RSS
Facebook
Twitter

Thursday, 6 January 2011


"
సరిగా యాభై ఏళ్లక్రితం జనవరి, 6, 1961 వ తేదీన యన్.ఏ.టి వారి
"సీతారామకళ్యాణం" విడుదలయింది. ఈ చిత్రానికి శ్రీ రామారావు
మొదట కె.వి.రెడ్డి గారు దర్శకులుగా నిర్మిద్దామను అనుకుంటే
శ్రీ కె.వి.రెడ్డి రామారావుగారు రావణపాత్రలొ నటించడానికి
ఇష్టపడక ,ఈ విషయంలో రామారావుగారిని ఒప్పించలేక ఆయనే
తప్పుకున్నారు. చివరకు దర్శకత్వ భాధ్యతను తన భుజాలమీదకే
ఎత్తుకొని ( ఈ చిత్రం లో రావణాసురిడి పాత్రను అతి ప్రతిభావంతంగా
నటించి, కైలాస పర్వతాన్నీ భుజాలపై ఎత్తుకున్నారు) " సీతారామ
కళ్యాణం " చిత్రాన్ని కమనీయ చిత్రంగా తెలుగు ప్రజానీకానికి
సమర్పించారు. చిత్రం క్రెడిట్స్ చూపిస్తున్నపుడు దర్శకత్వం అనే
చోట "ఎన్ ఏ టి యూనిట్ " అని వేశారు.
సంగీతానికి రాజేశ్వరరావుగారిని తీసుకున్నా"కానరార కైలాస
వాసా" అన్న పాట ను ఆయన స్వర పరచాక అభిప్రాయ భెదాలు
రగా మిగతా సంగీత దర్శకత్వాన్ని శ్రి గాలిపెంచల నిర్వహించారు.
శ్రీరాముని గా హరనాధ్, సీతగా గీతాంజలి (అప్పటి ఆమె పేరు
మణి ) నటించారు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
అన్న పాట యాభై ఏళ్ళు దాటినా ఇంకా ప్రతి పెళ్ళి పందిర్లలోనూ
మనకు వినిపిస్తూనే వుంటుంది. ఈ చిత్రంలోని మాటలు శ్రీ సముద్రాల
వ్రాసారు. ప్రతి సంభాషణా ఓ ఆణి ముత్యమే.
హైద్రాబాద్ వీడియోస్ వారు ఈ చిత్రాన్ని విసిడీ, డివీడీలుగా
విడుదల చేసారు.

Wednesday, 5 January 2011

బై బై , మై డియర్ పావలా !!





