RSS
Facebook
Twitter

Thursday, 19 April 2012

నవ్వించే పూతరేకులు

మా తూర్పుగోదావరి ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి. ఉలిపిరి (ఉల్లిపొరనే ఉలిపిరి అంటారేమో) కాగితంలా అతిసన్నగా వుండే పూతరేకుల పొరలలో నెయ్యి పంచదార పొడి వేసి మడతలుగా పెడతారు. ఇప్పుడయితే అన్నీ కుక్కర్ వంటలు వచ్చాయిగాని పూర్వం గిన్నెలలోనే అన్నం వండేవారు. గిన్నె పైన మూత పెడితే ఉడుకుతున్నప్పుడు పై మూత ఆవిరికి కదులుతూ గంజి, మూత సందులోంచి వచ్చి గిన్నె అంచులకు తగిలి సన్నని గంజి పొర కాగితంలా తేలేది. దీనికి మూలమే పూత రేకుల తయారీ !

ఇలాటి పూతరేకులనే సుధామ అనే ఆయన హైద్రాబాదులో తయారు చేసి వదిలారు. ఈ పూత రేకుల ప్రత్యేకత ఎన్నిసార్లు మీరూ వీటిని ఆస్వాదించినా అక్షయ పాత్రలా తరిగిపోవు. అసలు పూతరేకుల్లాగే మీ నోట్లో కరిగిపోతూ మీ నోటిలో ( అదేనండి మీ నోరుండేది మీ ముఖారవిందం లోనే కదా) నవ్వులు చిందిస్తుంది. శ్రీ సుధామ కార్టూనిస్టుగా, కాలమిస్టుగా, కధారచయితగా, పదబంధ ప్రహేళికల కూర్పరిగా ( రచన, నవ్య ), సాహితీవేత్తగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. దాదాపు పాతికేళ్ళ వయసులోనే శ్రీ సుధామ 1972 లో "యువ భారతి " సంస్థ ప్రచురించిన "మహతి" లో ఆయన వ్రాసిన "తెలుగు పత్రికలలో కార్టూనులు - జోకులు " రచన ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.

ఆ రచనలో శ్రీ సుధామ ఇలా అంటారు " పత్రిక తిరగేస్తున్నారు. పది పేజీలకో మరింకొన్ని పేజీలకో ఒక్కొక్కసారి అనుకోకుండా మీ పెదవులమీద చిరునవ్వు మెరుస్తుంది. ఒక్కోసారి ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తున్నారు ఆమధుర దరస్మితవదనానికి ప్రేరణ ఏమిటి? కార్టూన్లు, జోకులు..." ఇప్పుడు "పూతరేకులు " పేరిట పాఠకులకు ఆయన తయారు చేసి అందించిన ఈ మధుర వంటకం ప్రతి పొరా (ప్రతి పేజీ) నవ్వుల పసందే. జోకులే కాదు అక్కడక్కడా మనల్ని హి/టింగ్లీషు ( ఈ భాషే వేరు) జీడిపలుకుల్లా పలకిరించి చక్కిలిగింతలు పెట్టిస్తాయ్. ఇంకోచోట S.M.S లు ( సరదా మాటల శైలి) కవ్వింతలు పెట్టిస్తాయి. ఒక చోట ఓ చిన్ని శాంపిలు జోకు :
" మీ పత్రిక రెండు రూపాయలేట కదా బాగా పోతుందా ?"
" ఆ (!... కాని కిలోల్లో "
ఇలా ఎన్నెన్నొ అచ్చ తెలుగు జోకులు. నేడే పూతరేకులు కొని తెచ్చుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి. తీపి పడని వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసు "కొన" వచ్చును.

1 comment:

  1. పూతరేకులు పేరు వినగానే నోరూరుతుంది. ఈ పుస్తకంలో కూడా అంత చక్కని రస సారం ఉందని తెలిపిన మీకు ధన్యవాదాలు!

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About