినల్
బొమ్మలతో బొమ్మలకొలువు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల
వరకు జరుగుతుందన్న ఆహ్వాన పత్రం చూశాక, 2001 , మార్చి స్మైల్
సంచిక 16, 17 పేజీలలో చదివిన " బాపు బొమ్మల కోసం కోటి రూపాయల
మ్యూజియం " అన్న ఆర్టికల్ జ్ఞాపకం వచ్చి ఆనాటి ఆ ఆర్టికల్
మీ ముందు వుంచుతున్నాను. చదివి ఆ మ్యూజియం వివరాలు మరిన్ని
తెలిస్తే అభిమానులెవరైనా తెలియజేస్తారని ఆశిస్తాను.
హైదరాబాదులోని శిల్పారామం ఎదురుగా బాపు బొమ్మల కోసం
మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.ఒక తెలుగు
కార్టూనిస్టుకి ఇంతటి గౌరవం దక్కడం వెనుక ఇద్దరు అధికారుల కృషి,
పట్టుదల వుంది. అసలు "బాపు బొమ్మలకోసం ఒక మ్యూజియం" వుండా
లనే ఆలోచనకు సారధ్యం వహించింది, పునాది వేసింది ఐఎ ఎస్ అధికారి
రాణి కుముదిని.మరో ఐ ఎ ఎస్ అధికారి హుడా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ
పార్ధసారధి భాస్కర్ గారు మ్యూజియం కోసం శిల్పారామం ఎదురుగా ఐదు
ఎకరాల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు.
బాపు బొమ్మల మీద అభిమానంతో ఈ ఇద్దరు ఐ ఎ ఎస్ల కృషి వల్ల బాపు
అపురూప చిత్రాలను కాపాడుకొనే అదృష్టం కలిగింది మనకి.
మూడువేలకి పైగా కార్టూన్లు, లైన్ డ్రాయింగ్స్ కాక మరో ఐదు వందల
కలర్ ఇల్లస్ట్రేషన్సుని ఈ మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు. బాపు గీసిన
కదలని బొమ్మలతో బాటు ఆయన తీసిన కదిలే బొమ్మల వివరాలు సీడీల్లో
భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకి మ్యూజియం. సిద్ధం అవుతుంది
అప్పటివరకూ ఎదురుచూసే ఓపిక లేక పోతే ఈ కార్టూన్లు చూసి నవ్వుకోండి.
( "స్మైల్" మార్చి 2001 సంచిక నుంచి )


అప్పుడే పదేళ్ళు దాటి పోయాయి. ఆ మ్యూజియం విషయం అందరూ మర్చే
పోయారు.బాపుగారి ఒరిజినల్ బొమ్మలకొలువు జరుగుతున్న ఈ సంధర్భం
లోనైనా ఈ మ్యూజియం విషయం ఆలోచిస్తే బాగుంటుంది.లేకపొతే ఆంధృల
ఆరంభశూరత్వం మరోసారి బయటపడుతుంది.
( కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమ్మోహన్ " స్మైల్ " సౌజన్యంతో )

Saturday, 28 May 2011

ఈ రోజు తారకరాముని జయంతి

ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు. తెలుగువాళ్ళ
ఆత్మ గౌరవాన్ని నిజంగా తెలుగు నేలపై నిలబెట్టిన మహనీయుడాయన.
తెలుగు వాళ్లనే ఒక జాతి వుందనీ , ఉత్తరభారత దేశప్రజలకూ చాటి
చెప్పిన గొప్ప వ్యక్తి రామారావు. మనల్ని మద్రాసీలుగా పిలవబడుతుంటే
" తెలుగు " వాణిని పార్లమెంటులో వినిపించాడు. మామూలుగా దీనికి కూడా
మన తెలుగు వాళ్ళు కొందరు హర్షించలేదు. "తెలుగు తెగులు ": అంటూ
ఎగతాళి చేసి మనం తెలుగువాళ్ళమని నిరూపించుకొన్నారు. బాపు రమణ
గార్లచే పిల్లలకు తెలుగు పాఠాలు తయారు చేయించి, ఆ తెలుగు ప్రముఖులు
ఇద్దరినీ ఉచితరీతిన సత్కరించాడు.
ఇక నటుడిగా అనితర సాధ్యంగా వివిధ పాత్రలను తెరపై అవిష్కరించారు.
రాముడు, కృష్ణుడు ఇలానే ఉంటారు అని పించారు. ఇలాటి మహానటుడి
మైనం బొమ్మను ప్రదర్శనలో( Madame Tussaud) వుంచకబోవటం ఆయనా
.ఓ తెలుగు నటుడిగా పుట్టడమే !!

శ్రీ నందమూరి తారకరామారావు లాంటి ప్రముఖ తెలుగు వ్యక్తి పుట్టిన రోజునే
నా పుట్టిన రోజు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి
ఈ ఫొటో నా చిన్ననాటిది. ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకొని 71లోకి
అడుగు పెడుతున్నా ఇంకా నా ఆలోచనలు యవ్వనంగానే వున్నాయి. దీనికి
కారణం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబం, నాపై అమిత ప్రేమాభి
మానాలు చూపించే మితృలు ! అందరికీ నా శుభాకాంక్షలు !!