మరో ఆరు నెలల్లో పాపం మన ప్రియమైన {ధరలన్నీ ప్రియమై
పావలా ( 25 పై )కు విలువ తగ్గిపోయింది} పావలాకు మన
ప్రభుత్వం వీడుకోలు చెప్పేస్తూ మన పావలాను (మన దగ్గర
ఇంకా వుంటే ) గుర్తుగా దాచుకోవాలనే కోరిక కలిగిస్తూ ఆ
పావలాకు విలువనూ పెంచింది. అమ్మో జూన్ నుంచి పావలా
ఎందుకూ మారదట ( ఇప్పుడు ఏదో మారుతున్నట్లు ) అనుకొని
దానాలు చేసో ( ఎవడు తీసుకుంటాడు?!), ఏ దేముడి హుండీ
లోనూ వేసో పుణ్యం దక్కించు కోవాలనుకొనే కొందరు,
ఇక అగుపించని పావలాను గుర్తుగా పదిలపరచుకొనాలనుకొనేవారు
"ఏమండీ, మీ దగ్గర ఓ పాత పావలా వుంటే ఇద్దురూ !" అని అడిగే
వారూ వుంటారు.
ఈ రోజుల్లో పావలాకు వచ్చేది ఏదీ లేక పోవచ్చు కానీ మా రోజుల్లో
ఆ పావలాకే మేము ఆంధ్రవారపత్రికలో హకల్బెరీఫిన్, టామ్సాయర్
లాంటి కధలు చదువుకున్నాం. మా అమ్మగారు అలెగ్జాందర్
డ్యూమాస్ వ్రాసిన "కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో" చదువుకున్నారు.
"చందమామ" ఇంకో రెండణాలు పెడితే వచ్చేది. "పాపాయి"అనే
పిల్లల పత్రిక పావలాకే వచ్చేది. అన్నట్లుశ్రి గణేశ్ పాత్రో "పావలా" పేరుతో
వ్రాసిన ఓ నాటిక చాలా ప్రాచూర్యం పొందింది. అందులో నటించిన సరోజిని
అనే నటి "పావలా" సరోజినిగా పేరు పొంది కొన్నిసినిమాల్లోనూ నటించారు
అప్పటికాలానికి ఇప్పటికాలానికి డబ్బు విలువ గురించి తెలుసు
కోవాలంటే రమణగారి కోతికొమ్మచ్చి మొదటి భాగం 98 వ పేజీ చూడండి.
" 1937 లో నా చిన్నప్పుడు ధవళేశ్వరం లో రూపాయికి 64 ఇడ్లీలు
ఇచ్చేవారు పచ్చడీ కారప్పొడీ నెయ్యితో. 1950 లో మెడ్రాసులో
రూపాయికి 32 ఇడ్లీలు + చారులాటి చిక్కని కొబ్బరి పచ్చడి ..."
ఈ కాలం వాళ్ళకి వింటానికి వింతగా వుంటుంది!
రూపాయి దండకం
ఈ అణాలు ఈ తరం వారికి వింతగా వుండవచ్చు. ఇప్పుడు రూపాయి
దానికి 100 పైసలూ, గుణకారాలూ,భాగారాలూ-పదోఎక్కంతో లాగించెయ్య
వచ్చు. అప్పుడు 16వ ఎక్కం, 12వ ఎక్కం-లెక్కలికి తప్పని సరి.పూర్వం ఈ
చిల్లర దండకం చాలా పెద్దది. రూపాయికి -
2 అర్ధలు, 4 పావలాలు, 8 బేడలు, 16 అణాలు,
32 అర్ధణాలు, 64 కాణీలు, 128 ఏగాణీలు, 192
దమ్మిడీలు
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
పావలా( నాలుగు అణాలు) పై రమణగారు చెప్పిన మరో కో.కొ కధ
ఇంకో అ " ణా " వేస్తే పావలా
ఆంధ్ర పత్రికలో రమణగారు పని చేస్తున్నప్పుడు ప్రకాశం పంతులుగారి
ప్రసంగ సారాంశం కి హెడ్డింగు పెట్టే భాధ్యత రమణగారు తీసుకొన్నారట.
" గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమానికి కంకణధారణ చేదాం " అని హెడ్డింగు
రాశారు. ఆయన వెనుకనే వుండి గమనిస్తున్న మద్దాలి శర్మగారు, " మూడు
అణాలు పడ్డాయి-ఇంకో అణా వేస్తే పావలా అయిపోతుంది అన్నారు చిరు
నవ్వుతో! మూడు అణాలు అంటే- ఆ టైటిల్లో " ణ " లు మూడు సార్లువచ్చాయ్!
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
పై ఫొటోల్లోని పాత పావలాలు ( మా నాన్నగారి సేకరణ నుండి) : కుడి నుంచి
1. 1862 విక్టోరియా రాణి 2. 1908 ఎడ్వర్డ్ 7th 3. 1919 జార్జి V
4..1929 జార్జి V 5. 1988 25 పైసలు


