RSS
Facebook
Twitter

Thursday, 29 September 2011




శ్రీకాకుళం , కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో గల శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం
ఆంధ్రమహావిష్ణువు వెలసిన ఆలయంగా చెబుతారు.శ్రికాకుళం అనే ఈ పేరుని విదేశీ
వర్తకులు తమ వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని సిరికొలని, సిరికి
కొలనుగా పిలిచే వారట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్న మరో జిల్లా ముఖ్యపట్టణం
పేరు కూడా శ్రీకాకుళంగా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు ఈ ఊరిని చికాకోల్ అనే
వారు మన భూమండలానికి కృష్ణాజిల్లాలో గల ఈ శ్రీకాకుళం మధ్య భాగమని
శ్రీకాకుళం భూకేంద్రమనీ ఇక్కడ ఆది ద్వుడు "ఆంధ్రవిష్ణువుగా వెలిసాడని
చెబుతారు . ఈఆలయం విశాలమైన ప్రాంగణంలొ మధ్యగా నిర్మాణం జరిగింది.
ఈ ఆలయ గోపురం చోళరాజైన అనంతదండపాలుడు నిర్మించినట్లుగా చరిత్ర
తెలియజేస్తున్నది.ఆలయ గోపురము పై సర్వధారి నమ సంవత్సరము 1081
లో నిర్మాణము జరిగినట్లుగా శాసనం వ్రాసి వున్నది.
బ్రహ్మగారు శ్రీమహావిష్ణువు కొరకు తపస్సు చేయగా వారి ఫూజలకు వీలుగా విష్ణువు
ఆర్చారూపుడుగా శ్రీవైఖానన మహర్షులచే ప్రతిష్టించబడ్డాడని ,శ్రీమన్నారాయణుడు
వైకుంఠమునుండి ఆంధ్రవిష్ణువుగా వెలిసినట్టు క్షేత్రమహత్యంలో వివరించారు.
విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కీ"శ" 1519లో శ్రీకాకుళాంధ్రదేవుని
అర్చించాడని చెబుతారు స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యములకై ఐదు గ్రామాలను
సమర్పించాడని శాసనములద్వారా తెలుస్తుంది.
ఆలయప్రాంగణములొ విశ్రమించిన రాయలుకు కలలో శ్రీఆంద్రమహావిష్ణువు అగుపించి
ఆంధ్రకావ్యమును రచించమని చెప్పినట్లు, అటుపిమ్మట ఆముక్తమాల్యద రచించినట్లు
ఆ గ్రంధములో వ్రాశారు. ఈ ఆలయానికి ఆగ్నేయ మూలగా ఎత్తైన 16 స్థంబాల
మంటపంలోనే కూర్చుని ఆ గ్రంధ రచన చేశారట. అందువల్ల ఈ మంటపానికి "ఆముక్త
మాల్యద మంటపము" అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశఖ శుద్ధ
దశమితో బ్రహ్మోత్సవాలు మొదలై పంచాహ్నిక దీక్షతో ముగుస్తాయి.

Saturday, 24 September 2011

తెనాలి ఐతానగరంలో 1908 ఆగష్ట్ 5వ తేదీన వెంకట సుబ్బారావనే
చక్రపాణి జన్మించారు. ఆయన ఇంటి దగ్గరే వున్న ప్రాధమిక పాఠశాలలో
ఐదో తరగతి పూర్తి చేసి, తెనాలి తాలూకా హైస్కూళ్ళో ఆరవ తరగతిలో
చేరి ఎస్.ఎస్.ఎల్.సి.వరకూ చదివారు. జాతీయోద్యమంలో చేరి ఉత్సాహంగా
పాల్గొన్నారు.

