తెలుగులో ఇదివరలో చాలా సినిమాల స్కిప్ట్ లతో వెండితెర నవలలు వెలువడడం
అన్నపూర్ణావారి "తోడికోడళ్ళు" సినిమాతోనే నాంది పలికింది. అలా వెలువడిన కొన్ని
సినిమా నవలలకు తన నవలీకరణ నేర్పుతో మరింత ప్రాచుర్యం కలిగించినవారు
ముళ్లపూడి వెంకటరమణగారు. బాపురమణల సృష్ఠి " శ్రీరామరాజ్యం" పూర్తి స్క్రిప్ట్
శ్రీబాపు వేసుకున్న బొమ్మల స్టోరీ బోర్డుతో, వర్ణ చిత్రాలతో, బాపూ స్వహస్తాలతో
దిద్దిన ద(క)స్తూరీ తిలకం అక్షరాలతో పాటలు అభిమానులకు కన్నుల పండుగ
చేస్తుందీ పుస్తకం. భారత దేశంలో ఇలా పూర్తి స్క్రిప్ట్ తో వెలువడిన పుస్తకం ఇదే
కావడం మన తెలుగువాళ్ళు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి
రామభక్తులైన రమణగారు తన ఆరాధ్య దైవం కధను రమణీయంగా పూర్తిచేసి
రాముడితో చెప్పటానికా అన్నట్టు వెళ్ళారు. "నను గోడలేని చిత్తరువుని చేసి
వెళ్ళిపోయిన నా వెంకట్రావు కోటికోట్ల జ్ఞాపకాలకు సభక్తికంగా " అంటూ బాపు
గారు ఈ అపురూప పుస్తకాన్ని రమణగారికి అంకితం చేసారు. రమణగారి
మాటలు ఎంత రమణీయంగా వుంటయో చెప్పనకర్లేదు రాముడు Scene No 9
లో సీతతో " పుట్టింటి వారిని కాస్త నొప్పించినా అత్తలను మెప్పించావు.అందరి
కన్నా ఆనందం నాదే,అనుకోని కానుక-మెచ్చాను,వరం ఇచ్చాను కోరుకో-"
అంటే సీత "వరమా- వద్దులెండి" అనగానే రాముడు "అదేమిటి-అంతలా ఉలికి
పడ్డావు?"అంటాడు. దానికి సీతమ్మ "వరాలంటే భయం-మన ఇంట మామగారంతటి
వారికే వరాలు అచ్చిరాలేదు కదా" అని జవాబిస్తుంది. ఇలాటివి ఎన్నో పాఠకులను
అలరిస్తాయి.
సీత బంగారు విగ్రహం దగ్గర రాముడు కూర్చొని ( బాపుగారి అందమైన భంగిమ)
విలపించడం, లవకుశులు చెరువులోకి పరుగులు తీస్తున్న గుర్రాన్ని బంధించడం
లాటి చక్కని పూర్తి పేజీ రంగుల బొమ్మలు ప్రత్యేకం. చిత్రంలోని స్టిల్స్ ,వర్కింగ్
స్టిల్స్ రంగుల్లో అలరిస్తాయి. ఇక శ్రీ బాపుకే ప్రత్యేకమైన బొమ్మలతో వ్రాసుకున్న
స్కీన్ ప్లే దర్శకులు కావాలనుకునే నేటి యువతరానికి ఓ అమూల్య కానుక. ఇంతటి
మంచిపుస్తకాన్ని అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు గారి, "రచన"
శాయిగారి కృషి అభినందనీయం. శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి ప్రధమ వర్ధంతి,
"శ్రీరామరాజ్యం" శతదినోత్సవం ఫిబ్రవరి 24 తేదీనే కావడం అదేరోజున "శ్రీరామరాజ్యం"
పుస్తకం విడుదల కావడం అంతా ఆ శ్రీరామచంద్రుని లీల !!వాహినీ బుక్ ట్రస్ట్ ,
H.No.1-9-286/2/P-రాంనగర్ గుండుదగ్గర, విద్యానగర్ :: హైద్రాబాద్-500044
వారికి Rs..800/- డ్రాప్ట్ పంపితే రిజిస్టర్ పోస్టులో 472 పేజీల బైండు పుస్తకం
మీకు అందుతుంది.నవోదయ బుక్ హౌస్ వారి అన్ని పుస్తక కేంద్రాలలోనూ ఈ
పుస్తకం దొరుకుతుంది.
ఈ పుస్తకం గురించి అందరూ చెపుతున్నవి చదువుతుంటే ఈ పుస్తకం వెంటనే కొనుక్కోవాలనిపిస్తోంది .మీ పరిచయం బాగుంది .
ReplyDelete