RSS
Facebook
Twitter

Thursday, 21 February 2013

అమ్మ మాట

         మనకు మాటలు నేర్పిన అమ్మే మొదట భాషను నేర్పిన గురువు.
అమ్మ ఏ భాష మాట్లాడితే ఆ భాషే పిల్లలకు వస్తుంది. అందుకే మనం
పలికే భాషనే (మాటనే) మాతృభాష అని వ్యవహరిస్తున్నాం. ఈ రోజే
ప్రపంచమంతా తమ మాతృభాషాదినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది.
ఇటీవలే మన ఘనత వహించిన ప్రభుత్వం  తెనుగు మహాసభలను
అట్ట(కటౌట్లతో) ఏర్పాటుచేశారు. మన ఆంధ్రులకు ఆరంభశూరత్వం
ఎక్కువనే అపవాదు వుంది. అది నిజమవకూడదనే భగవంతుని
ప్రార్ధిద్దాం. ఈ సభలను సార్ధకం చేయాలంటే మన పిల్లలకు అమ్మా,
నాన్నా అని పిలవడం అలవాటు చేయాలి. ఈమధ్యే మా ఆత్మీయుల
ఇంట జరిగిన ఓ శుభకార్యానికి వెళితే అక్కడ అన్ని వయసుల పిల్లల
నోట మమ్మీ, డాడీ అన్న మాటలే వినిపించాయి. యన్టీఆర్ తెలుగు
వాడకాన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రవేశపెడితే మనవాళ్ళే తెలుగు
తెగులు అంటూ వేళాకోలం చేసిన మాట ఇంకా గుర్తుండే వుంటుంది.



ఇతర భాషల వ్యక్తులు కలుసుకుంటే వాళ్ళ మాతృ భాషలోనే ఒకరి
నొకరు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. మరిమనమో
ఇంగ్లీషు తప్ప మాట్లాడం. ఎవరిమీదనైనా కోపం వచ్చినా ఇంగ్లీషులోనే
గట్టిగా అరుస్తాం.వాడు బాబోయ్ వీడు బాగా చదువుకున్నవాడని
భయపడతాడని. మీరు గమనించారా, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా
ప్రతి రెండు తెలుగు పదాలకూ "అండ్","అండ్" అని మధ్యలో అనడం
ఓ ఫాషనైపోయింది. మన తెలుగు భాషకున్న వరం పద్యం. మనకున్న
వేమన, సుమతీ శతకాలు పిల్లలకే కాదు పెద్దలకూ బుద్ధులు నేర్పుతాయి.
పిల్లలచేత అందులోని మంచి పద్యాలు ఒకటి రెండైనా వల్లె వేయించి
ఆప్తులు, మిత్రులు వచ్చినప్పుడు వాళ్ళచేత చెప్పిస్తె, కొత్తవాళ్ళ దగ్గర
స్టేజీలమీదా భయం పోతుంది.   శ్రీ నార్ల చిరంజీవి బాలగేయాలు
"తెలుగు పూలు" పుస్తకం మీరు చదివారనుకుంటాను.అందులోని
గేయాలు ప్రతి తెలుగు పిల్లవాడు తప్పక నేర్చుకోవాలి.
           మధుర మధురమైన మనభాష కంటెను
           చక్కనైన భాష జగతి లేదు
           తల్లిపాల కంటె తనయుల కే పాలు
           బలము నీయగలవు ? తెలుగు బిడ్డ
మన తెలుగు భాషలో నుడికారాలు, చమత్కారాలు మరో భాషలో
లేవు. ఉదాహరణకు "చెప్పు" అన్న మాటకు పాదరక్ష అనీ,  ఏదైనా
విషయాన్ని తెలియజేయమని (చెప్పు) అనే భావం కూడా వుంది..
ఒకసారి మహాకవి శ్రీశ్రీ మద్రాసు నగరంలో మండుటెండలో చెప్పులు
లేకుండా రావటం చూసిన ఓ మిత్రుడు " అదేమిటి ఇంత ఎండలో
చెప్పులు లేకుండా!" అంటే శ్రీశ్రీ " చెప్పుకొనలేనే పరిస్థితి   " అన్నారట!
ఇదే తెలుగుభాషలోని మహత్తు. మన పిల్లలకు "అంకుల్" అని
పిలిచే కుళ్ళుమాట మానిపించి మామయ్యగారూ అనిపిలిచే మంచి
అలవాటును నేర్పిద్దాం!!