1934లో చక్రపాణిగారికి టిబీ సోకింది. మదనపల్లి శానిటోరియంలో 1935
లో చికిత్సకై చేరిన ఆయనకు ఓ బెంగాలీ వ్యక్తితో పరిచయమవటమే
కాకుండా ఆయన దగ్గర బెంగాలీ నేర్చుకున్నారు. కలకత్తా నుంచి వాచకాలు,
పిల్లల కధలు తెప్పించి చక్రపాణికి కానుకగా ఇచ్చారు. తన అపార గ్రహణశక్తితొ
బెంగాలీ భాషను నేర్చుకొనడమే కాక ప్రఖ్యాత శరత్ నవలలను అవి తెలుగులో
శరత్ బాబే వ్రాశాడా అన్నంతగా ఆయన అనువాదం సాగింది. చక్రపాణి శత
జయంతి సంధర్భంలో ఆయన వ్రాసిన శరత్ సాహిత్యం దేవదాసుతో బాటు
మరో ఐదు నవలను ఒకే పుస్తకంగా డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సేకరణగా
వెలువడింది.
నాగిరెడ్డిగారితో పరిచయం అటుతరువాత వారిద్దరి స్నేహం దినదిన
ప్రవర్ధమానమయింది. నాగిరెడ్డిగారు మద్రాసులో బియన్ కే ప్రెస్ ప్రారంబించాక
అందులో చక్రపాణిగారి పుస్తకాలు అచ్చువేసేవారు ఇద్దరూ కలసి సినిమాలు,
తీశారు. "చందమామ" లాంటి పిల్లల బొమ్మల పత్రికను పలు భాషలలో
ప్రారంభించారు. విజయా సంస్థను స్థాపించి "షావుకారు", "పెళ్ళిచేసి చూడు",
"పాతాళభైరవి", "మిస్సమ్మ"," గుండమ్మకధ", "మాయాబజార్" లాంటి ఆణిముత్యాలను
తెలుగుతెరకు అందించారు ఆయన ముక్కుసూటిగా మాట్లాడేవారు. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణగారు ఆంధ్రపత్రికలో పని చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళి
"నేను ఆంధ్రపత్రిక నుంచి వచ్చానండి" అన్నారు
"ఎందుకూ"
"మీతో ఇన్టర్వ్యూ చేసి"
"ఎందుకూ"
"మీ గురించి వ్రాద్దామని"
"నా గురించి చెప్పడానికి ఏముంది..నువ్వు రాయడానికేముంది.నేను నేనే"
"అంతేనా"
"అంతేగదా". కుండ బద్దలు కొట్టినట్లు సమాధానాలు చెప్పడం చక్రపాణిగారికే
సాధ్యం. ముళ్ళపూడి చక్రపాణి గురించి ఇలా అన్నారు. "వేప రసం,హ్యూమరసం
కలిసి కళాత్మక వ్యాపారి వెరసి చక్రపాణి"
ఆంధ్రజ్యోతి మాస పత్రికను స్థాపించి అందులో "పనిలేని మంగళి" శీర్షికలో వివిద
విషయాలపై ఎన్నో వ్యాసాలను వ్రాశారు. హైద్రాబాదులో "యువ" మాసపత్రికను
నడిపారు. "కినిమా" మాసపత్రికను నాగిరెడ్డిగారితో స్థాపించి కొంతకాలం నడిపారు.
సినిమా, పుస్తక పత్రికా రంగాలలో ఎనలేని సేవలందించిన చక్రపాణిగారు ఇదే
రోజు ( 24-09-1975) చెన్నై విజయా హాస్పటల్లో మరణించారు .సినీ సాహిత్య
లోకంలో చందమామలా వెలిగిన శ్రీ చక్రపాణిగారికి జోహార్లు. .

Friday, 23 September 2011

దేముళ్లనూ వదలం !

ఈ కలికాలంలో మానవుడు దేముడికి భయపటం లేదు. వాడు ప్రతి రోజూ
చేస్తున్న పాపాలకు భయపడుతున్నాడు. తన మోసాలు, అత్యంత నీచంగా
పీడించి మేస్తున్న లంచాల గడ్డి ఎక్కడ పోతుందోనని ప్రతి రోజు భయపడుతూ
బ్రతుకు వెళ్ళబోస్తున్నాడు. చివరకు తన పాపాల గోతిలోంచి బయటకు
లాగడానికి ఆ దేముడికీ లంచాలు సమర్పిస్తున్నాడు. మనం చేసే పాపాలకు
ఓ కొబ్బరికాయ కొట్టేసి, అప్పనంగా కొట్టేసిన డబ్బుతో వెలిగిపోవాలని
అనుకుంటున్నాడు..

