Saturday, 31 March 2012
సిరివెన్నెల నంది వర్ధనాలు !
Wednesday, 28 March 2012
ఫేసు బుక్కూ , నీకు బుక్కయిపోయా......
ప్రతి చెడు కీ ఓ మంచీ వుంటుంది. ఈ ఫేసుబుక్కు మూలాన నాకు ఎందరో దేశవిదేశాల మితృలు మరింత మంది దగ్గరయ్యారు.. అందులో కొంతమందిని ఇంతవరకూ నేను చూడకపోయినా అత్యంత ఆప్తులయ్యారు. ఇప్పుడు వైజాగు లాంటి ఊరికి వెళితే నన్ను బాబాయిగారూ అంటూ ఆప్యాయంగా పిలిచే జ్యోతిర్మయి లాటి అమ్మాయిలు ఎందరో. అలానే, ఎక్కడో సెటిలయిన పాతకాలం మితృలూ, మా పిల్లల స్నేహితులూ, అమెరికా, కెనడాల్లో వుండే మా మితృల పిల్లలు, ఆహా: ఎందరో ! సజ్జా నరేంద్ర అనే ఫేసుబుక్కు మితృడయితే నా ముఖాన్ని పట్టుకు చెక్కేసి ( అదే నండి చెక్కపై చెక్కి) ఇండియా వచ్చి నప్పుడు నాకు కానుకగా ఇస్తాను అన్నారు. ఆ చెక్కేసిన ముఖాన్ని ఫెసుబుక్కు లోకి ఎక్కించేశారు ! ఇక మా జయదేవ్ గారితొ, మితృలు పుక్కళ్ళరామకృష్ణ , హిందూ కార్టూనిస్టులు శ్రీ సురేంద్ర, శ్రీ కేశవ్ గార్లు రోజూ ముఖాముఖాలే !!
చికాగోలో వుంటూ విజయవాడ వచ్చిన శ్రీ వోలేటి వెంకట సుబ్బారావు గారు ఫేసుబుక్కులో పరిచయమైన నన్ను కలవాలని, మధ్యలో ఆయన చిన్న నాడు చదువుకున్న చేబ్రోలు హైస్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అదే స్కూల్లో చదివిన నా శ్రీమతి అక్కగారిని కలసి రాజమండ్రి వెళుతున్నాని అంటే అక్కడమా చెల్లి పద్మ ఇంటికి వెళ్ళమని ఆమె చెబితే, విచిత్రం, ఇంతకీ ఆయన వెళుతున్నది మా ఇంటికే ! ఇక్కడకు వచ్చాక నాతో కంటే మా ఆవిడ, ఆయన తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. అప్పటి వరకు నేను కంప్యూటర్ ముందు కూర్చుంటే సనిగే మా శ్రీమతి యాభైఏళ్ల తరువాత తన చిన్న నాటి స్నేహితున్ని కలిపినందుకు ఫేసుబుక్కును పొగడడం మొదలెట్టింది .ఇక ముంబాయి, చన్నై లోని మా అమ్మాయిలు, అబ్బాయి ఫేసుబుక్కు లోనే కనబడుతున్నారు. ఏమైనా సుధామ గారు, శిష్టా రామచంద్రరావు గారు, జ్యోతి వలబోజు గారు, కంప్యూటర్ యెరా సంపాదకులు శ్రీ నల్లబోతు శ్రీధర్, శ్రీమతి రాజావరం ఉష ఇలా ఎందరమో ఫేసుబుక్కులో బుక్కయిపోయాం !!
Tuesday, 27 March 2012
"పన్" డుగ-పంచాంగం
మా చిన్నతనంలో గుప్తావారి పంచాంగం అని పేద్ద లావుపాటి పంచాంగం వచ్చేది.అందులో శృంగార ప్రకటనలు, స్త్రీ వశీకరణకు మార్గాలు, సూత్రాలు వగైరా వుండేవి. ఆనాటి వాటితో పోల్చితే ఇప్పటి పంచాంగాలలో వున్నది అతి తక్కువ.పంచాంగమంటే గుర్తుకొచ్చింది. 1963 లో బాపు రమణల బృందం వారి "జ్యొతి" మాస పత్రికతో ఓ నవ్వుల "పన్"చాంగాన్ని ఏప్రిల్ సంచికతో విడుదల చేసింది. ఆ పంచాంగం వినోద భరితంగా తమాషా ప్రకటనలతో సహా నవ్వులు కురిపించింది.ఆ పంచాంగం ఇలా వుంటుంది!
