ఈ రోజు ఆంధ్రజ్యొతి దినపత్రిక తెరవగానే లోపలి పేజీలో "బాపూ పుస్తకంపై
నిషేధం?" అన్న వార్త అగుపించింది. అదేమిటి బాపుగారి పుస్తకాల్లోని
బొమ్మలు నవ్విస్తాయి మరెందుకీ నిషేధం అని ఆశ్చర్యపడి లేచి విషయం
చదివాక అమ్మయ్యా ! ఇదా సంగతి అని కుదుటపడ్డాను.
ఎవరో విదేశీపెద్దమనిషి గాంధీ గారి మీద అవాకులు చెవాకులు
రాశాడట. బ్రతికిపోయాం! ఆ గాంధి మీద వ్రాశాడు, ఈ గాంధీలమీద
వ్రాసుంటే ఇప్పటికి ఎన్ని బస్సులు కాలిపోయేవో ! ఎన్ని బందులు
రాస్తా రోకోలు జరిగేవో !!
పేపరు తీస్తే, అదే నండి మన వార్తాపత్రికలు చదివితే అన్నీ హత్యలూ,
ఆత్మహత్యలు, దోపిడీలూ ,త్రీపిడీలూ, నిన్నలూ ,రేపులూ కోకొల్లలు !! కానీ
ఆ వార్తలూ ఒక్కోసారి చదివితే నవ్వు వస్తుంది. ఎలాగో చిత్తగించండి.
ఈ మధ్యే ఒక హెడ్డింగ్:
" రైతు ఆత్మ హత్యలకు రెండు కోట్లు "
ఈ మాట చదవగానే ఏమిటి, ఆత్మ హత్య చేసుకోడానికి ప్రభుత్వం రెండు
కోట్లు ఇస్తున్నదా అనిపిస్తుంది. ఇక మరో వాక్యం:
"ఆత్మహత్య చేసుకొన్న యువకుడి మృతి"
ఆత్మ హత్య అంటేనే చనిపోయాడని అర్ధం. ఇక చేసుకొన్నవ్యక్తిని వీళ్ళు
మరోసారి చంపేశారన్నమాట!
చాలా ఏళ్ళ క్రితం ఇంగ్లీషు పేపర్లలో తరచు ఈ మాటలు అగుపించేవి
MGR BACKS INDIRA
OPPOSITION'S MOTION IN PARLAMENT.
ఇవి చదువుకొని నవ్వుకొనే వాళ్ళం! కొన్ని వినటానికి అదోలా వుంటాయి.
అన్ని శీర్షికలూ అలానే వుంటాయి అనలేం!ఒక పత్రిక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి
వ్రాస్తూ " స్టేట్ బ్లాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్న పతాక శీర్షిక వుంచింది.
అలానే గనుల దోపిడీని "గనుల ఘనులు" అని వ్రాసారు. బొగ్గు గనుల్లోని
దగాకు కోల్ మాల్ ( గొల్ మాల్ ) అని వ్రాయటం సీరియస్ విశేషాలకు
వ్యంగ్యాన్ని జోడించడం పాఠకులను ఆకర్షించడానికి జర్నలిజమ్ లో
కొత్త ప్రయోగాలు. వివాహ ప్రకటనలు కూడా ఈ మధ్య " 50వ వివాహ
వోత్సవమ్" అని వేస్తున్నారు. ఆ తప్పు అటుతరువాత మార్చారు.
మా చిన్నతనంలో వచ్చిన కొన్ని పత్రికల పేర్లు కూడా తమాషాగా
వుండేవి. గుండుసూది,ఢంకా, కాగడా, చిత్రగుప్త మొదలైనవి. ఆ రోజుల్లో
డిటెక్టివ్, అపరాధపరిశోధన పేర్లతో పత్రికలు వచ్చేవి. కొమ్మూరి సాంబశివరావు
సంపాదకత్వంలో తెలుగు సినిమా అనే సినిమా మాస పత్రిక వచ్చేది.