RSS
Facebook
Twitter

Tuesday, 16 October 2012


           ఈ రోజుల్లోనే కాదు ఆరోజుల్లోకూడా రకరకాల హాబీలుండేవి. అందులో రకరకాల స్టాంపుల
           సేకరణ..మా నాన్నగారు ఎన్నోరకాల స్టాంపులూ, నాణేలు సేకరించారు. నేను శ్రమపడకుండా
           అవన్నీ జాగ్రత్త చేయడం మాత్రం నాకదో హాబీ. ఈ స్టాంపుల్లో ఎన్ని రకాలవో !! పక్షులు,
           జంతువులే కాకుండా ఆర్ట్ పైకూడా వున్నాయి. అందులో మధుబని మిధిలా పెయింటింగ్
           మీద  5, 10 రూపాయల స్టాంపు రెండూ కలపి ఒకటిగానే విడుదలవడం ఓ విశేషం!!.మనం
           ఐదు రూపాయల స్టాంపు మాత్రమే వాడాలంటే సగానికి చింపి ( చిరగటానికి వీలుగా చిల్లులు
           వుంటాయ్) వాడుకోవచ్చు, లేక పోతే మరో సగం పదిరూపాయల స్టాంపు ఒకటి మాత్రమే
           వాడుకోవచ్చు.

                              మరికొన్ని స్టాంపులు కుడి ఎడమైతే పొరబాటులేదోయ్ అంటూ కుడి ఎడమగా తప్పుగా
                              అచ్చయి జనాలమీదకి అచ్చేసి వదలినవీ వున్నాయి. దానికి ఉదాహరణ  మీరు చూస్తున్న
                              ఈ భోదిస్వత్తుడి బొమ్మ స్టాంపు. కొన్ని అందమైన కొండలూ తటాకాలతో చిత్రపటంలా వుంటే
                              మరికొన్ని నిలువుగా  నిలుచున్నమ్యూనిచ్ ఒలింపిక్ స్టాంప్స్.

                 నా దేశనాయకుల స్టాపుల కలెక్షన్స్ చూసిన మామిత్రులు  ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్
                 జయదేవ బాబుగారికి ఈ నాయకుల స్టాంపులనగానే రబ్బరు స్టాంపులే గుర్తుకొచ్చిఇలా
                 కొసమెరుపుగా తమాషా చేసి చూపించారు! Indian Express లో శ్రీ రవిశంకర్ వేసిన
                 ఈ "రబ్బరు" స్టాంపు బొమ్మ మరీ బాగుంది కదూ !!
               ( Cartoon courtesy: Sri Ravi Shankar & The Indian Express)

Friday, 5 October 2012


                            ఈ రోజు అంతర్జాతీయ నవ్వుల దినోత్సవంకదా నాకు ఈ పాట జ్ఞాపకం
                            వచ్చింది. మానవులకు ఒక్కరికే నవ్వే గుణం వుందని అంటారుగానీ ఇక్కడి
                            చింపాంజీ ఫొటోలు చూడండి. నవ్వటమే కాదు ఎన్ని రకాల ఫోజులిచ్చిందో !
                            కొందరు నరులు కూడా అసలు నవ్వరు. ఈజోకు విన్నారా. నలుగురు
                            మిత్రులు కల్సినప్పుడు అందులో ఓ సుబ్బారావు ఓ మంచి జోకు చెప్పాడు.
                             మిగిలిన ఇద్దరూ పగలబడి నవ్వారు కానీ మూడో వాడు మాత్రం నవ్వలేదు.
                            అదేమిట్రా సుబ్బారావు అంత మంచి జోకు చెబితే నవ్వవేం అనడిగారు.
                            వాడంటే నాకు పడదు. నేనింటికి వెళ్ళి నవ్వుకుంటాను అన్నాడట! తమ
                            మీద తామే జోకులేసుకొని నవ్వించడం నవ్వుకోవడం బాపురమణ
                            గార్ల గొప్పతనం. వాళ్ళు తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాకొట్టి
                            నప్పుడల్లా బాపూరమణలు కార్టూన్లు వేసుకొని నవ్వుకున్నారు!.