వినోదమస్తు! వినోదమస్తు!! వినోదమస్తు
శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ జ్యోతీ పన్చాంగమ్
యంబ్రహ్మశ్రీ శ్రీమజ్జోక్కుల వినోదాచార్య సిద్ధాన్తిన : అద్వితీయ పుత్రేణ
వికటానందశాస్త్రిణా ప్రణీతమ్
Monday, 26 March 2012
రాజమహేంద్రవర రాజసాలు
రెడ్డి రాణ్మహేంద్రవరము, గోదావరి తల్లి చల్లగా కమ్ముకుని, పచ్చని చూపు చూడగా, ఆ కేదారంలో, వేసీ వేయని పడచుదనం, పరువూ మర్యాదా ముక్కారు పైరుగా పండుతూన్నది : అది ఏనాడో పల్లె, ఎన్నడో పట్టణమైనది : ఉన్నంతలో నగరమైనది.. ( శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి " కనక-వీణె " నుండి ). రాజమహేంద్రవరాన్ని ఏలిన రాజరాజనరేంద్రుని పేరున రాజమహేంద్రవరమై, ఆంగ్లేయుల పాలనలో రాజమండ్రిగా మారింది. ఈనాడు ప్రఖ్యాత వాణిజ్య కేంద్రంగా, స్వర్ణ, వస్త్ర వ్యాపారాలలో ప్రముఖనగరంగా పేరు పొందింది. రాష్ట్రమంతా విస్తరించిన బొమ్మన, చందన లాంటి ప్రముఖ సంస్థలకు పుట్టినిల్లు రాజమండ్రి !
గోదావరి నది పై విహారానికి టూరిజం శాఖ లాంచీలని ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటైన ఈ స్పీడు బోటులో గోదావరీ విహారం పిల్లలకు, యువతీ యువకులకు జాలీగా హుషారుగా వుంటుంది.
Sunday, 25 March 2012
చేటోపాఖ్యానం
పూర్వం తెలుగు పాఠాల్లో" ఏనుగు చెవులు చేటల్లా వుండును" అని చెప్పేవారు.. ఇక ఎవరైనా ఏ విషయమైనా విని అనందిస్తే, "అబ్బో వాడి ముఖం చూడాలి.చాటంతయింది" అని అంటారు. ఇక ఎవరినైనా తిట్టినా , ఛూశావా వాడిని నలుగురిలో చెరిగి పారేశా అని కూడా అంటుంటారు. (చెరగటానికి చేటకావాలి కదా).మన ప్రజా ప్రతినిధులు కొందరు నిధులు భోంచేసి అరగటానికి ఒకర్నొకరు అసెంబ్లీలో, పార్లమెంటులో చెరిగేసుకుంటుంటారు.
పొలాల్లో ధాన్యాన్ని ఇలా చేటలతో గాలి వాటంతో నేలపైకి వదులుతూ పొట్టును వేరుచేస్తుంటారు. అదో కమనీయమైన సుందర దృశ్యం. ఇక్కడ ఓ మంచి ఫొటో పెడదామని ఛుశాను కానీ ఎంత వెతికినా దొరకలేదు. చివరకు నేనే ఓ బొమ్మ గీసేసి ఉంచాను. తప్పులకు క్షమిస్తారని తలుస్తాను. ఆ బొమ్మ కోసం వెతుకుతుంటే చేట గడియారం దొరికింది. ఎప్పటిదో ఆదివారం ఈనాడులోనే కత్తిరించి అతికించిన ఓ ఆల్బమ్ లో దొరికింది. ఈరోజుళ్ళొ బైట పారేసే చేటను కూడా ఇలా కళాత్మకంగా చేసిన ఆ మహానుభావుడికి జోహార్లు! అన్నీ పాత వస్తువులూ దాచే నాదగ్గర చేట లెకపోవడం ఎంత చేట(టు) !! అందుకే ఈ చేటోపాఖ్యానం మీ ముందుంచాను.నచ్చక పొతే మాత్రం చెరిగి పారెయ్యకండేం !!
Friday, 23 March 2012
చిరంజీవి భగత్ సింగ్ !!
దేశస్వాతంత్ర్యం మీదే అతని గురి
అందుకై హారంగా ధరించాడు ధైర్యంగా ఉరి
అతని పేరే తెలియదుకదా ఈనాటి కొందరు నాయకులకు
నిజం నిజం ! భగత్ సింగ్ అదృష్టవంతుడు !
దేశం కోసం తృణంగా ప్రాణాలర్పించిన అతని పేరు నేడు
కూలిపోబోయే వంతెనలకు, కొట్టుకుపోబేయే
జలయజ్ఞాలకు లేదు
ఐనా మన దేశ ప్రజల నరనరాల్లో ఆ పేరు ఏనాటికి చెరగిపోదు !!
