ఆడువారు అంటే "ఆడు" వారు కాదండి ! మాటలాడువారని నా భావన!
మాటలకు అర్ధాలు ఎలా మారిపోతున్నాయో ! అదే మన తెలుగు భాష
కున్న సౌకర్యం.తెలుగుతో మాటలాడుకోవడమే కాదు ( ఐనా మన తెలుగు
వాళ్ళు తెలుగులో మాట్లాడు కోవడం తక్కువే కదా ) ఆ మాటలతో ఆటలు
ఆడుకోవచ్చు! ఒక్కో సంధర్భాన్ని బట్టి , ప్రాంతాలను బట్టి అర్ధాలు ఇట్టే
మారిపోతాయి. మీరు కొత్తగా స్కూటరో , బైకో కొనుక్కుని బయటకు
వచ్చారనుకోండి. వెంటనే మీకు ఎదురయ్యే ప్రశ్న, "పెట్రోల్ ఎంతిస్తుంది?"
అని. అసలే పెట్రోలు ధర పెట్రోలులా మండిపోతుంటే ఆ ప్రశ్నతో మనకు
మరింత మండి పోతుంది ! అదేమన్నా కామధేనువా, కాకపోతే ఏ ఆవా,
గేదా, పాలిచ్చినట్లు పెట్రొలు ఇవ్వడానికి.
ఇక నేను బ్యాంకు నుంచి రిటైరైన కొత్తలో,; కనిపించిన ప్రతి వాడూ "ఏంటీ,
అప్పుడే రిటైరై ఫోయారా? అని ఆడిగే వారు. నేనూ, " మీరు విన్నది సగం
నిజం, సగం అబద్ధం ! ఏమంటే నేను రిటైరయ్యాను అన్నది నిజం. కానీ
ఫొయిన మాట మాత్రం అబద్ధం. ఇదిగో దయ్యంలా మీ ముందు నిలబడి
వున్నాకాబట్టి" అని జవాబిచ్చేవాడిని. ఇలా ఈ ప్రశ్నలను బట్టి ఓ కార్టూన్
కూడా వేసేశా!
నేను శ్రీకాకుళం స్టేటు బ్యాంకులో క్యాషియరుగా 1963లో చేరినప్పుడు
బ్యాంకు మెసెంజరు ( అతని పేరూ అప్పారావే, ఉత్తరాంధ్రలో చాలా
పేర్లు అవే ఉంటాయి) "ఇక్కడ దోమలు లావు ! జాగ్రత్తండీ " అన్నాడు.
నే కంగారు పడుతుంటే క్యాష్ ఆఫీసరు కామేశ్వరరావుగారు "కంగారు
పడకు. లావంటే ఏనుగుల్లా లావని కాదు. ఎక్కువ అని అర్ధం" అన్నారు.
అక్కడ బైటకు వెళ్ళారనడానికి పైకి వేళ్ళారంటారు. నేనొకసారి వైజాగులో
పనిచేస్తున్నప్పుడు ఒకరింటికి వెళ్ళి ఉన్నారా అని అడిగితే " పైకి
వెళ్ళారు" అని జవాబిచ్చారు వారి శ్రీమతి. నేను ఆయన మేడమీద
ఉన్నారేమోననుకొని "ఒకసారి పిలుస్తారా" అనంటే "బజారులో ఎంత
దూరంలో వున్నారో ఎలా వీలవుతుందండీ?"అన్నారు. అప్పుడు తెలిసింది
పైకి అంటే బయటకు అని. ఇప్పటిలా అదృష్టంకొద్దీ అప్పుడు సెల్ ఫోన్లు
లేవుగా!!