Tuesday, 4 January 2011


ఈ పుస్తకరచయిత డా"పి.వి.యల్.నరసింహారావుగారు చక్కని హాస్యాన్ని
జోడించి మనల్ని నవ్వించి కవ్వించారు. ఓ కార్టూన్ గీయాలన్నా, ఓ
హాస్య కధో, గేయమో చెప్పాలన్నా ఐడియాలు మన చుట్టూ అగుపిస్తూనే
వుంటాయి ఇలాటి వివిధ విషయాలను ,విశేషాలను శ్రీ నరసీంహారావు
తమ "చమత్కార స్రవంతి"లో ప్రతి పేజీలోనూ అవిష్కరించారు ముందు
మాటలో కోర్టు తాలూకు చమత్కారాన్ని చెప్పారు (ఆయన కొంతకాలం
న్యాయవాదేనట!) ఒక న్యాయవాదిని చూసి న్యాయమూర్తి "ఏమిటండీ
అలా వెదుకుతున్నారు హడావుడిగా?" అంటే "యువర్ ఆనర్, నా కోటు
కనిపించటంలే"దన్నాడట. " అంతేనా, ఇక్కడ ఎంతమందో సూట్లే పోగొట్టుకొని
మాట్లాడకుండా బైటకుఫోతుంటారుగా?" అని చురక అంటించారు న్యాయమూర్తి.
అందరూ తనివి తీరా నవ్వుకొన్నారు. ఆయన చెప్పిన ఈ హాస్య సంఘటన
లానే ఇందులోని పద్యాలన్నీ మనల్ని నవ్వుల్లో ముంచెత్తటం గ్యారంటీ.
మచ్చుకు కొన్ని చమత్కారాలు రుచి చూడండి. ఆనక ఈ చమత్కారాల
విందును పూర్తిగా ఆరగించాలంటే వెంటనే ఓ పుస్తకం కొనేసుకొని తృప్తిగా
ఆనందించేయండి. ఒక సారి రుచి చూస్తే మరొసారి మరో సారి మీరొదలురు!
<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>
ఈ నాటి పిల్లలు తినే జంక్ ఫుడ్ గురించి....
గారెలు బూరెలు పెరుగు కమ్మని నేయియు ముద్దపప్పు, గోం
గూరయు కంది పచ్చడియు గుంటురికారము ఆవకాయయున్
కోరి భుజించు పెద్దలకు గొంతులు నిండగ, ఐసు క్రీము, మం
చూరియ గోబివాచవిని చూసెడి పిల్లలకెట్లు తృప్తియౌ.
ఇక ఇల్లాల్లకు తీరిక ఎక్కడిది అంటూ....
కంటికి జోడు ఫ్యాషనుకు కాలికి జోడును ఎత్తు పెంచగా
ఒంటికి పౌడరున్ పులిమి ఒద్దిక పాలిషు గోళ్ల కద్ది కా
న్వెంటుకు పంపుపిల్లలకు వేషము వేయుచు సర్ద బుక్కులున్
ఇంటిని తీర్చిదిద్దుటకు ఇంతికి తీరిక ఎట్లు చిక్కెడిన్ ?
మిన్నంటే ధరలను గురించి చివరిగా ఇలా అన్నారు.....
ధరలెటు చూసినన్ పెరగ దద్దరిలెన్ ప్రజ్ఞ పండు పంటకున్
ధరపడి పోవుచుండ పరితాపము చెందెను పేదరైతు, సం
స్కరణల పైకి క్రిందకును కాంగ్రెసు వారలు త్రిప్పుచుండ, ఏ
సరణిని జీవితమ్ము కొనసాగునటంచు జనమ్ము చింతిలన్.
(ఇది వ్రాసింది 2007 లో! 2011 లో కూడా అదే పరిస్ఠితి!)
ఈ చమత్కార స్రవంతిని " చమ(త్కారాలు) నూరటంలో చెయ్యి తిరిగిన
వారి శ్రీమతి కి నరసీంహారావుగారు అంకితమివ్వడం ఎంతో సమంజసం!
అంద.మైన ముఖచిత్రం గీసింది, ఇంకెవ్వరు ? శ్రీ బాపు.! లోపలి బొమ్మల్ని
ఇండియా టుడే నర్శిం చిత్రించారు ఋషి ప్రచురణలు విజయవాడ వారు
పాతిక రూపాయలకే అందంగా అందిస్తున్నారు.