Tuesday, 29 January 2013

పద్మశ్రీకి బాపు అవార్డు !!


      ఎన్నాళ్ళకు పద్మశ్రీ అవార్డుకు విలువ వచ్చింది ! అవునండీ పద్మశ్రీ అవార్డు
బాపుగారికి వచ్చి ఇన్నాళ్ళకు ఆ బిరుదుకే విలువ పెరిగింది. ఆయన
ఇంతకాలం అవార్డు కా(రా)వాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. కానీ
ఆయన అభిమానులు మాత్రం ప్రతి ఏడాదీ పద్మ అవార్డుల ప్రకటనలో బాపు
గారి పేరుంటుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తూనే వున్నారు.


      శ్రీ బాపు 1945 నుంచి తెలుగు, తమిళం, ఇంగ్లీషు పత్రికల ,కధలకీ
, నవలల ముఖచిత్రాలకీ బొమ్మలు, కార్టూన్లు వేస్తునే వున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి ముఖ్యమంత్రిగా సారధ్యం వహిస్తున్నప్పుడు
బాపు రమణలు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధమిక విద్యాభోధనకు ఆడియో
విజువల్ పాఠాలు ( 1986-88) నిర్మించారు. ఈటీవీ కోసం 40 గంటల టీవీ
సీరియలుకు దర్శకత్వం వహించారు (1996-2004). తిరుమల తిరుపతి
దేవస్ఠానం ఆస్థాన చిత్రకారుడిగా 1979 నియమించ బడ్డారు. రఘుపతి
వెంకయ్య అవార్డు, ఆంధ్రాయూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (కళాప్రపూర్ణ),
తిరుపతి వెంకటేశ్వరయూనివర్సిటీ ఆనరరీ డాక్టరేట్ ఇలా ఎన్నో సత్కారాలు
అందుకున్నారు.
        ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ 2001, ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమీ-2002, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-క్రోక్విల్ అకాడమీ-2002,
ప్రపంచ తెలుగు సమాఖ్య 2004, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 5 వ
తెలుగు సాహితీ సదస్సు 2006 లలో లైఫ్ టైం అచీవుమెంట్ అవార్డులు
పొందారు..భద్రాచలం రామాలయంలో, కోటప్పకొండ దేవాలయంలోనూ
ఆయన వేసిన వర్ణచిత్రాలు అలంకారాలుగా నిలచాయి.
   1967 నుండి తెలుగు సినిమాలకు గర్వకారణమైన చిత్రాలను మితృలు
శ్రీ ముళ్లపూడితో సహకారంతో దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో
వచ్చిన "సీతాకళ్యాణం" విదేశాలలో విమర్శకుల ప్రశంసలను పొందటమే
కాకుండా, లండన్, చికాగో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.శ్రీ బాపు 9 హిందీ
చిత్రాలకు, ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. "వంశవృక్షం" చిత్రంతో
అనిల్ కపూర్ ను హీరోగా పరిచయం చేశారు.

   మేమింత అందంగా వుంటామా అని దేముళ్ళే అనుకునేటంత అందంగా
వుంటాయి శ్రీ బాపూ గీసిన దేముళ్ళ బొమ్మలు. శ్రీ బాపూ దేముళ్ళ బొమ్మలు
చిత్రించేటప్పుడు ఋషిగా మారిపోతారని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
అన్నారు. ఇంతటి ప్రతిభావంతులైన శ్రీ బాపుకి పద్మశ్రీ నిజంగా చాలా చిన్న
పురస్కారం. అభిమానుల ప్రేమాదారాలే ఆయనకు నిజంగా తృప్తినిచ్చే
బహుమతి. ఆయన అభిమానిగా , ఆశేష అభిమానులందరి తరఫున
వారికి నా శుభాభినందనలు.

Thursday, 10 January 2013

మధురమీ సు(రేష్)ధాగానం !!