Tuesday, 24 May 2011

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు ఆత్రేయ. కన్నీళ్లను ఇంగ్లీషులో
" టియర్స్" అని అంటారుగానీ, ఏడిస్తే, నవ్వితే వచ్చే ఆ కన్నీళ్ళు కళ్ళనుంచే
వస్తాయి కాబట్టి " ఐస్ " వాటర్ అని అంటే కాస్త హాస్సెంగా వుంటుంది కదా?
కన్నీళ్ళ రుచి ఉప్పగా వుండటానికి కారణాన్ని ప్రఖ్యాత రచయిత జనార్దన
మహర్షిగారు తన " వెన్నముద్దలు " పుస్తకంలో సరదాగా ఇలా చెప్పారు.
"ఎన్ని చేపల
ఏడుపో...
సముద్రం ఉప్పు..!
మరోచోట ఇలా అన్నారు :
"ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట ?
పక్కింటోడు
ఎదిగిపోయాడట !!



భార్యాభర్తలు సినిమాలో ఓ డైలాగు, " ఏడ్చే మొగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మ
కూడదు" ఇక పిల్లలు, పెళ్ళాలు తమ కోర్కెలు తీర్చుకోడానికి ఏడ్పు మంత్రం
చదువుతారని!. పిల్లల విషయంలో మాత్రం దీనికి కారణం అమ్మా నాన్నలే! ఇక
ఈ కాలంలో ఆడవాళ్ళు అలా "ఐస్" వాటర్ కురిపించి చీరలో, నగలో భర్తలచేత
కొనిపించుకోవటం లేదు. భర్తలే వాళ్ళు ఇంట్లో తమకు, పిల్లలకు చేసే సేవలకే
"ఐస"యిపోయి వారి కోరికలు తీరుస్తున్నారు. కానీ పిల్లలకు ఏడిస్తే తమ పనులు
సాధించుకోవచ్చు అన్న అలవాటును పెద్దలు చెస్తే చివరకు వాళ్ళే ఏడుపు ముఖం
పెట్టాల్సి వస్తుంది. " ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు"
అని బుజ్జి పాపాయిలను ఆటపాటలతో మరిపించవచ్చు కానీ పెద్దపిల్లలను ఏడ్చి
నప్పుడల్లా చంకనెక్కించుకొంటే నడుమునొప్పితో ఏడవలసి వస్తుంది. ముఖ్యంగా
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వున్న బొమ్మో మరోటో కావాలని ఏడుపు
లంకించుకోవటం ఆ ఇంటివారికీ, మనకూ ఇబ్బందే! బుజ్జిపాపాయిల ఏడుపు
ఉంగా ఉంగా అంటూ విన సొంపుగానే వుంటుంది.అదీకాక వాళ్ళు ఎంత ఏడిస్తే
ఊపిరితిత్తులకు అంత బలమనే మన పెద్దలు " బాలానాం రోదనం బలం " అన్నారు!
ఇక కొందరు వాళ్ళకు ఏ బాధలు లేకపోయినా ఎదుటివాళ్లని చూసి ఏడుస్తునే
వుంటారు ఎదుటవాడి అబ్బాయికో అమ్మాయికో మంచి మార్కులొచ్చి మెడిసనులోనో
ఇంజనీరింగ్ లోనో సీటొస్తే " ఆ ఊరికే సంబరపడిపోతున్నాడు.రేపు ఫీజులు కట్టేటప్పుడు
తెలుస్తుంది " అంటూ ఏడుస్తుంటారు. మా హాసంక్లబ్ కార్యక్రమాలకు ఏనాడూ రాని
ఓ పెద్దమనిషి "మీరు హాలు సగానికిపైగా జనాలువచ్చారన్నారు, సగంహాలు ఖాళీట
గదా" అని ఓ వెకిలి ఏడుపునవ్వు నవ్వుతుంటాడు. ఇది అతనికి ప్రతిసారి అలవాటైన
ఏడుపు.

ముళ్లపూడి రమణగారి "బుడుగు" బుజ్జిపాపాయిల ఏడుపు గురించి ఇలా చెప్తాడు.
"చిన్ని పాపాయికి కోపంవస్తే వాడు కేరుకేరుమని, యాయా అని ఘట్టిగా చాలాసేపు
చెప్తాడన్నమాట.!" ఇంకా ఏడుపు గురించి బుడుగు బోల్డు సంగతులు చెప్పాడు.
"ఏడిస్తే బామ్మ రూపాయిస్తుంది. ఇక లావుపాటి పక్కింటి పిన్నిగారు ఉందా,.వాళ్ళ
మగుడు దానికి ప్రెవేటు చెప్పేస్తాడా, అప్పుడేమో అది యిలా యేడుస్తూ బామ్మ
దగ్గరకి వస్తుందా, బామ్మేమో యేడవకమ్మా అని దానికి కాఫీ యిస్తుంది". అంటే
ఏడుపువల్ల కొన్ని సమయాల్లో లాభాలున్నాయని మన బుడుగు చెప్తాడు.