                                      ఇప్పుడు గతంలోలా తెలుగు సినిమాల్లో సున్నిత హాస్యం కరువయింది.
                                      బ్రహ్మానందం ను చెంపదెబ్బలు హీరో ఎన్నిసార్లు కొడితే అదే హాస్సెం
                                      అని నవ్వుకుంటూ హాస్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. మనకు
                                      తెలుగులో శ్రీ బాపు, శ్రీ బాబు,శ్రీ జయదేవ్, సరసిలాటి కార్టూనిస్టులు
                                      నవ్వుల డాక్టర్లగా మనల్నిఆరోగ్యంగా వుంచుతున్నారు. ఇందులో శ్రీబాపు,
                                      జయదేవ్ లు నిజ జీవితంలో డాక్టర్లు కాని డాక్టర్లు కూడా!


                                          నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలన్నారు. సమయం సంధర్భం
                                          లేని నవ్వు హాయినిగాక హానిని కలిగిస్తుంది. కష్టాల్లో వున్నవాడిని
                                          నవ్విస్తే అ బాధను మరచిపోతాడు.మంచి కార్టూనుకు, లేదా జోకుకు
                                          పాతదనం లేనే లేదు. చదివినప్పుడల్లా చూసినప్పుడల్లాకొత్తగా అనిపిస్తూ
                                          పొట్టచెక్కలు చేస్తూనే వుంటుంది. ఇక్కడి నా కార్టూన్లు మిమ్మల్ని
                                          నవ్విస్తే ధన్యుణ్ణి. మీరు తప్పక నవ్వుతారు. అదిగో నవ్వేస్తున్నారు.
                                          ఐనా మీకు సెన్సాఫ్ హ్యూమర్ చాల ఎక్కువగదా!! ఈ రోజే కాదు,
                                          ప్రతి రోజూ నవ్వండి, నవ్వించండి. నవ్వే జనా సుఖినో భవంతు.

Wednesday, 26 September 2012

దిష్టి బొమ్మ

         

                       దిష్టిబొమ్మ !
                       నిండుగా గడ్డినింపుకొని
                       ఆపైన ఒంటి నిండుగా బట్టలేసుకొని
                       ఠీవిగా నలబడింది !!
                       కేరింతల మధ్య తగలబడింది !!
                       అభాగ్య జీవులకు గుడ్ద కరవు !!
                       మూగ జీవులకు గడ్డి కరవు !!!

    నేను సురేఖార్ట్యూనులు పేరుతో స్థానిక దినపత్రిక సమాచారంలో
    ప్రతి ఆదివారం  ఇలాటి చిన్న కవితలు (?) వ్రాసే వాడిని. వాటిలో
    దిష్టిబొమ్మ కవిత నాకు బాగా నచ్చింది. "గోదావరి" అనే కవితా
    సంకలనంలో అచ్చయింది కూడా. రాష్టంలో ప్రతి రోజూ ఏదో
    ఉద్యమం జరుగుతూ వుంటుంది, ఎన్నో గడ్డి బొమ్మలకు మంచి
    డిమాండు కుడా. ఎవరైనా, ప్రభుత్వమైనా ఈ గడ్డి బొమ్మల
    తయారీ వ్యాపారం మొదలెడితే మంచి లాభదాయకం కదూ! 

Tuesday, 25 September 2012

30 ఏళ్ల నాటి- "మేఘసందేశం "