పదవిరావాలని, అటుతరువాత డబ్బు గడ్డి బాగా దొరికే మరో పదవి రావాలని
అగుపించిన ప్రతి దేముడి గుడి చుట్టూ గానుగెద్దులా తిరుగుతూ చివరకు ఆ
దేముడికే శఠగోపం పెడుతున్నాడు. చివరకు దొరికిపోయి జనాలు, కోర్టులు
అక్షింతలు వేసినా, శ్రీకృష్ణజన్మస్థానానికి ( పెద్ద వాళ్ళను జైలుకెళ్ళాడు అని
అనకూడదు కదా!) వెళ్ళి చిప్పకూడు తింటున్నా గుళ్ళో వాడూ, బయట
(అ)కార్యకర్తలు యజ్ఞాలు,యాగాలు చేస్తుంటారు. ఇక బందులూ చేయిస్తూ
రాబందుల్లా జనాలను పీక్కు తింటారు. ఇక పవిత్రత ఎక్కడ వుంది. ఈ
మధ్య కొన్ని గుళ్ళల్లో పూజారులు గుళ్ళు మూసేసి ఆ గుడి బయట క్రికెట్
ఆడుతున్నారంటే ఇంతకంటే పాపం ఎక్కడవుంది చెప్పండి. రెండు రోజుల క్రితం
హిండూ పత్రికలో పడిన పై ఫొటోయే అందుకు నిదర్శనం.
భగవాన్ ! ఈ ప్రపంచాన్ని ఇలాటి నరాధములనుంచి ఇక నువ్వే కాపాడాలి.
వాళ్ళకి నువ్వంటే చచ్చేంత భయం. నువ్వెక్కడ బయటకు వచ్చి వీళ్ళ భరతం
పడతావేమోనని నీ గుడికీ తాళాలేసి ఆటలాడుతున్నారు.

Wednesday, 21 September 2011

మన గురజాడ అప్పారావుగారు.

ఈ రోజు శ్రీ గురజాడ అప్పారావుగారి 150వ జయంతి. ఆదుర్తి, అక్కినేని నిర్మించిన
"సుడిగుండాలు" సినిమాలో ఒక డైలాగు మీకు గుర్తుండే వుంటుంది. ఈ కాలం
పిల్లలకు గురజాడ అంటే తెలియదని అదెక్కడో మారుమూల ఓ గ్రామమనీ అను
కుంటారనీ ఆనాడే మాటల రచయిత శ్రీ యన్నార్ నంది వ్రాశారు. గురజాడ కలం
నుంచి వెలువడిన దేశభక్తి గీతాలు మన జాతీయగీతాల స్థాయికి మించినదిగా
వున్నా తెలుగునే మరచిపోతున్న మన యువతరానికే పూర్తిగా తెలియనప్పుడు
యావత్ భారతదేశానికి తెలిసే అవకాశం ఎక్కడ? "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే
మనుషులోయ్","ఈసురోమని మనుషులుంటే దేశమేగతిని బాగుపడునోయ్" ఇలా
ఎన్నెన్నో గీతాలను రచించారు.
సంఘదురాచారాలను ఎత్తి చూపిస్తూ ఆయన రచించిన "కన్యాశుల్కం" నాటకం
రంగస్థలం మీదే కాకుండా సినిమాగా ప్రశంసలను అందుకుంది. గురజాడ అంటారు
"మనం చెడ్డవారని అనుకునేవారి యెడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నిస్తే
దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ లోకము మరింత యింపుగా
కనబడుతుంది. మీకూ, మీ పరిచయం కలిగిన వారికి మరింత సౌఖ్యం కలుగుతుంది.
కాక, మంచి చెడ్డలు ఏర్పరచగలిగినవాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది; చెడ్డ
లోనూ మంచి ఉంటుంది." ఇలాటి మహనీయుడు మన తెలుగు రాష్ట్రంలో కాకుండా
ఏ తమిళనాడులోనో, బెంగాలు లోనో పుట్టి వుంటే ?! మన తెలుగు వాళ్ళు ,నాయకులు
ఇప్పటికైనా మేలుకుంటారనీ ఆశిద్దాం! అట్లాంటి మంచి రోజులు రావాలనీ కోరుకుందాం
ఈ రోజు సాయంత్రం 4-30 గంటలకు రాజమండ్రి కందుకూరి వీరేశలింగం టౌన్ హాల్లో
కళాగౌతమి ఆధ్వర్యంలో శ్రీ గురజాడ జయంతి సభ జరగడం హర్షనీయం .