రాజకీయనాయకుల్ని కవ్వించి ఏడ్పించే కార్టూన్లు మనల్ని మాత్రం నవ్విస్తాయి.
అంటే వాళ్ళేడుస్తుంటే మనం నవ్వుతామన్నమాట! అంకెల్లో ఏడు సంఖ్య అంటే
చాలామంది ఇష్టపడరు. దేన్నైనా లెక్కపెట్టేటప్పుడు ఏడు సంఖ్యరాగానే ఆరున్నొక్కటి
అంటారు. ఏడిస్తే వాడు ఆరున్నొక్కరాగం తీశాడు అంటారు. మన అమితంగా
అభిమానించేవారికి ఏదైనా దుఖం, కష్టం కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తుంది.
అందుకే ఇలాటి సంధర్భాలలో ఏడుస్తున్నవారిని ఏడవనివ్వమంటారు. అలా ఏడిస్తే
మనసు తేలిక పడుతూందని, రోగ నిరోధక వ్యవస్త మెరుగు పడుతుందని చెబుతారు.
బాధకలిగినప్పుడు ఏడ్చేది మానవులు మాత్రమే! మిగతా జంతుజాలం వాటికి వచ్చిన
శారీరక బాధలను మరోవిధంగా , అరుపుల ద్వారా తెలియపరుస్తాయికానీ కన్నీళ్ళు
కార్చవు. అంతేకాదు తోటి జంతువులు బాగుంటే మన మానవుల్లా అవి ఏడవవు!!
(కన్నీళ్ళ కార్టూన్లతో మనని నవ్వించిన బాపుగారికి కృతజ్ఞతలతో)

Friday, 20 May 2011

ఊమెన్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ! ఆయన
గురించి మన బ్లాగరు మితృలు శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు
తన saahitya-abhimaani.blogspot.co ద్వారా ఇదివరలో తెలియ
జేశారు.

ఆంధ్ర సచిత్రవార పత్రిక సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణగారు
శ్రీ ఊమెన్ కార్టూన్లను వారం వారం మొదటి పేజీలో ప్రచురించే వారు.
తెలుగులోకి అనువాదం చేసి ప్రచురుణ జరిగేది నా దగ్గర వున్న ఆయన
కార్టూన్లను మీ ముందు వుంచుతున్నాను.
శివసేన నేత బాల్ ధాకరే కూడా మంచి కార్టూనిస్టే! ఆయన రైల్వేలలో
అవినీతి పై గీసిన కార్టూన్ చూడండి.

Thursday, 19 May 2011



ఈనాటి తెలుగు దినపత్రికలలో పాఠకుల దృష్టి పడేది మొట్టమొదట
ఆనాటి కార్టూన్లమీదే! కార్టూన్లకోసం పత్రికలు కొనే నాలాంటి వాళ్ళు
చాలా మంది ఉంటారని నా నమ్మకం. నిన్న జరిగిన రాజకీయాలన్నీ
ఒక్క గీతలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తాడు కార్టూనిస్ట్ !. ఇది
వరలో రాజకీయ కార్టూన్లకు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై గారి
"శంకర్స్ వీక్లీ " వుండేది. శ్రీ శంకర్ నెహ్రూ మీద వారం వారం ఎన్నో
కార్టూన్లు గీసేవారు. ఆ కార్టూన్లకోసం నెహ్రూజీ ఆతృతతో ఎదురు
చూసేవారట1 ఈనాటి నాయకులు తమపై వచ్చిన కార్టూన్లను చూసి
కిసుక్కున నవ్వు కోవడం మాని విసుక్కుంటున్నారు, నసుక్కుంటున్నారు.
ఈనాడు, ప్రముఖ వార్తా పత్రికలలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు గీసే
శ్రీధర్(ఈనాడు), సురేంద్ర ( ది హిండూ), శేఖర్ (ఆంధ్రజ్యోతి) మన
తెలుగు వాళ్లయినందుకు గర్వించాలి. మీకు మరో విషయం తెలుసా
"ఈనాడు" ప్రారంభించిన కొత్తలో ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్
శ్రీ సుధామ (శ్రీ అల్లంరాజు వెంకటరావుగారు) పాకెట్ కార్టూన్లు వేసే
వారు. అలనాడు " ఈనాడు "లో శ్రీ సుధామ గీసిన పాకెట్ కార్టూన్
మీ కోసం.
ఇక్కడ మీరు చూస్తున్న కార్టూన్లు ఈనాడు, ది హిండూ, శ్రీ శేఖర్ గారి
పారాహూషార్ సౌజన్యంతో.

  • Blogger news

  • Blogroll

  • About