                        కాళిదాసు విరచిత "మేఘసందేశం" విరహ ప్రేమికుల సందేశమయితే,
  దాసరి దర్శకత్వంలో అక్కినేని 200వ చిత్రంగా తారకప్రభు పతాకంపై
  శ్రీమతి దాసరి పద్మ ఈ చిత్రాన్ని సంగీత దృశ్యకావంగా నిర్మించారు.
  అక్కినేని 200 చిత్ర వేడుక  మద్రాసు మ్యూజిక్ అకాడామీ లో 12,
  సెప్టెంబరు,1982 న  శివాజీ గణేశన్, ఆశోక్ కుమార్, రాజ్ కుమార్,
  ప్రేమ్ నజీర్ లాటి చిత్ర హీరోల సమక్షంలో జరిగింది. ఇంకా పి.పుల్లయ్య,
  బి.నాగిరెడ్డి, డి.వి.యస్.రాజు, యల్వీ.ప్రసాద్, దుక్కిపాటి మధుసూధన
  రావు,యస్.యస్.రాజేంద్రన్, యమ్మెస్.రెడ్డి,యు.కృష్ణంరాజు,జితేంద్ర,
  రాజేష్ ఖన్నా, రేఖా, రీనారాయ్ కూడా పాల్గొనటం విశేషం.ఇందులో
  చాలా మంది ఇప్పుడు మన మధ్య లేరు.
   అతితక్కువ సంభాషణలున్న మేఘసందేశంలో రమేష్ నాయుడు
  కూర్చిన సంగీతం ఈ చిత్రాన్ని మధుర కావ్యంగా మలిచింది. ఇందులో
  జయదేవుని అష్టపదులతో బాటు దేవుళపల్లి కృష్ణశాస్త్రి రచించిన నాలుగు
  పాటలను ఉపయోగించుకున్నారు. ఈనాటికీ 30 ఏళ్ళుదాటినా జేసుదాసు,
  సుశీల మధురగాత్రాల పాటలు నిత్యనూతనంగా నిలచిపోయాయి. జాతీయ
  అవార్డులలో ఉత్తమ ప్రాంటీయ చిత్రంగా, ఉత్తమ సంగీత దర్శకత్వానికి,
  ఉత్తమ గాయనీ గాయకులుగా సుశీల జేసుదాసులు ఎన్నికయ్యారు.
  ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమనటి(జయసుధ),ఉత్తమ సంగీత
  దర్శకుడు, ఉత్తమ చాయాగ్రాహకుడు,ఉత్తమగేయ రచయిత (ఆకులో
  ఆకునై దేవుళపల్లి) ఉత్తమ ఆడియో గ్రాఫర్ ఇలా ఈ చిత్రానికి తొమ్మిది
  నందుల బహుమతులు వచ్చాయి ! ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ యన్టీ.
  రామారావుగారి చేతులమీదుగా ఈ బహుమతులను చిత్ర బృందం
  అందుకున్నారు. ఒక సంధర్భంలో శ్రీమతి పాలువాయి భానుమతి
  అన్నట్లు "అక్కినేని అదృష్టవంతుడు".

Friday, 21 September 2012

గురజాడ జయంతి


                        దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా
 దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్ !! "ఆన్న
 గురజాడ  వేంకట అప్పారావు గేయం ద్వరా ఈతరం జనాలకు
 తెలిసింది. కన్యాశుల్కం నాటకాన్ని 1897లోనే వ్రాసినా రెండవ
 కూర్పు 1909 లో. ఆనాడే గురజాడ డబ్బుకు ఆశపడే లుబ్దావధానుల
 వంటి పాత్రలతొ బాటు గిరీశం ,మధురవాణి లాటి పాత్రలతో రక్తి
 కట్టించారు. కన్యాశుల్కం నాటికగా ఎంతో ప్రాచూర్యం పొందింది.
 వినోదావారు కన్యాశుల్కం చిత్రంగా, డాక్టర్ గోవిందరాజుల
 సుబ్బరావు, సి.యస్సార్, యన్టీ రామారావు, సావిత్రి, షావుకారు
 జానకి లతో అద్భుత చిత్రంగా మలిచారు.

గురజాడ  వ్యవహారిక భాషలో రచనలకు ఎనలేని కృషి చేశారు.
 విచిత్రమేమంటే గురజాడ 150 వ జయంతిని నిర్వహించాలని
 ఘనత వహించిన మన ప్రభుత్వం నిర్ణయించినా,. బాధాకరమైన
 విషయం విశాఖ బస్ కాంప్లెక్స్ సమీపకూడలిలో వున్న గురజాడ
 విగ్రహం తొలగించి దూరంగా పడేసి ఈ నాడు ఆ మహానుభావుని
 150 జయంతి నాటికైనా ప్రతిష్ఠించకబోవటం సిగ్గుపడవలసిన
 విషయం.
  • Blogger news

  • Blogroll

  • About