            జంధ్యాల రూపొందించిన " హై హై నాయకా " సినిమాలోని " సరిగమలెరుగని
రాగము....." పాట గుర్తుందా! ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రవేశించిన శ్రీ
మాధవపెద్ది సురేష్, మాధవపెద్ది సత్యం ( ఈయన మాయాబజార్ సినిమాలో
శ్రీ యస్వీ రంగారావుకు పాడిన "వివాహ భోజనంబు" పాట పాడటమే కాకుండా
అందులో అగుపిస్తారు కూడా), కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే, గాయకులు
మాధవపెద్ది రమేష్ వంటి మేటి సినీ సాం కేతవర్గానికి చెందిన కుటుంబం నుంచి
వచ్చారు.  1967 లో విజయవాడలో భావనాకళాసమితి నిర్వహించిన ఒక
కార్యక్రమంలో శ్రీ సురేష్ హార్మోనిస్ట్ గా తనప్రతిభను చూపించారు. ఆ సమయంలో
ఆయన SSLC విద్యార్ధి. శ్రీ సురేష్ అన్నగారు కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని
అధ్యయనం చేశారు. ఆయన ఇచ్చిన పోత్సాహంతో సురేష్ సంగీతం మీద అభిమానాన్ని
పెంచుకున్నారు. సురేష్ తల్లిగారు శ్రీమతి వసుంధరాదేవిగారికి వీణలో డిప్లొమో,
కర్ణాటక సంగీతంలో ప్రవేశముంది. సంగీతం ప్రవృత్తే గాని, వృత్తి కాకూడదని ఆమె
అనేవారట.
 శ్రీ సురేష్ నాన్నగారు విజయవాడ ఆంధ్రా సిమెంట్స్ లో ఇంజనీరుగా పనిచేసేవారు.
సురేష్ సంగీతంపై చూపిస్తున్న శ్రర్ధను గమనించి ఆయన అమ్మగారికి తెలియకుండా
ఓ అకార్డియన్ను కొనిచ్చారట. అనుకోకుండా సురేష్ నాన్నగారు 1973 లో కీర్తిశేషు
లయ్యాక కుటుంబం మద్రాసు తరలి వెళ్లారు. ఆనాడు వాళ్ల నాన్నగారు కొనిచ్చిన
ఆ వాయిద్యమే శ్రీ సురేష్ గారికి భుక్తికి దారి చూపించింది. సురేష్ అన్నగారు శ్రీ
మాధవిపెద్ది  రమేష్ నేపధ్యగాయకుడిగా ప్రశిద్ధిపొందారు.అటుతరువాత శ్రీసురేష్
సంగీత దర్శకులు శ్రీ టి.చలపతిరావుగారివద్ద అకార్డియన్ ప్లేయరగా చేరారు.1974
నుంచి ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్,పెండ్యాల, జె.వి.రాఘవులు,రమేష్ నాయుడు,
జి.కె.వెంకటేష్, నౌషద్,లక్ష్మీకాంత్ ప్యారీలాల్,ఆర్.డి.బర్మన్ వంటి సుప్రసిద్ధ సంగీత
దర్శకుల వద్ద పనిచేశారు.
 హై హై నాయకా సినిమా తరువాత రంభ రాంబాబు, భార్గవ్, ప్రేమా జిందాబాద్, బాబాయ్
హోటల్, పర్వతాలు పానకాలు,బృందావనం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాలన్నిటిలో బృందావనం శ్రీ సురేష్ గారి సినీ సంగీత జీవీతాన్ని మలుపు
తిప్పిందనే చెప్పాలి. అందులో శ్రీ వెన్నెలకంటి కలం నుంచి వెలువడిన " మధురమీ
సుధాగానం" సంగీత కూర్పు గొప్ప సంగీత దర్శకులను గుర్తు చేసింది. భైరవద్వీపం
లోని నరుడా ఓ నరుడా అనే వేటూరి గీతం, నారద తుంబుర గానామృతం లాటి
మధురగీతాలు ఆయనకు ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డుతో బాటు డబుల్ ప్లాటినం
డిస్కును సంపాదించి పెట్టింది. దాసరి  125వ చిత్రం మాయాబజార్, రాజేంద్రప్రసాద్
మేడమ్, ఈ.కోదండరామిరెడ్డి "మాతో పెట్టుకోకు" చిత్రాలు శ్రీ సురేష్ ప్రతిభను చాటాయి.
"సాహిత్యం-సంగీతం పూలదండలోని దవనం,మల్లెపూలలాగ కలసి,విడిగా తెలిసి
అలరించాలి" అని రమేష్ అంటారు.