Tuesday, 20 September 2011



ఏ నాగేశర్రావ్? అదేనండి మన నాగేశ్వర్రావే ! అదే ఏ.నాగేశ్వరరావుకు 88 వ
పుట్టిన రోజు. నాగేశ్వరరావనే చిన్న బీజం "ధర్మపత్ని" అన్న సినీమాలో
ఓ చిన్న పాత్ర ద్వారా చిన్న పిల్లాడిగా (కన)పడినా నటుడిగా జన్మించినది
మాత్రం "సీతారామజననం" చిత్రంలోనే !అటు తరువాత అంచెలంచెలుగా తెలుగు
తెరపై వెలుగుతుంటే ఎన్నేన్నో పాత్రలు అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతనితో
జత కలిపాయి..నాగేశ్వరరావు ఫలానా పాత్రకు సరిపోడని కొన్ని పత్రికలూ, సినిమా
వాళ్ళు ధైర్యంగా చెప్పినా వాళ్ళ అభిప్రాయాలన్నీ తప్పులనీ తన అభినయం
ద్వారా నిరూపించాడు. నటసామ్రాట్ అయ్యాడు.పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ
వీభూషణ్, దాదాఫాల్కే, మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాళిదాస్ సన్మాన్ పురస్కారాలు
అందుకున్నాడు. అమెరికా ప్రభుత్వంచే ఆ దేశానికి అతిధిగా ఆహ్వానం అందు
కొని ఆ దేశంతో సహా ఎన్నెన్నో దేశాలు చుట్టివచ్చాడు.
హైద్రాబాదుకు తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకు వెళ్ళడానికి శ్రీ అక్కినేని ఆనాడు
కృషి చేస్తే 1963 లో బాపు రమణలు "ఈనాడు తెలుగు సినిమా నావ నతడు
చేర్చదలచిన రేవు నీటికీ నేటికీ నూరామడనిపించే హైదరాబావు !" అంటూ
"జ్యోతి"లో కార్ట్యూన్ ద్వారా వెక్కిరించి వాళ్ళే మళ్ళీ 2003లో ఆయన పుట్టినరోజున
ఇలా అన్నారు.
తెలుగు సినిమా నావను
ఓడగా పెంచిన ధీరో !
హైదరాబాదులో హార్బరు
నిర్మించిన హీరో !!
అనుకున్నది సాధించిన అసాధ్యుడా !
అఖండుడా !
ఓ మా అందరి హీరో!
నీకు మా జోహారో !
ఈనాడు హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృర్ది చెందింది అంటే ఆనాడు
అక్కినేని తీసుకున్న చొరవే!
వేసేది బుద్ధిమంతుడి పాత్రైనా (విప్రనారాయణ) బుడ్డిమంతుడి పాత్రైనా (దేవదాసు)
మెప్పించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. చక్రపాణి, మిస్సమ్మ లాంటి చిత్రాలలో
హాస్యాన్ని పండించాడు.
శ్రీ బాపు రమణలంటే శ్రీ అక్కినేనికి ఎనలేని గౌరవం. శ్రీరామరాజ్యం చిత్రంలో
బాపురమణలు ఆయన్ని వాల్మీకి మహర్షిగా చూపించబొతున్నారు.
అక్కినేని తన అనుభవాలను ,భావాలను ’అ ఆ " ( అక్కినేని ఆలోచనలు)లుగా
వ్రాసుకున్నారు. ఒక చోట అయన ఇలా అంటారు.
"జీవితములో నటన వృత్తిగా తీసుకొనేవాడొకప్పుడు మానవుడు!
నటనే జీవితంగా జీవిస్తున్నాడు యిప్పుడు"
తెలుగు చిత్ర పరిశ్రమ 80 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఈ సమయంలో
88 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మన అక్కినేని ఇలా మరెన్నో పుట్టిన
రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.....
  • Blogger news

  • Blogroll

  • About