Monday, 3 January 2011




ఒకప్పుడు ( చాలా ఏళ్ళ క్రితం) సినిమాలు శత దినోత్సవం జరుపు
కోవడమంటే అదో పండుగ. ముఖ్య కేంద్రాలకు సినిమా తారలు
వచ్చేవారు. ఆ నాటి మొదటి ఆట ఇంటర్వల్లో తెర ముందుకు వచ్చి
ప్రేక్షకులకు కనువిందు కలిగించేవారు. తారలను ప్రత్యక్షంగా చూసే
అవకాశం అప్పుడే కలిగేది. ఇప్పట్లా ఔట్ డోర్ షూటింగులుండేవి
కావు. ఇప్పుడంతా బట్టబయలు ! తారలూ ఒళ్ళు దాచుకోకుండా
పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పటిలా దొంగ శతదినోత్సవాలు,
లాగించడాలూ వుండేవి కావు. ఆ రోజుల్లో సినిమా ఫ్లాపయితే
రెండు మూడు వారాలకే తీసేసే వారు. "కాడెద్దులు-ఎకరానేల"
అన్న సినిమా మా రాజమండ్రిలో రెండే రోజులాడింది. జత
దినోత్సవం జరుపుకొన్నది అని సరదాగా చెప్పుకొనేవారు.
ఆ రోజుల్లో శతదినోత్సవ వేడుకులలో తారలు ఊరూరూ
తిరిగితే ఇప్పుడేమో రెండో రోజునుంచే విజయ యాత్రలు చేస్తున్నారు!.
బాపు రమణగార్లు తాము తీసిన సినిమాలు ఫట్మంటే వాళ్ళకు
వాళ్ళే జోకులు, కార్టూనులు వేసుకొనే వారు. పబ్లిసిటీలూ గమ్మత్తుగా
దిన పత్రికలలో వేసే వారు. "అందాలరాముడు" మొదట సారి బాగా
ఆడకపోతే "తీసిన వారికీ చూసినవారికీ అంచనాలు తలకిందులు
చేసిన" అందాలరాముడు" అంటూ ప్రకటనలు ఇచ్చారు. మరో ప్రకటన:
"అందాలరాముడు" 70వ రోజు అన్న ప్రకటన చూసి "ఏడ?" అని
అడుగుతున్న ప్రేక్షకుడితో మునుగుతున్న పడవలో కూర్చున్న
నిర్మాత(?) "ఏడా లేదు బేడాలేదు.రిలీజైన రోజునుంచి యివాల్టికి
70వ రోజు !" అంటాడు. ఇలాటి డేరింగ్ ప్రకటన స్పోర్టివ్ గా ఇవ్వగల
నిర్మాతలను ఇప్పుడు మనం చూడగలమా? ఈ ప్రకటన చూసిన
అక్కినేని "అబద్ధాలు చెప్పి కోతలు కోసి-సత్తురూపాయల్లాంటి
నకిలీ ప్రకటనలు వెయ్యకుండా ధైర్యంగా పొగరుగా నిజం చెప్పారు"
అని అన్నారుట ( చూ: కోతికొమ్మచ్చి స్వాతి సపరి వార పత్రిక
18-12-2009) ఇప్పుడేమో తలతోకాలేని పాటలకు ప్లాటినం
డిస్కులంటూ ప్రోగ్రాములు మరప్పుడో, ఎన్నెన్నో మంచి మంచి పాటలు
విడుదలయినా ఇలాటి కార్యక్రమం వుండేదికాదు. 2010లో మన
తెలుగు సినిమా దాదాపు చావు దెబ్బ తిన్నా దిన పత్రికలలో
మీరు ప్రకటనలు చూస్తున్నారుగా, అన్నీ డూపర్ సూపర్ హిట్లే!
57 ఏళ్ళ క్రితం విడుదలైన "మూగమనసులు" శత దినోత్సవ
ఆహ్వాన పత్రం నే దాచుకొన్నది దొరికితే దానితో బాటు "ముత్యాల
ముగ్గు"కు బాపు గీసిన వందరోజుల పండుగ కార్డు, "మూగమనసులు"
చిత్రానికి శ్రీ బాపూ చిత్రంలోని ఏఎన్నార్, సావిత్రి, జమున పాత్రలను
చూపిస్తూ గీసిన అద్భుతమైన లోగో మీకు చూపిస్తున్నాను.