శ్రీమాధవపెద్ది సురేష్ గారిని నేను మొదట ఓ సంధర్భంలో శ్రీ బాపుగారింట్లో కలవడం
జరిగింది. " రాజమండ్రి మా అత్తగారి ఊరే , ఈసారి వచ్చినప్పుడు తప్పక కలుద్దాం"
అన్నారు. అటుతరువాత ఫేసు బుక్ మిత్రులుగా తరచు కలుసుకుంటున్నా ఓనాడు ఫోనులో
"నేను రాజమండ్రి వచ్చాను" అన్నారు.. నేను ఆయన్నికలసి మా ఇంటికి రమ్మని పిలువగానే
వచ్చారు. ఉన్న కొద్ది సేపూ ఆయన నాతో, నా శ్రీమతితో ఎంతోకాలం నుంచి పరిచయం
వున్న వారిలా కలివిడిగా మాట్లాడారు. వారి బాబాయి గారు శ్రీ మాధవపెద్ది గోఖలే
గీసిన చిత్రం ( భారతి మాస పత్రికలోని నా సేకరణ) పైన ఆయన సంతకం చేశారు.
సంగీత దర్శకుడిగా శ్రీ మాధవపెద్ది సురేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ..

Wednesday, 19 December 2012

తెలుగు తల్లికి వందనం !!

                 ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు మాట వినిపిస్తున్నది. కారణం మన ప్రభుత్వం
తెలుగు మహా సభలు నిర్వహించడానికి నిర్ణయించడమే. ఓ నాడు తెలుగు అంటూ
ఆనాటి యన్టీఆర్ తెలుగును ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రవేశ పెడుతుంటే ఈనాటి
నాయకులు కొందరు తెలుగు తెగులంటూ వేళాకోళం చేస్తే మనమూ నవ్వుకున్నాం
అవును నవ్వమా ,మనం తెలుగోళ్ళం కదా !!
        గోదారి జలాలలో
        ఆ తీయదనమేమి ?
        నన్నయ గంటమ్ము కడిగెనాడేమో !
        పినాకిని పదచాలనములో
        ఆ విలాసమేమి ?
        తిక్కన భారత విన్యాసమేమో !
        కృష్ణా తరంగాలలో
        ఆ సంగీతమేమి ?
        ఎర్రన పద్యాల ఆలాపనేమో !
        పోతన పదాలలో
        ఆ మాధుర్యమేమి ?
        అక్షరాలకమృతము అద్దినాడేమో !!
ఇంతటి తెలుగు అమ్మంటే మనకు నామోషీ
మమ్మీ అంటూ పిలిస్తే ఎంతో ఖుషీ ఖుషీ !!

        బ్రిటిష్ దేశస్తుడైన బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకొని, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
తయారు చేశాడనీ, మన వేమన పద్యాలను  తన భాషలోకి అనువాదం చేశాడని ఎంత
మంది ఈకాలం పిల్లలకు తెలుసు. వాళ్ళకు తెలియడానికి వాళ్ళ తల్లిదండ్రులకు
తెలిస్తేగదా !బ్రౌనంటే ఎవరంటే అదో రంగు అని ఈ మద్యే కాన్వేంటులో తన పిల్లల్ని
చదివిస్తున్న ఓ పెద్దమనిషి. జవాబిచ్చాడు.
     తెలుగు భాషలో వున్న అందం, మాధుర్యం మరో భాషకు లేదనే చెప్పాలి. తెలుగుతో
ఎన్నెన్నో చమత్కారాలను సృష్టించవచ్చు. ఒకే మాటకు వేరు వేరు సంధర్భాలలో
వేరు వేరు అర్ధాలు వస్తాయి. దీనితో ఎంత హాస్యానైనా పుట్టించవచ్చు. ఆనాటి తెలుగు
సినిమాలలో నటినటుల ఉచ్చారణ, రచయితలు వ్రాసిన మాటలు తెలుగు భాష
అందాన్నిచాటి చెప్పాయి. అక్కినేని అంటారు, చదువురాని నేను అంత చక్కగా మాటలు
చెప్పానంటే ఆనాటి దర్శకులు, కవులూ అని. ఈనాటి దర్శకులకు తెలిస్తేకదా నటులకు
చెప్పడానికి.

