చూశావటోయ్ ! నాగేశర్రావ్ కు అప్పుడె 8 9 ఏళ్ళొచ్చాయట !
ఏ నాగేశర్రావ్?
ఇంకేం నాగేశర్రావ్ ? మన ఏ.నాగేశర్రావ్ ! తెలియదా !
మన అక్కినేని అని చెప్పరాదూ!!
అవును నిజమే హీరో నాగేశ్వరరావు గారు ఇప్పుడు 89 లోకి
అడుగు పెట్టారంటే అభిమానులందరికీ ఆనందమే కదా!
రాముడిగా అడుగుపెట్టి , "బాలరాజు"తో జానపద హీరోగా
ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ,"సంసారం"
సాంఘిక చిత్రంలో బుక్కయినప్పుడు కత్తులుతిప్పే ఇతను
సోషల్ పిక్చర్ లో హీరో నా అని సినీపెద్దలుపెదవి విరిస్తే అక్కడా
నెగ్గి సాంఘక చిత్రాలలో హీరోగా మెరిశాడు. దేవదాసుగా,
విప్రనారాయణగా, తెనాలి రామకృష్ణగా,కాళిదాసుగా, భక్త
జయదేవునిగా అలా ఎన్నో పాత్రలకు జీవం పోశాడు..
మిస్సమ్మ" చిత్రంతో హాస్యాన్నీ కురిపించగలనని నిరూపించాడు.
"కాళిదాసు" పాత్రకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవార్డు అందుకున్నాడు.
అమెరికా ప్రభుత్వ ఆహ్వనాన్నిఅందుకొని ఆ దేశ అతిధిగా తిరిగి
వచ్చాడు. 60 చిత్రాలు పూర్తి చేయగానే తన నిర్మాతలను సన్మానించి
తన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు. ఆనాటి సభ కోసం విజయా
నాగిరెడ్డి తమ స్టుడియోలోని స్థలాన్ని విజయాగార్డెన్స్ గా అతికొద్ది
వ్యవధిలోనే రూపుదిద్దారు!ఆంధ్ర,తమిళ,కేరళ విశ్వవిద్యాలయాలకు
విరాళాలు అందజేశాడు.
"పాతాళభైరవి" చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న
రోజులు. అప్పటికింకా ఎన్.టి.రామారావుకు నాగేశ్వర్రావు
కున్నంత పేరు రాలేదు..నాగేశ్వర్రావు జానపద చిత్రాల
హీరోగా పేరు మోశాడు.చిత్రం చూసిన ఇద్దరు ప్రేక్షకులు
ఇవతలికి రాగానే " ఆ మొసలితో పోరాటం ఉంది చూశావ్?
అబ్బ..ఎంతసేపు పోరాడాడయ్యా ఆ రామారావు?"అన్నాడు
ఒకడు.
"అంతేలే. రామారావు కొత్తగదా. అంచేత అరగంట పట్టింది.
నా-చిటికలో చంపేసి ఉండును"
అన్నాడు మిత్రుడు. అలానే నాగేశ్వరరావు, సావిత్రీ చాలా
పాప్యులర్ జంట ! దీనిపై శ్రీ బాపు గీసిన ఓ కార్టూన్లో "ఆడ
పిల్లో, మగ పిల్లాడో "తెలుసుకోవాలని నర్సును ఆతృతతో
ఓ వ్యక్తి అడుగుతున్న తీరు శ్రీ బాపు అద్భుతంగా ఎలా
గీశారో చూడండి.
తెలుగు చిత్ర పరిశ్రమ మన రాజధానిలో స్థిరపడాలని అక్కినేని
తన చిత్రాలు హైద్రాబాదులో నిర్మించాలనే షరతుతో రాజధానికి
మకాం మార్చారు. మొదట నవ్విన మిత్రులే తరువాత అతని
ముందు చూపుని మెచ్చుకున్నారు. దీనిపై బాపు రమణలు
రాత గీతల ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పారు. అక్కినేని ఇంకా
ఎన్నో చిత్రాల్లో నటిస్తూ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని
కోరుకుందాం.. .
(అక్కినేని పొట్రైట్ , కార్టూన్లు శ్రీ బాపూ సౌజన్యంతో)