Tuesday, 20 March 2012
పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి నవ్వులు గుబాలించే ఓ హాసంక్లబ్బూ ! హాపీ బర్త్ డే !!
అవునండి మా హాసం క్లబ్ మా ఇంటి డాబా మీద పురుడుపోసుకొని ఈ రొజు పుట్టిన
రోజు జరుపుకుంటున్న రోజు. మా రెండో వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకటరమణ
గారు వ్రాసి పంపిన ముందు వాక్యాలే మీరు ఈ శీర్షికలో చదివారు. "హాసం" పత్రికలో
నేను నాదగ్గర వున్న బాపుగారి బొమ్మలు "బాపూరమణీయం" శీర్షికకు పంపినప్పుడు
నేను మేనేజింగ్ ఎడిటర్ శ్రీ యమ్బీయస్ ప్రసాద్ గారికి దగ్గరయ్యాను. ఆ పరిచయంతో
మీరూ రాజమండ్రిలో హాసం క్లబ్ ప్రారంభించండి అనగానే మితృడు డివీ హనుమంత
రావు నేనూ కలసి మార్చి 20 వతేదీ ఉగాదినాడు శ్రీప్రసాద్ గారు, సినీవిశ్లేషకులు
రచయిత శ్రీ యస్వీ రామారావు గార్ల చేతుల మీద, మా డాబా మీద ప్రారంభించాము.
ఆనాటి కార్యక్రమానికి పండగరోజు, పైగా క్రికెట్టు ఆట వున్నందున ఉదయం పది
గంటలకు ఎవరూ రారేమో అని నవ్విద్దామనుకొని మొట్టమొదటిసారే నవ్వులపాలు
అవుత్తున్నామేమోనని భయపడినా చాలామంది ఆడామొగా పిల్లాజల్లలతో వచ్చి
మమ్మల్ని చెయ్యేట్టుకొని లేపి మాతో నవ్వులు ఇచ్చి పుచ్చుకున్నారు.
ఆనాటి సభలో సినీనటుడు, గాయకుడు మా మితృడు శ్రీ జిత్మొహనమిత్రా యోడలింగ్
లో కిషోర్ కు రఫీకి గల తేడాను పాడి వినిపించారు.
అటుతరువాత మా హాసంక్లబ్ రాజమండ్రిలో అందరిమన్నలను పొందింది. 50 వ
కార్యక్రమాన్ని స్వర్ణోత్సవంగా ఆనం కళాకేంద్రంలో ఘనంగా మితృల ప్రోత్సాహంతో
ఉత్సాహంగా హాసం వ్యవస్ఠాపకులు పద్మభూషణ్ కె ఐ.వరప్రసాద్ రెడ్డిగారి సమక్షంలో
జరిపాము. ఆనాటి సభలో నా "సురేఖార్టూన్స్" పుస్తకం,అవిష్కరణ, శ్రీ రావి కొండలరావు
గారికి సత్కారం జరిగింది.
మా కార్యక్రమాలలో పిల్లలు, మహిళలు, పెద్దవయసు పెద్దలు (మేమిద్దరం ఇంకా పిల్లలమే)
ప్రతి ఒక్కరు వచ్చి పాటలు ,నవ్వులాటలాడి నవ్వించి వెళతారు.
మా హసం క్లబ్ గురించి ఇంకా వివరంగా మితృడు హనుమంతరావు తన బ్లాగు
"హాస్యవల్లరి" చెప్పాడు.పనిలో పని అక్కడికీ వెళ్ళి రండి. వెళ్ళారా ! ఐతే ఇక్కడి ఫొటోలూ
చూడండి. అతిత్వరలో మా కార్యక్రమంతో మళ్ళీ నవ్వులు పంచబోతున్నాం !
శ్రీ ముళ్లపూడివారు ఆనాడు పంపిన శుభాకాంక్షల మాటల సందడిలో మరికొంత..
. సంక్షిప్తంగా...
ఆంధ్రుల్లో ఐకమత్యం కాలరెత్తుకున్నంత ఒట్టు
గిరీశం మధురవాణికి తాళి కట్టినంత ఒట్టు
గంగా కావేరీ నదులు
కాశీ రామేస్రాల్లో సరిగంగా స్తానాలు చేసినంత ఒట్టు
శివుడి తలమీద గంగ కూర్చుందని
గౌరి కంటనీరు పెడితే
శివ శివా ! గంగ నా శిరసున కాదే !
నీ కళ్ళలోనే తిరుగుతుందే చూస్కో
అని శివుడు నవ్వించి నవ్వినంత ఒట్టు
హాసం క్లబ్బూ! హాపీ బర్త్ డే !