ఏమిటో ఈ మానవ దేహానికి సవాలక్ష సందేహాలు. కొందరు అడిగే ప్రశ్నలు చిత్రంగా వుంటుంటాయి. ఒక్కోసారి నవ్వుతో బాటు విసుగూ వస్తుంటుంది. పిల్లలకు వచ్చే సందేహాలు అందుకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. పెరిగే వయసులో వాళ్లకు ఎదురుబడే ఎన్నో కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా వుంటుంది. ఒక్కోసారి టీవీల్లో అగుపించే కొన్ని ప్రకటనల గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం కొంచెం ఇబ్బంది ఐనా తెలివిగా సమాధానం చెప్పాలికాని వాళ్ళను కసురుకోవడం సరైన పద్ధతి కాదు.
ఇక కొందరికి ప్రశ్నలడగటం ఓ హాబీ. ప్రతి విషయానికీ వాళ్లకి ప్రశ్నలు సంధించనిదే తోచదు. చాలా ఏళ్ల క్రితం నేను విసిఆర్ కొన్న రోజుల్లో ఒకాయన చూడటానికి వచ్చి వరుసగా ప్రశ్నలు సంధించడం మొదలెట్టాడు. ఆయనగారి మొదటి ప్రశ్న "ఇది వీసీఆరా, విసీపీనా ?" నేను "ఇది విసీఆర్ అండి" అని ఓపిగ్గా జవాబిచ్చా. "అలానా విసిఫీ కొనక విసిఆర్ ఎందుకు కొన్నారు?" రెండో ప్రశ్న! "విసీఆర్ ఐతే మనకు నచ్చిన ప్రొగ్రాములు రికార్డు చేసుకోవచ్చు" అన్న నాజవాబు.."రికార్డు చేసుకోవడమెందుకు, ఒకసారి చూస్తాముకదా?" అన్నాడు. "అయ్యా ఇప్పుడు మీలాటి పెద్దమనుషులొచ్చారనుకోండి. మీతో మాట్లాడకుండా నే టివీ చూస్తుంటే బాగుండదు కదా? మనం ట్యూన్ చేసుకొన్న ప్రోగ్రాము టివితో పనిలేకుండా విసిఆర్ ఒకటే ఆన్ చేసి రికార్డు చేసుకొని మీరేళ్ళాక తీరిగ్గా చూసుకోవచ్చన్న మాట! " నేను చెప్పింది ఆయనకు అర్ధమయిందో లేక పోతే టీవీ ఆన్ చేయకుండా రికార్డు చేస్తానన్న నా మాటలు కోతలనుకున్నాడో ఏమో కాని, మరి నే వస్తానంటూ లేచాడు.
కొందరి ప్రశ్నలు సరదాగా కొంటెగా వినోదంగా వుంటాయి. కొంతకాలం పత్రికలలో "ప్రశ్నలు- సమాధానాల " శీర్షిక వుండేది. "ఫిల్మిండియా" అనే ఇంగ్లీషు సినిమా పత్రికలో సంపాదకులు శ్రీ బాబూరావ్ పటేల్ పాఠకుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు సమయానుకూలంగా వినోదభరితంగా వుండేవి. ఆయన జవాబులు చదవడానికే ప్రత్యేకంగా ఆపత్రికను చదివే పాఠకులు ఆరోజుల్లో వుండేవారు. ఒకసారి ఓ పాఠకుడు " What is family planning ?" అని అడిగితే, .దానికి ఆయన జవాబు " Heating the stove without cooking ! ". అలానే నేను నా మిత్రున్న సరదాగా ప్రశ్న అడిగా. " కార్ల కంటే తక్కువ ఖరీదు గల స్కూటర్లకూ, బైకులకూ స్టాండులు ఉంటాయి కదా మరి లక్షలు చెసే కార్లకు స్టాండులు పెట్టరేం?" అని. దానికి అతనిచ్చిన జవాబు, కార్లకీ స్టాండులుంటాయి ! నువ్వు చూడలేదా ? టాక్సీ స్టాండులో వున్నవి కార్ల స్టాండులు కావా?" అన్నాడు. నిజమే కదా మరి !! వెంటనే అతనన్నాడు " నీ ప్రశ్నకు నువ్వైతే ఏం సమాధానం చెబుతావ్" అని.. అందుకు నా జవాను. " స్కూటర్లుబైకులు కార్ల కంటే తేలిక గదా ! ఎత్తి స్టాండు వేయొచ్చు. అదే కార్లు చాలా బరువు కదా ఎత్తి స్టాండు వేయటం కష్టమని పెట్టలేదు " అన్నా!!
ఇక ఇది చదివి మీరెన్ని ప్రశ్నలు వేస్తారో