        ఇప్పుడు పొరబాటున తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళుకూడా గమ్మత్తు తెలుగు
మాట్లాడుతున్నారు. మీరు గమనించివుంటారు. ప్రతి రెండు పదాలకూ అండ్, అండ్
అంటుంటారు. దేనికో, బహుశ: అదో ఫ్యాషన్ కాబోలు. మాటలు రాని వాడెవడో
తడబడుతూ మాట్లాడితే అదే సరైనదనుకుంటుంన్నారు. ఇక మన ప్రభుత్వం
తెలుగును ఎంత ఖూనీ చేస్తున్నదో అన్న దానికి నిదర్శనం ఇటీవల ప్రత్యక్ష
మవుతున్న ప్లాస్టిక్ బోర్డులు. అవి కూడా తయారు చేయించింది ప్రభుత్వ విద్యా
శాఖ !! ఉదాహరణకు కొన్ని :-
    విద్వామా హక్కు,  సర్వశిక్షాఅభియాన్,  అంధ్రప్రదేశ్ !!
 దయచేసి తెలుగు మీ పిల్లలకి నేర్పండి. మీరూ తెలుగు పుస్తకాలు తీసు "కొని"
చదవండి. మీ పిల్లలకి తెలుగు పుస్తకాలు కానుకగా ఇవ్వటం అలవాటు చేసు
కోండి. ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు వ్రాసిన తెలుగు పర్యాయపద నిఘంటువును
ఒకసారి చూడండి. తెలుగులో ఎన్నెని పర్యాయపదాలున్నాయో తెలుస్తుంది.

Monday, 17 December 2012



           ఎన్నో ఏళ్ళుగా మూత పడిన ఈ అందాల అలనాటి వంతెన నిరుపయోగంగా వుంచకుండా
      వందేళ్లనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు గుర్తుగా ఈనాటి తరం మరచిపోకుండా సుందరంగా తీర్చి
      దిద్దితే బాగుంటుందని ప్రజలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ
      ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటంలేదు. స్థానిక ప్రజాప్రతిధినులు కేంద్రంలో, రాష్ట్రం
      లో ఒకే పార్టీకి చెందినా  ఎందుకో ఈ విషయంలో శ్రర్ధ వహించటంలేదు. పర్యాటక మంత్రిగా
      పదవిలో వున్న చిరంజీవి ఈ విషయంలొ చూపుసారించాలి. . మొన్ననే వచ్చిన
      మన రాష్ట్రానికే చెందినన రైల్వే సహాయ మంత్రి గారు కూడా ఈ విషయంలో పెదవి విప్పక
      పోవటం  అత్యంత విచారకరం.ఆనాటి బ్రిటిష్  ఇంజనీర్ హేవ్ లాక్ సారధ్యంలో మూడేళ్ళ
      అతి స్వల్పకాలంలో ఈ వంతెన నిర్మింపబడటం విశేషం.
       1897 నవంబరు లో నిర్మాణం ప్రారంభమైన ఈ వంతెన ఆగస్టు 30 వతేదీ,1900  సంవత్సరం
      రైళ్ల రాకపోకలకు  ప్రారంభించబడింది. ఇక్కడ మీరు ఆనాటి శిలాపలకాన్ని చూడొచ్చు. !!
      పుష్కర్ ఘాట్ వద్ద ఇప్పటికీ ఆ శిలాఫలకం పదిలంగా వుంది.
   



      ఇదే మరో ఏ దేశమైనా, అంతెందుకు మనదేశంలోని మరో రాష్ట్రమైనా ఈ వంతెన గురించి
     శ్రర్ధ తీసుకొనే వారు. ఏం చేస్తాం మనం తెలుగువాళ్ళం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని
     ఆరోజుల్లో మూడేళ్ళ స్వల్పకాలంలోఅనుకున్న దాని కంటే తక్కువ వ్యయం తో నిర్మించిన
     ఈ వంతెన దాదాపు వందేళ్లకు పైగా సేవ లందించింది.ఈ.వంతెనను స్మతి చిహ్నంగా పదిల
     పరచుకోవసిన భాధ్యత మనందరీదీ !!
  • Blogger news

  • Blogroll

  • About