Sunday, 2 January 2011





గత ఏడాది హాస్య రచయితగా శక్తి ఎవార్డును అందుకొన్న మితృలు
శ్రీ ఎమ్బీయస్.ప్రసాద్ గారి గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తాను..
రచయితగా ఆయన రచనలు చాలా మంది సాహిత్యప్రియులు
చదివేవుంటారు. వరల్డ్ స్పేస్ ( ఓ మంచి రేడియో గత ఏడాదే
నష్టాలతో కనుమరుగయింది) రేడియోలో పడకకుర్చీ కబుర్ల ద్వారా
ఆయన గళాన్ని వినే వుంటారు. "ఇదీ అసలు కధ" అంటూ వనిత
టీవీ లో మన సినిమాలు, ఇతర భాషల్లో తీసిన వాటి మాతృకల
గురించి, వాటి వీడీయోలు చూపిస్తూ రెండింటి చిత్రీకరణలో చేసిన
మార్పులగురించి చెప్పిన శ్రీ ప్రసాద్ గారిని టీవీలోచూసేవుంటారు. ఈ
అపురూప కార్యక్రమానికి ఉత్తమ టీవీ కార్యక్రమ ఎవార్డూ వచ్చింది.
ఆయనతో నాకు పరిచయం కలిగించింది ఒక విధంగా శ్రీ బాపూ
గారనే చెప్పాలి. శ్రీ ప్రసాద్ "హాసం" పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా
వున్నప్పుడు "హాసం"లో" బాపూ రమణీయం" అనే శీర్షిక వచ్చేది.
ఆ శీర్షికకు నేను బాపు గారు ఆంధ్రసచిత్రవారపత్రికకు 1960 లో
గీసిన ముఖచిత్రం పంపాను. అందుకున్న వేంటనే శ్రీ ప్రసాద్
గారి దగ్గర నుంచి పోనొచ్చింది. అలా ప్రారంభమైన స్నేహం
మా హాసం క్లబ్ ప్రారంభోత్సవానికి ఆయన రాజమండ్రి వచ్చి
మా ఇంటికి రావటం, అలా అలా ఆయన మా కుటుంబ మిత్రులయ్యారు.
ఆయన ఎన్నో నవలలను , కధలను వ్రాసారు. వూఢ్ హౌస్ నవలలు
"అచలపతి కధలు" గా అవి అచ్చు తెలుగు వాతావరణంలో తిరిగి
వ్రాశారు. ఆయన కలం నుంచి తెలుగులో, ఇంగ్లీషులో డైరెక్ట్ కధలు,
అనువాదాలు వచ్చాయి చరిత్ర, కళ, రాజకీయాలపై ఎన్నో వ్యాసాలు,
ఫీచర్సు ప్రముఖపత్రికలలో వ్రాసారు.
ఈ తరం వారికోసం ముళ్లపూడి వెంకట రమణగారి సమగ్ర సాహిత్యాన్ని
ఎనిమిది సంపుటాలుగా ఏర్చి కూర్చారు ( బుడుగుతో సహా)!.350
పైగా వైవిధ్యభరితమైన రచనలు అందించారు. శ్రీ ప్రసాద్ రచించిన
వివిధ విషయాలపై "పడకకుర్చీ కబుర్లు" పేరిట 14 సంపుటాలు,,
38 కాలిబర్ పేరిట మపైఎనిమిది ధ్రిల్లింగ్ కధలు, ప్రసిద్ధ ఘట్టాలు, కొందరు
ప్రఖ్యాత వ్యక్తుల జీవితాల గురించి "హిస్టరీ మేడీజీ" అనే పుస్తకం,
కాగితాల బొత్తి పేరిట వివిధ పత్రికలలో ప్రచురించిన కధల సంపుటి,
జంతువులతో మాట్లాడే డాక్టర్ కధ డాక్టర్ డూలిటిల్ ( ఈ సిన్మా పిల్లల్ని
పెద్దల్ని అలరించింది) రచన చేసారు. శ్రీ ప్రసాద్ గారి శ్రీమతి స్వాతిగారు
కూడా మంచి రచయిత్రి.
శ్రీ ప్రసాద్ వారి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!



  • Blogger news

  • Blogroll

  • About