"టిఫిను చెయ్యడం ,టిఫిను తీసుకొని రావడం": ఈ మాటల్లోనూ తిరకాసు
వుంది. చాలాకాలం తరువాత ఉదయాన్నే ఇంటికొచ్చిన స్నేహితుడితో
హలో హలో పలకరింపులయ్యాక "కూర్చోవోయ్ ! పదినిముషాల్లో టిఫిన్
తీసుకొనస్తా" అంటూ లోపలికి వెళ్ళిన ఫ్రెండు ఓ పదిహేను నిముషాల
తరువాత ఖాళీ చేతుల్తో బైటకు వస్తే ఆశగా టిఫిన్ తీసుకొస్తాడేమోనని
ఎదురు చూసిన స్నేహితుడి బుర్రకు అప్పుడర్ఢమవుతుంది అతను లోపల
టిఫిన్ తీసుకొని (కానిచ్చి) వచ్చాడని. అలానే టిఫిన్ చేద్దూగాని అంటూ
బజార్లో అగుపించిన మితృన్ని ( అతడు అన్ని రకాల (పిండి)వంటలూ
బాగా చేస్తాడని తెలుసుకొని) ఇంటికి పిలవడమ్లోనూ వేరే అర్ధముంటుంది.
"ఏమిటో ఈ బందులతో మహా ఇబ్బందిగా వుంది.ఊరికెల్దామంటే బస్సులూ,
రైల్లూ తిరగడంలేదు" అన్నాడో మితృడు రెండు రోజుల క్రితం. "బస్సులు
తిరిగితే మాత్రం నువ్వు మీ ఊరెళ్ళడం కుదరదు కదా అన్నా". "ఏం? ఎందుకు
కుదరదు?" అన్నాడు "!బస్సులు నడవాలిగాని,అదే తిరిగితే ఇక్కడే ఉంటావు"
అన్నా. "బస్సులు నడవడానికి వాటికి కాళ్ళుంటాయా?! తిరగడం అన్న మాటే
కరెక్ట్ అన్నాడు. "సరే! తిరగడం, నడవడం రెండూ తప్పే! చక్రాలుంటాయి కాబట్టి
దొర్లడం అనటమే కరెక్ట్ మాట అన్నాను. " ఈ మధ్య బస్సులూ రోడ్లమీద తరచు
దొర్లుతూనే ఉన్నాయ్"అన్నాడు మరొ మితృడు మధ్యలో కలగచేసుకొని.
పడటమన్నా నానా అర్ధాలున్నాయి. "ఈ మధ్య మీ కార్టూన్లేమన్నా పత్రికల్లో
పడ్డాయా" అంటూ మా మితృడు హనుమంతరావడిగితే, " పత్రికలవాళ్ళు
త్రిప్పి పంపిన కార్టూన్లు పోస్ట్మాన్ విసిరితే హాల్లొ పడ్డాయ్!" అంటూ మా పద్మ
జోకెయ్యగానే, వెంటనే ఆ ఐడియాతో కార్టూన్ వేయగానే నిజంగానే "రచన"
పత్రికలో ఆ కార్టూన్ పడింది. అలానే పడటం మీద " నాకు ఏసీ పడదు " అని
ఒకాయన అంటే ఆ "పడటం" మీద ఓ కార్టూన్ వేశాను. శ్రీ ముళ్లపూడి వెంకట
రమణగారు ఈ నా కార్టూన్లను ఎడా-పెడా-ర్ధాల కార్టూన్లంటూ నా కార్టూన్ల
పుస్తకానికి ముందుమాట చెబుతూ అన్నారు.
పెద్దల మాటలకు అర్ధాలే వేరులే !!
*ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీ శ్రీ కనబడితే మొక్కపాటి
నరసింహశాస్త్రిగారు " ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " శ్రీ శ్రీ సమాధానం.
<><><><><>
*ఈ రెండో జోకులోనూ శ్రీ శ్రీ గారే కధానాయకుడు.మదరాసులో
పూర్వం ఒక తెలుగు కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు.
కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినవి ఆర్డరిస్తున్నాము. శ్రీశ్రీ
తనకి సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి
"శ్రీ శ్రీ గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు " అన్నాడు.
<><><><><><>
"ఎచటికండీ అంత త్వరగా బోవుచుంటిరి ?"
"జపానికి"
"అమ్మో అంతదూరమే ?"
"జపానికి కాదండీ-జపమునకు" అని వాని తెలివితక్కువకు
నవ్వుకొనుచు జపాన్ కు బోవును.
ఈ జ్యోకులు బాపు రమణల బృందం అందించిన "జ్యోతి" మాస పత్రికనుంచి
వారికి తెలియకుండగ సంగ్రహించ బడినవి. అందులకు నేనెంతయో వారికి
కృతజ్ఞతలు చెప్పుచున్న వాడను.
.